S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అదృష్టం

కథల పోటీలో
ఎంపికైన రచన
**
శాంతినగర్‌లో విజయా అపార్ట్‌మెంట్స్ బిల్డింగ్ ముందు బైక్ ఆపాడు అనిల్‌కుమార్. సెల్ తీసి ‘హరీష్! మీ అపార్ట్‌మెంట్ గేటు ముందు ఉన్నాను. వచ్చెయ్’ అన్నాడు.
‘ఇప్పుడే స్నానం చేశా! టెన్ మినిట్స్‌లో రెడీ అవుతా! ఇంట్లోకి వచ్చి కూర్చో’ అన్నాడు హరీష్.
‘వద్దురా బాబూ! మీ మమీ పట్టుకుని వదల్దు. మీ మామయ్య ఉద్యోగం వస్తే గాని పిల్లనివ్వ నన్నాడంటగా? ఉద్యోగాలు చెట్లకు కాస్తున్నాయా కోసుకు రావడానికి? అని ఏదేదో మాట్లాడుతుంది. ఎంబ్రాసింగ్‌గా ఉంటుంది నాకు. బైక్ మీద కూర్చుని ఉంటా రా! తొందరగా వచ్చెయ్!’ అని హరీష్‌కి చెప్పి సెల్ జేబులో పడేశాడు.
ఇంతలో గావుకేక వినిపించింది. అనిల్ ఉలిక్కిపడ్డాడు. వంద గజాల దూరంలో చైన్ స్నాచింగ్ దృశ్యం కనిపించింది. పెద్దావిడ మెడలో చైన్ లాక్కుని బైక్ మీద పోతున్నారు దొంగలు. ఆమె పాపం రోడ్డు మీద పడిపోయి కేకలు పెడుతోంది.
‘దొంగలు... దొంగలు!’
చైన్ స్నాచింగ్ కళ్ళారా చూసిన అనిల్ శరీరంలోకి ఏదో శక్తి ప్రవేశించినట్లయింది. దానికితోడు వంటి మీద ఉన్నది ఖాకీ డ్రెస్. ఇంకేం?! ఆవేశంతో బైక్ ముందుకు దూకించాడు. వేగం పెంచి దొంగల్ని ఛేజ్ చెయ్యడం సాగించాడు. హెల్మెట్లు పెట్టుకున్న దొంగలు అతనికి దొరక్కుండా స్పీడ్ ఎక్కించారు.
బ్యాక్ సీటు మీద కూర్చున్నవాడు వెనక్కి తిరిగి చూశాడు. బిత్తరపోయాడు.
‘అరేయ్! ఎస్సైరా...!’ కంగారుగా చెప్పాడు బైక్ నడుపుతున్న సహచరుడికి.
‘ఓ.. మైగాడ్! ఈ రోడ్డులో పొద్దునే్న ఎస్సై ఎందుకు తగలబడ్డాడురా?’ సణుగుతూ స్పీడ్ పెంచాడు వాడు.
‘పొద్దునే్న లేచి ఎవడి మొహం చూశామో? బ్యాడ్‌లక్...’ అని గొణగసాగాడు బ్యాక్ సీట్లో కూర్చున్నవాడు.
తమని ఛేజ్ చేస్తున్నవాడు మామూలు సాదాసీదా మనిషైతే భయపడేవాళ్లు కాదు చైన్ స్నాచర్స్. తరుముతున్నది ఎస్సై అయ్యేసరికి అదురు పుట్టింది. గుండె దడ మొదలైంది. బైక్ నడుపుతున్న వాడికి చేతులు వణుకుతున్నాయి. దొరికిపోతామేమో అని భయం పట్టుకుంది. అయినా తెగింపుతో సందులు గొందులు తిరుగుతూ అనిల్‌ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. అనిల్ వదలకుండా పట్టుదలతో వెంబడిస్తున్నాడు. హడలు పుట్టేట్టు హారన్ కొడుతున్నాడు.
చైన్ స్నాచర్స్ దురదృష్టం. ఒక స్కూల్ బస్ అడ్డుగా వచ్చింది. బైక్ ఆపక తప్పలేదు. అనిల్ దూసుకొచ్చి తన బైక్‌తో డాష్ ఇచ్చాడు. వెనుక కూర్చున్న వాడిని పట్టుకుని గట్టిగా గుంజాడు. వాడు బ్యాలెన్స్ కోల్పోయి వెల్లడిలా పడ్డాడు. అయినా స్ప్రింగ్‌లా లేచి అనిల్‌ని అటాక్ చేశాడు డాగర్‌తో. అనిల్ జబ్బలో గుచ్చుకుని గాయం చేసింది కత్తి. అనిల్ తెగింపుతో కలబడ్డాడు. బైక్ నడిపే వాడు స్కూల్ బస్సు కదలడంతో పారిపోయాడు సహచరుడిని వదిలి.
