S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలివితేటలు

మగధ రాజ్యాన్ని రాజు మేఘనాథుడు పరిపాలించే రోజులవి. నెలకి మూడు వర్షాలు కురవటంతో పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు.
అయితే ఒక ఏడాది వర్షాలు కురవక రాజ్యమంతా భయంకరమైన కరవు నెలకొంది. పంట నిలవలు అయిపోయాయి. చెరువులూ, నీటి కొలనులూ, కాలువలూ ఎండిపోయి తాగునీరు లేక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు.
అదేం చిత్రమో గాని.. ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటిలో వర్షాలు కురుస్తూనే ఉండేవి. వాళ్లెవరికీ లేని ఇబ్బంది తమ రాజ్యానికే ఎందుకో ఎంత ఆలోచించినా రాజుకి అర్థం కాలేదు. ఇదంతా చూస్తూ రాజుకి ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. కొద్దికాలంపాటు ఇరుగూ పొరుగూ రాజ్యాల నుండి నీటిని ఆహారాన్ని తెప్పించి ప్రజలకు అందుబాటులో ఉంచాడు. అయినప్పటికీ ఇబ్బంది తప్పలేదు. వర్షాలు కురవలేదు.
ఆస్థాన జ్యోతిష్కుడు కూడా దీనికి కారణం ఏమిటో చెప్పలేకపోయే సరికి రాజు తల పట్టుకున్నాడు.
తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఇంకా ఇక్కడే ఉంటే మరణం తప్పదని భావించి ప్రజలు రాజ్యాన్ని విడిచి వలస పోసాగారు. అలా పోతూ పోతూ కథలు కథలుగా చెప్పుకుంటున్న కరువు పరిస్థితులు అక్కడే ప్రశాంతంగా తపస్సు చేసుకునే ముని రాజశుకుని చెవిన పడ్డాయి. పైగా వాళ్ల కబుర్లూ, చంటి పిల్లల ఆకలి ఏడుపులు అతని తపస్సుకి భంగం కలిగించటమే కాక ఆ రాజ్యపు ప్రజల పట్ల జాలిని కలిగించాయి.
వారిని రక్షిస్తే తప్ప తన తపస్సుకు మోక్షం లేదని భావించాడు రాజశుకుడు. వెంటనే తన తపోశ్శక్తితో ఏ యాగం చేస్తే వానలు కురిసి మళ్లీ రాజ్యం సుభిక్షం అవుతుందో తెలుసుకోగలిగాడు. అయితే అతడు తెలుసుకున్న యాగం వల్ల విపరీతమైన పొగలు కమ్ముతాయని గ్రహించి దానిని ఎలా నివారించుకోవాలో రాజే నిర్ణయించుకుంటాడని మగధ రాజ్యం బయలుదేరాడు.
రాజశుకుని రాకను తెలుసుకున్న రాజు పూర్ణకుంభంతో అతనికి స్వాగతం పలికాడు.
అయితే తను వచ్చిన విషయం రాజుకి వివరించి మునీశ్వరుడు ఇలా అన్నాడు.
‘మహారాజా...! రాజ్యం నలుమూలలా ఈ యజ్ఞం జరగాలి. ఈ యజ్ఞం పూర్తయిన రెండు రోజులకు విపరీతమైన వర్షాలు కురిసి కావలసినంత నీరు సమకూరుతుంది. రాజ్యంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటాయి. కాకపోతే...’
‘కాకపోతే ఏమిటి మునీశ్వరా..? వర్షాలు కురుస్తాయంటే, నా రాజ్య ప్రజలు క్షేమంగా ఉంటారు అనుకుంటే ఏ పని చేయటానికైనా నేను సిద్ధమే... చెప్పండి మునీశ్వరా..!’ అన్నాడు తన సింహాసనం నుండి లేచి నిటారుగా నిలబడుతూ...
‘ఈ హోమం చేయటం వల్ల... విపరీతమైన పొగ ఆకాశంలోకి ఎగసి ఆకాశం అంతా కమ్ముకుంటుంది. మహారాజులు... మీకు తెలియనిదేమున్నది. నల్లని పొగలు ఒకచోట నిలిచేవి కావు. ఆకాశంలోకి ఎగసిన తర్వాత గాలికి అవి ఎటు పోతాయో ఎవరికీ తెలియదు. కాకపోతే మనం చేసిన ఈ యజ్ఞం వల్ల వెలువడిన నల్లని పొగలు పొరుగు రాజ్యంలోనికి ప్రవేశిస్తే ఆ రాజుల నుండి మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందో ఆలోచించి మరీ యజ్ఞం చెయ్యాలో వద్దో నిర్ణయించుకోండి మహారాజా... కరువు నివారించే ప్రక్రియలో పొరుగు రాజుల కోపానికి గురై రాజ్యానే్న కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు..’
