S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహావిజేత 17

41
ఆనాటికి కుంతల రాచవారు కరద చేరేరు.
చంపక మాలిని, విషయ, విరజ - వారి ఇష్టసఖులూ, వజ్రసేనుడూ అతని సేవకుడు మాత్రం వచ్చారు. ఈ బృందంలో మదనుడు లేడు.
తీరా, కుంతలపురిలో వీరందరూ బయలుదేరుతుండగా - గాలవుల వారు మదనుని రాజధానిలో వుండమన్నారు. దానిని మహారాజు కోరికగా చెప్పాడాయన. మహారాజు అస్వస్థత దృష్ట్యా దుష్టబుద్ధి కూడా మదనుని ఆగిపొమ్మన్నాడు. మహారాజుకి మదనుడంటే సదభిప్రాయం ఉన్నందుకు దుష్టబుద్ధికి అంతరాంతరాల్లో సంతోషంగానే ఉన్నది.
అప్పటికే చందనావతి నుండీ పద్మినీ, దుర్గీ వచ్చి వున్నారు. కరదలో వీరందరికీ ఆతిథ్యం, వసతి సౌకర్యాలు - అన్నీ అడివప్ప పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఆయన శిష్యులూ, దక్షణ్ణా, పరివారం, వేగులూ అందరూ - అటు కుంతల, ఇటు కళింద్ర రాజ కుటుంబీకుల మర్యాదలలో అప్రమత్తులై ఉన్నారు.
చవితి నుండీ ప్రాచీన గణపతి దేవాలయంలో నవరాత్రులు ఆరంభం. ఆనాటి ఉదయం నుండీ ఆలయంలో పూజా కార్యక్రమాలకు అందరూ చైతన్యార్ణవంలా పొంగుతూ దేవాలయాన్ని చేరారు. ప్రత్యేక, సామూహిక పూజా విధుల్ని పూర్తి చేసుకుని ఏనుగుల సంతని చూసి అందరూ ప్రాసాదానికి చేరారు.
పంచమినాడు - రాచవారు ప్రీతీసంగమం చేరుకున్నారు. ఆ సాయంత్రం నుండీ నదీ తీరమంతా నేల ఈనినట్లుగా జనం చేరారు. ఎదురుగా విస్తృత జలాస్తరణం. ఎటు చూసినా తీరపంక్తి సమస్తమూ ప్రత్యేక నిర్మాణాలతో నదీహారతికి సిద్ధమైంది.
సూర్యుడు అస్తమించాడు. ఒక్కసారిగా వేల హారతులతో నదీమతల్లికి పూజ ప్రారంభమైంది. వేనవేల కంఠాలు ఒకే గళంగా సామూహిక ప్రార్థనా గీతాన్ని గానం చేయనారంభించాయి. చేతులలోని దివ్య హారతుల్ని తిప్పుతూ గానాన్ని పూర్తి చేశారు. ముక్తకంఠంతో ‘గంగా మారుూకీ జై’ అని నినదించారు ప్రజలు.
స్ర్తిలు దొనె్నల్లో పుష్ప హారతులను నదిలోకి వదిలారు. ఈ జల హారతి సంప్రదాయమంతా ‘మహారథి’ భాషలో ఆచరించబడుతుంది. క్రియా వ్యవహారమంతా ‘వారణాసి’లో జరిగే గంగాహారతి ప్రభావంతో తరతరాలుగా ఆచరణలోకి వచ్చింది. జలహారతి కృష్ణానదికి జరుగుతున్నా గంగ పేరుతోనే ప్రాచుర్యం! ‘మహారథి’ భాషలో ‘మారుూ’ అంటే మాత అనే అర్థం!
పరమ రమణీయంగా వున్నది అక్కడి వాతావరణం.
ఆ కోలాహలాన్నీ ఉత్సవ సంరంభాన్నీ చూసి కుంతల రాచవారు సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు. తనివితీరా ఆ దృశ్యాలను మనోఫలకం మీద చిత్రించుకుని తృప్తి పొందారు.
ప్రీతీ సంగమం జలదేవతకి అక్కడొక చిన్న ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని సందర్శించారందరూ. అక్కడ రాత్రి అంతా ఉత్సవమే. ఒక జాము గడిచిన తర్వాత తీర్థ ప్రసాదాలను తీసుకుని రాచవారంతా తమతమ విడిదికి తిరిగి వచ్చారు.
మరునాడు - అతి ప్రాచీనమైన గుహల్నీ చూసి వచ్చి ఆనందించారు.
ఆ పైన మూడు రోజులూ నగరంలోని ప్రధాన ప్రదేశాల సందర్శనంతోనే గడిపారు.
42
రాత్రి-
నగరంలో వివరంలేని సవ్వడులు సాగుతూనే ఉన్నాయి.
అతిథులంతా భోజనశాలకు వచ్చారు. వడ్డనలు అయినాయి. పంక్తి భోజనం మొదలైంది.
ఉత్సవాల విశేషాలన్నీ ముఖ్య సంభాషణగా సాగుతున్నాయి. మధ్యమధ్యలో భోజన పదార్థాల గురించి కూడా చర్చ జరుగుతోంది.