అదే సమయంలో కొందరు యువకులు క్రికెట్ బ్యాట్లు ఊపుకుంటూ వస్తున్నారు. ప్రాక్టీస్ కోసం గ్రౌండ్‌కి వెళ్తున్న యువకులు అక్కడ ఇద్దరు ఫైట్ చేయడం చూసి పరిగెత్తుకొచ్చారు.
‘వీడు చైన్ స్నాచర్..!’ అని గట్టిగా అరిచాడు అనిల్.
యువకులు చుట్టుముట్టి పట్టుకున్నారు. అనిల్ వాడి జేబులు వెతికితే దొరికింది బంగారు గొలుసు.
‘ఫ్రెండ్స్ వీడిని వదలకండి. ఒక పెద్దామె మెడలో లాక్కొచ్చాడు ఈ చైన్. పాపం ఆమె రోడ్డు మీద పడిపోయి ఉంది. ఎట్లా ఉందో వెళ్లి చూస్తాను. పోలీస్ వ్యాస్ వస్తుంది. వీడిని హేండోవర్ చేయండి’ అని అనిల్ బైక్ మీద బయల్దేరాడు.
అనిల్ విజయా అపార్ట్‌మెంట్స్ దగ్గరికి వచ్చాడు. గేటు ముందు జనం గుంపుగా నిలబడి ఉన్నారు. గోల్డ్ చైన్ పోగొట్టుకున్న శ్యామలాదేవి ఒక కుర్చీలో కూర్చుని ఉంది.
‘మేడమ్! మీ చైన్ దొరికింది. చైన్ స్నాచర్లలో ఒకడు దొరికాడు. పోలీసులకి పట్టిస్తున్నాం. రెండో వాడు తప్పించుకుని పోయాడు’ చెప్పాడు అనిల్ ఆమెకు గోల్డ్‌చైన్ అందిస్తూ.
‘్థంక్ గాడ్! దేవుడిలా సమయానికి వచ్చి పట్టుకున్నావు బాబూ’ మెచ్చుకుంది శ్యామలాదేవి.
‘మీరేంటి ఇంత పొద్దునే్న ఒంటరిగా రోడ్డు మీదకు వచ్చారు? ఈ రోడ్డులో జన సంచారం తక్కువ. అసలే చలికాలం...’ అన్నాడు అనిల్.
అప్పటికి ఉదయం ఏడున్నర దాటింది. చలికాలం కావడంతో మంచుతెరలు అప్పుడప్పుడే తొలగుతున్నాయి. సూర్యుడు ఉదయించినా మబ్బులు కమ్ముకుని వెలుతురు రావడం లేదు.
‘గుడికి బయల్దేరానయ్యా! అప్పటికీ మా అబ్బాయి కారులో వెళ్లమన్నాడు. గుడి దగ్గరే.. ఉదయం నడిస్తే ఆరోగ్యానికి మంచిది అని నడిచి వెళ్తున్నాను. పొద్దునే్న ఈ మాయదారి దొంగలు ఎటాక్ చేస్తారనుకోలేదు’ చెప్పింది ఆమె.
‘దొంగలకి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అనే తేడాలు ఏముంటాయండీ? పోనియ్యండి. మీకు దెబ్బలేం తగల్లేదుగా?’ అని పరామర్శించాడు అనిల్.
‘పెద్ద దెబ్బేం తగల్లేదులే! కింద పడగానే షాక్ తిన్నట్టయింది. మెదడు మొద్దుబారింది. కొంచెంసేపు ఏం జరిగిందో అర్థంకాక అయోమయంలో పడిపోయాను. వెంటనే లేవలేకపోయాను. ఇదిగో ఈ అపార్ట్‌మెంట్‌లో వాళ్లొచ్చి లేవదీసి కూర్చోబెట్టారు. మీ అందరికీ థాంక్స్..’ అన్నది ఆమె చుట్టూ మూగి వున్న వాళ్లతో.
‘అయ్యో! ఫర్వాలేదండీ! అయినా మేం చేసింది ఏవుంది? ఈ ఎస్సై బాబు సమయానికి వెంటపడి దొంగని పట్టుకుని మీ బంగారం మీకు ఇచ్చాడు’ అన్నాడు అందులో ఒక పెద్దాయన.
