S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనస్సాక్షి (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

మొదట తనకి వినిపించిన శబ్దం కారుదని బిల్లీ నమ్మలేదు. హూకర్స్ రిడ్జ్ మెయిన్ రోడ్‌కి మైలు దూరంలో ఉంది. అక్కడికి మట్టి రోడ్డు కూడా లేదు.
మళ్లీ ఆ శబ్దాన్ని జాగ్రత్తగా విన్నాడు. అది కారు శబ్దమే అని, నెమ్మదిగా వస్తోందని గ్రహించాడు. ఆ శబ్దం క్రమంగా దగ్గర అవసాగింది. అక్కడికి కారులో వచ్చే జంటని చూడాలనే ఆసక్తితో బిల్లీ తను కూర్చున్న రాతి వెనక్కి జరిగాడు. చేతిలోని ఉడతలని కాల్చే తుపాకీని పక్కన పెట్టి చూశాడు.
అతనికి పది గజాల దూరంలో ఓ నల్లరంగు డాడ్జి కారు జాక్ పైన్ వృక్షం పక్కన ఆగింది. డ్రైవర్ వైపు తలుపు తెరచుకుంది. నల్ల సూట్‌లోని ఓ పొడుగాటి వ్యక్తి దిగి తన తల మీద టోపీని తీసి సీట్లో పడేశాడు. తర్వాత చేతి రుమాల తీసి సూటుని దులుపుకుంటూ చుట్టూ చూశాడు. బిల్లీ తను కనపడకుండా వెనక్కి నక్కాడు. హంటింగ్ దుస్తుల్లోని బిల్లీ అతనికి కనపడలేదు.
‘ఇతని మొహం సుపరిచితం’ అని బిల్లీ అనుకున్నాడు. అతను జాగ్రత్తగా చుట్టూ చూసి ఎవరూ లేరని తృప్తి పడ్డాక కారు వెనక్కి వెళ్లాడు. తాళం చెవి గుత్తిలోంచి ఓ తాళం చెవిని ఎంపిక చేసి డిక్కీ మూతని తెరిచాడు. బహుశ అతను కూడా తనలాగే వేట కోసం వచ్చి ఉంటాడని, ఐతే అతనికి హంటింగ్ లైసెన్స్ ఉండచ్చని బిల్లీ భావించాడు. కాని అతని దుస్తులు వేట దుస్తులు కావు అనుకున్నాడు.
ఆ వ్యక్తి డిక్కీ తెరిచి అందులోంచి పార, గునపం తీసి కింద ఉంచి డిక్కీలో తల పెట్టి లోపల నించి ఓ పొడుగాటి చెక్కపెట్టెని బయటకి లాగాడు. దాన్ని భుజం మీదకి ఎత్తుకుని పైన్ వృక్షాల సముదాయం దగ్గరికి చేరుకున్నాడు. ఆ పెట్టెని కింద ఉంచి వెనక్కి తిరిగి వెళ్లి పరికరాలని అందుకుని మళ్లీ అక్కడికి వెళ్లాడు. బిల్లీకి జరిగేది తను కూర్చున్న చోటి నించి కనపడకపోయినా, అతను గోతిని తవ్వుతున్నాడని అర్థం చేసుకున్నాడు.
ఎందుకు తవ్వుతున్నాడు? అతనిలో ఆసక్తి కలిగింది. ఆ కారు వంక చూశాడు. అది ఖరీదైన కొత్త మోడల్. బహుశ అతను పెద్ద నేరాలు చేసే రౌడీ అయి ఉండచ్చు. తను సంపాదించింది టేక్స్ ఇన్స్‌పెక్టర్లకి దొరక్కుండా ఇక్కడ పాతడానికి వచ్చి ఉంటాడు. ఇంతకు మునుపు కూడా ఇలా కొన్ని పాతి ఉండచ్చని కూడా బిల్లీ అనుకున్నాడు. అతనిలో ఉత్కంఠ పెరిగింది.
తను చాలాకాలంగా ఆశిస్తున్న డబ్బు సంపాదించే అవకాశం, జీవితాన్ని మలుపు తిప్పే అదృష్టం ఇదే అని అతనికి అనిపించింది. నిశ్శబ్దంగా అక్కడే కూర్చున్నాడు.
