S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాహసవంతుడు (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

‘సైమన్! నువ్వు వెనకడుగు వేయదలచుకోలేదా?’ స్టికిల్ గుసగుసగా ప్రశ్నించాడు.
వాళ్లు ఆ సమయంలో లేబ్‌లో ఉండకూడదు. అది నియమాలని అతిక్రమించడమే అవుతుంది.
పసుపుపచ్చ, గోధుమ రంగు కలిసిన చర్మం మీద నల్లటి డైమండ్ గుర్తులు ఉన్న ఆ తాచుపాము పొడవు నాలుగు అడుగులు. దాని విషాన్ని ఇంకా పిండాల్సి ఉంది. ఆకలితో నకనకలాడే, సహజంగా క్రూరమైన ఆ సర్పం కాటువేసే అవకాశం కోసం చూస్తోంది. సైమన్ దాని వంక పాలిపోయిన మొహంతో, కొద్దిగా భయంగా, కొద్దిగా ఆసక్తిగా చూసి చెప్పాడు.
‘నేనీ పని చేయక తప్పదు స్టికిల్. గతంలో నువ్వు అనేకసార్లు పాముని హేండిల్ చేసావు కాబట్టి నువ్వే దీన్ని ఆ పెట్టెలో పెట్టాలి’ సైమన్ కోరాడు.
‘నీకు భయంగా ఉంది కదా సైమన్?’
‘అవును. అది నన్ను కాటేస్తుందేమోనని భయంగా ఉంది’
‘ఐనా నువ్వు విరమించుకో దలచుకోలేదా?’
‘అవును. అది నన్ను కాటేయదనే నా ఆశ’
సైమన్ యువకుడు. స్టికిల్ మధ్యవయస్కుడు. వయసులో తేడా వున్నా వారి మధ్య బలమైన స్నేహం ఉంది. అందుకే స్టికిల్ సహాయం చేయడానికి అంగీకరించాడు. పాముని పట్టుకునే కర్రతో దాని తలని వి ఆకారంలో అదిమిపట్టి నైపుణ్యంగా దాని తలని వెనక నించి పట్టుకున్నాడు. అది కాటేయడానికి ప్రయత్నించింది కాని కాటేయలేకపోయింది. దాన్ని చెక్కపెట్టెలో ఉంచి మూత మూసాడు.
స్టికిల్‌లో ఎలాంటి భయం లేదు కాని సైమన్ మాత్రం ఆ నాలుగు అడుగుల పాముని చూసి వణికిపోయాడు.
‘నీకసలు ధైర్యమే లేదు’ స్టికిల్ చెప్పాడు.
‘సమయం వచ్చినప్పుడు నాకు ధైర్యం ఉంటుంది. ఇక మన కోసం ఎదురుచూసే మిత్రుడి దగ్గరకి వెళ్దాం పద... లేదా శత్రువు దగ్గరికి’ సైమన్ చెప్పాడు.
‘మిస్టర్ ప్రెస్టన్ మన కోసం అక్కడ ఎదురుచూస్తుంటాడనే ఆశిస్తాను’ స్టికిల్ చెప్పాడు.
ఆ గది తలుపుని యథాప్రకారం మూసి వాళ్లు లేబ్ నించి చీకటి కారిడార్‌లో ముందుకి నడచి, మెట్లు దిగి బయాలజీ బిల్డింగ్ లోంచి బయటకి వచ్చారు. తమ చేతిలోని పెట్టెని ఎవరైనా చూస్తారనే భయంతో సాధ్యమైనంత వరకు చీకట్లో నక్కి పాత ఫర్నేస్ బిల్డింగ్‌లోకి చేరుకున్నారు. ప్రస్తుతం దాన్ని స్టోరేజ్ కోసం ఉపయోగిస్తున్నారు.
ముందే తెరచి ఉంచిన కిటికీలోంచి లోపలకి ప్రవేశించారు. స్టికిల్ పామున్న పెట్టెని ఓ బల్ల మీద ఉంచాడు. సైమన్ అక్కడ సిద్ధంగా ఉన్న ఏడు కొవ్వొత్తులని వెలిగించాడు. బల్ల చుట్టుపక్కల ఉన్న వస్తువులని పక్కకి జరుపుతూ స్టికిల్ చెప్పాడు.
‘నీకు పిచ్చనే నాకు నమ్మకం’
‘కావచ్చు’ సైమన్ అంగీకరించాడు.
‘నువ్వు చాలా పెద్ద సాహసం చేస్తున్నావు.