‘మేడమ్ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి. డ్రాప్ చేస్తాను నా బైక్ మీద’ అన్నాడు అనిల్.
‘వద్దులే బాబూ! ఏ.సి.పి. కారు తీసుకొస్తున్నాడులే. నేను ఫోన్ చేసి అంతా చెప్పాను’ అన్నది శ్యామలాదేవి ముసిముసి నవ్వులు నవ్వుతూ.
‘ఏసిపికి ఫోన్ చేశారా? మీకు తెలుసా ఆయన?’ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అనిల్.
‘తెలియడం ఏంటి బాబూ! ఏసిపి మోహనకృష్ణ మా అబ్బాయే!’ అన్నది.
‘ఔనా?’
‘ఔను. నువ్వు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైవి కదా? నీకు తెలీదూ మా వంశీ? ఏ స్టేషన్‌లో పని చేస్తున్నావు?’ అన్నది ఆమె.

‘నేను పోలీస్ ఎస్సైని కాదండీ...’ మొహమాటంగా అన్నాడు నవ్వుతూ.
‘ఎస్సైవి కాదా? మరి ఈ యూనిఫారం ఎందుకు వేసుకున్నావ్? పోలీస్ బ్యాడ్జీ అదీ.. ఉన్నాయిగా?’
‘ఇది వేషమండీ! నేను సినిమా యాక్టర్‌ని. షూటింగ్‌కి బయల్దేరాను. స్పాట్‌కి వెళ్లేసరికి ఆలస్యమవుతుంది. అక్కడ అంతా హడావిడి. కాస్ట్యూమ్ డిజైనర్ ఇంటి దగ్గరే వేసుకుని రమ్మన్నాడు. స్పాట్‌కి వెళ్లాక మొహానికి కొంచెం మేకప్ టచ్ చేస్తారు. అంతే! మాకు పెద్దగా మేకప్‌లు ఉండవు’ చెప్పాడు అనిల్.
‘ఓర్నీ! సినిమా పోలీసువా?’ అని తెగ ఆశ్చర్యపోయింది శ్యామలాదేవి.
జనం పకపకా నవ్వారు. సినిమా పోలీస్ అయితేనేం? నిజం ఎస్సైలాగానే వెంబడించి దొంగని పట్టుకున్నాడుగా అని మెచ్చుకున్నారు.
ఇంతలో అక్కడికి కారు వచ్చి ఆగింది. ఏసిపి మోహనకృష్ణ కారు దిగి తల్లి దగ్గరికి వచ్చాడు.
‘కృష్ణా! ఈ అబ్బాయి మీ ఎస్సై కాదంట. సినిమా ఎస్సై అంట’ అని పకపకా నవ్వింది శ్యామలాదేవి.
‘మా ఎస్సై కంటే షార్ప్‌గా యాక్ట్ చేశావ్. వెల్‌డన్... అరెరె... ఆ బ్లడ్ ఏంటి?’ అన్నాడు అనిల్ జబ్బ వైపు చూసిన ఏసిపి.
‘నేను పట్టుకుంటే చైన్‌స్నాచర్ డాగర్‌తో పొడిచాడు సార్!’
‘ఐసీ... పద హాస్పిటల్‌కి పోదాం. నెగ్లెట్ చెయ్యకూడదు. లేకపోతే సెప్టిక్ అవుతుంది’ అన్నాడు ఏసిపి.
‘సార్! ఇప్పటికే లేటైంది. మా స్టూడియో దగ్గర డిస్పెన్సరీ ఉంది లెండి. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటాను’ అని సెలవు తీసుకున్నాడు అనిల్. ఏసిపి అతని సెల్ నెంబర్ తీసుకున్నాడు. ఇంతలో అక్కడికి హరీష్ రావడంతో ఇద్దరూ బయల్దేరారు.
* * *
ఆ రాత్రి టీవీ న్యూస్ ఛానల్స్‌లో ‘సినీ ఆర్టిస్టు అనిల్ కుమార్ సాహసం. ఎస్సై వేషంలో వెంబడించి చైన్ స్నాచర్‌ని పట్టుకున్న వైనం’ అని టెలికాస్ట్ అయ్యింది.
పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్‌ని పొగుడుతూ మాట్లాడాడు. ఉదయం శాంతినగర్‌లో ఏసిపి మోహనకృష్ణ తల్లి మెడలో చైన్ లాక్కుని పారిపోతున్న వాళ్లని పట్టుకున్నది వివరంగా చెప్పాడు అనిల్. దొంగ డాగర్‌తో పొడిచి గాయం చేసినా జంకక చైన్ స్నాచర్‌ని పట్టుకున్న అనిల్ ధైర్యసాహసాలు మెచ్చుకున్న ఏసిపి అతను యువకులకు స్ఫూర్తి అని మెచ్చుకున్నాడు.
మర్నాడు న్యూస్ పేపర్లలో అనిల్‌కుమార్ పోలీస్ కమిషనర్‌తో కరచాలనం చేస్తున్న ఫొటో ప్రముఖంగా అచ్చయింది.
తర్వాత ఆ వార్త హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ల దృష్టికి వెళ్లింది. ప్రభుత్వానికి వున్న ప్రత్యేక అధికారంతోటి అనిల్‌కుమార్‌ని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా నియమించి ట్రైనింగ్‌కి పంపించారు.
* * *
ఆ రోజు ఉదయమే అనిల్‌కుమార్ మేనమామ వెంకటేశ్వర్లు వచ్చాడు.
‘అబ్బో! ఊరక రారు మహానుభావులు...! ఏమేవ్ మీ తమ్ముడు దారి తప్పి మనింటికి వచ్చాడు..’ వెటకారంగా అన్నాడు సుబ్బారావు.
‘దారి తప్పి ఏం రాలేదులే బావా! అయినా ఊరక రాలేదు. బంగారంలాంటి మా జయలక్ష్మిని మీ ఇంటి కోడలిగా చెయ్యాలని వచ్చాను’ అన్నాడు వెంకటేశ్వర్లు.
‘ఏరా! అనిల్‌కి పిల్లనివ్వనని బిగుసుకు పోయావుగా! ఇప్పుడేంటి వెతుక్కుంటూ వచ్చావు’ అన్నది జానకి తమ్ముడిని వ్యంగ్య ధోరణిలో ఎత్తిపొడుస్తూ.
‘అసలు ఇవ్వను అనలేదు. ఏదైనా ఉద్యోగం వచ్చాక ఇస్తానన్నాను. సినిమా వేషాలు వేసుకునే వాడికి ఎవరైనా ఎట్లా పిల్లనిస్తారు అక్కా! కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాలిగా?’ అన్నాడు వెంకటేశ్వర్లు.
గతంలో పిల్లల పెళ్లి గురించి మాటలు జరుగుతున్నాయి. తన కూతురు జయలక్ష్మి, మేనల్లుడు అనిల్‌ని ఇష్టపడుతున్నా పెళ్లికి ససేమిరా అన్నాడు వెంకటేశ్వర్లు.
‘తాడూ బొంగరం లేకుండా, వేషాలు వేసుకుంటూ తిరుగుతున్న వాడికి పిల్లను ఇవ్వలేను. వాడిని ఏదైనా ఉద్యోగం సంపాదించమను. అప్పుడే పెళ్లి చేస్తా!’ అని అక్కాబావలకు నిర్మొహమాటంగా చెప్పాడు.
మేనమామను తప్పు పట్టలేదు అనిల్. అందులో యధార్థ ఉంది. ఒకవైపు వేషాలతో కాలక్షేపం చేస్తూ మరోవైపు కంప్యూటర్ కోర్సులు చేస్తున్నాడు. బ్యాంక్ టెస్ట్‌ల కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఏదొక జాబ్ సంపాదించగలనని నమ్మకంతో ఉన్నాడు.
ఇంతలో అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి పోలీస్ ఎస్సై అయ్యాడు. అనిల్ కలలో కూడా ఊహించనిది జరిగింది.
‘అక్కా! అదృష్టం మా అమ్మాయిది. అందుకే మీవాడికి ఉద్యోగం వచ్చింది’ అన్నాడు వెంకటేశ్వర్లు నవ్వుతూ.
‘బాగుందిరా..!’ అని జానకి ఏదో అనబోతుంటే అనిల్ అడ్డొచ్చాడు.
‘పోనియ్యమ్మా! మామయ్యని అదృష్టం వాళ్ల అమ్మాయిదే అనుకుని తృప్తిపడనీ! ఏం పోయింది?’ అన్నాడు అనిల్ నవ్వుతూ.
‘అంతేలేరా! ఎవరి తుత్తి వాళ్లది!’ అని పకపక నవ్వింది జానకి.
***
సిహెచ్.శివరామ ప్రసాద్ (వాణిశ్రీ)
స్వగృహ అపార్ట్‌మెంట్స్, సి-బ్లాక్, ఎఫ్-2, భాగ్యనగర్ కాలనీ,
ఆపోజిట్ కెపిహెచ్‌బి
కూకట్‌పల్లి, హైదరాబాద్-500 072.. 9390085292

-వాణిశ్రీ