S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బతుకాట

కాచిగూడ స్టేషన్లో బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ కదలటానికి సిద్ధంగా ఉంది.
సెకండ్ ఏసి కోచ్‌లో సామాను సర్దుకుని కూచున్న సుజాత కిటికీలోంచి ప్లాట్‌ఫాం మీది ప్రయాణీకుల్ని కుతూహలంగా చూస్తున్నది. చివరి క్షణంలో పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లు, జనరల్ బోగీలోకి ఎక్కటానికి హైరానా పడేవాళ్లు, వీల్‌ఛైర్‌లో వచ్చే వృద్ధులు... ఆత్మీయులకి వీడ్కోలు ఇస్తూ కళ్లనీళ్లు పెట్టుకునేవాళ్లు... రకరకాల జీవన సందర్భాలు... మనస్తత్వాలు...
మనుషులందరి సుఖదుఃఖాల కలబోత ఈ రైల్వే ప్లాట్‌ఫాం అన్పిస్తోంది.
రైలు కదలటానికి ఇంకో పది నిమిషాలుందనగా ఒక యువతి ఎనిమిది తొమ్మిదేళ్ల పాపతో ఎదుటి బెర్త్‌లోకి వచ్చి కూచుంది. కూలీ సామాన్లు సర్ది వెళ్లిపోయాడు.
సుజాత ఆ యువతికేసి యధాలాపంగానే చూసినా ఆకట్టుకునే అందం ఆమెది!
ముప్పై ఏళ్లుంటాయేమో! పచ్చని ఛాయ, కోలమొహం, నొక్కుల జుట్టు, ఐదు-ఆరు అడుగుల ఎత్తుండొచ్చు. మెరూన్ కలర్ చుడీదార్‌తో మరింతగా చూపుల్ని ఆకర్షిస్తోంది. పై పెదవి మీద పెసరబద్దంత పుట్టుమచ్చ, తేనె కళ్లు చూస్తుంటే మళ్లీ చూడాలన్పిస్తుంది. సభ్యత కాదనుకుని వౌనంగా పుస్తకంలోకి తల దూర్చింది సుజాత.
‘అమ్మా! కేక్...’ పాప మారాం చేస్తుండగానే రైలు కదిలింది.
‘ఉండు పింకీ... వెయిట్ బంగారూ!’ ముద్దుగా పాపని విసుక్కుని సామాను సరి చూసుకుందా యువతి.
పాప కూడా తల్లి పోలిక. రంగుతో బాబ్డ్ హెయిర్ కటింగ్‌లో ముద్దొస్తోంది.
టిటి రావటం, సెల్‌లో మెసేజెస్, ఐడి కార్డులు చెక్ చేసి వెళ్లిపోవటం జరిగింది.
కాస్త స్థిమితపడి పింకీకి కేక్ తీసి డిస్పోజబుల్ ప్లేట్‌లో పెట్టి ఇచ్చింది. తనూ అందులోంచి ఓ ముక్క తిన్నది. కొన్ని పళ్లు, లస్సీ ముగిసాయి.
ఓరకంట ఆ యువతిని చూస్తూ ఆ మాట, నవ్వు అన్నీ.. సుజాతకి లీలగా ఎవరో గుర్తొస్తున్నారు.
దాదాపు పదేళ్ల గత మాటు నుంచి కన్పించీ కన్పించకుండా అమాయకంగా మంచు తడిపిన గులాబీ లాంటి ఓ ముద్దు మోము స్మరణకు వస్తున్నది.
నవ్వితే సొట్టపడే ఆ బుగ్గలు కూడా... ఈమె ఆ అమ్మాయి సంజనేనా? అవును సంజనాయే! సందేహం లేదు. పదేళ్ల కాలంలో కాస్త వొళ్లు చేసింది. వయసుతోపాటు అందం కూడా పదింతలయింది. మరి ఈ పాప... అర్భనాకారంగా పుల్లల్లాంటి కాళ్లు చేతులతో నడవలేక పోయిన ఆ పాపేనా? ఇంత ముద్దుగా ఆరోగ్యంగా ఎలా సాధ్యం?