అందులో విజయం సాధిస్తావో లేదో మనకి తెలీదు’
‘కాని నా అదృష్టాన్ని పరీక్షించుకోక తప్పదు’ సైమన్ చెప్పాడు.
ఇద్దరూ చెరో చెక్క బెంచీ మీద కూర్చుని వేచి చూడసాగారు.
* * *
ప్రెస్టన్ జర్మనీ నించి ఇంగ్లండ్‌లోని ఆ యూనివర్సిటీకి మూడు నెలల క్రితం విద్యార్థిగా వచ్చాడు. సైమన్‌తో అతనికి స్నేహం కుదిరింది. కాని సైమన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్న యువతితో ప్రెస్టన్ ప్రేమలో పడ్డాడు. డోనా కూడా అతన్ని ప్రేమించడం విచిత్రం.
ఓ రాత్రి ఓ క్లబ్‌లో డోనా సైమన్‌ని వదిలి ప్రెస్టన్‌తో డేన్స్ చేయడంతో అది ఆరంభమైంది.
‘నీ ప్రియురాలు డోనా మంచి డేన్సర్’ డేన్స్ తర్వాత ప్రెస్టన్ నవ్వుతూ చెప్పాడు.
ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఓ లోకల్ టూరిస్ట్ బస్‌లో ప్రయాణించడం సైమన్ చూశాడు. అనేక క్లాసుల్లో వారిద్దరూ పక్కపక్కనే కూర్చోసాగారు. ప్రెస్టన్ ఫుట్‌బాల్ ఆటలో నిపుణుడు. అందువల్ల చాలామంది అమ్మాయిలకి అతనంటే ఆసక్తి ఏర్పడింది. అతనితో చాలామంది అమ్మాయిలు సన్నిహితంగా ఉండటం కూడా సైమన్ గమనించాడు. నారింజ తొక్కని వలిచి పారేసినట్లుగా అతను అనేక మంది యువతులని వాడుకున్నాక పారేస్తాడని, డోనా గతి కూడా చివరకి అంతే అవుతుందని సైమన్ నమ్మకం.
కొద్ది రోజుల తర్వాత డోనా నించి వచ్చిన ఉత్తరంలో ‘గుడ్‌బై’ అన్న పదం మాత్రమే ఉంది. బహుశ ముఖాముఖీ చెప్పలేక ఉత్తరం రాసింది అని సైమన్ అనుకున్నాడు. ఆ ఉత్తరాన్ని స్టికిల్‌కి చూపిస్తే అతను వెళ్లి డోనాని కలిశాడు. డోనా అతనికి ప్రెస్టన్ ఇచ్చిన ఎంగేజ్‌మెంట్ డైమండ్ రింగ్‌ని చూపించింది. అది తెలిసాక కాని సైమన్‌కి ప్రెస్టన్, డోనాల మధ్య ప్రేమ బలపడిందనీ తెలీలేదు. డోనా తనని వదిలి ప్రెస్టన్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల యూనివర్సిటీలోని అంతా తనని చూసి నవ్వుతారని సైమన్ భయపడ్డాడు. అతను ఆ అవమానాన్ని దిగమింగుకోలేక పోతున్నాడు. చాలామంది కొత్త విద్యార్థులు కూడా అతని వంక చూసి నవ్వుతూ గుసగుసలాడుకోవడం గమనించాడు.
ఒక వారంపాటు సైమన్ దాన్ని భరించాడు. యూనివర్సిటీ మారాలని కూడా అనుకున్నాడు. మరో చోట సీట్ దొరక్కపోతే ఇంటికి వెళ్లిపోవాలని కూడా ఆలోచించాడు. కాని ఓ బలమైన భావన అతన్ని కదలనీయలేదు. అది డోనా ఇంకా తనని ప్రేమిస్తోందని తెలిసిన ప్రేమ భావం కాదు. ద్వేషం.
ఓ మనిషి పోగొట్టుకున్న గౌరవాన్ని మరమ్మతు చేయగలిగేది ప్రతీకారం మాత్రమే. శారీరకంగా ప్రెస్టన్‌కన్నా బలహీనుడైన సైమన్ ఓ సాక్షి చూస్తూండగా ప్రెస్టన్ చెంప మీద బలంగా కొట్టాడు. ప్రెస్టన్ దానికి ఎంత నివ్వెరపోయాడంటే చాలాసేపు దానికి స్పందించలేకపోయాడు. తర్వాత సైమన్ భుజాలు పట్టుకుని పైకి లేపి వెంటనే వదిలేసి చెప్పాడు.