ఈ బృందంలో విషయకి ప్రత్యేక స్థానం. ఆమె గొప్ప సంభాషణా చాతుర్యం కలది. మాటల్లో విరుపులూ, చరుపులూ ప్రయోగించి నలుగురినీ అలరించగల నేర్పరి. ఈ విహార యాత్రలో ఆమెకు అందరి మీదా చనువు ఏర్పడింది. ఎవరి మీద ఏ పరిహాసోక్తి విసిరినా, వారు కూడా దాన్ని తేలిగ్గా తీసుకుని నవ్వేస్తున్నారు.
చంపకమాలిని గంభీరంగా పరిణత మనస్కగా కనిపిస్తున్నది. మితభాషి. కానీ ‘స్మితపూర్వం’గా మాట్లాడుతూ ప్రశాంత వదనంతో ఉంటున్నది.
విషయ చమత్కారానికీ, హేళనకూ వజ్రసేనుడు ప్రధాన లక్ష్యం అయినాడు. మదనుడు రాకపోవడం అతనికి చాలా లోటుగా అనిపిస్తోంది. అతను వస్తే తనకీ ఒంటరితనం ఉండేది కాదు. అయినా ఉత్సాహం తెచ్చుకుని అందరితో కలివిడిగా వున్నాడు. విషయ మాటలకు ముఖాన్ని కందగడ్డలాగా చేసుకున్నా, వెంటనే సర్దుకుని అతడూ ఈ సరదాలను ఆనందిస్తున్నాడు.
‘మన మిత్రుడు వజ్రసేనుడు భక్ష్యాల్లోని పాలకాయల మీదకు ‘దండు పంపు’ అన్నట్లు మొదలెట్టాడండీ’ అన్నది విషయ.
అందరూ గొల్లున నవ్వారు.
గుప్పిటలో వున్న పాలకాయల్ని విస్తరిలోకి వదిలి భ్రుకుటి ముడిచి కినుకగా చూశాడు వజ్రసేనుడు.
‘అయినా వారేమీ వినాయకులవారేం కాదులేమ్మా. నాజూకు అయిన నాగరికులు’ అన్నది దుర్గి. ఆ మాటకి అందరూ ఆశ్చర్యంతో ఆమెవైపు చూశారు.
తృటిలో తేరుకుని అన్నది విరజ ‘అమ్మో! ఈ పిల్ల గడసరే. మా అన్నకు వత్తాసు పలుకుతున్నది!’ అని.
అందరూ నవ్వారు. కానీ, విషయ మాత్రం చంపకమాలినిని చూస్తూ గంభీరంగా, ‘రాజకుమారీ! కళింద్రవారి చూపు కుంతలపై మరలుతోందమ్మా. మనం జాగ్రత్త పడాలి’ అన్నది నర్మగర్భంగా.
‘చింత లేదులే విషయా. ఇక్కడ ఎవరికి ఎవరూ తీసిపోరు’ అన్నది చంపకమాలిని - దుర్గివైపు హెచ్చరికగా చూస్తూ. అటు పంక్తి చివరి వజ్రసేనుడూ, ఇటు పక్కన పద్మినీ, దుర్గీ లజ్జావనత వదనులైనారు.
‘ఇక్కడ మీగడ మెరుగు’ కుంకుమ పూవుతో గుబాళిస్తూ వున్నది రాజకుమారీ. నీకూ, నాకూ, విరజకూ అత్యంత ప్రియమైన పదార్థం. ఒక పట్టు పట్టవచ్చు’ అంటూ ముందుకు సర్దుకుని కూర్చుని ఆ పదార్థాల్ని తినసాగింది విషయ. చంపకమాలినీ సేవించసాగింది.
‘మేము దాన్ని బహిష్కరించాం’ నవ్వుతూ అన్నది పద్మిని.
విరజ ‘ఈనాటికి నాకు కూడా వద్దు’ అన్నది.
వజ్రసేనుడు ‘నేనూ అంతగా ఇష్టపడను’ అని ‘ఈ పూటకి నాకు చాలు. ఇంక వద్దు’ అన్నాడు.
‘ఎందుకనీ, దుర్గికి ఇష్టం లేదనా?’ అనబోయి ఆగింది విరజ. ముసిముసి నవ్వులతో కొంటెచూపుతో అన్నకి ఆ భావాన్ని అందజేయనే చేసింది. అతడు కనుసైగతో చెల్లిని మందలించాడు. అందరికీ ఆ వౌనలిపి అర్థమవుతూనే ఉంది. భోజన కార్యక్రమం ముగియబోతోంది.
ఉన్నట్టుండి పెద్దగా ఓకరిస్తూ, వస్తున్న వాంతిని ఉగ్గబట్టుకుని ద్వారం బయటికి పరుగెత్తింది చంపకమాలిని. అందరూ లేచి ఆందోళన పడుతూ ఆమెను అనుసరించారు. రాకుమారి వమనం చేసుకుంది. చెలులిద్దరు రాకుమారికి నీరు అందించి, ఆమెను ఆ స్థితి నుండీ తేర్చారు. అందరూ వచ్చి శాలలో నిలిచారు. చంపకమాలిని తన శయన గృహానికి వెళ్లిపోయింది.
విషయం తెలిసి దొడ్డణ్ణ, హాలప్ప కంగారుపడుతూ పరుగుపరుగున వచ్చారు.
‘ఏదో తేడా చేసి ఉంటుంది. బయట అన్నీ చూడటానికి తిరగటం, ఉత్సవాల హడావిడి అంతా కలిసి శ్రమ అయిందల్లే ఉంది’. మాట పూర్తి చేయక ముందే, చేత్తో నోటిని మూసుకుని ద్వారం వైపు పరుగెత్తింది విషయ కూడా. ఆమెకూ పెద్ద వాంతి అయింది. నెమ్మదించాక లోపలికి వెళ్లి తన పడక మీదికి చేరింది.
ఇంతలో చంపకమాలిని మరోసారి వాంతి చేసుకున్నదని కంగారుగా వచ్చి చెప్పింది కాంచన. విషయకూ మళ్లీ వాంతి అయిందని మరో పరిచారిక వచ్చి చెప్పింది.
భటుల్ని పిలిచి ఏదో చెప్పి బయటకి పంపాడు దొడ్డణ్ణ. హాలప్ప మరో భటునితో కలిసి పచారాల్ని దాటుతూ వేగంగా ప్రాసాదం లోపల ఆగ్నేయ దిశగా పరుగెత్తాడు.
ఈలోగా రాజవైద్యులు ఇరువురు అక్కడికి చేరారు. రాకుమారినీ, విషయనూ పరీక్షించసాగారు.
వారికి వెంట వెంటనే వాంతులు అవుతున్నాయి. రాజవైద్యులిరువురూ తమలో తాము సంప్రతించుకుంటూ వైద్యం చేస్తున్నారు.
ఈ కబురు తెలిసిన వెంటనే అక్కడికి వచ్చారు అడివప్ప, దక్షణ్ణ. వైద్యులను ప్రశ్నించారు. ‘్భజించిన ఆహారం వికటించింది. అందులో తినకూడనిదేదో కలిసింది’ అన్నారు వారు.
అందరికీ ఆశ్చర్యంతోపాటు ఆందోళన కూడా అధికమైంది. కుంతల నుంచీ వచ్చిన వారంతా అక్కడికి చేరి, తాము తిన్న పదార్థాల్ని గురించి చర్చించసాగారు.
‘మీగడ మెరుగుని వారిద్దరే భుజించారు. మిగిలిన పదార్థాలను తిన్న అందరికీ ఏమీ కాలలేదు కనుక- మీగడ మెరుగులోనే తప్పు జరిగినట్లు’ అన్నాడు వజ్రసేనుడు. అవునంటూ అందరూ తలలూపేరు.
అడివప్ప, దక్షణ్ణ శయన మందిరాలలోకి వెళ్లి చూశారు. చంపకమాలినీ, విషయా మాగన్నుగా నీరసపడి పడుకుని ఉన్నారు. ఔషధం పనిచేయడం ఆరంభించి వాంతులు కాస్త తగ్గాయి.
సాలోచనగా వారిద్దరూ శాలలోకి వెళ్లేసరికి హాలప్ప వేగంగా అక్కడికి వచ్చి, ప్రాసాదంలో తూర్పు వైపున గల కూటస్థలానికి దారి తీశాడు. వజ్రసేనుడు వారిని అనుసరించబోయాడు. కానీ అడివప్ప, మీరు ఇక్కడే ఉండి, విశ్రాంతి తీసుకోండని వెనక్కి పంపించేశాడు.
కూటస్థలంలో అప్పటికప్పుడే భటుల మధ్యలో అడసాల పర్యవేక్షకులూ, ముఖ్యమైన వంటవారూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు.
వారిని ప్రశ్నించే కార్యక్రమం చాలాసేపు సాగింది. అడివప్ప, దక్షణ్ణలు అందరినీ ఎటువారినటు పంపివేశారు. తిరిగి వచ్చి రాజవైద్యులతో సంప్రతించారు. తగిన జాగ్రత్తలు చెప్పి ఆ ఇరువురినీ ఆ రాత్రికి అక్కడే ఉండమన్నారు. హాలప్ప, దొడ్డణ్ణలను కూడా అక్కడే ఉండే ఆజ్ఞలనిచ్చారు.
ప్రాసాద ప్రాంగణంలోని ఆంతరంగిక వేశానికి వచ్చి కూర్చున్నారు. సంభవం తీవ్రత గురించి - అడివప్ప, దక్షణ్ణలకు మనస్తాపం కలిగింది. వంటవారి నుండిగానీ, వారి పర్యవేక్షకుల నుండి గానీ వలసిన సమాచారం రాలేదు. విష ప్రయోగ ప్రయత్నమా లేక ప్రమాదవశంగా జరిగిన లోపమా అనేది తెలియలేదు.

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600