S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేస్తం.. నువ్వే సమస్తం (జూలై 30న ‘ఫ్రెండ్‌షిప్ డే’)

ఒకే ఆత్మ ఉంటుంది.. రెండు శరీరాలలో
ఒకే మాట పలుకుతుంది.. వేరువేరు గుండెలలో
***
శత్రువు ఒక్కడైనా ఎక్కువే..
మిత్రులు వందమంది ఉన్నా తక్కువే..
స్నేహబంధం గురించి, మిత్రుల గురించి ఒక్కసారైనా మననం చేసుకోనిదే ఎవరి జీవనయానమూ సాగదు. రక్తసంబంధీకుల మధ్య రాగద్వేషాలు ఉండొచ్చేమో గానీ- నిజమైన స్నేహితుల మధ్య ఎలాంటి భేషజాలు, అరమరికలు ఉండవు. స్నేహసౌధానికి పరస్పర విశ్వాసమే బలమైన పునాది. కుటుంబ సభ్యులతో, బంధుగణంతో చెప్పుకోలేని ఎనె్నన్నో విషయాలను స్నేహితులతో పంచుకోగలగడమే ‘ఫ్రెండ్‌షిప్’ గొప్పదనం. కాలమహిమ ప్రభావంతో మనిషి జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ- తరతరాలుగా ‘స్నేహం’ అనే మాట ఎప్పటికీ నిత్య నూతనమే. స్నేహం అనేది ఓ ఆధునిక భావన అని చాలామంది అనుకుంటారు. నిజానికి స్నేహబంధానికి సంబంధించిన సాక్ష్యాలు మన పురాణేతిహాసాల్లో పుష్కలంగా కనిపిస్తుంటాయి. రామాయణ, భారత గాధల్లో నిజమైన స్నేహానికి నిలువెత్తు నిదర్శనాలెన్నో మనకు కనిపిస్తాయి. పురాణాల సంగతి పక్కనపెడితే.. నేటి నవనాగరిక యుగంలోనూ ‘స్నేహసుమాలు’ ఆత్మీయత అనే సుగంధాన్ని విరజిమ్ముతూనే ఉన్నాయి. డబ్బుకే విలువనిచ్చే నేటి ఆధునిక కాలంలో కుటుంబ వ్యవస్థ కునారిల్లుతున్నప్పటికీ స్నేహబంధం మాత్రం ఇంకా పటిష్టంగానే ఉంటోంది. ఉమ్మడి కుటుంబాలు నానాటికీ అదృశ్యమవుతూ, రక్తసంబంధీకుల మధ్య మాటలు కరవై పోతున్న ప్రస్తుత రోజుల్లో- అలసిన హృదయాలకు కాస్త సాంత్వన చేకూర్చేది స్నేహబంధమే. అందుకే..
తడికన్నులను తుడిచే నేస్తానికి మించిన విలువైనదేదీ లేదు.
చెమరించిన నయనాల్లో చెదిరిపోని జ్ఞాపకం- స్నేహం
ఒడిదుడుకులలో ఓదార్పునిచ్చి ఒడ్డున చేర్చే అభయహస్తం- స్నేహం
ప్రతిఫలం ఆశించకుండా తోడై నిలిచేది- స్నేహం
హృదయాన్ని ‘స్విచ్చ్ఫా’ చేయకుండా ఉంచితే..
జీవితాంతం పనిచేసే అద్భుత ‘నెట్‌వర్క్’- స్నేహం
సంక్లిష్ట సమయంలో సపోర్ట్..
జీవితం గజి‘బిజీ’గా, యాంత్రికంగా మారిపోతూ.. కాలంతో పాటు పోటీపడి నేడు పరుగెడుతున్న మనిషికి స్నేహబంధం ఎడారిలో నీటిచెలమలా కనిపిస్తోంది. అనేకానేక సమస్యలతో సతమతమవుతూ సంక్లిష్టతను ఎదుర్కొంటున్న నేటి తరానికి స్నేహమే కాస్త ఉపశమనం ఇస్తుంది. ఒకే ఇంట్లో ఉంటున్నా కుటుంబ సభ్యులు మాట్లాడుకునేందుకు తీరిక, కోరిక లేని నేటి పరిస్థితుల్లో బాధలను పంచుకోవడానికి నేస్తం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆసరాగా నిలవనపుడు స్నేహితులు మాత్రమే అండగా నిలుస్తున్నారని నవతరం భావిస్తోంది. బాధలు చుట్టుముట్టినపుడు, భావోద్వేగాలు పెల్లుబికినపుడు- మనసు కుదుటపడాలంటే ‘నేనున్నాన’ని భరోసా ఇచ్చే స్నేహహస్తం అవసరం అని నేడు అందరూ గ్రహిస్తున్నారు. మానసికంగా కుంగుబాటుకు లోనై, నిరాశానిస్పృహలు ఆవరించినపుడు- మనం మళ్లీ ‘రీచార్జి’ కావాలన్నా, ‘రీస్టార్టు’ కావాలన్నా, ‘రిఫ్రెష్’ అవాలన్నా స్నేహం కావాలి. ఈ వాస్తవాన్ని గ్రహించే- ‘స్నేహబంధము ఎంత మధురము.. అది చెరిగిపోదు, తరగిపోదు జీవితాంతము..’ అని నేటితరం మనసారా పాడుకుంటోంది.
