S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గురూణాం గురుః - కవీనాం కవిః

ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 5వ తేదీ అయింది. ఆ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం కూడా. భారతీయ సంప్రదాయంలో ఉపాధ్యాయునకు అంటే గురువునకు గురుతర స్థానం ఉంది.
‘గుశబ్దస్త్వంధకారస్య రుశబ్దస్తన్నిరోధకోః
అంధకార నిరోధత్వాత్‌ గురురిత్సభిధీయతే॥
మానవుడిలోని అజ్ఞానమనే చీకటిని అడ్డుకొనేవాడు గురువు. అంటే జ్ఞానభానుడన్న మాట గురువు. గణపతి కూడా జ్ఞానభానుడే. అందుకే శ్రీ గణేశ ప్రభాత ప్రార్థనాష్టకంలో
‘నమస్తే నమస్తే ప్రభో శంభుసూనో
నమస్తే నమస్తే ప్రభో జ్ఞానభానో...’
అని ఉంది. మరో మాట - వినాయకుడు జ్ఞానమే గమ్యంగా గలవాడు. ఈ విశేషణం
‘గుణాతీత మానం చిదానంద రూపం
చిదాభాసకోం సర్వగం జ్ఞానగమ్యమ్
మునిశ్రే్ఠః మాకార రూపం పరేశం
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ॥
అన్న గణేశ స్తుతి శ్లోకంలో కనిపిస్తుంది. అంతేకాదు - గణేశుడు పరబ్రహ్మ స్వరూపమని కూడా ఈ పై శ్లోకంలో ఉంది. గురువు కూడా పరబ్రహ్మ స్వరూపమే కదా;
‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’
అని గదా! శ్లోకం. గురువెలాగైతే - బ్రహ్మవిష్ణు మహేశ్వరుల వలే తన వద్దకు చేరిన వారిలో సద్భావాలను సృష్టించడం, ఉన్న మంచి భావాలను విస్తృతపరచి రక్షించడం, చెడు తలంపులను నాశనం చేయడం చేస్తాడో - అలాగే గణేశుడు కూడా తనను సేవించే భక్తుల మనస్సులలో మంచి భావాలను సృష్టించడం, ఉన్న మంచి భావాలను విస్తృతపరచి రక్షించడం, చెడు తలంపులను నాశనం చేయడం చేస్తాడు. అసలు - ‘గ’ అంటే బుద్ధి. ‘ణ’ అంటే జ్ఞానం. బుద్ధి జ్ఞానాలను ప్రసాదించే దేవుడు - గణపతి. ఉత్తమ గురువు కూడా ముమ్మూర్తులా అంతే కదా! కాబట్టి పరబ్రహ్మ రూపం - గణపతీ అవుతాడు. గురువు అంటే ఉపాధ్యాయుడూ అవుతాడు. అంటే త్రిమూర్త్యాత్మక రూపం. త్రిమూర్త్యాతీత రూపం - గణపతీ, గురువూ అన్నమాట. ఇంతకీ వీరిరువురికీ ఈ విషయంలో భేదం లేదని గ్రహించాలి.
మన తెలుగు సాహిత్యంలో -
‘తుండము, నేక దంతమును, తోరపు బొజ్జయు, వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును, మెల్లని చూపుల మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ! ఓరుూ గణాధిప! నీకు మ్రొక్కెదన్’
అన్న పద్యంలో మనం కోరుకున్న విద్యల కన్నిటికీ గురువు - వినాయకుడని ఉంది. కనుక వినాయకుని కంటే మించిన ఉపాధ్యాయుడు లేడని గ్రహించాలి. ‘ఉపాధ్యాయుడు’ అన్న పదం ప్రకృతి రూపం. ‘ఒజ్జ’ అన్న పదం వికృతి రూపం - తెలుగు వ్యాకరణం ప్రకారం. అందుకనే తరతరాలుగా అంతటా బాలబాలికలందరూ వినాయక చవితినాడు తమ పుస్తకాల్నీ, పలకలనూ గణేశుని విగ్రహం వద్ద ఉంచి యథాశక్తిగా అర్చిస్తారు. ఇంతకూ చిన్నారులకు అభీష్టాల్ని తీర్చే ఇష్టదైవం వినాయకుడే. కాబట్టే ఈయన వీరి పాలిట విద్యా గణపతిగా వెలుగొందుతున్నాడు. సుమారుగా ముప్పై ఏళ్ల క్రితం భారతదేశంలోని ప్రాచ్య సంస్కృత కళాశాలల్లో శ్రీవిద్యా గణపతి నవరాత్రోత్సవాలను విధిగా నిర్వహించేవారు.