దాదాపు అరగంట తర్వాత ఆ వ్యక్తి చెట్ల మధ్య నించి కారు దగ్గరికి వచ్చాడు. షర్ట్ చేతులు పైకి మడుచుకున్న ఆ వ్యక్తి భుజానికి కోటు వేలాడుతోంది. అతను పలుగు, పారలని డిక్కీలో ఉంచి, నీళ్ల సీసాతో చేతులని శుభ్రంగా కడిగి రుమాలుతో తుడుచుకున్నాడు. కోటు తొడుక్కుని తలుపు తెరిచి కారెక్కి పోనించాడు. క్రమేపీ ఆ కారు శబ్దం దూరమైంది.
బిల్లీ మేఘావృతమైన ఆకాశం వంక చూశాడు. స్క్విరల్ గన్‌ని భుజాన తగిలించుకుని కొండవాలు మీంచి కిందకి దిగి ఇందాక అతను వెళ్లిన పైన్ చెట్ల మధ్యకి నడిచాడు. అతను తవ్విన చోటు గుర్తు పట్టకుండా ఆకులు చక్కగా కప్పాడు. కొత్త వాళ్లకి అక్కడ అంతకు మునుపు తవ్వినట్లు తెలీదు. చుట్టూ చూసి ఓ బలమైన ఎండు కొమ్మని అందుకుని, దాంతో ఆకుల్ని పక్కకి ఊడ్చి అప్పుడే నింపిన మట్టిని తేలిగ్గా తవ్వాడు. అకస్మాత్తుగా అతనికి ఆ చెక్కపెట్టె పైభాగం కనిపించింది. దాని కొక్కాలకి తాళాలు లేవు. బంగారమా? డబ్బా? అనుకుంటూ వణికే చేతులతో కొక్కాలని తీసి దాన్ని తెరిచాడు. వెంటనే అతను ఉలిక్కిపడ్డాడు.
అందులో బంగారు రంగు జుట్టుగల ఒకామె ముడుచుకుని ఉండి ఒకప్పుడు అందగత్తె అని తెలుస్తోంది. బిల్లీకి అతను హంతకుడని అర్థమైంది.
వెనక్కి తిరిగిన బిల్లీకి ఇంకో ఆలోచన కలగడంతో దాని గురించి ఆలోచిస్తూ నడిచాడు.
* * *
బిల్లీ ఇంటికి చేరేసరికి అతని భార్య యూలా వంట పూర్తయింది. శనివారం కాబట్టి ఆమె సూయింగ్ సర్కిల్‌కి వెళ్లొచ్చింది. కొందరు గృహిణులు కలిసి శ్రమ తెలీకుండా కబుర్లు చెప్పుకుంటూ కుట్టు పని చేసుకునే క్లబ్ పేరది. ప్రతీ శనివారం సూయింగ్ క్లబ్ సభ్యులు కలిసి పని చేసుకుంటారు.
‘ఈ రోజు నువ్వు చాలా వదంతులు విని ఉంటావు?’ బిల్లీ అడిగాడు.
ఆమె అతని వంక తీక్షణంగా చూసి చెప్పింది.
‘నువ్వు తెచ్చే జీతం సరిపోకేగా నేను కుట్టి సంపాదించేది. అక్కడికి వచ్చే వారికి తమ భర్తల గురించి ఫిర్యాదు చేయడానికే సమయం చాలదు. ఇంక వదంతులకి టైం ఎక్కడ ఉంటుంది? ఉడతలు ఏమైనా దొరికాయా?’
‘లేదు’
‘ఉడత చర్మానికి మంచి ధర వస్తుందని నీకు తెలుసుగా? ఒంటి నిండా ఆ మట్టేమిటి?’ నిరసనగా చూస్తూ అడిగింది.