స్నేహబంధాన్ని గుర్తుచేసుకునేలా ఏడాదిలో ఒక రోజును ‘ఫ్రెండ్‌షిప్ డే’గా పాటించడం ఆనవాయితీగా మారింది. మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే మాదిరిగా స్నేహానికి ఉన్న విశిష్టతను చాటిచెప్పేలా ఏటా జూలై 30న ‘ఫ్రెండ్‌షిప్ డే’గా సంబరాలు చేసుకుంటున్నారు. మొదట్లో విభిన్న దేశాల్లో వివిధ తేదీల్లో ‘ఫ్రెండ్‌షిప్ డే’ను పాటించేవారు. అయితే, ఏటా జూలై 30న ‘ఫ్రెండ్‌షిప్ డే’ను జరుపుకోవాలని 2011 ఏప్రిల్ 27న ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో ఏటా జూలై 30న ‘స్నేహితుల దినం’ పాటించడం సంప్రదాయంగా మారింది. స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటూ కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది అమెరికాలో 1919లోనే మొదలైంది. ఆ దేశంలో 1935లో ఆగస్టులో మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్ డే’గా పాటిస్తూ తొలిసారిగా అట్టహాసంగా వేడుకలు జరిపారు. కాలగతిలో ఈ సంబరాలు అనేక దేశాలకు విస్తరించడంతో నేడు ప్రపంచ వ్యాప్తంగా ‘ఫ్రెండ్‌షిప్ డే’ను పాటిస్తున్నారు. స్నేహితులను నిత్యం కలుసుకోవడం, పలకరించడం సాధ్యం కాకపోవచ్చు. కనీసం ఏడాదిలో ఒకరోజైనా స్నేహబంధాన్ని గుర్తుకు తెచ్చుకునేందుకే ‘ఫ్రెండ్‌షిప్ డే’ను పాటించాలని ఆధునికులు చెబుతుంటారు. ఈ రోజున ఆత్మీయ స్నేహితులను కలుసుకోవడం, శుభాకాంక్షలు తెలపడం, విందులు చేసుకోవడం, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను చేతులకు కట్టడం.. ఇలా కొత్తకొత్త పోకడలు చోటుచేసుకున్నాయి. అందుబాటులో ఉండే స్నేహితులైతే స్వయంగా కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. ఎక్కడో దూరతీరాల్లో ఉంటున్న వారికి ఎస్‌ఎంఎస్‌లు, ఇ- కార్డులు, నెట్ చాటింగ్ వంటి ప్రత్యామ్నాయాలెన్నో ఉన్నాయి.
ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్
ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు వచ్చాక ఆన్‌లైన్ ఫ్రెండిషిప్ అన్న ట్రెండ్ మొదలైంది. ఇందులో లింగ, మత, వర్ణ వివక్ష ఏమీ లేదు. నిజానికి ప్రత్యక్షంగా కలుసుకునే స్నేహితుల మధ్య కన్నా ఆన్‌లైన్ స్నేహితుల మధ్య జరిగే సంభాషణల్లో నిజాయితీ, రహస్యాలు దాచుకోకపోవడం, చివరకు తమ జీవితాల్లోని లైంగిక రహస్యాలను వెలిబుచ్చుకోవడానికీ వారు వెనుకాడటం లేదట. ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్‌తో మనసులో దిగులు పోగుట్టుకుంటున్నవారి సంఖ్య దాదాపు 65 శాతం ఉంది. ఆన్‌లైన్ ఫ్రెండిష్‌లో గుట్టు అంటూ లేకపోవడంవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి సంఖ్య చాలాస్వల్పమట.
ఆ రోజున ఏం చేద్దాం?
