S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 9

అలా కళానిధి ఇండస్ట్రీ నుండి ఫేడవుటయిపోయాడు. దానితో షరీఫ్‌కి కొత్త ఉద్యోగం వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది.
మరో ఆలోచన లేకుండా అతను వెళ్లి చంద్రాన్ని కలిశాడు. అప్పుడప్పుడే చంద్రం ఇండస్ట్రీలో కాస్త నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కారు కూడా కొనుక్కున్నాడు. దానితో మరో ఆలోచన లేకుండా షరీఫ్‌ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు.
అంతకు ముందు చంద్రంతో తనకున్న పరిచయాన్ని ఏనాడూ ఉపయోగించుకోడు షరీఫ్. యజమానిని యజమానిగా చూస్తాడు.
చంద్రం ఫోన్ మాట్లాడటం ముగించాడు.
‘ఏంటి సాబ్! లేటెస్ట్ మెజారిటీ ఏమైనా తెలిసిందా?’
‘ఆమె వెనుకబడే ఉంది...’
‘మంచివాళ్లు రాజకీయాల్లో నెగ్గుకు రావటం కష్టం సాబ్!’
‘మంచి వాళ్లు నెగ్గకపోయినా అర్థం చేసుకుంటాం. మరీ అశోక్ లాంటి వాడి మీద ఓడిపోవటం అంటే ఎన్నికల వ్యవస్థ మీదే నమ్మకం పోతోంది...’
‘తప్పు ప్రజల దగ్గర పెట్టుకుని వ్యవస్థని తిడితే లాభం ఏమిటి సాబ్?’
‘అయితే ఏమీ చెయ్యలేమా? అశోక్ నెగ్గుతుంటే చూస్తూ ఊరుకోవలసిందేనా?’
‘ఊరుకోక ఏం చెయ్యగలం సాబ్?’ అన్నాడు షరీఫ్.
షరీఫ్ చంద్రం కంటే హోదాలో తక్కువ కావచ్చు. కానీ అతని కంటే ఎక్కువ లోకాన్ని చూశాడు. అందుకే చంద్రం మాట్లాడలేదు.
‘అశోక్... ది పర్ఫెక్ట్ పొలిటీషియన్’. అతన్ని చూసి చాలామంది భయపడతారు. కొంతమంది ఈర్ష్య పడతారు. కానీ, ఎవరూ అతన్ని ఎదిరించరు. ఆ పని చేసింది చంద్రం నేస్తమే!
* * *
అశోక్
నేను ఊహ తెలిసేటప్పటికి అమెరికాలో ఉన్నాను. అక్కడే బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను.
నా తల్లిదండ్రులు అమెరికాలో ఉండేవారు కాదు. ఇండియాలోని రాయలసీమలో ఉండేవారు.
అమెరికా బోర్డింగ్ స్కూల్లో చదువు చాలా ఖరీదు. అమెరికనే్స వేలల్లో ఒకరు ఆ ఖర్చు భరించ గలుగుతారు. స్కూలు చదువు కోసం అంత ఖర్చు పెట్టి నన్ను మా తల్లిదండ్రులు అంత దూరం పంపవలసిన అవసరం ఏమిటనే అనమానం మొదట్లో నాకు కలిగేది. చివరకు తెలిసిన కారణం ఒకటే... ప్రాణ భయం.
అవును! రాయలసీమలోనే కాదు ఇండియాలో ఎక్కడ ఉన్నా నా ప్రాణాలకు రక్షణ లేదు. అందుకే ఇంటికి ఇంత దూరంగా నన్ను ఉంచి చదివిస్తున్నారు.
రాయలసీమలో పూర్తిగా ఫ్యాక్షన్ రాజకీయాలతో కుళ్లిపోయిన ప్రాంతం నాది. అలాంటి ప్రతిచోట ఉన్నట్లే రెండు గ్రూపులు ఉన్నాయి. తరతరాలుగా ఒక గ్రూపునకు మా కుటుంబం నాయకత్వం వహిస్తుంది. ఎప్పుడు ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో, ఏ దాడిలో ఎంతమంది హతమవుతారో... ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలాంటి వాతావరణం నుండి దూరంగా ఉంచటానికి చదువు నెపంతో, నన్ను అమెరికాకి పంపి రక్షణ కల్పించారు నా తల్లిదండ్రులు.
లాంగ్ హాలిడే వచ్చినపుడు నా తోటి స్టూడెంట్స్ ఎవరికి ఇంటికి వాళ్లు వెళ్లేవాళ్లు. నేను మాత్రం అమెరికాలో ఉన్న చుట్టాలింటికి వెళ్లేవాడిని. వాళ్లు నన్ను వారిలో ఒకడిగా చూసేవారు కాదు. ఊరేగింపునకు వచ్చిన ఉత్సవ విగ్రహాన్ని చూసినట్లు మర్యాదగా చూసేవారు.
ఎప్పుడో ఒకసారి మా అమ్మా, నాన్నలే అమెరికా వచ్చేవారు - నన్ను చూడటానికి.
నేను పెరిగింది అమెరికాలో అయినా నాకు ఇండియా అంటే ఇష్టం.
అమ్మ, నాన్న అంటే అంతకంటే ఇష్టం. వారికి దూరంగా ఉండవలసి వచ్చిన పరిస్థితుల మీద కోపం.
అక్కడి ఆప్యాయతలూ, ప్రేమలూ ఎక్కడా దొరకవని నాకు బాగా తెలుసు.
కానీ ఆ ఆప్యాయతలు పొందాలంటే, ఒక అడ్డంకి దాటాలి. అదే వైరిపక్షపు పగ.
చదువు ముగించుకుని ఇండియాకి వెనక్కి వస్తానన్నపుడు అందరూ ఏకగ్రీవంగా వద్దన్నారు.
అయినా నేను వినలేదు. నా మనసులో నేను చేయవలసిన పనుల మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది.
ఇప్పుడిప్పుడే మా ఇంట్లో కూడా ఫ్యాక్షనిజం మీద విరక్తి కలుగుతోంది. అర్థంలేని, అనవసరపు కార్పణ్యాలకు తరతరాలుగా ఎంతమంది బలయ్యారో తలచుకుని ఈ పరిస్థితిని మార్చే రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ ఎవరికీ తెలియంది ఈ రొచ్చులో నుండి ఎలా బయటపడాలనే!
ఎవరు ఎంత చెప్పినా వినకుండా నేను ఇండియాకి తిరిగి వచ్చాను. నన్ను ఊర్లోకి రానివ్వకుండా మా వాళ్లే హైదరాబాద్ వచ్చి నన్ను కలుసుకున్నారు. ఇన్నాళ్లూ దూరంగా ఉన్న కొడుకు తిరిగి రావటం మా ఇంట్లో వారికి ఆనందానికి బదులు భయాన్ని కలిగించింది.
‘మనకంటే ఆస్తిపాస్తులు లేని వాళ్లు కూడా అమెరికాకి పోయి మరి రావటం లేదు. అలాంటిది నువ్వెందుకురా వచ్చావు?’ అంది మా అమ్మ.
‘మనూర్లో రాజులా ఉండాలి కానీ, పరాయి దేశం పోయి ఊడిగం చేసే బతుకు మనకెందుకమ్మా?’ అన్నాను నేను.
‘ఇక్కడి పరిస్థితి నీకు అర్థం కావటంలా... పగోళ్లు కాసుకు కూర్సున్నారు...’ చెప్పాడు మా నాన్న నరసింహం.
‘నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకపోతే అది మీ చేతకానితనం..’ అన్న నా మాటకు మా నానే్న కాదు అందరూ కట్రాటలయ్యారు. ఇలాంటి ఫ్యాక్షన్ కుటుంబాల్లో కుటుంబ పెద్ద మాటకు ఎదురు చెప్పటం అన్నది ఉండదు. అలాంటిది ఆయన్ని విమర్శించటం అన్నది ఎవరూ ఊహించలేని సంఘటన.
‘రేయ్!... ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా..?’ అన్న గొంతులు ఒకటి కాదు నాలుగయిదు ఒక్కసారిగా పైకి లేచాయి.
కోపంతో ఊగిపోయాడు నాన్న. ‘పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని.. ఏడనుండో నిన్న వచ్చినావు. ఏం తెలుసురా నీకీడ సంగతులు...’ అని రెచ్చిపోయాడు.
