S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం - మీరే డిటెక్టివ్

మర్నాడు కూడా రామాయణం హరికథకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన ఆశే్లషకి తల్లి శారదాంబ ఆసక్తిగా అడిగింది.
‘ఇవాళ హరికథ రెండో రోజు కదా?’
‘అవునమ్మా’
‘ఈ రోజు హరిదాసుగారు చెప్పిన కథేమిటో నాకు, నానమ్మకి చెప్పు’ శారదాంబ కోరింది.
ఆశే్లష ఉత్సాహంగా తను విన్న రామాయణం కథని ఇలా చెప్పసాగాడు.
‘అయోధ్యాపురిని దశరథ మహారాజు, కుబేరుడు అమరావతిని పాలించిన రీతిలో పాలించేవాడు. అక్కడ ఒక్క బీద వాడు కాని దానం కోరేవాడు కాని అడుక్కునేవాడు కాని, రోగగ్రస్థుడు, ధర్మం తప్పి ప్రవర్తించేవాడు కాని లేరు. అంతా సుఖశాంతులతో జీవిస్తున్నారు. సింధు పర్వతాల్లోని ఉత్తమ ఏనుగులు రాజుగారి సైన్యంలో ఉండేవి. మంత్రులు ఎనిమిది మంది ఐకమత్యంతో రాజ్యపాలనలో దశరథుడికి సహాయం చేసేవారు. అంతా న్యాయంగా వ్యవహరించేవారు.
‘ఐతే సంతానం లేని దశరథుడు తన పురోహితుడైన కాశ్యప మహర్షిని, ఇతర బ్రాహ్మణులని పిలిపించి పుత్రకామేష్టి యాగాన్ని చేయాలనుకుంటున్నానని చెప్పి, సలహా కోరాడు. దాన్ని చేయమని, గుర్రాన్ని వదలమని వారు సలహా ఇచ్చారు. సుమంత్రుడు మాత్రం తర్వాత దశరథుడ్ని వొంటరిగా కలిసి ఇలా చెప్పాడు.
‘రాజా నీకు సంతానం కలగడం గురించి పూర్వం సనత్కుమారుడు ఋషులతో చెప్పాడని విన్నాను. ఆ వైనం విను. కాశ్యపుడి మనవడు, విభాండకుడి కొడుకు అయిన ఋష్యశృంగుడు బ్రహ్మచారి. వంగ దేశపు రాజైన రోమపాదుడు ధర్మం తప్పి పాలించడంతో ఆ దేశంలో అతివృష్టి ఏర్పడింది. ఋష్యశృంగుడు తమ రాజ్యంలో కాలుపెడితే వర్షం ఆగుతుందన్న సలహా ప్రకారం, కొందరు వేశ్యలని పంపి అతన్ని ఆకర్షించి, ఋష్యశృంగుడ్ని తన రాజ్యానికి రప్పించడంతో వర్షాలు ఆగిపోయాయట.
‘కృతజ్ఞతగా రోమపాదుడు తన కూతురు శాంతని ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సందర్భంలో సనత్కుమారుడు ‘దశరథుడు చంద్రవంశంలో రాజుగా పుడతాడని, తనకి పుత్రసంతానం కలగడానికి ఋష్యశృంగుడ్ని అయోధ్యకి రప్పిస్తాడని, ఆయన ఋత్విక్కుగా వ్యవహరించాక పుత్రకామేష్టి యాగం పూర్తి చేసి, గుర్రాన్ని వదులుతారని చెప్పాడు.
ఇంతదాకా చెప్పాడమ్మా’
శారదాంబ నవ్వుతూ చెప్పింది.
‘చూడు నేను ఎన్ని వేళ్లు ముడిచానో అన్ని తప్పులు చెప్పావు’
‘డిటెక్టివ్‌గా మీరు కూడా ఆ తప్పులు ఎన్నో, అవే మీరైతే కనుక్కోగలరా?
(బాలకాండ 6 నించి 12 సర్గల దాకా)
మీకో ప్రశ్న
శ్రీరాముడి కొడుకు లవుడు నిర్మించి నగరం పేరేమిటి? ఇప్పుడది ఎక్కడ ఉంది?

(కిందటి వారం
రామాయణ కథలో తప్పులు)
1.రామాయణం రాసింది వ్యాసుడు కాదు. వాల్మీకి.
2.రాముడి సుగుణాలు 14 కాదు, 16.
3.వాల్మీకి స్నానానికి వెళ్లింది సరయూ నది కాదు. తమసా నది.
4.వాల్మీకికి ప్రత్యక్షమైంది విష్ణువు కాదు. బ్రహ్మ.
5.గాయత్రీ మంత్రంలోని అక్షరాలు 24. 23 కాదు. రామాయణంలోని శ్లోకాల సంఖ్య 23,000 కాదు. 24,000.
6.దశరథుడి రాజధాని అయోధ్య. మిథిలా నగరం కాదు. అయోధ్య అంటే ‘జయింపశక్యం కానిది’ అని అర్థం.
7.సుమంతుడు దశరథుడి మంత్రి. మిత్రుడు కాదు. దశరథుడికి మొత్తం 8 మంది మంత్రులు ఉండేవారు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి