S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కథ నచ్చింది (కథ)

.................
కథల పోటీలో ఎంపికైన రచన
..................
ఫ్రెండ్‌ని కలవడానికి వాళ్ల ఆఫీస్‌కి వెళ్లా.. వెయిట్ చేయమంది. రిసెప్షన్‌లో మేగజైన్ తీశా.. పేపర్లు తిప్పుతుంటే ఒక బొమ్మ బావుంది. అమ్మాయి ఓణీ వేస్కుని నాన్న పక్కన నిల్చుని అమ్మతో మాట్లాడుతోంది.. చేతిలో ఫొటో ఉంది. బొమ్మ నచ్చింది. చదవడం మొదలెట్టా. అన్నాచెల్లెళ్ల మధ్య రిలేషన్.. చాలా డీప్‌గా తీస్కెళ్లాడు రచయిత. చుట్టూ చూడలేనంతగా... ఇంకా అరపేజీ ఉంది. చదవకముందే కళ్లు తడిసాయ్. చాలా మంచి రచన... అత్తగారింటికెళ్లే చెల్లెలికి వీడుకోలిచ్చి రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా తడిచెంపలతో కూర్చున్నాడు అన్న.. అనేది క్లైమాక్స్ వాక్యం. కన్నీళ్లొచ్చాయ్. రిసెప్షన్‌లో అమ్మాయ్.. ‘మేడమ్.. మేడమ్...’ అని టిష్యూ పేపర్ ఇచ్చింది. ప్రపంచం గుర్తొచ్చింది. ఇంతలా నన్ను కదిలించిన రచన వెంటాడుతోంది. కథ కింద అతని ఫోన్ నెంబర్, పేరు ఇచ్చారు. నోట్ చేస్కుందాం అనుకున్నా.. ఆలోచిస్తున్నా. ఫ్రెండ్ వచ్చింది. ‘సారీనే.. సారీ.. వెళదామా..’

‘చూశా...’ పుస్తకంలో వున్న ఓణీ వేస్కున్న అమ్మాయి బొమ్మని అలానే చూస్తూ పుస్తకం పక్కన పెట్టేశా..
ఇద్దరం కదిలాం.. కానీ.. మూడో వ్యక్తి - ఆ రచయిత నాతో వస్తున్నట్టుంది. ఇంకోసారి చదవమని సైగ చేస్తున్నట్టుంది.. అతనెవరో.. ఎలా ఉంటాడో.. ఆలోచన. ‘నువ్వేంటే సైలెంట్ అయిపోయావ్... ఒంట్లో బాలేదా.. షాపింగ్ అంటే పరిగెడతావ్‌గా ఎప్పుడూ...’
‘అదేం లేదు పద...’
నడుస్తున్నాం ఇద్దరం. షాపింగ్ అయిపోయింది. ఇంటికొచ్చేశా. కానీ.. కథ వెంటాడుతూనే ఉంది. రెండు పేజీల కథలో అన్ని ఎమోషన్స్ ఎలా రాయగలిగాడు.. నా కళ్లల్లో నీళ్లు తిరిగేంతగా రాశాడు.. కథనంతా మళ్లీ రీకలెక్ట్ చేస్కున్నా.. అన్న గుర్తొచ్చాడు. వాడు అమెరికాలో ప్రొఫెసర్. ‘అర్జెంట్‌గా కాల్ చేయవా మాట్లాడాలి...’ రాత్రి పదకొండుకి మెసేజ్ పెట్టా.. కాల్ చేశాడు.. ఏడ్చేశా.. ‘ఎందుకు లేవు నా దగ్గర. నేను నీ చెల్లెల్ని కాదా.. వారమైంది ఫోన్ చేసి...’ ఇంకా ఏదేదో తిట్టేశా.. అన్నయ్య చాలా బతిమాలాడు. ‘అమెరికా వద్దురా నాకు... డిషుం అని కొట్టేసి వచ్చేస్తాగా...’ చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పాడు చాలాసేపు.
రాత్రి రెండు దాటింది.. మాటల్లో చెప్పా ‘మేగజైన్‌లో కథ చదివా.. చాలా నచ్చింది. నీకు చదివి వినిపించాలని ఉంది. ఆ కథ చదివి మళ్లీ ఏడవాలని ఉంది.. ఏడుపు మీద మొదటిసారి ఇష్టమొచ్చింది..
కథలో విషయాలు చెప్తూ చిన్నప్పటి విషయాల్లోకి వెళ్లిపోయాం.
ట్రైన్‌లో కిటికీ సీటు కోసం కొట్టుకున్న రోజు.. నాకు జ్వరమొస్తే అన్న దేవుడి గుడిలో నూటెనిమిది ప్రదక్షిణలు చేసిన రోజు...
ఆరు నెలలు ఇద్దరం మాట్లాడుకోకుండా ఉన్న రోజులు...
చాలా మాట్లాడుకున్నాం.. అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య, తాత, నానమ్మ, మాస్టార్లూ... ఈవ్‌టీజింగ్‌లు అన్నీ అన్నీ మాట్లాడేసుకున్నాం. ఉదయం ఆరై పోయింది.
అన్నకి నాకు ఫోన్ కట్ చేయాలని లేదు.
‘ఇప్పుడే వచ్చేయాలనుంది బుజ్జీ నీ దగ్గరికి...’ అన్న అన్న మాటలకి చాలా ఇష్టమేసింది. నిన్న చదివిన మేగజైన్ కథ గుర్తొచ్చింది... ఆ రచయితకి చాలా థాంక్స్ చెప్పుకున్నా.. మా అన్నని నన్ను ఇలా ఇంత దగ్గరగా... చాలా రుచిగా మాట్లాడుకునేంతగా చేసినందుకు... మళ్లీ గుర్తొచ్చాడు రచయిత. ఇంకోసారి చదవవూ అని సైగ చేస్తున్నాడు.
‘అన్నయ్యా.. ఏడౌతోందిగా షాపులు తెరిచేసుంటారు. పుస్తకం కొనుక్కొని కథ చదువుకుందామా.. లైన్‌లోనే ఉండవూ...’
‘నేను కూడా వెయిట్ చేస్తున్నా... నిన్ను అంతగా వెంటాడుతున్న కథ... మనల్ని ఇంతలా మాట్లాడుకునేలా చేసి హ్యాపీగా ఉంచిన కథ.. ఎలా ఉంటుందో... అర్జెంట్‌గా వినాలి..’
‘్థంక్యూ..’
స్కూటీ మీద ఫోన్ మాట్లాడుతూనే వెళ్లా పక్క వీధికి. మేగజైన్ కొనేశా.. ఫాస్ట్‌గా ఇంటికొచ్చి కథ చదవడం మొదలెట్టా.. కరెక్ట్‌గా అరపేజీ చదవగానే కన్నీళ్లు.. రెండోసారి చదివినా అదే ఫీల్ వచ్చేంత బావుంది ఆ కథ.. అన్నయ్య మొత్తం విన్నాడు...
‘చాలా బావుంది. చాలా.. ఎవడే వీడు. మన ఫ్యామిలీ మెంబర్‌లా.. అన్నీ తెలిసిన వాడిలా రాశాడు. నిజంగా వాడి పెన్నుకి టెంకాయ్ కొట్టాలే బాబూ...’
‘మరేమనుకున్నావ్ నేనేం చేసినా సూపర్...’ గర్వంగా అరిచా.
‘బుజ్జి గ్రేట్ కదా..’ పొగిడాడు. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాం.
* * *
మధ్యాహ్నం భోజనం అయిపోయింది. నాన్న పక్కన పడుకొని ఆయన్ని నిద్రపోనీకుండా హింసిస్తున్నా... అమ్మ అరిచింది. ‘కాసేపు పడుకోనీవే ఒకటే గోల...’
‘నాకు నిద్ర రావట్లేదుగా..’
‘తొందర్లో అత్తగారింటికి తరిమేస్తాం.. అక్కడ నీ ఆటలు సాగవు...’
అమ్మ మాటలు నచ్చలేదు... నాన్న వైపు తిరిగి చెయ్యేసుకుని కళ్లు మూసుకున్నా.. ఇంకా నిద్ర రాకముందే మొహం కనపడని రచయిత అడుగుతున్నాడు.
‘కథ బావుందన్నావ్. రెండుసార్లేనా.. చదివేది ఇంకొక్కసారి చదవవూ...’
కళ్లు తెరిచా. మెల్లగా లేచి నాన్న మొబైల్ తీశా. మేగజైన్‌లో రచయిత ఫోన్ నెంబర్ చూసి ‘మీ కథ చాలా బావుంది..’ మెసేజ్ చేశా...
‘్థంక్యూ సార్..’ రిప్లై వచ్చింది.
చాలాసేపు ఆలోచించా.. బావుంది అని చెప్పాలనిపించింది. చెప్పేశా.. థాంక్స్ కూడా చెప్పాడు.. మళ్లీ మనం చేస్తే ఏమనుకుంటాడో.. అయినా నేను సారో మేడమో తెలియనప్పుడు సార్ అని ఎందుకు రిప్లై ఇచ్చాడు. చెప్పేయాలి...
‘నేను సార్ కాదు.. మేడమ్..’
‘్థంక్యూ మేడమ్..’ రిప్లై వచ్చింది.
ఇంకా మెసేజ్ చేస్తే బావుండదు. సైలెంట్ అయిపోయా. కానీ ఒక్కసారి మాట్లాడాలని అనిపిస్తోంది. అసలు అతని చెల్లెలు ఎంత అదృష్టవంతురాలో.. ఆమెతో ఉన్న అందమైన రిలేషన్‌ని కథగా రాయించుకుంది..
‘మీ చెల్లెలి పేరేంటి..’ మెసేజ్ పెట్టా మళ్లీ.
‘నిజంగా చెల్లి ఉంటే బావుండేది...’
‘మరి అంత బాగా రాశారు..?’
‘మన దగ్గర లేనిది ఎక్కువ ప్రేమిస్తాం కదా!?’
అమ్మో.. ఇతనెవరో గమ్మత్తు సమాధానాలిస్తున్నాడు.. చూద్దాం.. ఇలా ఎంతసేపో...
‘ఏం చేస్తున్నారు.. లేని వాటిని ప్రేమిస్తూ కూర్చోనున్నారా..’
‘ఉన్న వాటిని కాపాడుకుందామని మిద్దె మీద విలన్‌లా కూర్చోనున్నా...’
‘అర్థం కాలేదు అర్జెంట్‌గా విలన్ ఎందుకయ్యారో...’
‘అమ్మ వడియాలు పెట్టింది.. కాకులకు నన్ను కాపలా పెట్టింది..’
‘మా అమ్మా రేపు పెడుతుందిట. వీలుంటే వచ్చి వెళ్లండి.. నాకూ పని తగ్గుతుంది’
‘మీరు బాగా మాట్లాడుతున్నారు.. రచయిత్రులా..?’
‘నాకు దగ్గర లేని వాటిని ప్రేమించడం రాదు.. అందుకే రచయిత్రి కాలేదు..’
ఇంకా మెసేజ్‌కి రిప్లై రాకముందే నాన్న పిలిచారు.
‘్ఫన్ నీ దగ్గరుందా?.. బైటకెళ్లాలి తీస్కురామ్మా...’
వెంటనే మెసేజ్ చేశా.. ‘ఇది నాన్న ఫోన్.. ఇచ్చేస్తున్నా.. మళ్లీ కలుస్తా’
నాన్నకి ఫోన్ ఇచ్చేశా.. కానీ అతనితో ఇంకా మాట్లాడాలని ఉంది.. అసలు ఎలాంటి వాడో తెలుసుకోవాలనిపించింది. నాన్న ఎప్పుడొస్తాడో.. ఎదురుచూస్తున్నా.. ఎప్పుడూ ఇలా ఎదురుచూడలేదు కొత్త పరిచయం కోసం.. నాకు తెలీకుండానే నన్నాక్రమిస్తున్నాడు.
కొంటె ప్రశ్నలు వేసి ఆన్సర్ వినాలనుంది.
అసలు అతను నాకన్నా పెద్దో.. చిన్నో.. అసలు అతను ఎలా ఉంటాడో.. కానీ సైగ చేస్తున్నాడు కథ చదవమని. మెసేజ్ చేయమని. నాన్నొచ్చారు.. ఫోన్ అడిగా. ఫొటో ఇచ్చారు.
‘ఇతను సాఫ్ట్‌వేర్ ఇంజనీరమ్మా.. ఎలా ఉన్నాడో చెప్పు...’
‘మళ్లీ చూస్తా.. ఫోన్ ఇవ్వండి..’ ఫోన్ తీస్కున్నా.
‘సారీ.. ఇందాక పెట్టేశా కదా మాటల మధ్యలో...’ రిప్లై రాలేదు.
‘నిజంగా సారీ...’
రిప్లై రాలేదు.
కోపమొచ్చింది. రింగ్ చేశా.. లిఫ్ట్ చేయలేదు.
బాధగా అనిపించింది. ననె్నవరూ నెగ్లెట్ చేయలేదు ఇప్పటివరకు.. రాత్రి కూడా చాలాసేపు వెయిట్ చేశా. రిప్లై రాలేదు.. అమ్మ పిలిచింది.
‘పడుకోమ్మా.. రేపు నిన్ను చూడ్డానికి వస్తున్నారు.. నాన్న ఫొటో తెచ్చారుగా వాళ్లే.. ఆల్‌రెడీ ట్రైన్ ఎక్కేశారంట...’
‘నో..’ చెప్పాలనుంది. రచయితతో మాట్లాడిన తర్వాత డెసిషన్ తీస్కోవాలనిపిస్తోంది.. అన్నా చెల్లెళ్ల రిలేషన్ భలే రాశాడు. మా ఇంట్లోకొచ్చి చూసినట్టే.. రిలేషన్స్‌కి వాల్యూ ఇచ్చే రచయిత కదా..! ఆలోచనొచ్చింది.. నాకు కాబోయే అబ్బాయి ఎలా ఉంటాడో కూడా తెలిసుంటుందేమో...
అడగాలనిపిస్తోంది.. రెండు నిమిషాలు మాట్లాడాలనిపిస్తోంది.. మళ్లీ రింగ్ చేశా.. ఎందుకో.. ఫోన్ ఎత్తట్లేదు..
అసలెందుకు చదివానో కథ.. చిరాకేస్తోంది అతని

మీద.. ‘పోరారేయ్..’ అనేయాలనిపిస్తోంది. ఈ అర్ధరాత్రి తెలియని రచయిత గురించి ఆలోచనేంటో...
* * *
నన్ను రెడీ చేశారు. అబ్బాయొచ్చి హాల్లో కూర్చున్నాడు.. నాన్న ఫోన్ నా చేతిలోనే ఉంది.. స్క్రీన్ వైపే చూస్తున్నా. రచయిత సైగ చేస్తాడేమో.. అని. కొంచెం మాధగా ఉంది.. రచయిత మాట్లాడలేదని.. అమ్మ తీస్కెళ్లి హాల్లో కూర్చోబెట్టింది.. అబ్బాయిని చూశా.. బాగున్నాడు. పాకెట్ వైపు చూశా. పెన్ లేదు పాకెట్‌లో. రచయిత కాదుగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కదా.. రిలేషన్స్.. మా ఇంట్లో ఉండే రిలేషన్స్ తెలుసో తెలీదో.. అసలు రిలేషన్స్‌కి వాల్యూ ఇస్తాడా?... యంత్రంలా డబ్బు వెనక పరిగెడతాడేమో... అన్నీ ఆలోచనలే...
‘బాబూ అమ్మాయితో మాట్లాడు.. అలా తీస్కెళ్లమ్మా..’ నాన్న చెప్పాడు. నేను నడిచా. అబ్బాయి నా వెనక వచ్చాడు. కారిడార్‌లో నిలబడ్డాం...