‘మమీ! డాడీ స్టేషన్‌కి వస్తారా?’ చక్రాల్లాంటి కళ్లు తిప్పుతూ పింకీ అడుగుతోంది.
‘అవున్రా బంగారం. నీ కోసం తప్పకుండా వస్తారు’ కూతుర్ని ప్రేమగా ముద్దు పెట్టుకుందామె.
తల్లీ కూతుళ్లు కలుసుకోబోయే ‘డాడీ’ గురించి ఏవేవో ముచ్చట్లు చెప్పుకున్నారు.
రాత్రి తొమ్మిది దాటాక బెర్తు పరిచి పాపని పడుకోబెట్టింది. పాప త్వరగానే నిద్రపోయింది.
సుజాత కూడా బెర్తు వేసుకుని పడుకుంది. కానీ నిద్ర రావటం లేదు. రీడింగ్ లైటు వేసుకొని పుస్తకం చదువుతోందన్న మాటే గానీ అక్షరాలు... చీమల్లా తల్లో చేరి నా ఆలోచనలు ఆక్రమిస్తున్నాయి.
ఆ సంజనే ఈమె అయితే... ఇంత హేపీగా... ఎలా సాధ్యం? సంజన జీవితాన్ని పునర్నిర్మించుకుంటే మంచిదే!
చిగురుటాకులా వణికిపోతూ పసిపిల్లతో వచ్చేసిన సంజన ఈమే అయితే... తనని గుర్తు పట్టలేదా? పట్టనట్లు నటిస్తోందా? పోనీ ఓసారి పలకరించి చూస్తే...
ఆ సంజన కాకపోతే... కాకపోతే మాత్రం ఏముంది? మనుషుల్ని పోలిన మనుషులుంటారంటారు. అందుకేనేమో! అటువంటి దీన స్థితి నుంచి ఇంత ఉల్లాసంగా సంజనని ఊహించటానికే నమ్మశక్యంగా లేదు. ఏం? ఎందుకుండకూడదు? తనలో కూడా ఇంత శాడిజం ఉందా? ఆనాడు సంజన గురించి తానూ బాధపడింది కదా?! ఆ అమ్మాయి జీవితం బాగుండాలనేగా తనూ కోరుకున్నది.
‘మీరు సుజాతాంటీ కదా!’
ఆలోచనల్లో పడిన సుజాతకు ఆ యువతి ప్రశ్న విన్పించలేదు.
‘ఎక్స్‌క్యూజ్‌మీ... మీరు సుజాతాంటీయేనా?’ మళ్లీ ఆమే అడిగింది.
ఉలిక్కిపడిందోసారి సుజాత.
‘ఆ... అవును... మీరు?’ తన ఊహ నిజమవుతోందేమోనన్న దిగ్భ్రాంతి.
‘నేనాంటీ! సంజనని. మీ ఆఫీసర్ కామేశ్వరిగారి అమ్మాయిని’ మార్దవంగా చెప్పింది.
‘నిజమా! బాగున్నావా! ఇందాకట్నుంచీ ఎక్కడో చూశాను నిన్ను అని ఆలోచిస్తున్నాను’ సుజాత మనసులో మాట బయటపెట్టింది. తన ఆలోచన నిజమయినందుకు సంతోషంగా కుతూసలంగా కూడా ఉంది.
‘గుర్తు పట్టకపోవటం సహజమే కదా ఆంటీ! ఈ పదేళ్లలో మీరూ మారారు. నేనూ మారాను’ గలగలా నవ్వేసింది.
‘ఎంత హాయిగా నవ్వుతోంది...’ అనుకోకుండా ఉండలేక పోయింది సుజాత.
‘కామేశ్వరి మేడం.. అదే.. మీ అమ్మగారు బాగున్నారా?’ అభిమానంగా అడిగింది.
సంజన మొహం మ్లానమయింది.