‘నేను హత్యానేరం మీద జైలుకి వెళ్లదలచుకోలేదు’
‘నువ్వు నాతో పోట్లాడటం లేదా?’ సైమన్ ఎగతాళిగా ప్రశ్నించాడు.
‘లేదు. సమ ఉజ్జీ కాని వాడితో పోట్లాడను’
‘కాని నిన్ను నేను అందుకు ఆహ్వానిస్తున్నాను’
వెంటనే ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఫుట్‌బాల్ ఆటగాడైన ప్రెస్టన్ ఎత్తు ఆరడుగులు. బరువు ఎనభై రెండు కిలోలు. సైమన్ ఎత్తు ఐదడుగుల ఏడంగుళాలు. బరువు డెబ్బై ఒక్క కిలోలు.
ప్రెస్టన్ జోక్ విన్నట్లుగా పకపక నవ్వి తన కోపాన్ని మర్చిపోయి వినోదంగా అడిగాడు.
‘నువ్వు నిజంగా నీతో పోట్లాటకి నన్ను ఆహ్వానిస్తున్నావా?’
‘అవును. నా గౌరవాన్ని కాపాడుకోడానికి. నేను నిన్ను చంపదలచుకున్నాను’
ప్రెస్టన్ తన మిత్రుడి వంక చూస్తూ చెప్పాడు.
‘శారీరక బలంలో తేడా వల్ల మనిద్దరి మధ్యా కుస్తీ పోటీ సబబు కాదు. నీకు ఇది తెలీదేమో సైమన్. నేను ఫెన్సింగ్ (కత్తియుద్ధం)లో నిపుణుడ్ని. పిస్టల్ పోటీలో ఎప్పుడూ నేనే గెలుస్తూంటాను. కాబట్టి వీటిలో నీకు కూడా ప్రవేశం ఉంటే ఈ రెంటిలో దేన్నైనా ఎంపిక చేసుకో’
‘వాటిలో నాకు ప్రవేశం లేదు’
‘ఐతే నువ్వు తప్పక చస్తావు. చాక్లెట్స్ తినడాన్ని?’ ప్రెస్టన్ నవ్వుతూ అడిగాడు.
‘మిస్టర్ ప్రెస్టన్! నేను సీరియస్‌గా అడుగుతున్నాను’
ప్రెస్టన్ నవ్వాడు. అతనికి అది ఆటలా అనిపించింది.
‘సరే. సీరియస్‌గానే. కత్తి, పిస్తోలు వద్దు. ఎందుకంటే నేను హత్యానేరం మీద జైలుకి వెళ్లదలచుకోలేదని చెప్పాగా? మరి ఏ ఆయుధం వాడదాం?’ ప్రెస్టన్ ప్రశ్నించాడు.
‘ఆ ఛాయిస్ నీకు వదులుతున్నాను’
ప్రెస్టన్ కొద్ది క్షణాలు ఆలోచించి తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘సమయం, ప్రదేశం, ఆయుధం మూడు నీ ఇష్టానికే వదులుతున్నాను. ఏ విధంగా చస్తావో నువ్వే ఎంపిక చేసుకో. నేను నీకన్నా అన్నిట్లో గొప్ప వాడినని రుజువు చేస్తాను’
‘దీనికి నా వైపు సాక్షి స్టికిల్’ సైమన్ చెప్పాడు.
‘నేను సాక్షిగా ఉండటానికి వొప్పుకుంటున్నాను. మీ సాక్షి ఎవరు?’ స్టికిల్ ప్రశ్నించాడు.
‘నా సాక్షి నా మిత్రుడు జో’
‘సరే. నా సాక్షి నీ సాక్షికి సమయం, ప్రదేశం, ఆయుధం గురించి త్వరలో చెప్తాడు. మరోటి మిస్టర్ ప్రెస్టన్. ఇందాక నువ్వు జైలు మాటెత్తావు. కాబట్టి మనం ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచాలి. ధైర్యం గల మనుషులు తమ గౌరవాన్ని కాపాడుకోడానికి ఇలా పోట్లాడుకోవడం ఒకప్పుడు మన రెండు దేశాల్లో చట్టబద్ధమే. కాని ఇప్పుడది ఈ దేశంలో చట్టవిరుద్ధం. మనలో ఎవరూ తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లకూడదు. జీవించిన వాడు పోయిన వ్యక్తి ప్రమాదవశాత్తు పోయాడనే పోలీసులకి చెప్పాలి. అది నీకు అంగీకారమేనా?’
