S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డైరీలు - ఉత్తరాలు

డైరీలు రాసే అలవాటు చిన్నప్పుడు ఎక్కువగా ఉండేది. ఉద్యోగ బాధ్యతల్లో పడిన తరువాత తగ్గిపోయింది. కాని రాస్తే బాగుండునని అన్పిస్తుంది. ఉద్యోగంలో చేరినప్పుడు రాసిన పేజీ మాత్రం ఉండిపోయింది. న్యాయవాదిగా ఉండి న్యాయమూర్తిగా పరిణామం చెందిన క్రమం అందులో కనపడింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లభించింది.
ఉద్యోగ బాధ్యతల్లో ఎదురైన అనుభవాలు, సహ న్యాయమూర్తులతో గడిపిన క్షణాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనలని నిక్షిప్తం చేయలేదు. అయితే అవి మనస్సులో నిక్షిప్తం అయి వున్నాయి. ఎప్పుడైనా ఆ అనుభవాలని రాయవచ్చు. అయితే అప్పుడే అవి రాసి ఉంటే అవి తాజాగా నవనవలాడుతూ వుండేవి.
ఉద్యోగ బాధ్యతల గురించే కాదు. మనం ఏదైనా ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఆ అనుభవాలని రాసి ఉంచితే ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు చదువుకుంటూ వుంటే మనస్సు ఆనందపడుతుంది. మన మానసిక పరిస్థితి, అప్పుడున్న పరిస్థితులు ఇట్లా ఎన్నో విషయాలని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
డైరీ రాయడం, ఆ తరువాత ఎప్పుడో చదువుకోవడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. గోదావరి పుష్కరాలప్పుడు ఎక్కడికి వెళ్లాం, ఏ గుడికి వెళ్లాం. అధికారులు, పూజారులు మనతో ఎట్లా ప్రవర్తించారు లాంటి విషయాలని కృష్ణా పుష్కరాల సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవచ్చు. జ్ఞాపకాలు ఆనందాన్ని ఇస్తాయి.
డైరీలలోని రాతలు కాలం గడిచిన తరువాత చదువుకున్నప్పుడు ఎక్కడికో వెళ్లిపోతాం. డైరీలే కాదు, ఉత్తరాలు కూడా అలాంటివే. పెళ్లైన కొత్తలో భార్యకు రాసిన ఉత్తరం, భర్తకి రాసిన ఉత్తరం మనల్ని ఎక్కడికో తీసుకొని వెళ్తాయి.
కాలేజీ రోజుల్లో బాపు, అన్నయ్య రాసిన ఉత్తరాలు చదువుకుంటే మనస్సు ఊగిపోతుంది. మన పట్ల వాళ్ల శ్రద్ధ, ఆసక్తి మనల్ని ఆనంద డోలికల్లో ముంచెత్తుతాయి. ఇప్పుడు వాళ్లు లేకపోవచ్చు. కానీ వాళ్ల రాత, ప్రేమ మనల్ని ఊరడిస్తాయి. ఆ రోజు అతి మామూలుగా అన్పించిన విషయాలు ఇప్పుడు ఎంతో విలువైనవిగా అన్పిస్తూ ఉంటాయి. ఎంతో ప్రేమగా, వెచ్చగా అన్పిస్తాయి.
మన భావ ప్రకటన అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయం తెలుసుకునే వీలు చిక్కుతుంది. అదే విధంగా అప్పుడు గొప్పగా అన్పించిన విషయం ఇప్పుడు అల్పంగా తోచవచ్చు.
అప్పుడు రాసిన అనుభవాన్ని, అభిప్రాయాలని ఇప్పుడు తిరిగి రాసుకునే పరిస్థితి కూడా ఉంటుంది.
టెలిఫోన్లు, మొబైల్స్ వచ్చిన తరువాత డైరీలు, ఉత్తరాలు రాసుకోవద్దని ఎవరన్నారు?
మీ కలాన్ని ఉపయోగిస్తారా? మీ ‘కీ’ బోర్డుని ఉపయోగిస్తారా? మీ ఇష్టం.