S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మామిడిపండు (కథ)-- సిసింద్రి

పూర్వం విష్ణు భక్తుడైన సుఫల రాజ్యానే్నలే హరికేతుడనే రాజుకి పిల్లలు లేకపోవడమనే కొరత తప్ప మరే కొరతా లేకుండా ఉండేది. రాజుగారు అనేక పూజలు, హోమాలు చేయగా సంతృప్తుడైన విష్ణువు ఒకనాడు రాజుగారి కలలో సాక్షాత్కరించి నీ తోటలో అన్నిటికన్నా మేటియైన మధుర ఫలమును రాణి మధూలికతో తినిపించిన యెడల సంతానప్రాప్తి కలుగుతుందని వరమొసగాడు.
ఆనందభరితుడైన హరికేతుడు తన తోటలోని ఫలములన్నిటిని తెప్పించాడు. అరటి పండు మధురమే గానీ సువాసన లేదు. కమలా బత్తాయి జామ ద్రాక్ష దానిమ్మలు పులుపు కలుపుకున్నవి. పనస అనాస ఆకారం బాగోలేదు. నేరేడు రంగే ఇంపుగా లేదు. రేగుపండు సయించలేదు. అన్నిటిలోకి ఎర్రఎర్రని పచ్చని రంగులతో నిగనిగలాడుతూ, మదిని దోచే వాసనలు కలిగి, మధురాతి మధురంగా రుచిని కలిగి చూపులకు సైతం అందంగా ఆకర్షవంతంగా ఉన్న మామిడిపండు మేటిగా అనిపించింది.
మామిడిపండు తిన్న పది నెలలకు రాణీగారు పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పాపాయి పేరు స్వర్ణరేఖ అని పెట్టారు. ఆ పాపాయికి కూడా మామిడి ఆకుల తోరణాలు, మామిడికాయలు, మామిడి పళ్లంటే తప్ప మరే పదార్థమూ రుచించేది కాదు.
ఆ సమయంలో మామిడి సంవత్సరం పొడవునా లభించే ఫలంగా ఉండేది. రాజుగారు తన తోటలో రకరకాల మామిడి చెట్లను తప్ప ఇతర ఫలవృక్షాలను పెంచవద్దని ఆదేశించడంతో తోటంతా మామిడి మొక్కలతో కళకళలాడిపోసాగింది.
అపురూప లావణ్యవతి అయిన యువరాణి స్వర్ణరేఖ పెరిగి పెద్దదయింది. స్వర్ణరేఖకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా ఉద్యానవనంలో వాహ్యాళికెళ్లిన రాణీగారిని నాగుపాము కరవడంతో మరణించినందువల్ల రాజ్యంలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజుగారు దిగులుతో మంచం పట్టారు. మంత్రిగారి జోక్యంతో పక్క రాజ్యంలో వయసు మీరినా ఇంకా పెళ్లికాకుండా ఉన్న తన బంధువుల అమ్మాయిని ఏదో మాయమాటలు చెప్పి రేపు కన్యాదానం చేయాలంటే రాణి ఉండాలని రాజుగారితో వివాహం జరిపించేశాడు. రాజ్యం కూడా తన చెప్పుచేతల్లో ఉంటుందన్న అత్యాశతో.
పినతల్లి అయిన పసరికకు సవతి కూతురంటే కంటగింపుగా ఉండేది. దానికి తోడు రాజుగారు పదేపదే స్వర్ణరేఖకు కాబోయే భర్తకే రాజ్యాన్ని అప్పగిస్తానని అనటంతో మరింత ఈర్ష్యతో రగిలిపోసాగింది.
ఒకరోజు మంత్రిగారితో కుమ్మక్కై తోటలోని చెట్లన్నిటికీ విషం నింపిన నీళ్లు పట్టడంతో ఆ ఫలాలన్నీ విషతుల్యమైపోయాయి. అందులోని ఫలాలు కేవలం యువరాణికి మాత్రమే స్వంతమని శాసించటం వల్ల అవి తిన్న స్వర్ణరేఖ చనిపోయింది.
రాజుగారు కూతురి మృతదేహం వద్ద కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగాడు. రెండు రోజులైనా దహన సంస్కారాలు సైతం చేయనివ్వక ఏడుస్తున్న రాజుగారికి ధైర్యం చేసి ఎవరూ ఏమీ చెప్పలేక సతమతమవసాగారు. మూడవ రోజు స్వర్ణరేఖ శరీరం నుంచి ఒక బంగారు కాంతి మెరిసి ఇలా వినిపించసాగింది ‘నాన్నగారూ బాధపడకండి. నేను ఒక మంచి మామిడి ముట్టె రూపంలో మారబోతున్నాను. మన తోటలో దీన్ని నాటిన మరుక్షణమే అన్ని చెట్లలోని విషము హరించుకుపోయి మధురంగా తయారవుతుంది. మీ ఇంట అమ్మాయిగా జన్మించిన నాకు దుఃఖమే ఎదురైంది కాబట్టి ఇకపైన మామిడి చెట్లకు ఫలములు అన్ని రోజులూ కాకుండా మండుటెండల్లో మీరంతా అల్లాడుతున్నప్పుడు నా జ్ఞాపకాలు మీకు మధురమై తోచేలా నేను వేసవిలో మాత్రమే మీకు లభిస్తాను’ అని చెప్పి బంగారు వర్ణంతో మెరిసే మామిడి ముట్టెగా మారిపోయింది.
మంత్రిని, పసరికను తరిమికొట్టిన రాజుగారు మామిడి ముట్టెను తోటలో నాటించి ప్రతి వేసవికీ కాసే ఫలాలను ప్రజలకు కూతురి జ్ఞాపకంగా పంచి పెట్టి చివరి రోజుల్లో ఆ తోటను విస్తరించే బాధ్యత తీసుకున్న యువకుని దత్తత తీసుకుని రాజుగా చేసి సంతృప్తి కన్ను మూశారు.

-డేగల అనితాసూరి