‘సారీ ఆంటీ! అమ్మనాన్న యాక్సిడెంట్‌లో పోయి ఆరేళ్లయింది’ తల దించుకుంది.
‘అయ్యో! అలాగా! నేను ట్రాన్స్‌ఫర్ అయ్యాక నాకీ వివరాలేవీ తెలీలేదు. సారీ సంజనా!’ సంజన చేతిని మృదువుగా తాకింది సుజాత.
‘్ఫర్వాలేదు ఆంటీ! అన్నిటికీ అలవాటయిపోయింది. మీరేంటి ఇలా... బెంగుళూరులో ఎవరున్నారు?’
‘మా అబ్బాయి ప్రవీణ్. ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. అంకుల్ కూడా వచ్చి పది రోజులయింది. నేను సెలవు పెట్టి నాలుగురోజులుండి పోదామని వస్తున్నాను.’
‘అలాగా! అడ్రస్ ఇవ్వండి ఆంటీ! ఇప్పుడు మేము బెంగుళూరులోనే ఉంటున్నాం. కలుస్తాను’ గబగబా అంది.
‘స్టేషన్‌లో ప్రవీణ్ ఇస్తాడులే! ఇంక ఏంటి సంగతులు సంజనా!’ పాపని చూస్తూ ప్రశ్నించింది సుజాత.
‘ఏముంది ఆంటీ!... డైవోర్సు దాకా మీకు తెల్సు. మళ్లీ పెళ్లి చేసుకున్నాను. యోగీష్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. పింకీ అంటే ప్రాణం!’ సంజన కళ్లు ఆనందంతో తళుక్కుమనటం సుజాత దృష్టిని దాటిపోలేదు.
‘పోనే్ల సంజనా! కావల్సిందదే! కామేశ్వరి మేడం నీ గురించి ఎంత బాధపడ్డారో!’ గతం తల్చుకుంది సుజాత.
‘అంతే ఆంటీ! తీరా నేను హ్యాపీగా ఉన్నప్పుడు చూట్టానికి వాళ్లకి అదృష్టం లేదు’ సంజన గొంతు గరగరలాడింది.
‘సారీ నిన్ను డిస్ట్రబ్ చేశాను’ నొచ్చుకుంది సుజాత.
‘లేదాంటీ! మిమ్మల్ని చూస్తే మళ్లీ అమ్మని చూసినట్లుంది. మీకు యోగీష్‌ని పరిచయం చేస్తాను. తనూ చాలా హేపీగా ఫీలవుతాడు. మేమిద్దరం వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాం’ హుషారుగా అంది.
సుజాత వింటూ ఉండిపోయింది. సంజన కబుర్లన్నీ యోగీష్, పాపల గురించే. ఆడపిల్లలు ఎంత త్వరగా తల్లిదండ్రుల్ని మర్చిపోతారు! సుజాతలో కొత్త ఆలోచన. సంజన ఆవులించి ‘గుడ్‌నైట్’ చెప్పి పడుకుంది.
సుజాతకి నిద్ర రావటంలేదు. జీవితం పదేళ్లు వెనక్కి పరుగెడుతోంది. సంజన తల్లి కామేశ్వరి మేడం మళ్లీ మళ్ళీ గుర్తొస్తోంది. ఆ జ్ఞాపకాలన్నీ దృశ్యాలుగా పాత కథని మనసు తెర మీద సినిమా రీల్‌లా చూపిస్తున్నాయి.
* * *
‘అప్పుడే ఒంటిగంటయిందా?’ చేతికున్న వాచీకేసి చూసుకుంటూ అనుకుంది సుజాత.
ఉదయం నించి సీటు కదలకుండా కూర్చొని పనిచేసి పెండింగ్ ఫైల్స్ అన్నీ దాదాపు క్లియర్ చేయగలిగింది. పని బాగా చేసేవాళ్లకి పనిలోనే తృప్తి ఉంటుంది మరి!
‘కృష్ణా!’ అటెండర్‌ని పిల్చి డబ్బులిచ్చి కాఫీ తెమ్మని పంపింది.