ప్రెస్టన్ ఈసారి ఇంకాస్త ఎక్కువ సేపు నవ్వి చెప్పాడు.
‘మంచిది. నిన్ను చంపి జైలుకి వెళ్లడం నాకు ఇష్టం లేదు’
సైమన్ తలవంచి అభివాదం చేసి బయటకి నడిచాడు.
* * *
‘ప్రెస్టన్ రాడేమో?’ స్టికిల్ చేతి గడియారం వంక చూసుకుని చెప్పాడు.
ఆ గది నిండా కొవ్వొత్తులు వెలుగు వల్ల పడే నీడలు కదులుతున్నాయి. సైమన్ ఎదురుగా ఉన్న పెద్ద చతురస్రపు పెట్టె వంక వౌనంగా చూశాడు. మరి కొద్దిసేపు వారి మధ్య నిశ్శబ్దంగా గడిచింది. అకస్మాత్తుగా ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. స్టికిల్ లేచి వెళ్లి ఆ పాత భవంతి తలుపు తెరిచాడు. ప్రెస్టన్, అతని వెంట జో లోపలకి వచ్చారు.
‘మేము సమయానికే వచ్చాం’ ప్రెస్టన్ చెప్పాడు.
‘గుడీవినింగ్’ సైమన్ విష్ చేశాడు.
వారు లోపలికి రాగానే స్టికిల్ తలుపు మూశాడు.
‘ఇలాంటి చీకటి ప్రదేశంలో ఏ ఆయుధంతో పోరాడబోతున్నాం?’ ప్రెస్టన్ ప్రశ్నించాడు.
‘ఆయుధం అందులో ఉంది’ సైమన్ చేత్తో ఆ పెట్టెని చూపించి చెప్పాడు.
‘ఆ పెట్టెలోనా?’
‘అందులో ఓ తాచుపాము ఉంది’
ప్రెస్టన్ చాలాసేపు ఏం మాట్లాడలేదు. ఆ మసక చీకట్లో అతని మొహంలోని భావాలు ఏమీ కనపడలేదు. చివరకి అతను చెప్పాడు.
‘నాకు అర్థం కాలేదు’
అతని కంఠంలో అపనమ్మకంతోపాటు కొద్దిగా భయం కూడా వ్యక్తం అయింది.
‘నీకు పాములంటే భయమా ప్రెస్టన్?’ సైమన్ ప్రశ్నించాడు.
‘లేదు. నీకు?’ ప్రెస్టన్‌కి తనకి పామంటే భయమని చెప్పడానికి సిగ్గుపడ్డాడు.
‘నాకు అవంటే భయం’ సైమన్ చెప్పాడు.
‘మీ మధ్య పోట్లాట ఎలా సాగుతుందో నేను వివరిస్తాను’ స్టికిల్ చెప్పాడు.
ప్రెస్టన్, అతని మిత్రుడు జో స్టికిల్ వంక చూశారు.
‘ఆ పెట్టెలో తాచుపాము ఉంది. దాదాపు నాలుగు అడుగుల పొడవుంది. ఆ పెట్టె తలుపు మూసి ఉంది. ఎవరైనా దాన్ని తెరిస్తేనే పాము బయటకి వస్తుంది’
‘ఇది శుభవార్త’ జో నవ్వుతూ చెప్పాడు.
‘మీకీ పాము ఎక్కడిది?’ ప్రెస్టన్ అడిగాడు.
‘జువాలజీ లేబ్ నించి దొంగిలించాం. డాక్టర్ వేన్స్ పరిశోధనల కోసం పాము విషాన్ని తీస్తాడని మీరు విని ఉంటారు. ఈ మధ్య దీన్నించి విషం తీయలేదు కాబట్టి దీని విష గ్రంథుల్లో చాలా విషం ఉంది. జువాలజీ లేబ్ అసిస్టెంట్‌గా నేను దీనికి ఆహారం అందిస్తూండాలి. తిండి తింటే ఇది మందకొండిగా ఉండి కాటు వేయదని దీనికి ఆహారం పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు చురుగ్గా ఉంది’
అతను చెప్పేది వింటూ ప్రెస్టన్ ఆ పెట్టె వంకే చూడసాగాడు.
‘ఆ పెట్టెకి రెండు వైపులా ఆరంగుళాల వైశాల్యంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. సరిగ్గా ఎదురెదురుగా. ముక్కోణపు రబ్బరు ముక్కలని వాటి అంచులకి బిగించాను. ఆ ముక్కోణపు చివర్లు రంధ్రం మధ్యలో ఒకదాన్ని మరొకటి తాకుతున్నాయి. అందువల్ల పాము అందులోంచి బయటకి రాలేదు.’
జో దాని దగ్గరికి వెళ్లి పరిశీలించి చూసి అడిగాడు.
‘ఇందులోంచి పాము తలని బయట పెట్టలేదా?’
‘కుదరదు. చాలా గట్టి రబ్బర్‌ని వాడాను’
‘ఆ రంధ్రాలు ఎందుకు?’
‘ఈ పోట్లాటలోని ఆయుధం ఆ పాము. నేను ఒకటి, రెండు, మూడు లెక్క పెట్టాక పోటీదారులు ఇద్దరూ ఒకేసారి గుప్పెట మూసి తమ కుడి చేతులని ఆ రంధ్రాల్లోంచి లోపలకి చొప్పించాలి. డిస్టర్బ్ ఐన పాము వెంటనే ఓ చేతిని కాటేస్తుంది. అది ఆ రెండు గుప్పెళ్లల్లోని ఒకదాన్ని మాత్రమే కాటేయగలుగుతుంది. కాటు తిన్న వ్యక్తి ఓడిపోయినట్లు. రెండో వ్యక్తి విజేత’
‘నా చేతిని ఆ రంధ్రంలో పెట్టడానికి నేనేం పిచ్చివాణ్ణి?’ ప్రెస్టన్ వెంటనే చెప్పాడు.
సైమన్ సహనంగా, నిశ్శబ్దంగా ఉండి తన తరఫున స్టికిల్ మాట్లాడేది విన్నాడు.
‘కాని నువ్వు సైమన్‌తో పోట్లాటకి సిద్ధం అన్నావు?’
‘నిజమే. కానీ...’
‘ఆయుధాన్ని సైమనే్న ఎంపిక చేయమని నువ్వు చెప్పావు?’
‘నిజమే. కాని...’
‘నువ్వు కత్తి, పిస్తోలు తప్ప ఏదైనా ఫర్వాలేదన్నావు?’
ప్రెస్టన్ వౌనంగా, నిరసనగా తలని అడ్డం తిప్పడం తప్ప మాట్లాడలేదు.
‘ఏ పోట్లాటలో పాల్గొనాలన్నా పోటీదారులు ఇద్దరూ సాహసవంతులై ఉండాలి. ముఖ్యంగా ఈ ఆయుధం పిరికిపందలకి కాదు’
‘ప్రెస్టన్ పిరికిపంద అనను కాని..’ జో అర్ధోక్తిగా ఆపేశాడు.
‘ఈ ఆయుధానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఈ పాము ఇద్దరిలో ఎవర్ని కాటేస్తుందో దానికే తెలీదు. రెండోది ఇందులో నైపుణ్యానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. అందువల్ల పోటీదారులు ఇద్దరికీ సమాన న్యాయం చేకూరుతుంది. ఈ రెంటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఆయుధాన్ని ఎంపిక చేశాం. దీని ఫలితాన్ని శాసించే అవకాశం మీ ఇద్దరిలో ఎవరికీ లేదు. ఇంతకంటే సబబైన, న్యాయమైన ఆయుధం ఇంకోటి లేదు. ఎందుకంటే మనిషి పాముని ప్రభావితం చేయలేడు కదా’
ప్రెస్టన్ ఆ పెట్టె వంకే నిశ్శబ్దంగా చూస్తూండిపోయాడు.
‘లోపల పాముందని మాకు నమ్మకం ఏమిటి? ఇది నాకు ప్రాక్టిల్ జోక్‌లా, నిన్ను భయపెట్టడమే వీళ్ల ఉద్దేశంలా నాకు అనిపిస్తోంది’ జో చెప్పాడు.
స్టికిల్ నవ్వి చెప్పాడు.
‘మీకు ఇలాంటి అనుమానం కలగచ్చని నేను ఊహించాను. పెట్టె మూతని ధైర్యం ఉన్నవారు ఎత్తితే అది కనిపిస్తుంది.’
జో నిర్భయంగా పెట్టె మూత హేండిల్‌ని పట్టుకుని కొద్దిగా పైకి ఎత్తాడు. తక్షణం లోపల నించి పాము బుస వినిపించింది.
‘పాముంది. మెలకువగా కూడా ఉంది’ జో తక్షణం హేండిల్‌ని వదిలేసి ఓ అడుగు వెనక్కి వేస్తూ చెప్పాడు.
‘నేను నా చేతిని ఆ రంధ్రంలో ఉంచడం లేదు’ ప్రెస్టన్ చెప్పాడు.