‘మీరు చెప్పింది నిజమే.. మహారాజా..!’ అని ఆలోచనలో పడ్డాడు.
రాజు, ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, మునీశ్వరుడు అనేక తర్జన భర్జనలు పడ్డా.. ఒక నిర్ణయానికి రాలేకపోయారు. రాజు తల పట్టుకున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో... ‘దీనికి నేను పరిష్కారం చెప్పగలను మహారాజా...!’ అని వినిపించింది. అంతా ఆ మాటలు వినిపించిన వైపుగా దృష్టి సారించారు.
అతను ఆస్థాన పురోహితుల వారి కుమారుడు విష్ణుశర్మ. ఆశ్రమంలో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే తండ్రి వద్దకు వచ్చాడు. రాచరిక వ్యవహారాలలో విజ్ఞానం కోసం రోజూ తండ్రిగారి వెంట రాజుగారి ఆస్థానానికి వస్తున్నాడు. రాజ్యం పరిస్థితి పట్ల అతనికీ దిగులుగానే ఉంది.
‘నువ్వేం చెయ్యగలవురా?’ భయంగా అన్నాడు ఆస్థాన పురోహితుల వారు. ఇది పెద్దవాళ్ల వ్యవహారం. ఎట్నించి ఎటొచ్చి ఏదైనా కీడు జరిగితే ప్రమాదమని అతని భయం.
‘చెయ్యగలను తండ్రిగారూ...’ అని తండ్రితో అని.. ‘మహారాజా... మునీశ్వరుల వారు సెలవిచ్చినట్లుగా యజ్ఞానికి ఏర్పాట్లు చేయండి. మన చుట్టుపక్కలనున్న రాజ్యాల పరిస్థితి నేను చూసుకుంటాను’ అన్నాడు ధైర్యంగా.
ప్రశంసిస్తున్నట్లుగా చూశారు సభలోని వారంతా అతని వైపు. అనుకున్న విధంగా యాగానికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాడు రాజు. మునీశ్వరుడు చెప్పినట్లుగానే యజ్ఞంలో వాడిన ద్రవ్యాల వల్ల అంతులేని పొగ వెలువడింది. యజ్ఞం చేస్తున్నంతసేపూ రాజు భయపడుతూనే ఉన్నాడు. యజ్ఞ వాటిక నుండి వెల్లువెత్తుతున్న పొగను చూసి ఏ మూల నుండి, ఏ రాజు నుండి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని.
సాక్షాత్తూ రాజశుక మునీశ్వరులే దగ్గరుండి యజ్ఞం నిర్వహించారేమో.. చక్కగా యజ్ఞం పూర్తయ్యింది.
మునీశ్వరుడు చెప్పినట్లుగానే వర్షాలు మొదలయ్యాయి. ప్రజలంతా వర్షంలో తడుస్తూ పండుగ జరుపుకున్నారు. ఈ వార్త విని అప్పటికే రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయిన వారంతా తిరిగి పయనమవుతున్నట్టు వేగుల ద్వారా రాజు చెవిన పడింది. చెరువులూ, వాగులూ, వంకలూ, కాలువలూ, తటాకాలు పూర్తిగా నీటితో కళకళలాడటం చూసి నిండా సంతోషంలో మునిగిపోయాడు రాజు. మునీశ్వరులకు మోకరిల్లి ప్రణామములు సమర్పించి తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు రాజు.
తర్వాత రెండు రోజులకి విష్ణుశర్మ తండ్రిగారితో కలిసి రాజాస్థానానికి వచ్చాడు.
విష్ణుశర్మని రాజలాంఛనాలతో సభకు ఆహ్వానించాడు రాజు. యధావిధిగా మునీశ్వరుని సన్నిధిలోనే విష్ణుశర్మని సత్కరించి...