‘మీరేం చేస్తున్నారు?’ అడిగాడు.
‘ఎంటెక్...’
‘ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు?’
ఆన్సర్ చెప్పేలోపు హాల్లో నాన్న ఫోన్ రింగ్ అయింది. ‘రచయిత చేశాడేమో..’ వెళ్లి లిఫ్ట్ చేయలేని పరిస్థితి. తడబడి ‘బుక్స్ చదువుతుంటా...’ చెప్పేశా..
ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. వెళ్లి మాట్లాడాలనిపిస్తోంది.
‘మీరు నచ్చారు..’ అన్నాడు.
నాకేం చెప్పాలో తెలియలేదు.
‘మీరేం చేస్తుంటరా..’ అడగాలని అడిగా.
వౌనంగా ఉన్నాడు. మళ్లీ అడిగా.. కళ్లల్లోకి చూశాడు. చూస్తున్నాడు.. మళ్లీ అడగబోయా...
‘మా అమ్మ పెట్టిన ఒడియాలకు కాపలా కాస్తుంటా..’ అనేశాడు.
కళ్లల్లో నీళ్లొచ్చేశాయ్ నాకు.. ‘మీరేనా కథ రాసింది..’
అవునని తలూపాడు.. అలిగి అటువైపు తిరిగేశా..
‘మీరొద్దు నాకు.. చాలా అలిగా..’ అనేసా.
‘బుజ్జి గ్రేట్ కదా..’ అన్నాడు.
ఇటు తిరిగి చూశా నీళ్ల కళ్లతో.
‘నిన్న మీ అన్నయ్య ఫోన్ చేశాడు. ఫేస్‌బుక్‌లో నా ప్రొఫైల్ చూసి.. మీ ఫొటో పంపాడు. నాన్న నెంబర్ ఇచ్చాడు. నా ఫొటో పంపమన్నాడు. నాన్న నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందుకే ‘్థంక్యూ సార్..’ అని మెసేజ్ పెట్టా.. మిమ్మల్ని చూడాలనే తొందర్లో ఫోన్ మర్చిపోయా.. ఫోన్ ఉంటే బావుండనిపించింది జర్నీ అంతా’. భలే నవ్వొచ్చింది. కళ్లు తడిసేంతలా ఇంకా.. హాల్లో ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. మరెవరో ఆ ఫోన్ వెళ్లి చూశా.. అన్నయ్య చేశాడు.
‘గిఫ్ట్ నచ్చిందా?’ అడిగాడు.
‘ఏమో నాకేం తెలీదు. అంతా నువ్వే చేశావ్..’
‘ఏరా.. అతను నచ్చలేదా?’
నాకు చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది...
‘కథ నచ్చింది..’ అని ఫోన్ పెట్టేశా సిగ్గుతో.
నాన్న ననే్న చూస్తున్నాడు.. ఎదురుగా రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తకుండా.. అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడిలా..
సాఫ్ట్‌వేర్ రచయిత కళ్లతో సైగ చేశాడు. కళ్లతోనే ఓకె చెప్పేసా.
‘మీ ఫోన్‌కి నెంబరుండదా.. మీ నాన్న ఫోన్‌కి మాత్రమే నెంబరుంటుందా?’ మెల్లగా అడిగాడు.
‘ఈ రోజు నుంచి నా ఫోన్‌లో మీ నంబరుంటుంది నాన్న ఫోన్ అపరిచితులకు మాత్రమే..’
కథ రాసిన చెయ్యి నా చెయ్యి పట్టుకుంది. అన్న మీద భలే ప్రేమేసింది ఆ చేతిని కలిపినందుకు.

సురేష్‌కుమార్ సర్వేపల్లి
సీనియర్ ప్రొడ్యూసర్, టివి 9,
టివి 9 బిల్డింగ్స్,
బంజారాహిల్స్, రోడ్ నెం.3, హైదరాబాద్... 9948505107

-సురేష్‌కుమార్ సర్వేపల్లి