‘సరే. మన కేంపస్‌లోని అందరికీ నువ్వు భయంతో పోటీలోంచి విరమించుకున్నావని రేపీపాటికి తెలుస్తుంది’ సైమన్ చెప్పాడు.
‘నీతో పోట్లాట నాకు ఇష్టమే కాని ఈ ఆయుధం...’
‘ఈ ఆయుధం నాకైతే ఇష్టమైంది. దీనికి సాహసం కావాలి. అది నీలో లేదు’
తనని ఇరికిస్తున్నారా అన్న అనుమానంతో ప్రెస్టన్ తన శత్రువు వంక చూశాడు.
‘సరే. వెళ్లిపోదాం. ప్రతీ ఆటలో కెప్టెన్, బలవంతుడు, కేంపస్ మొత్తానికి అందగాడైన ప్రెస్టన్‌లో ఓ లోపం ఉందని అతను పరమ పిరికివాడని, కాని బలహీనుడైన సైమన్‌లో అంతులేని ధైర్యం ఉందని రేపు అందరికీ తెలుస్తుంది. అది నా విజయం’ ప్రెస్టన్ బయటకి వెళ్తూంటే సైమన్ గర్వంగా చెప్పాడు.
ప్రెస్టన్ తలుపు దగ్గర ఆగి తలుపు మీద చేతిని వేసి కూడా దాన్ని తెరవకుండా కొన్ని క్షణాలు నిలబడిపోయాడు. అతని విషయంలో సైమన్ అంచనా కరెక్టే. అతను పిరికివాడు, అహంభావి ఐన అతనిలోని అహంభావాన్ని తట్టి లేపడంతో ప్రెస్టన్ వెనక్కి తిరిగి చెప్పాడు.
‘సరే. పోటీ మొదలు పెడదామా?’
జో తన మిత్రుడి వంక వింతగా చూసి, సైమన్‌ని అడిగాడు.
‘నువ్వు మమ్మల్ని మోసం చేయట్లేదని మాకెలా తెలుస్తుంది? పెట్టెలో పాముని పెట్టింది మీరే. అది ఏ వైపు ఉంది? ఏ రంధ్రం భద్రమైంది మీకే తెలుసు’
‘పాము దాని ఇష్టం వచ్చినట్లు కదులుతుంది. రంధ్రాన్ని మీరే ఎంపిక చేసుకోవచ్చు’ సైమన్ సూచించాడు.
రంధ్రంలోకి వెళ్ళేది తన చేయి కాదు కాబట్టి జో అన్ని కోణాలని ఆలోచించాక చెప్పాడు.
‘అంతా సరిగ్గానే ఉన్నట్లుంది. కాకపోతే ఇద్దరూ ఒకేసారి తమ గుప్పిళ్లని లోపల ఉంచాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు కాటు తినే దాకా చేతుల్ని లోపలే ఉంచాలి. అవునా?’
‘అవును. కాటు తిన్నవారు తక్షణం తమ చేతిని వెనక్కి లాక్కుంటారు. ఆ సమయంలో రెండో వ్యక్తి కూడా తమ చేతిని బయటకి తీసేయచ్చు’
‘పెట్టె లోపల అంతా చీకటి. గుప్పిళ్లని అది ఎలా చూడగలదు? బహుశ దాన్ని ఓ చెయ్యి ముట్టుకోవాలి. లేదా పాము చేతిని చూసే దాకా రాత్రంతా చేతులు లోపలే ఉంచాలి. అది కష్టమైన పని. దానికి సమయ పరిమితి లేదా?’ జో అడిగాడు.
‘ఆ భయం అక్కర్లేదు. పాము చూడటం, వినడం లేదా వాసన చూడటం ద్వారా కాటు వేయదు. పాము కళ్లు సరిగ్గా చూడలేవు. పాములన్నీ చెవిటివి కూడా. వాసన చూడగలదు కాని అందుకు సమయం పడుతుంది. కాని అది తక్షణం వేడిని గమనించగలదు. వేడి రక్తం లోపల ప్రవహిస్తూండటంతో మనిషి చెయ్యి వేడిగా ఉంటుంది. పాము రెండు చేతులని ఒకేసారి గమనిస్తుంది. ఓ చేతి మీద కాటు వేస్తుంది. అందుకు అది ఓ చేతినే ఎంపిక చేసుకుంటుంది. ఏ చెయ్యి అన్నది చెప్పలేం. బహుశ బాగా భయపడ్డ చేయి. ఎందుకంటే వాడిలో రక్తప్రసరణ వేగం పెరిగి రెండో వాడి చేయి కంటే ఒకటి, రెండు డిగ్రీల వేడి ఎక్కువగా ఉండచ్చు. అందువల్ల సాహసవంతుడు గెలుస్తాడు’ స్టికిల్ చెప్పాడు.
