S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జంబో బస్సు వస్తోంది!

* అధునాతన హంగులతో కొత్తరూపు *మొబైల్ జిమ్‌కోసం కొత్తరకం వాహనాలు *స్పా, అందాలకు మెరుగులూ అందులోనే
*మొబైల్ హోటల్స్..వస్త్ర దుకాణాలూ బస్సుల్లోనే *మారుతున్న కాలంలో కొత్తరూపుతో ప్రత్యక్షం

భవిష్యత్‌లో జంబో బస్సులు రాబోతున్నాయ్..
ఆ బస్సు ఓ మినీ ట్రెయిన్‌లా ఉంటుంది...
అది ప్రయాణించడానికి ఓ ట్రాక్ కూడా ఉంటుంది..
అది కదలినప్పుడు ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందీ ఉండదు..
అ బస్సులోపలి భాగం ఓ పార్కులా ఉంటుంది..
విశాలంగా ఉండే సీట్లలో, విలాసంగా ప్రయాణించొచ్చు...
మనం బస్సులో ఉంటే...ఆ బస్సు కింద నుంచి
ఇతర చిన్నవాహనాలు వెళ్లిపోతూంటాయి..
ట్రాఫిక్ సమస్యే ఉండదు..
గంటకు 60 కి.మి వేగంతో దూసుకుపోయే
ఆ బస్సులో ఒకసారి 1200 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది..
ఇదంతా నిజమే...అయినా నమ్మశక్యంగా లేదుకదూ..
కానీ అది వాస్తవమే...నమ్మి తీరాల్సిందే...చైనాలో అటువంటి బస్సును నడిపి పరీక్షించారు...అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఆ బస్సుపై పడింది.
భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆ బస్సు ప్రత్యేకతల గురించి ఆరా తీశారు. ఇంతకీ అంత భారీ బస్సు అవసరం ఏమొచ్చింది..? దాని పేరేంటి..? అంటే...అదో పెద్ద కథే.
ఆధునిక జీవితంలో మనిషి కాలంతో పోటీపడి పరుగెడుతున్నాడు. వేగం...అతడి జీవన వేదంగా మారిపోయింది. ఈ వేగం తెస్తున్న ప్రమాదం అందరినీ భయపెడుతోంది. దీంతో భద్రతతో కూడిన సురక్షిత ప్రయాణానికి అనువైన వాహనం కావాల్సి వస్తోంది. అన్నివర్గాల వారికి అనువైన ప్రయాణ సాధనం బస్సు. గడచిన కొన్ని సంవత్సరాలుగా బస్సు ఆధునిక సొబగులతో వినూత్న మార్పులతో ఆకట్టుకుంటోంది. ఆధునిక జీవనశైలిలో పెరిగిన వాహనాలు మన గమనాన్ని అడ్డుకుంటున్నాయి. ఎటువంటి ఆటంకాలు లేని సాఫీ ప్రయాణం ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. సాధారణ బస్సులు కాస్తా ఏసీ, టీవీ, స్లీపర్ సౌకర్యాలతో అలరిస్తున్నాయి. బస్సులనే మొబైల్ జిమ్‌లుగా మార్చి జనం ముందుకు తెస్తున్నారు. బస్సులనే మొబైల్ హోటళ్లుగానూ మార్చేస్తున్నారు. ఇక రాజకీయ నాయకులకు హైటెక్ బస్సులే రథాలైపోతున్నాయి. చైనాలో అయితే కాలం చెల్లిన బస్సులను తీర్చిదిద్ది ‘అందమైన’ స్పాలుగా మార్చేస్తున్నారు. మన దగ్గర స్కూల్ బస్సులకు పసుపురంగు మార్పు తప్ప విశేషాలేమీ ఉండవు. నిజానికి అవి పూర్తి కండిషన్‌లోనూ ఉండవు. విదేశాల్లో అలా కాదు. అత్యాధునిక ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ బస్సులనే స్కూల్ బస్సులుగా వాడుతున్నారు. ఇదంతా సరే ప్రపంచాన్ని ఇప్పుడు ఓ కొత్తరకం బస్సు ఆకర్షిస్తోంది. అదింకా ప్రయోగాల దశలోనే ఉంది. ఆ బస్సు నిజంగా అందుబాటులోకి వస్తే బాగుంటుందని ఎక్కువమంది కోరుకుంటున్నారు. ఆ బస్సు అంత ప్రయోజనకారి కాదనే వారూ పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఇంతకీ ఆ బస్సు కథ ఏమిటి?
ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ (టిఇబి).. ప్రపంచంలో అత్యంత రద్దీగా, ట్రాఫిక్ సమస్యలతో, కాలుష్యంతో సమతమతమయ్యే దేశాల్లో చైనా తొలి పది స్థానాల్లో ఉంది. ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ఆ దేశంలోని ఐదు నగరాలు తొలి పదిహేను స్థానాల్లో నిలిచాయి. అక్కడి రోడ్లపై సాఫీగా, గమ్యానికి అనుకున్న సమయంలోగా చేరడం అసాధ్యం. అందుకే ట్రాఫిక్ చిక్కుముడులు లేకుండా సాఫీగా సాగిపోయేలా ఉండే వాహనాలకోసం పరిశోధనలు మొదలయ్యాయి. నలభై ఏళ్లక్రితం న్యూయార్క్ (అమెరికా) నగరానికి చెందిన ఆర్కిటెక్ట్‌లు క్రెయిగ్ హడ్గట్, లెస్టర్ వాకర్ ఈ ‘ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సు’ ఆలోచనలను బయటపెట్టారు. ఆ ఆలోచనలకు చైనా ఇప్పుడు కార్యరూపమిచ్చింది. నిజానికి గత మేలో చైనాలో జరిగిన 19వ బీజింగ్ అంతర్జాతీయ హైటెక్ ఎక్స్‌పోలో ఈ ‘టీఇబి’ల ప్రస్తావన వచ్చింది. అక్కడికి మరోనెల తరువాత ఆచరణలోకి వచ్చింది. ఆగస్టు 2న ప్రయోగాత్మకంగా ఆ కలల జంబో బస్సును నడిపి చూశారు. దాని రూపు, ప్రయాణం, లోపలి సౌకర్యాలు చూసి ప్రపంచం అచ్చెరువొందింది. నిజానికి ఇది ప్రాథమిక ప్రయోగమే. అత్యంత వ్యయప్రయాసలతో కూడిన ఈ ప్రయోగం అన్ని దశలను దాటి
ప్రజలకు అందుబాటులో రావడానికి చాలాకాలం పట్టొచ్చు. కానీ ఇప్పుడు ఆ బస్సు అందరినీ ఆకర్షిస్తోంది. భారత్, ఇండోనేషియా, బ్రెజిల్, ఫ్రాన్స్ ఆ తరహా బస్సులపై ఆసక్తి చూపాయి. దాని పూర్వాపరాలు, వాటిని నిర్వహించడం ఆచరణ సాధ్యమేనా అన్న విషయంపై వివరాలు సేకరిస్తున్నాయి.
ఆ బస్సు ఎలా ఉంటుందంటే..
చైనాలోని హిబై ప్రావిన్స్ పరిథిలోని క్విన్‌హువాంగ్డో నగరంలో ఈ ఎలివేటెడ్ ట్రాన్సిట్ బస్‌ను ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. ఆగస్టు 2న ఈ ప్రయోగం నిర్వహించారు. మామూలు బస్సులకు భిన్నంగా, రోడ్డుకు అడ్డంగా, వెడల్పు ఎక్కువగా (స్టార్డ్లింగ్ బస్) ఉండే ఈ బస్సులో ప్రయాణికులు కూర్చునే భాగం ఎత్తుగా ఉంటుంది. మామూలు బస్సులకు ఉండే టైర్ల భాగం దీనికి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ట్రాక్‌లపై ఇవి నడుస్తాయి. ఈ బస్సు రూపు చాలా భిన్నంగా ఉంటుంది. ఇది నడుస్తున్నప్పుడు ట్రాఫిక్ నిలిచిపోకుండా దాని దిగువనుంచి చిన్నచిన్న కార్లు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్రవాహనాలు వెళ్లిపోయేలా దీని నిర్మాణం ఉంటుంది. కనీసం 300 మీటర్ల పొడవు ఉండే ఈ బస్సు కదులుతూంటే భారీ విమానం కదులుతున్నట్లుంటుంది. ఒక్కో బస్సులో 1200మంది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. బస్సు లోపలి భాగం ఓ చిన్ననగరంలా ఉంటుంది. అధునాత ఇంటీరియర్ డెకరేషన్‌తో చూడముచ్చటగా కనిపిస్తుంది. గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇదంతా ఊహ. అది ఎంతవరకు సాధ్యమో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం నిర్వహించారు. కొద్దిమీటర్ల దూరం దీనిని కొన్ని నిమిషాలపాటు నడిపారంతే. ఈ పరిమిత ప్రయోగానికే ప్రపంచం ఆశ్చర్యపోయింది. జంబో బస్సులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తోంది. చైనాకు చెందిన టిఇబి సంస్థ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. నలభై ఏళ్లక్రితం ఈ తరహా బస్సుల ప్రతిపాదనలు వచ్చినపుడు, బీజింగ్‌లో నిర్వహించిన ఎక్స్‌పోలో చర్చ జరిగినపుడు టిఇబి బస్సులపై చాలామంది పెదవివిరిచి, ఎగతాళి చేశారు. ఆచరణ సాధ్యంకాని ఆలోచనగా విమర్శించారు. కానీ అవేమీపట్టించుకోని చైనా తన సత్తా ఏమిటో చాటింది. కేవలం రెండు నెలల వ్యవధిలో టిఇబి ని నడిపిచూపి సంచలనం సృష్టించింది. 2010లో ఇన్‌చిన్ అనే అర్బన్ ప్లానింగ్ ఆఫీసర్‌కూడా ఇలాంటి నమూనాల ప్రస్తావన చేశాడు.
విమర్శలూ ఎక్కువే..
ఈ ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సులు ఆచరణ సాధ్యం కాదని చాలామంది అంటున్నారు. దానికి తగిన కారణాలనూ చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు దీనిని ‘అపరిపక్వ’ ప్రాజెక్టుగా అభివర్ణించారు.
ఇవీ సమస్యలు!
చూడటానికి భారీగా, ముచ్చటగా ఉన్న ఈ బస్సుల తయారీ ప్రాజెక్టు భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో బస్సు తయారీకి 4.5 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అత్యంత బరువుతో కూడుకున్న ఈ వాహనాలను తట్టుకునే ట్రాక్‌ల తయారీ, వౌలిక వసతుల కల్పనకూ భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత చేసినా ఆదాయం ఎలా వస్తుందన్నది ప్రశ్న. రవాణాఛార్జీలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. ఇది ఆర్థికపరమైన సమస్య. కాగా ఈ ఈ బస్సుల కిందినుంచి వెళ్లే వాహనాలు మలుపుల్లోకి తిరగాలంటే సమస్యే. ట్రాఫిక్ సిగ్నల్స్ చూడాలంటే టిఇబి పైభాగం అడ్డంగా ఉంటుంది. కింది వాహనాల సంగతి టిఇబి డ్రైవర్‌కు ఎలా కనిపిస్తుందన్నది ప్రశ్న. ప్రస్తుతం ప్రయోగం జరిగిన టిఇబి బస్సు లోపలిభాగంలో (ప్రయాణికులు ఉండే ప్రాంతం) ఎత్తు సుమారు 7 అడుగులు ఉంది. ప్రయాణికుల సామాన్లు భద్రపరచేది ఎక్కడో తెలీదు. వాటికోసం చోటు లేదు. ఈ ఎత్తు కనీసం 14 అడుగులు ఉండాలి. అలా చేసే వాహనం ఎత్తు బాగా పెరిగి అవి నడిచే ట్రాక్‌లపై వంతెనల వంటివి పునర్నించాల్సి ఉంటుంది. ఈ భారీ వాహనాలు టర్నింగ్‌ల్లో ఎలా నడుస్తాయన్నది ప్రశ్నార్థకమే. పైగా ఈ జంబో బస్సులు నడిచే ట్రాక్‌లకు కనీసం 1500 వోల్టుల విద్యుత్ లైన్లు ఉండాలి. ఇది అత్యంత ప్రమాదకరం. ఇలాంటి సమస్యలను ప్రస్తావిస్తూ చాలామంది టిఇబి బస్సులపై పెదవి విరుస్తున్నారు. కానీ ఏ ప్రయోగమైనా కార్యరూపం దాల్చడానికి, వీలైనంత తక్కువ భారంతో, ప్రయోజనకారిగా రూపుదిద్దుకోడానికి వీలుగా మార్చుకోవాలంటే...అసలంటూ ఓ ప్రయత్నం జరగాలి కదా. ఇప్పుడు జరిగింది అదే.
* * *

అవసరానికో బస్సు

బస్సు రూపు మారుతోంది. ఆధునిక మానవుడి ఆకాంక్షలకు దీటుగా అది రూపు సంతరించుకుంటోంది. కాలుష్యాన్ని తగ్గించి, ట్రాఫిక్ చిక్కులను అధిగమించి, సులువైన, సౌకర్యవంతమైన ఆధునిక జీవనసరళిలో సమయాన్ని ఆదా చేసేందుకు విభిన్నమైన రూపుతో మనిషి చెంతకే అది పరుగులు తీస్తూ వస్తోంది. పెట్రోల్, డీజిల్ ఇంధనాలతో నడిచే బస్సుల వల్ల కార్బన్‌డైయాక్సైడ్ అధికంగా విడుదలై వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటోంది. పైగా వీటివల్ల శబ్ద కాలుష్యమూ ఎక్కువే. ప్రయాణమూ సౌకర్యవంతంగా ఉండదు. అందుకే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సాఫీగా, కుదుపులు లేకుండా ప్రయాణించే బస్సులకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్, సోలార్, బ్యాటరీలతో నడిచే వాహనాలకు క్రేజ్ ఏర్పడింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే అవి పరుగులు తీస్తున్నాయి. దశాబ్దాల క్రితమే ఈ తరహా బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మనదేశంలో ఇప్పుడిప్పుడే బస్సుల రూపురేఖలు మారుతున్నాయి. డబుల్‌డెక్కర్ బస్సులు, ఏసీ, వీడియో, వైఫై, ఇంటర్నెట్, స్లీపర్ బెర్తుల సౌకర్యం ఉన్న విలాసవంతమైన బస్సులు భారత రహదారులపై పరుగులు తీస్తున్నాయి. మొబైల్ హోటళ్లు మనకు మామూలే. కానీ మొబైల్ జిమ్‌లు, మొబైల్ బొటిక్ సెంటర్లు ఇంకా విస్తృత వాడకంలోకి మనదేశంలో రాలేదు. కానీ అమెరికావంటి దేశాల్లో ఆ సంప్రదాయం విస్తృ
తంగా ఉంది. న్యూయార్క్ నగరంలో మనం కావలసిన చోటికి, అధికారికంగా అనుమతి ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో మొబైల్ జిమ్‌ల నిర్వహించేందుకు కొన్ని సంస్థలు బస్సులను అందిస్తున్నాయి. ఆ బస్సుల్లో అధునాతన వ్యాయామ సామాగ్రి ఉంటుంది. ఓ 20 నిమిషాల శిక్షణకోసం మీరు ఆ బస్సును బుక్ చేసుకోవచ్చు. ఓ కార్యాలయమో, ఓ సంస్థో ఆ వాహనాన్ని బుక్ చేసుకుని సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇప్పుడక్కడ అది పెద్ద క్రేజ్. ఈ మొబైల్ జిమ్‌లకోసం వినూత్న, విభిన్నమైన రూపాల్లో బస్సులు నిర్మిస్తున్నారు. అందానికి సొబగులు అద్దే బొటిక్ బస్సులకు చైనా ప్రత్యేకం. అక్కడ ఆ పరిశ్రమ ఎంత విస్తరించిందంటే...పాడైన బస్సులను ‘స్పా’లుగా మార్చేస్తున్నారు. కేవలం సైకిలింగ్ వ్యాయాయమే చేసేవారికోసం సైక్లింగ్ జిమ్ బస్సులూ అందుబాటులో ఉన్నాయి. మగవారు, ఆడవారు దుస్తులు, ఇతర అలంకరణ సామాగ్రి కొనుక్కోవాలంటే వారికోసం వేర్వేరు మొబైల్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సులన్నీ అధునాతన సౌకర్యాలతో కూడుకుని ఉన్నవే. కొన్ని బస్సులైతే పారదర్శకంగా ఉండే అద్దాలతో నిర్మించినవే. అంటే బస్సులోపల మీరు వ్యాయామం చేస్తున్నా, సైక్లింగ్ చేస్తున్నా, బట్టలు కొంటున్నా బయట ఉన్నవారికి కన్పిస్తారు. కొన్ని బస్సులు నడుస్తూండగా లోపల మీరు మీకు నచ్చిన వ్యాయామం చేసుకోవచ్చుకూడా. కుదుపులు, అసౌకర్యం ఏమీ ఉండదు. పైగా మీరు వ్యాయామంకోసం ఎక్కడకో వెళ్లాల్సిన పనిలేదు. మీ కాలనీకో, మీ ఆఫీసుకో, బంధువులంతా కలసిన పిక్నిక్ స్పాట్‌కో, పార్కువద్దకో రమ్మని ఆర్డర్ బుక్ చేస్తే ఆ స్పా బస్సులో, జిమ్ బస్సులో రయ్‌మంటూ వస్తాయి. పర్యావరణ సహిత గ్రీన్‌బస్సులకోసం ఇప్పుడు మనతోసహా ఎన్నో దేశాలు తపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్‌లో వోల్వో కంపెనీ నిర్మించిన డబుల్‌డెక్కర్ గ్రీన్ బస్సులు కేవలం విద్యార్థులకోసం నడుపుతున్నారు. గ్రీన్ బస్ సంస్థ వీటిని నిర్వహిస్తోంది. అధునాత సౌకర్యాలతో ఇవి ఉంటాయి. ఇక గ్రీన్‌లైన్ బస్సులు అమెరికాలో సేవలందిస్తున్నాయి. సౌరశక్తితో నడిచే బస్సులకోసం చైనాలో మన పెట్రోల్ బంకుల్లాంటి సోలార్ బంక్‌లు నిర్వహిస్తున్నారు. ఈ బంకుల్లో ప్రత్యేకమైన సోలార్ ట్రాక్‌లు ఉంటాయి. అక్కడ పవర్ ఛార్జింగ్ జరుగుతూంటుంది. బస్సు రీఛార్జ్ చేయాలంటే ఆ ట్రాక్‌పైకి వచ్చి నిలిపితే ఆటోమాటిక్‌గా బ్యాటరీ ఛార్జింగ్ పూర్తవుతంది. ప్రపంచం ఇప్పుడు తమ అవసరాలకు తగ్గట్టు ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. వాటిలో బస్సులూ ఒకటి. తమకు నచ్చినట్లు, తమ అవసరాలకు తగ్గట్లు కొత్తరూపుల్లో వాటిని తీర్చిదిద్ది ఉపయోగించుకుంటున్న మనిషి మున్ముందు మరెన్ని ఆలోచనలకు రూపమిస్తాడో చూడాలి.
*

కాలుష్యానికి చెక్

అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు

మన దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం నడుస్తున్న సుమారు లక్షన్నర డీజిల్ బస్సుల వల్ల వాతావరణంలో కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. డీజిల్ బస్సుల పుణ్యమాని గాలిలో కర్బన ఉద్గారాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. మన నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) ఇటీవల జరిపిన అధ్యయనంలో అనేక ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు డీజిల్ బస్సులకు బదులు ‘ఎలక్ట్రికల్ బస్సుల’ సంఖ్య పెంచడం తక్షణ అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. డీజిల్ బస్సుతో పోల్చితే ఎలక్ట్రిక్ బస్సు ద్వారా రోజుకు 27 శాతం ఆదాయం, 82 శాతం లాభాలను పొందవచ్చని అధ్యయనంలో తేల్చారు. ఒక డీజిల్ బస్సు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశపెడితే వాతావరణంలో ఏడాదికి 25 టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌ను తగ్గించవచ్చని ఐఐఎస్‌సికి చెందిన పరిశోధకులు సెలవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణాసంస్థ (బిఎంటిసి) దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా గాలిలోకి కర్బన ఉద్గారాలు వ్యాపించే సమస్యే ఉండదు. అయితే, ఈ బస్సులను నడిపేందుకు విరివిగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. సౌరశక్తిని వినియోగించుకుని ఈ బస్సులకు చార్జింగ్ చేసుకుంటే దేశంలోని ముఖ్య నగరాలలో 3.7 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలవకుండా నివారించవచ్చు. భారత్‌లో వాయు కాలుష్యం వల్ల ఏటా 6.70 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ కాలుష్యానికి చాలావరకూ రోడ్లపై తిరిగే డీజిల్ వాహనాలు కారణమవుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరిగతే ఆర్థికంగా, పర్యావరణ పరంగా మేలు జరుగుతుంది. అయితే, డీజిల్ బస్సుల కన్నా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడం ఖర్చుతో కూడిన పనే. అధునాతన డీజిల్ బస్ ధర 85 లక్షల రూపాయలుంటే, ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు మూడు కోట్ల రూపాయల పైమాటే. వీటిని కొనుగోలు చేయడం భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమే అయినప్పటికీ బహుళ ప్రయోజనాలున్నాయి. అంతర్జాలాన్ని అనుసంధానం చేసే వై-ఫై సౌకర్యం, సిసి కెమెరాలు, మెడికల్ కిట్స్, ఎసి వంటి హంగులన్నీ వీటిలో ఉంటాయి. గ్యాస్, డీజిల్‌తో నడిచే బస్సుల కన్నా వీటి నిర్వహణకు తక్కువ ఖర్చు అవుతుంది. ఇంధనం ఆదా, శబ్ద, వాయు కాలుష్యాలు లేకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరగాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు, ప్రజారవాణా వ్యవస్థను మెరుగు పరచేందుకు ముందు ముందు ఎలక్ట్రిక్ బస్సులే శరణ్యమని ‘దిల్లీ రవాణా సంస్థ’ (డిటిసి) ఇప్పటికే గుర్తించింది. ఎలక్ట్రిక్ బస్సును ఒకసారి చార్జింగ్ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల దూరం నడుస్తుందని, ఒక బస్సు ద్వారా రోజుకు కనీసం 8వేల రూపాయల ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తొలిదశలో వంద ఎలక్ట్రిక్ బస్సులను కొనాలని ప్రతిపాదించామని, ఇప్పటికే 25 బస్సులను సమకూర్చుకున్నట్లు డిటిసి తెలిపింది.
*

-రామానుజం