తన వేట దుస్తులకి అంటిన ఎర్రటి మట్టిని చూసి కింద పడ్డానని గొణుగుతూ చెప్పి, వాటిని మార్చుకోడానికి వెళ్లాడు. భోజనం చేస్తున్నంతసేపు బిల్లీ నిశ్శబ్దంగా ఉన్నాడు. యూలా మాట్లాడేది అతని చెవులు వింటున్నా మనసుకి ఎక్కలేదు. అడవిలో జరిగింది చెప్పాలనుకున్నాడు గాని అంతలోనే విరమించుకున్నాడు.
‘నువ్వు వచ్చినప్పటి నించి మాట్లాడటం లేదు. ఒంట్లో బాగా లేదా?’ యూలా అడిగింది.
‘నీ వంట తిన్న ఎవరికైనా ఎలాంటి జబ్బూ రాదు. ఏదో ఆలోచిస్తున్నాను’
‘ఓ లార్డ్! ఆలోచిస్తున్నాట్ట... క్రితంసారి నువ్వు ఆలోచించినప్పుడు మన ఆవు హైవే మీదకి వెళ్లి లారీ కింద పడి మరణించింది’
‘అది నా తప్పు కాదని చాలాసార్లు చెప్పాను’ గొణిగాడు.
‘దయచేసి ఈ ఆలోచనలని మాని సంపాదించు. మన పెళ్లయినప్పటి నించీ ఆ విషయంలో నీకు చుక్కెదురే’ యూలా ఫిర్యాదుగా చెప్పింది.
‘నిజానికి నేను ఆలోచించేది దాని గురించే’
బిల్లీ లేచి పోర్టికోలోకి వెళ్లి ఉయ్యాలబల్ల మీద కూర్చుని పైప్‌ని వెలిగించి చీకట్లోకి చూస్తూ హూకర్స్ రిడ్జ్‌లో పాతి పెట్టబడ్డ ఆమె ఎవరై ఉండచ్చా అని ఆలోచించసాగాడు. పాతిపెట్టిన వ్యక్తి భార్యా? తను కూడా యూలాని ఓ రోజు ఆ పక్కనే పాతిపెట్టాలి అనుకున్నాడు. కాని ఆమెని అక్కడి దాకా మోసుకెళ్లడం తన ఒక్కడికి సాధ్యం కాదు అని కూడా అనుకున్నాడు.
లేచి కొన్ని పాత దినపత్రికలని తిరగేస్తే ఓ చోట ఓ ఫొటో కనిపించింది. అందులోని ఓ గ్రూప్ ఫొటోలోని అతడిని గుర్తు పట్టాడు.
* * *
మర్నాడు ఉదయం బిల్లీ హూకర్స్ రిడ్జ్‌కి మళ్లీ తన పికప్ ట్రక్‌లో వెళ్లి కొద్ది దూరంలో ఓ కొత్త గోతిని తవ్వి పాతిపెట్టిన ఆ చెక్కపెట్టెని అందులోకి మార్చి కప్పేశాడు. చుట్టుపక్కల గల అనేక చెట్లని, రాళ్లని, ఇతర గుర్తులని బట్టి ఆ కొత్త సమాధి ఎక్కడ ఉందో రాసుకున్నాడు. తర్వాత సీసాలోని నీళ్లతో చేతులు శుభ్రం చేసుకుని ఊళ్లోకి వచ్చి బార్బర్ షాప్ ఆవరణలో కారు ఆపాడు. దాని బయట ఉన్న పబ్లిక్ ఫోన్ బూత్ నించి డైరెక్టరీ ఎంక్వయిరీకి డయల్ చేసి అడిగాడు.
‘లియోనార్డ్ క్రేమర్ ఫోన్ నంబర్ దయచేసి ఇవ్వగలరా?’
వెంటనే ఆ నంబర్‌కి డయల్ చేశాడు.
‘హలో’ అవతల నించి ఓ గంభీరమైన కంఠం వినిపించింది.
‘మీరు మిస్టర్ క్రేమరా? మీరు ఎవరైనా సరే. చెప్పేది వినండి. హూకర్స్ రిడ్జ్‌కి నిన్న సాయంత్రం నేను వేటకి వెళ్లాను. మీరు నన్ను చూడలేదు కాని నేను జరిగింది చూశాను. చెట్లలోంచి ఓ నల్ల కారు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ఓ వ్యక్తి దిగి, డిక్కీ తెరచి...’
‘ఎవరు? మీరెవరు?’ ఆ కంఠం ఆదుర్దాగా వినిపించింది.
‘నేను మీ మనస్సాక్షిని మిస్టర్ క్రేమర్. అవును. మీ మనస్సాక్షినే. నేను మళ్లీ మీకు త్వరలో ఫోన్ చేస్తాను. అప్పుడు మనిద్దరి మధ్య చిన్న లావాదేవీ జరుగుతుంది’
‘ఆగు’
బిల్లీ జో రిసీవర్ పెట్టేశాడు. నవ్వుతూ బార్బర్ షాప్‌లోకి వెళ్లి కోరాడు.
‘లూక్! చక్కగా షేవ్ చెయ్యి. నువ్వు ఎప్పుడూ చేయనంత అద్భుతంగా చేయాలి’
‘నువ్వు ఎన్నడూ ఇంత హుషారుగా కనపడలేదు. ఏం జరిగింది? యూలాకి కొత్త ఉద్యోగం వచ్చిందా? లేక నీకు కొత్త పని దొరికిందా?’
ఆ మాటలకి మరో ముగ్గురు నవ్వారు.
‘నవ్వుతూండండి. ఓ మనిషి అదృష్టం తిరిగే దాకా మీరు నవ్వుతూనే ఉంటారు’
ఆ సమయంలో క్రేమర్ ఎంత ఆదుర్దా పడుతూంటాడో కళ్లు మూసుకుని ఊహించాడు. ఎంత అడగచ్చు? తండ్రి రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి దగ్గర చాలా ఉంటుంది. పది వేల డాలర్లు అడగచ్చా? అది మరీ తక్కువా? ఏభై వేలు?
‘ఏమిటి నవ్వుతున్నావు?’ బార్బర్ ప్రశ్నించాడు.
‘నాకో ఏభై వేల డాలర్లు వస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను’
‘నువ్వు మొదటగా చేసేది నాకు తెలుసు. యూలాకి విడాకులు ఇస్తావు’
అది మంచి ఆలోచన అని బిల్లీకి అనిపించింది. యూలా తనకి విడాకులు ఇవ్వదు. క్రేమర్ తన భార్య విషయంలో ఏం చేసాడో తనూ అదే చేయాలి. కాని చక్కటి ఉద్యోగం, చక్కటి భర్తగల ఆమె అదృశ్యం అయితే తనని వదిలి వెళ్లిపోయిందని అనుకోరు. కాబట్టి అది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అవాలి. అది కూడా ఎవరూ అనుమానించని మరణం అవాలి.
‘ఏమిటి గొణుగుతున్నావు బిల్లీ’ బార్బర్ అడిగాడు.
‘ఆలోచిస్తున్నాను’
‘విన్నారా? బెల్లీ ఆలోచిస్తున్నాట్ట’
మిగిలిన ముగ్గురూ మంచి జోక్ విన్నట్లుగా పెద్దపెట్టున నవ్వారు.
ఓ రోజు తను లియోనార్డ్ క్రేమర్ కారు లాంటి కారులో ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు నవ్వుతారో వీళ్లే చూస్తారు అనుకున్నాడు.
* * *
మర్నాడు మధ్యాహ్నం బిల్లీ స్క్విరల్ గన్ తీసుకుని మరోసారి హూకర్స్ రిడ్జ్‌కి వెళ్లాడు. జాగ్రత్తగా క్రేమర్ తవ్విన చోట చూశాడు. అక్కడ మళ్లీ పూడ్చని ఖాళీ గుంటని చూసి తను ఫోన్‌లో మాట్లాడింది క్రేమర్‌తోనే అని గ్రహించాడు. ఆ శవం మాయం అయిందని తెలిసాక క్రేమర్ మొహం మాడిపోయి ఉంటుందని అనుకున్నాడు.
తర్వాతి కొద్ది రోజులు దినపత్రికని విడవకుండా చదవసాగాడు. క్రేమర్ భార్య కిడ్నాపైన వార్తలు అనేకం వెలువడ్డాయి. కిడ్నాపర్ కోరిన డబ్బు చెల్లించడానికి తన దగ్గర లేదని క్రేమర్ చెప్పాడు. ఆ వార్త క్రమంగా ముందు పేజీ నించి వెనక పేజీల్లోకి మారి సైజు కూడా తగ్గింది.
బిల్లీ ఈలోగా క్రేమర్‌కి మూడుసార్లు ఫోన్ చేశాడు. ప్రతీసారి ఊళ్లోని వేరే వేరే బూత్‌ల నించి చేశాడు. ప్రతీసారి ‘నీ మనస్సాక్షి జరిగింది నీకు గుర్తు చేస్తోంది. నిన్ను డబ్బు సిద్ధం చేసుకోమని చెప్తోంది’ అని చెప్పాడు. అవతల నించి భయంతో కూడిన మాటలు వినిపిస్తూంటే లైన్ కట్ చేశాడు.
డబ్బు గురించి అడుగుదామని అనుకున్న రోజు బార్బర్ లూక్ గడ్డం గీస్తూ ఎవరితోనో అన్న మాటలు విన్నాడు.
‘బిల్లీ దగ్గర పదివేల డాలర్లు ఉంటే ముందు పికప్ ట్రక్ బ్రేక్స్ బాగు చేయడు. కిరాయి హంతకుడ్ని నియమిస్తాడు. ఈపాటికి యూలా మరణించేది. అలా నిత్యం చాలామంది భార్యలు కారు ప్రమాదాల్లో లేదా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చో మరణిస్తూంటారు’
‘నిజమే. కాని పది లక్షల డాలర్లున్నా స్క్విరల్ గన్‌తో చంపే ధైర్యం అతనికి లేదు’ ఒకరు నవ్వుతూ చెప్పారు.
తన భార్య ఎంత గయ్యాళో ఊళ్లో అందరికీ తెలుసని బిల్లీకి తెలుసు. ఆ శనివారం మధ్యాహ్నం రెండు శనివారాల క్రితంలా కాక వర్షం పడుతోంది. వర్షం చూడగానే బిల్లీకి ఓ ఆలోచన కలిగింది. పది అడుగుల దూరంలోని మనిషి కనపడనంత దట్టంగా వర్షం కురుస్తోంది. అందరూ చూస్తూంటే ఎవరూ హత్య చేయరు.
వెంటనే ఆ ఆలోచనని అమల్లోకి తెస్తూ తన ఇంటి బయట పికప్‌ని ఆపి హార్న్ కొట్టాడు. యూలా తలుపు తెరవగానే కిటికీ అద్దం తెరచి అరిచాడు.
‘ఇక్కడికి రా. నాకు దింపడానికి సహాయం కావాలి’
‘ఏం దింపడానికి?’ యూలా అరిచింది.
‘ఇక్కడికి రా. చూపిస్తాను’
ఆమె కిటికీ తలుపు మూసేసింది. కొద్ది క్షణాలు బిల్లీ యూలా తన మాట వినడం లేదని భావించాడు. కాని యూలా రెయిన్ కోట్ తొడుక్కుని బయటకి వచ్చింది. కొన్ని ఇళ్ల కిటికీల్లోంచి కొందరు తమని గమనించచ్చని ఆశ పడ్డాడు. బిల్లీ ట్రక్‌ని గేర్లో వేసి క్లచ్‌ని వదిలి నేరుగా ఆమె వైపు పోనించాడు. యూలా తన వైపు వేగంగా వస్తున్న ట్రక్‌ని చూసి భయంతో నేలకి అంటుకుపోయింది. ట్రక్ బంపర్ ఆమెని బలంగా గుద్దటంతో ఎగిరెళ్లి పక్కన లాన్‌లో పడింది. బిల్లీ వెంటనే ట్రక్‌ని ఆపి దిగి అరుస్తూ ఆమె వైపు పరిగెత్తాడు. రక్తసిక్తమైన యూలా వెల్లకిలా పడి ఉంది. మూడు ఇళ్ల తలుపులు తెరచుకుని ముగ్గురు ఆడవాళ్లు బయటకి వచ్చారు. వారంతా సాటర్‌డే సూయింగ్ సర్కిల్ సభ్యులు.
* * *
బిల్లీ మీద సర్క్యూట్ కోర్ట్‌లో విచారణ ఆరంభం అయింది. ఆ కేసులు ఎక్కువ రోజులు సాగలేదు. ఊళ్లో జడ్జితో సహా అందరికీ యూలా గురించి తెలుసు. జూరీ సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మరణించేదాకా బిల్లీని ఉరి తీయాలి.
* * *
తన అదృష్టం ఆరంభం అవడానికి మునుపే దురదృష్టం చివరి దశలో ఉందని బిల్లీ భావించాడు. తను ఆ కేస్‌లోంచి ఎలా బయటికి రావాలా అని ఆలోచించాడు. తీర్పు తర్వాత జైలుకి తీసుకెళ్తూంటే ఆ ఆలోచన కలిగింది. క్రేమర్ తండ్రి వాషింగ్టన్ డి సిలో పెద్ద రాజకీయవేత్త. తమ రాష్ట్ర గవర్నర్‌ని తొలగించిన సమర్థుడు. ఓ కాగితం మీద అతను సంతకం చేస్తే చాలు. తనకి క్షమాభిక్ష లభిస్తుంది. అది న్యాయం కూడా. తన ప్రాణాలు. లేదా క్రేమర్ ప్రాణాలు అని చెప్పచ్చు.
ఆ రోజు బిల్లీని అతని లాయర్ వచ్చి కలిసాడు.
‘మనం పై కోర్ట్‌కి అపీల్‌కి వెళ్తున్నాం. అపీల్‌కి సంతకం చేయడానికి ఇవాళే ఆఖరు రోజు. ఇక్కడ సంతకం చేయి’ చెప్పాడు.
‘దాన్ని పక్కన పెట్టండి. నేను ఈ నిమిషమే బయటకు వెళ్లే అవకాశం ఉంది’
‘నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడంలేదు. జైల్లోంచి పారిపోయే పిచ్చి ప్రయత్నం చేయక’ లాయర్ హెచ్చరించాడు.
లాయర్‌ని ఆ చిన్న సెల్‌లోని ఓ మూలకి తీసుకెళ్లి చెవి దగ్గర నోటిని ఉంచి బయటి గార్డులు వినకుండా ఆయన ఏం చేయాలో కోరాడు.
‘లియోనార్డో క్రేమర్. అంటే గవర్నర్ థామస్ క్రేమర్ కొడుక్కి ఫోన్ చేసి...’
‘క్రేమర్?’
‘్ఫన్ చేసి మీరు ఎవరో చెప్పండి. మీ క్లైంట్ ఇబ్బందుల్లో పడ్డాడని కూడా చెప్పండి. అతనికి ఏం చెప్తారంటే... హూకర్స్ రిడ్జ్‌లోని ఓ చిన్న వివాదానికి చెందిన వాడే నీ క్లైంట్ అని చెప్పండి. అతనికి అర్థం అవుతుంది’
లాయర్ అతని వంక పిచ్చివాడి వంక చూస్తున్నట్లుగా చూస్తూ చెప్పాడు.
‘నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడంలేదు. అది మర్చిపో’
‘మర్చిపోవడమా? లియోనార్డో తండ్రి తన కొడుకు మాట విని నన్ను తప్పకుండా రక్షిస్తాడు. నేను చెప్పినట్లు చేయండి చాలు’ బిల్లీ కోరాడు.
‘నీ మనసులో ఏం ఉందో, థామస్ క్రేమర్ కొడుక్కి నీకు గల సంబంధం ఏమిటో నాకు తెలీదు. కాని నిన్న రాత్రి లియోనార్డో క్రేమర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన భార్యని చంపి హూకర్స్ రిడ్జ్‌లో పాతిపెట్టానని, మనస్సాక్షి తనని తరచు వేధిస్తూండటంతో ఆ బాధని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉత్తరం రాసి పెట్టాడు’ లాయర్ చెప్పాడు.
*