అప్పటికే మొహం నిండా చెమటలు పట్టిన ప్రెస్టన్ సైమన్ వంక నిరసనగా చూశాడు.
‘పాము కాటుకి ఫస్ట్ ఎయిడ్ సంగతి ఏమిటి?’ ప్రెస్టన్ అడిగాడు.
‘మా దగ్గర అలాంటిది ఏదీ లేదు’ స్టికిల్ చెప్పాడు.
‘ఎందుకు లేదు?’ జో ప్రశ్నించాడు.
‘ఇది సాహస పోటీ. ఇందులో కొంత ప్రమాదం ఉండాలి కదా? డాక్టర్. ఏంటీ-వీనమ్ ఇంజక్షన్లు ఉంటే ప్రమాదస్థాయి బాగా తగ్గిపోతుంది’ సైమన్ చెప్పాడు.
‘అంటే కాటు తిన్నవాడు మరణించాల్సిందేనా?’ జో ప్రశ్నించాడు.
‘ఓ అమ్మాయి కోసం ప్రాణాలతో పోరాడటానికి నేను సిద్ధపడ్డాను. నీ మిత్రుడు అందుకు సిద్ధంగా లేకపోతే నీ మిత్రుడు వెళ్లిపోవచ్చు జో. అతని వెంట నిన్ను రమ్మనడానికి కారణం తక్షణం అతన్ని నువ్వు హాస్పిటల్‌కి తీసుకెళ్లచ్చు. పాము కాటు తిన్నాక జీవించాలంటే ఆ మనిషి కదలకూడదు. వెంటనే నేల మీద పడుకోవాలి. ఇందువల్ల అవసరానికి మించి రక్తప్రసరణ తగ్గిపోతుంది. తద్వారా విషం శరీరంలో వేగంగా వ్యాపించదు. నువ్వు రక్తం నీ మిత్రుడిలోకి పోకుండా మణికట్టు కింద కట్టు కట్టి, అప్పుడప్పుడూ వదులు చస్తూ, గాయం దగ్గర కోసి రక్తాన్ని నోటితో పీల్చడం కూడా ఫస్ట్ ఎయిడే’
‘ఆపు’ ప్రెస్టన్ భయంగా అరిచాడు.
‘లేదా హాస్పిటల్‌కి ఫోన్ చేసి అంబులెన్స్‌ని రప్పించచ్చు’
‘ఐతే మనమంతా ఓ అంగీకారానికి వచ్చామన్నది మనం మర్చిపోకూడదు. కావాలని ఈ పోటీని ఏర్పాటు చేసామని ఎవరికీ చెప్పకూడదు. లేదా నలుగురం నిందితులం అవుతాం. పాముని ఆయుధంగా తీసుకోవడంలోని ప్రయోజనం ఇదే. ఎవరికి కాటు పడితే వారు తాము ప్రమాదవశాత్తు కాటుకి గురయ్యామని చెప్పాలి. మన కేంపస్‌లో పాములు ఉన్నాయి. ఈ పాము లేబ్‌లోంచి తప్పించుకుందని, తిరిగి నేను పట్టుకున్నానని చెప్తాను. ఇందుకు మీ ఇద్దరికీ అంగీకారమేనా?’ స్టికిల్ ప్రశ్నించాడు.
ఎవరూ మాట్లాడలేదు.
‘సరే. ప్రెస్టన్. రంధ్రాన్ని నువ్వే ఎంపిక చేసుకో. పెట్టెకి ఏ వైపు రంధ్రాన్ని ఎన్నుకుంటావు?’
ప్రెస్టన్ బలహీనంగా ఆ వైపు నడిచి కుడివైపు రంధ్రం దగ్గర నిలబడ్డాడు. సైమన్ లేచి రెండో రంధ్రం వైపు నడుస్తూంటే అతని అడుగులు తడబడ్డాయి. ప్రెస్టన్ మొహంలో భయం అందరికీ స్పష్టంగా కనిపించింది.
‘ఆఖరి సూచన. మీ ఇద్దరూ ఎడం చేతినే ఉపయోగించండి. కాటు ప్రాణాన్ని తీయకపోయినా ఒకోసారి ఇన్‌ఫెక్షన్ వచ్చి చేతిని తీసేయాల్సి వస్తుంది. మీది ఎడమచేతి వాటం కాకపోతే తప్ప, కుడి చేతిని కంటే ఎడమ చేతిని పోగొట్టుకోవడం మంచిది.’