భారతీయ సంప్రదాయంలో ఉపాధ్యాయుడు అంటే గురువు నేర్పే విద్య - ప్రధానంగా కేవలం జీవనోపాధికి పనికి వచ్చే శాస్త్ర విద్య మాత్రమే కాదు - వేద విద్య - మంత్ర విద్య కూడాను. వేద విద్యను చెప్పే వ్యక్తిని కూడా ఉపాధ్యాయుడని అనడం కూడా భారతీయ సంప్రదాయంలో ఉంది. (కేవలం పాఠశాల విద్యను బోధించే వ్యక్తినే ఉపాధ్యాయుడనీ, కళాశాల విద్యను నేర్పే వ్యక్తిని అధ్యాపకుడనీ, విశ్వవిద్యాలయ విద్యను బోధించే వ్యక్తిని ఆచార్యుడనీ ఈనాడు అంటున్నాం.) వేదార్థాన్ని తెలిపే ఆధ్యాత్మిక విద్య బాగా తెలిసిన వ్యక్తి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్. కాబట్టి ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం అనడం కూడా సముచితంగానే ఉంది.
అసలు - ప్రతి మంత్రమూ ఓంకారంతోనే మొదలవుతుంది. అది - బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి తత్త్వానికి ప్రతీక. పూర్వం భారతీయ గురువులు ఓంకారం లేకుండా ఏ మంత్రాన్నీ ఉచ్ఛరించేవారు కాదు. ఉపదేశించేవారూ కాదు. సంస్కృత భాషా లిపికి చెందిన ఓంకారం ఎలా ఉంటుందో, గణేశుని బాహ్య రూపమూ అలాగే ఉంటుంది. ఓంకారం ఎలా త్రిమూర్త్యాత్మకమో, గణేశ తత్త్వమూ అలా త్రిమూర్త్యాత్మకమే. ‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః..’ అన్న శ్లోకం చెప్పినట్లుగా త్రిమూర్త్యాత్మక రూపుడైన గురువు కూడా అంటే ఉపాధ్యాయుడు కూడా ఓంకార రూపమే అని సంభావించవచ్చు. నిర్ణయించవచ్చు కూడా.
కాబట్టి ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశం అంతటా జరిగే గణేశార్చన అంటే ఉపాధ్యాయార్చనయే. ఉపాధ్యాయార్చన అంటే గణేశార్చనయే. ప్రధానంగా విద్యా గణపతి అర్చనయే. ఉత్తమ శిష్యుల్ని తయారుచేసే ఉత్తమ బుద్ధిని ఉపాధ్యాయులకు అంటే గురువులకు ప్రసాదించే వేలుపు కూడా గణపతి కాబట్టి ఆయన ‘గురూణాం గురుః’ అంటే గురువులకే గురువు. మరో మాట - ‘కవీనాం కవిః’ గణపతి అంటే ఆయన కవులలోకెల్లా కవి. గురువులందరూ కవులు కారు. కాలేరు కానీ - విఘ్నేశుడు మాత్రం ‘కవీనాం కవిః’ అయిన ‘గురూణాం గురుః’. ఇంతకీ గురువులలోకెల్లా విశిష్ట గురువు ‘కవీనాం కవిః’ అయిన వినాయకుడు.

-డా.రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287