‘సింహం తన గుంపులో మరో మగ సింహాన్ని సహించదు. దాని ఆధిపత్యానికి అడ్డు వస్తున్నారనుకుంటే స్వంత పిల్లలనయినా చంపేస్తుంది. అందుకే అది మృగరాజయింది..’
నా మాట ఎవరికీ అర్థం కాలేదని వారు మొహాలు చూస్తేనే అర్థం యింది.
‘ఎప్పుడయినా శాంతిని ఆశించే వాళ్లు యుద్ధం చేయటానికి తయారుగా ఉండాలి’
‘అందుకే నిన్ను పిల్ల నాయాలా అంది. వందల ఏళ్ల నుండి ఈడ యుద్ధం జరుగుతానే ఉందిరా నాయనా! ఈయాళ వచ్చి కొత్తగా నువు చేసే యుద్ధం ఏందిరా..?’
మాట్లాడటానికి నోరు తెరచి ఏదో అనుమానం వచ్చి చుట్టూ చూశాను. ఆడవాళ్లు, మగవాళ్లు, చుట్టాలు, పక్క వాళ్లు, అనుచరులు, సహచరులు... తరతమ భేదం లేకుండా అందరూ చుట్టూ చేరి తమాషా చూస్తున్నారు.
‘నేను తరువాత మాట్లాడతాను...’ అని లోపలకు వెళ్లిపోయాను.
అర్ధరాత్రి దాటాక నాన్న గదిలోకి వెళ్లాను. ‘నీతో మాట్లాడాలి నాన్నా!’ అన్నాను.
‘చెప్పు...’ అన్నాడాయన.
‘బయటకు వెళ్దాం...’ అన్నాను.
అక్కడెవరున్నారన్నట్టు చుట్టూ చూశాడాయన. అభ్యంతరం చెప్పబోతున్న ఆయన్ని పట్టించుకోకుండా బయటకు నడిచాను.
ఇద్దరం ఒక గదిలోకి వెళ్లాక వెనుక తలుపేశాను.
‘ఉదయం మీరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకున్నా... అందరూ ఉన్నారని ఆగిపోయాను...’
‘అక్కడ కొత్త వాళ్లెవరున్నార్రా! అంతా మనోళ్లేగా!...’
‘అదే చెప్పదలచుకున్నాను నాన్నా! ఇన్నాళ్లూ మీరు చేస్తున్నది యుద్ధం కాదు, పోరాటం!’
‘రెంటికీ తేడా ఏందిరా?’
‘పోరాటం... మరో పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది. అదే యుద్ధం... శాశ్వత శాంతికి దారి తీస్తుంది’
‘నిన్ను చదివించింది, నాకు అర్థం కాని భాష మాట్లాడమని కాదు’ నిరసనగా అన్నాడు నాన్న.
‘మీరు ఎంత ప్రయత్నించినా, ఎదుటి పక్షం జీవించి ఉన్నంత వరకు మనకు శాంతి దొరకదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎదుటి పక్షాన్ని లేకుండా చేస్తాను’
‘నిన్ను ఆ దేశం పంపి చదివించింది ఈ రొచ్చులోకి దింపటానికి కాదు...’
‘నేను ఈ పని చేస్తానంటుంది కూడా రొచ్చు శుభ్రం చేయటానికే! నా పిల్లల్ని మరో దేశం పంపి కాందిశీకులుగా పెంచటం నాకు ఇష్టం లేదు. నేను నేర్చుకున్న చదువు బ్రతకటానికి ఎంత వరకు పనికి వస్తుందో తెలియదు. కానీ, చంపటానికి అవసరమైన తెలివి బానే ఇచ్చింది. మనం బతకాలంటే, ఎదుటి వారిని చంపాలి...’ అన్న నా మాట ఆయన మీద బానే పని చేసింది.
‘ఇంతమంది చేయలేనిది నువ్వు ఒక్కడివి ఏమి చెయ్యగలవు?’
‘అదే మీరు చేసిన పొరపాటు. అంతమంది కలిసి చెయ్యబోయిన ఏ పని కూడా సఫలం కాదు’
‘మన వాళ్లనే అనుమానిస్తున్నావా?’
‘నేను నా నీడని కూడా నమ్మను...’
చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు నాన్న. ‘నాకు ఒకటే భయంగా ఉంది. ఈ ప్రయత్నంలో నీకు ఏదైనా జరిగితే...’
‘ఆ అనుమానమే మీకు అవసరం లేదు. నాకు ఏమీ కాదు’
‘ననే్నమి చెయ్యమంటావో చెప్పు...’
‘ఒక సహాయం చెయ్యండి. ఈ విషయం ఎవరికీ చెప్పకండి... ఆఖరికి అమ్మకి కూడా!’
‘అదేంటి అమ్మని కూడా నమ్మవా?’
‘నమ్మకపోవటం కాదు. నా ఉద్దేశంలో మనింట్లో జరిగే ప్రతి విషయం ఎదుటి పక్షానికి తెలుస్తుంది. నా ప్రయత్నం గురించీ తెలిస్తే అమ్మ ఆందోళనకు గురవుతుంది. ఆ ఆందోళన ఆమె ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆమె మొహంలో, చర్యల్లో ప్రతిఫలిస్తుంది. అది ఎదుటి వాళ్లకి తెలిస్తే వాళ్లు జాగ్రత్త పడతారు. వాళ్లు జాగ్రత్త పడితే మన పని జరగదు...’
‘నీ ఇష్టం...’ తిరిగి తన గదిలోకి వెళ్తూ అన్నాడు నాన్న.
* * *
హైదరాబాద్ నా స్థావరంగా చేసుకున్నాను. నేను వచ్చిన విషయం ప్రత్యర్థులకు
తెలిస్తే, నాకు ప్రమాదం రావటమే కాదు, అనవసరంగా ప్రత్యర్థులు అప్రమత్తమయ్యే అవకాశం కూడా ఉంది.
మా ఊరిలో ఎవరితోనూ... అది మా పక్షమా, ఎదుటి పక్షమా అన్న భేదం లేకుండా సంబంధాలు తెంచుకున్నాను.
మా ఎదుటి పక్షపు లీడర్ నాగముని.
ముందుగా అతని కొడుకులు, కూతుళ్లు, వారి పిల్లలకు సంబంధించిన వివరాలు సంపాదించాను. ఎవరు ఎక్కడ ఉంటారు, ఏమి చేస్తారు, వారి ఫొటోలతో సహా సంపాదించాను. ఈ ఫేస్‌బుక్ కాలంలో అది పెద్ద కష్టం కాలేదు. ఆ తరువాత అతని కుటుంబానికి దగ్గర బంధువుల లిస్ట్ సంపాదించాను. అందులో అంగబలం, అర్థబలం ఉన్నవాళ్లూ, ఏనాటికైనా నాకు ప్రమాదం అవుతారనుకున్న వారి జాబితా తయారుచేశాను. వీరందరినీ ఒక్క దెబ్బతో చంపాలి. అదీ ఎవరికీ అనుమానం రాకుండా!
నాగమునికి ఒక అలవాటు ఉంది. ఆరు నూరైనా శివరాత్రి రోజు ఏదో ఒక శైవ క్షేత్రానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటాడు. అది కూడా పూర్తి కుటుంబంతోసహా!
ఈసారి శివరాత్రి ఇంకా రెండు నెలలు ఉంది.
నేను చేయవలసిన పని చాలా ఉంది.
మా ఊరిలో ఒక పాత శివాలయం ఉంది. అది దాదాపు పాడుబడిన కండిషన్‌లో ఉంది. దాన్ని బాగు చేసి రెగ్యులర్‌గా పూజాదికాలు చేయించాలని నాన్న నిర్ణయించేటట్లు చేశాను.
సరిగ్గా శివరాత్రి రోజు ఆ దేవాలయం పునః ప్రారంభం కావాలని నిర్దేశించాను. దానికి మా కుటుంబంలోని సభ్యులు, నాన్న ముఖ్య అనుచరులు తప్పకుండా హాజరవ్వాలని చెప్పాను. నాన్న ఆ ఏర్పాటు చేస్తానన్నాడు.
నేను ఒకసారి బీహార్ వెళ్లి వచ్చాను. అక్కడ కొన్ని కిరాయి హంతక ముఠాలు ఉన్నాయి. వాటిలో ఒకదానితో కాంట్రాక్ట్ మాట్లాడుకుని వచ్చాను. శివరాత్రికి సరిగ్గా పది రోజుల ముందు వాళ్లు నా దగ్గరకు వస్తారు. నేను చెప్పిన పని చేస్తారు.
ఇక నాగముని కుటుంబం మీద దృష్టి పెట్టాను. అతని కుటుంబ సభ్యుల్లో ఒకరి ఫేస్‌బుక్ ఎకౌంట్లోకి జాయిన్ అవటం ద్వారా వారు ఈసారి శివరాత్రికి ఎక్కడకు వెళ్లాలనుకుంటున్నారో తెలుసుకున్నాను.
ఈసారి నాగముని రిషీకేశ్ వెళ్లబోతున్నాడని తెలిసింది.
అంత దూర ప్రయాణం కార్లలో చెయ్యలేరు. ప్రైవేట్ బస్ కూడా అసౌకర్యమే! ఇక మిగిలింది విమానంలో ఢిల్లీ వరకూ వెళ్లి, అక్కడ నుండి కారుల్లోనో, బస్సుల్లోనో వెళ్లటం. ఆ విషయం తెలుసుకోవటం కోసం నేను ఢిల్లీ చేరుకున్నాను.
అన్ని కార్లు రెంట్‌కి తీసుకోవటం కంటే బస్ అయితే అందరూ కలిసి వెళ్లవచ్చని అనుకున్నట్లున్నారు. ఢిల్లీలో ఒక రెంటల్ ఏజెన్సీ ద్వారా లగ్జరీ వోల్వో బస్సు బుక్ చేసుకున్నారు.
ఆ రెంటల్ ఏజెన్సీ చాలా రెప్యూటెడ్ కంపెనీ. నా ప్రణాళికకు సహకరించే సమస్యే లేదు. ఆ ప్రయత్నం చేయటం కూడా అనవసరం.
అంతమాత్రాన నా ప్రయత్నం నేను మానలేదు. వోల్వో బస్సులు నడపటం అందరితోనూ అయ్యే పని కాదు. దానికి ప్రత్యేక తర్ఫీదు పొంది ఉండాలి. ఆ కంపెనీలో అట్లాంటి డ్రైవర్లు ఎవరు ఉన్నారా అని ఎంక్వయిరీ చేయించాను. ప్రత్యేకంగా కాంట్రాక్ట్ బేసిస్ మీద బాడుగకి పంపే వోల్వో బస్సులను ఆ కంపెనీలో ముగ్గురు డ్రైవర్లు నడుపుతారు. వారిలో వీక్ కాండిడేట్ పూరన్‌సింగ్. అతనికి ఐదుగురు పిల్లలు. డ్రైవింగ్ తప్ప మరో పని తెలియదు. అతనే నా టార్గెట్ అని నిర్ణయించుకున్న తరువాత బీహార్ గ్యాంగ్‌ను పిలిచాను.
బీహార్ గ్యాంగ్ అక్కడకి చేరుకుంది. ఒక స్క్రాప్ వ్యాపారి దగ్గర పాడుబడిన బస్ కొని దాన్ని ఊరి బయట నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి తరలించాను.
నాతో పాటు తెచ్చిన కెమికల్స్ ఎలా ఉపయోగించాలో ఆ బీహారీ గ్యాంగ్‌కి తర్ఫీదు ఇచ్చాను. ఆ కెమికల్స్‌లో అత్యధిక శాతం మెర్క్యురీ, ఫాస్ఫరస్ ఉండేలా చూశాను. వాటిని దీపావళి మందుగుండు సామాగ్రిలో ఎక్కువగా వాడతారు. కాబట్టి నేను అనుకున్న సంఘటన జరిగిన తరువాత అది ప్రమాదమో, కావాలని చేసిన ఘటనో ఎవరికీ స్పష్టంగా తెలియదు.
బీహార్ గ్యాంగ్‌లో కొందరికి ఆ పాడుబడిన బస్‌లో కెమికల్స్ అమర్చటం మీద ప్రాక్టికల్ సెషన్స్ తీసుకున్నాను. నిజం వోల్వో బస్‌లో ఇంటీరియర్స్, సీట్ కుషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, కెమికల్స్ అమర్చటానికి దొరికే ప్రదేశం ఈ డొక్కు బస్సు కంటే ఎక్కువే!
మొత్తానికి అందరికీ నేను చెప్పదలచుకున్నది అర్థమైందనుకున్న తరువాత, అక్కడ నుండి వచ్చేశాను.
మిగిలిన విషయాలన్నీ నాన్ టెక్నికల్ విషయాలు. వాటిని ఎలా డీల్ చేయాలో వాళ్లకి నేను నేర్పనవసరం లేదు. ఆ విషయాల్లో వాళ్లే నాకంటే ఘనులు.
ఢిల్లీలో పనులు ముగించుకుని సరాసరి మా ఊరు వెళ్లాను.
అప్పుడే నేను అమెరికా నుండి వచ్చినట్లు, ఆ సందర్భంగానే పాడుబడిన గుడికి మరమ్మతులు చేయిస్తున్నట్లు ప్రచారం చేశాడు నాన్న.
బహుశా నాగముని నేను అమెరికా నుండి తిరిగి వస్తానని ఊహించి ఉండడు.
మామూలుగా అయితే వెంటనే అతని ఆలోచనలు నా ప్రాణాలకు ఎసరు పెట్టే దిశగా సాగేవి. కానీ ఇప్పుడు అతనికి సమయం లేదు. రిషీకేశ్ ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోలేడు. అందుకే నా సంగతి వచ్చాక చూసుకుందామనుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సరాసరి నేను ఏర్పాటు చేసిన ఉచ్చులోకి నడుస్తున్నానని నాకు తెలియదు.
నాగముని లేకపోవటంతో ఊర్లో మా వర్గం వారందరూ గుడి పనుల్లో మునిగిపోయారు.
శివరాత్రి రోజు అట్టహాసంగా గుడి ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మా గ్రూప్ సపోర్ట్ చేస్తున్న పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు ముఖ్య అతిథిగా వచ్చాడు.
నేను కూడా పనుల్లో పాల్గొంటున్నట్లు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నా, నా మనసులో ఆలోచనలు మాత్రం మా బీహారీ గ్యాంగ్ మీదే ఉన్నాయి.
నాకు దివ్యదృష్టి లేదు కానీ అక్కడ జరుగుతున్న సంఘటనలు ఎలా ఉండి ఉంటాయో ఊహించుకుంటున్నాను.
మొదటి స్టెప్ పూరన్‌సింగ్ మాత్రమే ఆ బస్ డ్రైవ్ చేసేటట్లు చూడటం. ఆ డ్యూటీ అతనికే పడి ఛాన్స్ నూటికి ముప్పై మూడు శాతం ఉంది. ఆ మాత్రం ఛాన్స్ తీసుకోవటానికి కూడా నేను ఇష్టపడలేదు. ఇంత పెద్ద ప్రణాళికలో అంత చిన్న విషయానికి మనశ్శాంతి కోల్పోవటం నాకు ఇష్టంలేదు. ఆ ట్రావెల్ కంపెనీలో డ్యూటీలు వేసే క్లర్క్‌కి యాభై వేలు ఇవ్వటం ద్వారా మనశ్శాంతిని కొనుక్కున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ బస్ ఎవరు డ్రైవ్ చేస్తారన్న దాని మీద నాకు ఎలాంటి అనుమానమూ లేదు.
సరిగ్గా పూరన్ సింగ్ డ్యూటీ ఎక్కటానికి పది నిమిషాల ముందు అతన్ని వెతుక్కుంటూ ఒక అపరిచిత వ్యక్తి వెళ్తాడు. డ్రైవర్ని పక్కకు తీసుకువెళ్లి సెల్‌ఫోన్‌లో ఒక వీడియో చూపిస్తాడు. అందులో డ్రైవర్ పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. అయితే వాళ్లు ఆడుకుంటున్నది అతని ఇంట్లో అయి ఉండదు. తెలియని పరిసరాల్లో.
‘నీ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరాలంటే ఒక పని చెయ్యాలి...’ ఆ వీడియో చూపించటం ఆపుతూ చెప్తాడా వ్యక్తి.
అయోమయంగా అతని వైపు చూస్తాడు పూరన్‌సింగ్. షాక్ తిన్నట్లయిన అతని మెదడు ఎదుటి వ్యక్తి చెప్తున్న మాటలు అర్థం చేసుకోవటానికి సమయం తీసుకుంటుంది.

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002