‘పొరుగు రాజ్యపు రాజుల ప్రమాదం నుండి రాజ్యాన్ని ఏ విధంగా కాపాడారో తెలుసుకోవాలని ఉంది. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా మన రాజ్యపు చుట్టుపక్కలా రాజ్యాలు ఏడు. అన్నిచోట్లా రాజుల్ని నమ్మించటం అంత సులభమైన పని కాదు. ప్రాణాలకు తెగిస్తే తప్ప ఆ పని సాధ్యం కాదు. అంతటి క్లిష్టమైన పనిని తమరు ఎలా సాధించారో సభకు వివరిస్తే బాగుంటుంది’ అన్నాడు. అందుకు విష్ణుశర్మ సరేనని...
‘మహారాజా... ప్రతి పౌరునికి రాజ్యంలో హక్కులతోపాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పుడు సుఖంగా జీవించిన వాళ్లం ప్రకృతి వైపరీత్యాల వల్ల రాజ్యంలో అనుకోని పరిస్థితులు తలెత్తితే ప్రాణాలు వొడ్డి అయినా రాజ్యాన్ని, రాజ్య ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీదా ఉంది. తెలివితేటలతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.. ఈ దిశగా ఆలోచించి నన్ను బోలిన మరో ఆరుగురు బ్రాహ్మణ యువకులను ఎంపిక చేశాను. మేమంతా మునీశ్వరుల వేషం వేసుకుని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కరం ఒక్కో రాజ్యానికి వెళ్లాము.
బాటసారుల్లా రాజ్యాల్లోకి ప్రవేశిస్తూనే ఏదో విధంగా రాజుగారిని కలిసేలా ప్రణాళిక వేసుకున్నాము. అనుకున్న ప్రకారం రాజుని కలిసినప్పుడు.. ‘మహారాజా.. ప్రస్తుతం మీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉండి ప్రజలు చాలా సుఖశాంతులతో జీవిస్తున్నారు. అయితే రాబోయే రెండు రోజుల్లో అతివృష్టి వల్ల రాజ్యం చిన్నాభిన్నం కాబోతోంది.. మా తపోశక్తి వల్ల మేమా విషయాన్ని తెలుసుకోగలిగాము. అయితే తోటి ప్రజలను కాపాడలేని మా తపోశక్తి వృథా అని భావించి తమకు తెలిపి రాజ్యం ఎదుర్కోబోతున్న ప్రమాదం నుండి ప్రజలను కాపాడాలని తమరి దర్శనం కొరకు వచ్చాము. తమరు సెలవిస్తే ఎటువంటి ఖర్చూ లేని అతి చిన్నపాటి హోమం చేసి దాని ద్వారా.. ఆకాశంలో తిష్ఠ వేసిన మేఘాలను వర్షాలు కురవకుండానే తరిమివేసి నిర్మలంగా చేసేయగలము... ఎందుకంటే ఇప్పటికే మీ రాజ్యం నిండా సరిపడా నీరు నిలువ ఉంది కాబట్టి’ అనేసరికి మహారాజుల వారు ఉబ్బితబ్బిబ్బై హోమానికి ఏర్పాట్లు చేశారు.
అయితే అనుకున్నట్టుగానే మన రాజ్యంలో చేసిన యజ్ఞంవల్ల పొగలు వెలువడటం, గాలికి అదంతా అన్ని రాజ్యాల్లోనూ విస్తరించటం తమరికి తెలిసినదే. అయితే నల్లని పొగలను మేఘాలుగా భ్రమించిన రాజులంతా అవి మేము నిర్వహించిన హోమ ఫలితం వల్ల వెనక్కి పోయాయని భావించి సంతోషించి సత్కరించి పంపారు మసారాజా...’
‘రాజ్య క్షేమం కోసం అబద్ధం చెప్పక తప్పింది కాదు. మన్నించాలి మహారాజా. నాతోపాటు ముని పుంగవులుగా నటించిన మిగిలిన బ్రాహ్మణ యువకులంతా తమరి దర్శనం కొరకు ఎదురుచూస్తున్నారు మహారాజా’ అనేసరికి..
సభంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పట్టరాని ఆనందంతో సింహాసనం దిగి వచ్చిన రాజు ఆ యువకులకు ఎదురేది సాదరంగా సభలోనికి తీసుకువచ్చి తగిన రీతిన సత్కరించి తన కొలువులో ఉద్యోగం ఇచ్చి గౌరవించాడు.
తను వచ్చిన పని ముగియటంతో ఆనందంగా తిరుగు పయనమయ్యాడు రాజశుక మునీశ్వరులు.

-కనె్నగంటి అనసూయ