ఫ్లాస్క్‌తో కృష్ణ వెళ్లిపోయాడు.
ఫైల్స్ అన్నీ సర్ది వాటి మీద రైటింగ్ ప్లాంక్ ఉంచి చుట్టూ ఓసారి చూసింది.
విజయ, భర్త కుమార్‌తో కలిసి ముచ్చట్లు నవ్వులతో లంచ్ చేస్తున్నది సీటు దగ్గరే! భార్యాభర్తలు ఒకే ఆఫీసులో పనిచేస్తే ఒక రకంగా సౌకర్యం, మరో రకంగా ఇబ్బంది కూడా... అనుకుంటూ కదిలింది సుజాత.
కొందరు మగ కొలీగ్స్ అప్పటికే క్యాంటీన్ దారి పట్టారు.
‘వాళ్లకేం మగ మహారాజులు. ఎక్కడ నిల్చొని ఏం తిన్నా, తాగినా అడిగేవాళ్లుండరు. అదే ఆడవాళ్లు క్యాంటీన్‌లో కూర్చుని అరకప్పు కాఫీ తాగినా అందరి కళ్లు అటే చూస్తుంటాయి’ తనలో తాను చిరాకు పడుతూ లంచ్ బాక్స్, వాటర్ బాటిల్‌తో కామేశ్వరి మేడం ఛాంబర్‌కి వెళ్లింది.
కామేశ్వరి మేడం సుజాతకి పై అధికారి అయినా కొంచెం కూడా గర్వపడదు. రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉంది. ఇద్దరికీ వయసులో ఇరవయ్యేళ్ల అంతరం ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా కామేశ్వరి మేడం సుజాతని సొంత చెల్లెలిలా ఆదరిస్తుంది. వర్క్‌లో సలహాలిస్తుంది. ఇలా వీళ్లిద్దరూ పాలూ నీళ్లలా కలిసిపోవటం ఆఫీసులో చాలామందికి అసూయగా ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయత. ఇద్దరూ నిజాయితీగా అందరితో సహృదయతతో ప్రవర్తిస్తూనే పనిలో కచ్చితంగా ఉంటారు. అవినీతి వీళ్లకి ఆమడదూరంలోనే ఆగిపోతుంది. సుజాత మంచితనం, స్నేహం, అభ్యుదయ దృక్పథం కామేశ్వరికి నచ్చుతుంది. ఆవిడ ప్రేమ వాత్సల్యాలు సుజాతకి ఇష్టమైన గుణాలు.
ఆఫీసులో ఇతర ఉద్యోగినులకు ఏదైనా సమస్య ఎదురైతే సుజాత ఇచ్చే సలహా అందరి మెప్పు పొందుతుంది. ఆమెను ఏ విషయంలోనూ తప్పుపట్టలేక చాటుగా కుళ్లుకోవటం అందరికీ అలవాటుగా మారింది.
‘మే ఐ కమిన్ మేడం’ సుజాత గొంతు విని కామేశ్వరి మేడం తలెత్తి చూసింది.
‘రా సుజాతా!’ ఆహ్వానించింది ముక్తసరిగా. ఆ గొంతులో ఏదో మార్పు పసిగట్టింది సుజాత.
రోజూ అయితే లంచ్ చేసేటప్పుడు ఇద్దరూ బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవాళ్లు. సినిమాలు, పిల్లల చదువులు, వంటకాల దాకా ఎన్నో! ఇద్దరి అభిరుచులు కలిస్తే మాటలకి కొదువేముంది.
ఇవాళ మాత్రం కామేశ్వరి మేడం వౌనంగా నాలుగు మెతుకులు తిన్నాననిపిస్తున్నారు. తెలియని ఏదో బాధ ఆవిడ మొహంలో ప్రస్ఫుటవౌతోంది.
కాసేపయ్యాక కృష్ణ కాఫీ రెండు కప్పుల్లో పోసిచ్చాడు. కాఫీ తాగుతూ ఉండబట్టలేక సుజాత అడిగేసింది.
‘మేడం... ఎందుకలా ఉన్నారు. ఎనీ ప్రాబ్లెం?’
ఆవిడ బలవంతంగా నవ్వి సగం తాగిన కాఫీకప్పు బల్ల మీద ఉంచింది.
‘మీలో మీరు అలా బాధపడితే ఎలా మేడం. ఆఫీసుదా.. ఇంటిదా? అడిగానని మరోలా అనుకోకండి ప్లీజ్’
సుజాతకేసి కామేశ్వరి మేడమ్ చూసిన చూపులో చాలా అర్థాలున్నాయి. ఆవిడ కళ్లనిండా నీళ్లు.
‘సుజాతా! ఆఫీసు సమస్య అయితే దానె్నలా పరిష్కరించుకోవాలో ఒక దోవ ఉంటుంది. కానీ.. ఇది సంజన జీవితానికి సంబంధించిన సమస్య’ గొంతులో బాధ సుళ్ళు తిరుగుతోంది.
‘సంజనకి సమస్యా? ఏమయింది మేడమ్. నాతో చెప్పరూ!’ ఆవిడ చేయి పట్టుకుంది సుజాత.
‘నీకుగాక ఇంకెవరికి చెప్తాను సుజాతా! సంజన పెళ్లి ఎంత ఘనంగా చేశాం. అది సంతోషంగా ఉండాలని ఉన్న ఇల్లు కూడా అమ్మి కోరినవి జరిపాం. కానీ వాళ్ల అత్తింటి వాళ్లు ఇలా చేస్తారని అనుకోలేదు’ ఆవిడ గొంతు వణికింది.
సంజన కామేశ్వరి మేడమ్‌కి ఒక్కగానొక్క కూతురు. బి.టెక్ చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరింది. అమెరికా పంపటం ఇష్టంలేక హైదరాబాద్‌లో స్థిరపడిన ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఒక సంవత్సరం అయిందేమో!
సంజన చురుకైంది. తెలివైంది. పెళ్లికి అంతా వెళ్లాం కూడా! ఇంతలోనే సంజన వైవాహిక జీవితం బీటలు వారిందా? సుజాత అనునయంతో కామేశ్వరి మేడమ్ ఒక్కొక్క సంగతి అక్షరాలు కూడబలుక్కున్నట్లు చెప్పటం మొదలుపెట్టింది.
‘ఈ సంవత్సర కాలంలో అత్తగారింట్లో సంజనకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో సంజన ద్వారానే తెలిశాయి సుజాతా. పెళ్లై అత్తవారింటికి వెళ్లగానే మొదటిగా వాళ్లు సంజనని ఉద్యోగం మానేయమన్నారు. సెల్ తీసేశారు. సంజన మాతో ఫోన్‌లో కూడా మాట్లాడకూడదు. పుట్టింటికి రాకూడదు. మేం అక్కడికి వెళ్లి పిల్లను చూడకూడదు. సంజన సర్ట్ఫికెట్లు ఒరిజినల్స్ అన్నీ లాయరయిన వాళ్ల మామగారి కస్టడీలో ఉన్నాయట. సంజన పెళ్లి నగలు, సూత్రం తాడుతో సహా తీసేసుకుని లాకర్‌లో ఉంచి దానికి గిల్టు నగలు పెట్టారు. సంజనకి ఏ పనీ రాదని అత్తగారు ఎప్పుడూ సతాయిస్తుందట’
‘మరి మీరు అదేమని అడగలేదా?’ సుజాత గొంతులో తీవ్రత ధ్వనించింది.
‘ముందు వాళ్లే సర్దుకుంటారనుకున్నాం. ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. ఒకసారి మా బంధువులని తీసికెళ్లి గట్టిగా అడిగే ప్రయత్నం చేశాను’ కామేశ్వరి మేడమ్ అలసిపోయినట్లు కాసేపాగారు.
‘వాళ్లేమన్నారు?’ అసహనంగా అడిగింది.
‘అన్నిటికీ ఒకే జవాబు. మా కోడలుగా మా ఇంటికి వచ్చాక మా ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. తను మాకు సంపాదించి పెట్టక్కర్లేదు. మేం సంజనని మాక్కావాల్సినట్లు తీర్చిదిద్దుకుంటున్నాం. మీకు చాలా విషయాలు తెలీవు. ఊరికే వచ్చి సంజనని డిస్ట్రబ్ చేయొద్దు’ అని విసురుగా చెప్పారు.
‘అయితే అలా ఊరుకోవటమేనా మేడమ్’
‘పిల్లలు పుడితేనన్నా దాని జీవితంలో మార్పు వస్తుందని చూశాం. పెళ్లయ్యాక ఇంతవరకు ఒక్కసారి కూడా పుట్టింటికి పంపలేదు సరికదా పురుటికి కూడా పంపలేదు. నేనే వాళ్లింటికి వెళ్లి పది రోజులుండొచ్చాను’ విషాదంగా చెప్పిందావిడ.
‘సంజన నేటి తరం అమ్మాయి. ఇవన్నీ ఎలా ఊరుకుంటున్నది’ ఆవేశపడింది సుజాత.
‘తన ప్రయత్నాలన్నీ అయిపోయాయి. నిన్న రాత్రి సంజన దొంగచాటుగా ఎక్కడ్నుంచో ఫోన్ చేసింది. పసిపిల్లకి పాలివ్వనీయరట. పిల్లని అత్తగారి గదిలోనే ఉంచారట. తనకి హాల్లో మంచం వేసి బెడ్‌రూంలోకి పోవద్దని ఆంక్షలు విధించారట. తనకి జీవితం మీద విరక్తి ఉందనీ చావాలని ఉందనీ చెప్పి ఫోన్ పెట్టేసింది’ తలపట్టుకుందావిడ.
‘మీరెళ్లి సంజనని పాపని తెచ్చుకోండి. విడిపోతారేమో ఇంక’ నిట్టూర్చింది సుజాత.
‘మావారు కూడా కూతురి భవిష్యత్తు గురించి మధన పడ్తున్నారు. సంజన పుట్టింటికి వచ్చేస్తే మా అబ్బాయి శ్రీ్ధర్ వేరు కాపురం పెడతాడట’ మరో సమస్య గురించి బయటపడిందావిడ.
ఇది వినగానే ఆశ్చర్యం, బాధ కలిగాయి సుజాతకి.
సంజన తమ్ముడు శ్రీ్ధర్ అక్క పెళ్లి కాకముందే కొలీగ్‌ని ప్రేమించి పెళ్లాడాడు. కామేశ్వరి మేడమ్ ఇప్పటికీ కోడలికి బెడ్‌కాఫీతోసహా అన్ని సేవలు చేసి ఆఫీసుకి వస్తుందని సుజాతకి తెల్సు. ఎంత దురదృష్టం. తోడబుట్టిన అక్కకో చెల్లికో కష్టం వస్తే మగాడు ఎందుకింత స్వార్థంగా ఆలోచిస్తాడు. చిన్నప్పుడు వాళ్లిద్దరూ పరస్పరం ఎంత ప్రేమగా ఉండేవాళ్లు. భార్య రాగానే మగాడిలో ఇంత మార్పెందుకు? రాఖీ పండుగనాడు చూపే ఆడంబరం అంతా మోసమేనా?
‘సరే సుజాతా! ఏదో ఒకటి చేయాలి. ఆపైన దాని అదృష్టం’ అంటూ ముగించింది కామేశ్వరి మేడమ్.
ఆ తర్వాత రెండు రోజులు కొంచెం జ్వరంగా ఉందని లీవు పెట్టింది సుజాత.
మధ్యాహ్నం కొద్దిగా అన్నం తిని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎవరో తలుపు దబదబా బాదుతున్నారు.
తలుపు తీయగానే ఎదురుగా పసిపిల్లతో సంజనని చూడగానే సుజాత చిరాకంతా మాయమైంది.
‘రా సంజనా!’ ఇబ్బందిగా ఆలోచిస్తూనే ఆహ్వానించింది. సంజనకి అన్నం పెట్టి పాలు పట్టించి సేదతీర్చి బెడ్‌రూంలో రెస్ట్ తీసుకోమని చెప్పి కామేశ్వరి మేడమ్‌కి ఫోన్ చేసింది.
మరో గంటలోనే కామేశ్వరి మేడమ్ భర్తతోసహా వచ్చారు.
‘ఇల్లొదిలి వచ్చేశానమ్మా!’ నెయిట్ పెయింట్ కేసి చూసుకుంటూ చెప్పింది సంజన మెల్లగా.
‘పాప ఎందుకింత బలహీనంగా ఉంది’ అడక్కుండా ఉండలేకపోయింది సుజాత.
‘సరయిన తిండి దొరక్క. దొరికింది అరక్క’ సంజన విసురుగా చెప్పింది.
సుజాత ఇక సంభాషణ పొడిగించలేదు. కాఫీలు తాగి వాళ్లు వెళ్లిపోయారు.
తర్వాత చాలాకాలం కామేశ్వరి మేడమ్ డల్ అయ్యారు. ఆవిడ ఆరోగ్యంలో కూడా మార్పు బాగా కన్పించింది. జ్ఞాపకశక్తి తగ్గింది. ఫైళ్ల నెంబర్లు అలవోకగా చెప్పే మేడమ్ అలా తడబడుతూ మాట్లాడుతుంటే సుజాత కళ్లనీళ్ల పర్యంతం అయ్యేది.
ఓ రోజు కామేశ్వరి మేడమ్ చెప్తే తెలిసింది. సంజనకి డైవోర్సు వచ్చిందని. మళ్లీ ఉద్యోగంలో చేరిందనీ, పాపకి వైద్యం చేయించామనీ బాగానే ఉందని.
మరి కొన్నాళ్లకి తను ట్రాన్స్‌ఫర్ అయి వేరే ఆఫీసుకి బదిలీ కావటంతో ఆ కుటుంబంతో సంబంధం తెగిపోయింది. సుజాత మనస్సు గతంలోంచి ప్రయాణించి వర్తమానంలోకి వచ్చి పడింది భారంగా.
ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారో ఊహించలేం. అలా ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు.
బెంగుళూరు స్టేషన్‌లో రైలు ఆగగానే యోగీష్ బోగీ లోపలికి వచ్చాడు. వస్తూనే సంజనకేసి ఆపేక్షగా చూస్తూ పింకీని హగ్ చేసుకొని సామాన్లు కొలీతో పట్టించుకొని పోబోతున్నప్పుడు సంజన ‘సుజాత ఆంటీ’ అని యోగీష్‌కి సుజాతకి పరిచయం చేసింది. తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. పోతూపోతూ హడావిడిగా సంజన సుజాత చేతిలో మడతలు పెట్టిన ఓ తెల్ల కాయితాన్నుంచి ఈ లెటర్ ఇంటికెళ్లాక తీరిగ్గా చదవండి ఆంటీ’ అంది యోగీష్ వినకుండా.
ప్రవీణ్ ‘అమ్మా’ అని పిలవటంతో ఇటు తిరిగి కొడుకుతో ఇల్లు చేరింది సుజాత. భోజనం చేసి రిలాక్స్‌డ్‌గా నడుం వాల్చాక సంజన లెటర్ గుర్తొచ్చింది. హ్యాండ్ బ్యాగ్ లోంచి ఆ కాయితం తీసి ఆసక్తిగా చదవసాగింది.
ఆంటీ,
రాత్రి మీ కళ్లల్లో వంద ప్రశ్నలు, ఆశ్చర్యార్థకాలూ చూశాను. అన్నిటికీ సమాధానాలు నా దగ్గర లేవు. చిన్నప్పటి నించీ నేను ఏది కోరినా అమ్మనాన్నలు కాదనలేదు. కానీ యోగీష్‌తో నా ప్రేమని కులం కారణంగా కాదన్నారు. నేనెంత ఏడ్చి మొత్తుకున్నా వినే్లదు. నన్ను ఉద్యోగం మాన్పించి గదిలో ఉంచి ఫోన్ లాగేసుకుని నిఘా పెట్టారు. వాళ్లు చూపించిన సంబంధం చేసుకోకపోతే విషం తాగి చస్తామని బెదిరించారు. వాళ్ల నుంచి నేను దాచిన నిజం ఏమిటంటే అప్పటికే యోగీష్ ప్రతిబింబం నాలో పెరుగుతుండటం. అది తెలిస్తే నిజంగా విషం తాగేవాళ్లేమో మరి! పెళ్లయ్యాక మొదటి రాత్రే నా భర్త గౌతమ్‌కి యోగీష్ ఫొటో చూపించి అంతా చెప్పేశాను. ‘ముందే ఎందుకు చెప్పలేదని, ఈ పెళ్లితో తన జీవితం ఎందుకు నాశనం చేశావని’ బాధపడి నిందించాడు. ‘మా అమ్మానాన్నలపై కక్ష సాధించటానికే ఈ పెళ్లి చేసుకున్నాను’ అన్నాను.
కొన్నాళ్లు నా గర్భం సంగతి రహస్యంగా ఉంచమని కోరాను. అతని వౌనమే జవాబయింది.
మా అత్తగారింట్లో నేను పడిన బాధలన్నీ నా కల్పనలే! గౌతమ్ కుటుంబంపై 498ఎ కింద కేసు పెడతానని బెదిరించి వాళ్లు నాతో అన్ని విధాలా సహకరించేట్లు చేసుకున్నాను. పాపని కన్నాక నేను కోరినట్లు పదిహేను లక్షలిచ్చి గౌతమ్ విడాకులు తీసుకున్నాడు. ఏం చేయమంటారు ఆంటీ. యోగీష్ చాలా బీదవాడు. అందుకే ఇలా సంపాదించాల్సి వచ్చింది. నా ప్రేమను కాదన్న అమ్మానాన్నలతో నాకు తెగతెంపులయి పోయాయి. ఇప్పుడు నేను చాలా హేపీ. కోరుకున్నది సాధించాను. మీ ఇంట్లో రెండు రోజులు ఆశ్రయం పొందాను. అందుకే ఇదంతా చెప్పాలన్పించింది. మీ కామేశ్వరి మేడమ్ మీరనుకున్నంత విశాల హృదయిని కాదు ఆంటీ. సారీ ఫర్ ది డిజప్పాయింట్‌మెంట్... ఎప్పుడూ మిమ్మల్ని కలవను.
-సంజన
ఉత్తరం పూర్తయ్యేసరికి కొయ్యబారిపోయింది సుజాత. సాధారణంగా చట్టాలన్న ఆడవాళ్ల పక్షానే సానుభూతిని ప్రకటిస్తాయి. లోకమూ అంతే! మారుతున్న కాలంలో అమ్మాయిల బతుకాట ఇంత అమానవీయంగా ఉంటుందా? ఇంతమందిని ముఖ్యంగా తల్లిదండ్రుల్ని కూడా నిర్వీర్యం చేయగల్గుతున్నారా?
‘అమ్మా! టైమవుతోంది. తయారవు మరి’ ప్రవీణ్ పిలిచాడు.
ప్రవీణ్‌కి పెళ్లికూతుర్ని చూడడానికి బెంగుళూరు వచ్చిన సుజాత మనసులో వెయ్యి సందేహాలు, లక్ష భయాలు ముసురుకుంటున్నాయి. సంజన ఇచ్చిన షాక్ సరికొత్త పాఠాన్ని నేర్పుతోంది మరి!
*

డా.సి.్భవానీదేవి
986684700

-డా.సి.భవానీదేవి