ప్రెస్టన్ గడ్డం కింద నించి చెమట కారి నేల మీద పడింది.
‘జో! మూడంకెలు లెక్క పెట్టే అవకాశం నీదే. మీ ఇద్దరూ గుప్పెట్లు మూసి రంధ్రం దగ్గర సిద్ధంగా ఉంచండి. జో మూడు లెక్క పెట్టగానే తక్షణం గుప్పిటని చొప్పించాలి. మీ ఇద్దరిలో ఎవరూ భయపడి వెనక్కి తగ్గరుగా? అలా జరిగితే కాటు తిన్నా రెండోవారు గెలిచినట్లు అవుతుంది’
‘నేను సైమన్‌కన్నా సాహసిని. వెనక్కి తగ్గను’ బాధాకరమైన మాటలు ప్రెస్టన్ నోట్లోంచి వెలువడ్డాయి.
ప్రెస్టన్ చమట పట్టిన చేతులని పేంట్‌కి తుడుచుకుని గుప్పెట బిగించి రంధ్రం దగ్గర ఉంచి చెప్పాడు.
‘నేను సిద్ధం’
జో ఓ గుటక వేసి అంకెలని లెక్క పెట్టాడు.
ఆ ఇద్దరిలో ఎవరి చెయ్యి ముందుగా లోపలికి వెళ్లిందో తెలీనంత వేగంగా జో మూడు అంకె లెక్క పెట్టగానే వేలాడే రబ్బర్ త్రికోణాల్లోంచి ఇద్దరి చేతులు లోపలకి వెళ్లాయి. ఇద్దరు సాక్షులు ఊపిరి బిగబట్టి చూడసాగారు. ఆ అరుపు వినపడటానికి రెండు, మూడు క్షణాలు పట్టింది. తన చేతిని బయటకి లాగిన ప్రెస్టన్ తన చేతి వంక భయంగా చూసుకున్నాడు. ఆ మంద్రమైన వెలుగులో అతనికి బొటనవేలు గోరు కింద రెండు రూబీలు గల ఉంగరాన్ని ధరించినట్లుగా రెండు చుక్కల్లోంచి రక్తం కారుతూ కనిపించింది.
* * *
స్టికిల్ లేబ్‌లో పాముని యథాస్థానంలో ఉంచి సైమన్ దగ్గరికి హాస్టల్ గదికి వచ్చేసరికి సైమన్ ప్రశాంతంగా పడుకుని టీవీ చూస్తూ కనిపించాడు.
‘ప్రెస్టన్ బతుకుతాడా?’ స్టికిల్ ప్రశ్నించాడు.
‘ఆ పాము నిండా విషం ఉంది. అతనిలోకి చాలా విషం ప్రవేశించినా పెద్ద శరీరం కాబట్టి బతుకుతాడు’ అతనితో అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి వెళ్లొచ్చిన సైమన్ చెప్పాడు.
‘నువ్వు చేసిన సాహసంలో గెలిచావు. ఈ పోటీ గురించి అతను ఎవరికీ చెప్పలేదు. లేదా ఇద్దర్నీ యూనివర్సిటీ నించి బహిష్కరిస్తారని తెలుసు. నేను నీకు ఇచ్చిన సలహా పని చేసింది. పాము రక్తం చల్లగా ఉంటుంది. అది వేడిని మాత్రమే గ్రహిస్తుంది’ స్టికిల్ నవ్వుతూ చెప్పాడు.
‘అవును. నా చెయ్యి మంచులా అతి చల్లగా ఉండటంతో ఆ పాము నా చేతిని గుర్తించలేదు. ఆ చీకట్లో నా అరచేతిని డ్రై ఐస్‌లో ఉంచానన్న సంగతి ఎవరూ గమనించలేదు. నా చెయ్యి ఇంకా చల్లగానే ఉంది’ సైమన్ అరచేతిని రుద్దుకుంటూ చెప్పాడు.
ఆ తర్వాత ప్రెస్టన్‌లో పెద్ద మార్పు వచ్చింది. అతను గతంలోలా సాహసవంతుడిలా, అహంకారంతో ప్రవర్తించడం మానేశాడు. మళ్లీ డేనా, సైమన్‌ల మధ్య ప్రేమ కొనసాగింది.

***
(సి బి గిల్‌ఫోర్డ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి