S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం - మీరే డిటెక్టివ్

కొత్త శీర్షిక ప్రారంభం
***

రామాయణం మీకు తెలిసిన కథే. ఐతే పేర్లు, ప్రదేశాలు, సంఘటనలు క్షుణ్ణంగా తెలుసా? ఈ శీర్షిక ద్వారా మీరు రామాయణ కథని మొదటి నించి చదివే ప్రయోజనంతోపాటు డిటెక్టివ్‌గా తప్పులని కనిపెట్టే అవకాశం లేదా పేర్లు, ప్రదేశాలు, సంఘటనలు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీకు సరదాగా ఉండచ్చు.
* * *
హరికథ నించి ఇంటికి తిరిగి వచ్చిన కొడుకుని తల్లి అడిగింది.
‘ఇవాళ ఏం చెప్పారు?’
‘రామాయణం మొదలెట్టారమ్మా. దాన్ని శ్రీరామ నవమికల్లా పూర్తి చేస్తారట. రోజూ వెళ్లి వింటానమ్మా’
‘మంచిది. ఇవాళ ఏం చెప్పారో నాకు చెప్పు. వింటాను’ఒ
‘నీకు రామాయణం తెలుసు కదా?’ కొడుకు ప్రశ్నించాడు.
‘తెలుసు. కాని ఎన్నిసార్లు విన్నా రామాయణం నాకు కొత్తగా ఉంటుంది కాని చెప్పు’
‘సరే. వ్యాసుడు మంచి కథానాయకుడితో ఓ పుస్తకం రాయాలనుకుని తన ఆశ్రమానికి వచ్చిన లోక సంచారి ఐన నారదుడిని అలాంటి వ్యక్తి గురించి అడుగుతాడు. పధ్నాలుగు సుగుణాలు గల రాముడి గురించి నారదుడు ఆయనకి చెప్తాడు. తర్వాత వ్యాసుడు సరయూ నదీ తీరానికి స్నానానికి వెళ్లినప్పుడు చెట్టు మీది క్రౌంచ పక్షుల జంటని చూస్తాడు. అంతలో ఓ వేటగాడు ఓ పక్షిని బాణంతో చంపేస్తాడు. రెండో పక్షి పడే వేదనని చూసిన బాధతో ఆయనకి అనుకోకుండా నోటిలోంచి ఓ శ్లోకం వచ్చింది. తర్వాత విష్ణువు ఆయనకి ప్రత్యక్షం అయి, ‘క్రౌంచ పక్షి మరణంతో నీ నోటి నించి వెలువడ్డ శ్లోకాన్ని నేనే నీకు స్ఫురింపజేశాను. ఆ ఛందస్సులో రాముడి కథ రాయి’ అని సూచిస్తాడు. ఆయన రఘురాముడి చరిత్ర మొత్తాన్ని ఇరవై మూడు వేల శ్లోకాల్లో రాస్తాడు. గాయత్రీ మంత్రంలోని ఇరవై మూడు అక్షరాలతో ప్రతీ వెయ్యవ శ్లోకం మొదలవుతుంది. ఆయన రాసిన ఆ శ్లోకాలని లవకుశులు అనేకచోట్ల గానం చేస్తూ తిరుగుతూంటారు. ఓసారి వాళ్లు తన ఊళ్లో గానం చేస్తూంటే, దాన్ని విన్న రాముడు వారిని పిలిపించి తన సభలో రామకథని గానం చేయమంటాడు. అలా రామాయణం మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పబడిందట. నిజమేనా?’
‘నిజమే. తర్వాత?’ తల్లి చిరునవ్వుతో ప్రశ్నించింది.
‘మిథిలా నగరం రాజధానిగా దశరథుడనే మహారాజు కోసల సామ్రాజ్యాన్ని పాలించేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలంతా ఎలాంటి బాధలు లేకుండా ధర్మంగా, న్యాయంగా ప్రవర్తిస్తూ సదా సంతోషంగా ఉండేవారు. నాస్తికులు కాని, రోగులు కాని, బీదలు కాని, బాధపడేవారు కాని ఆ రాజ్యంలో ఉండేవారు కారు. దశరథుడి మిత్రుడు సుమంతుడు పాలన విషయంలో చక్కటి సలహాలని ఇచ్చేవాడు. ఇవాళ ఇంతదాకా చెప్పారు. మిగిలింది రేపు చెప్తానన్నారు. ఆయన ఎంత చక్కగా పాడుతూ చెప్పాడో అమ్మా!’
కొడుకు చెప్పేది అడ్డుపడకుండా విన్న తల్లి అడిగింది.
‘నువ్వు విన్నది విన్నట్లుగా చెప్పావా?’
‘అవును. ఏం?’
‘ఐతే ఆ హరికథ చెప్పినాయన రామాయణం చదివినట్లు లేదు. చాలా తప్పులు చెప్పాడు’
‘తప్పులా?’
‘అవును. నిజానికి ఏడు తప్పులు’
‘ఏమిటవి?’ కొడుకు అడిగాడు.

- జవాబు కోసం వచ్చే సంచిక చూడండి -

-మల్లాది వెంకట కృష్ణమూర్తి