ఎంతటి ఆప్తమిత్రులైనా రోజూ కలుసుకోవడం అనేది నేటి ఆధునిక యుగంలో సాధ్యం కానిపని. యాంత్రికత పుణ్యమాని కాలంతో పోటీపడి పరుగులు తీసే నేటి రోజుల్లో ‘ఫ్రెండ్‌షిప్ డే’ నాడైనా స్నేహితులను కలుసుకుని అలనాటి ముచ్చట్లను గుర్తుకుతెచ్చుకుంటే ఆ అనుభూతే వేరు. ఈ ఒక్కరోజైనా ‘బిజీ లైఫ్’ను కాస్త పక్కన పెట్టి మిత్రుల కోసం సమయాన్ని కేటాయించాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ- ట్యూబ్, ఐపాడ్, ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్, ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌లు, ఇయర్ ఫోన్లకు ఈ ఒక్కరోజైనా విరామం ఇచ్చి స్నేహితుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించాలి. స్నేహితులతో మార్నింగ్ వాక్‌కో, షికారుకో వెళ్లాలి. ఇంట్లోనో, హోటల్‌లోనో విందు ఇచ్చి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేయాలి. స్నేహితులు మన సమీపంలోనే ఉంటే ప్రత్యక్షంగా కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ‘ఊహించని కానుకలు’ ఇచ్చి స్నేహితులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలి. పుష్పగుచ్చాలు, మిఠాయిలు, చాకొలెట్లు, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు వంటివి ఇక ఉండనే ఉన్నాయి. *

స్నేహానికి మూలం ఎక్కడ..?
మనిషి మనసు భావోద్వేగాలకు, రాగద్వేషాలకు నిలయం. మరి- ఇలాంటి మనసులో స్నేహభావం ఎలా చిగురిస్తుంది? కొందరిని చూస్తే ఎందుకో ప్రేమించాలని అనిపిస్తుంది.. ఇంకొందరిని చూస్తే అసూయ, ద్వేషం కలుగుతాయి.. నిరంతరం ఆలోచనలు సుడులు తిరిగే మనిషి మెదడులో స్నేహబంధానికి బీజం ఎలా పడుతుంది..? స్నేహానికి దారితీసే కారణాలు ఎనె్నన్నో.. అవి పరిశోధకుల అధ్యయనానికి సైతం అంతుబట్టవేమో..? స్నేహభావాన్ని ప్రేరేపించేలా మెదడులో ఆలోచనల పొరలను కదిలించే రసాయనాలుంటాయా..? ఒకే రకమైన భావజాలానికి చెందిన వ్యక్తుల్లో సారూప్యతే స్నేహబంధం అల్లుకునేలా చేస్తుందా..? శాస్తప్రరిశోధనలు, అధ్యయనకారుల విశే్లషణల సంగతెలా ఉన్నా- స్నేహం అనేది ముమ్మాటికీ మనసుకి, మెదడు పొరల్లో ఆలోచనలకు సంబంధించినదని సూత్రీకరించవచ్చు. చిన్ననాటి స్నేహితులు ఒక్కసారి ఎదురైనపుడు మనసు పొరల్లో ఇన్నాళ్లూ నిక్షిప్తమైన జ్ఞాపకాలు ఒక్కసారి ఉబికి బయటకు వస్తాయట! అందుకే- బాల్యస్నేహాలు చెక్కుచెదరనివని చెబుతుంటారు. స్నేహబంధాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటే ‘ప్రాణస్నేహితుల’ని అభివర్ణిస్తుంటారు.

ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ఘన చరిత్ర..
స్కూలు పిల్లల దగ్గర నుంచి కాలేజీ యువత వరకూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను చేతికి ధరించడం ఇపుడు సర్వసాధరణమైంది. విభిన్న రంగులు, వివిధ ఆకారాల్లో లభిస్తూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సంతరించుకుంటున్న ఈ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లకు ఘనమైన చరిత్రే ఉంది. క్రీస్తుపూర్వం 481లోనే ఇవి చైనాలో రంగప్రవేశం చేశాయని, 13వ శతాబ్దంలో అరేబియన్లు దారంతో పలురకాలుగా ముడులు వేసి వీటిని తీర్చిదిద్దేవారని చరిత్రకారులు చెబుతుంటారు. ఒకప్పుడు సముద్రంలోకి వెళ్లే నావికులు వివిధ రకాలుగా ముడులు వేసి ఈ బ్యాండ్‌లను అల్లుతూ తమ స్నేహితులకు ఇచ్చేవారట. ఆ తర్వాతి కాలంలో ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలో ఇవి జనాదరణ పొందాయి. నేటి ఆధునిక యుగంలోనైతే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ల పోకడలకు అంతేలేకుండా పోతోంది. వీటికి సంబంధించిన రంగులు విభిన్న భావాలను తెలియజేస్తాయని చాలామంది నమ్ముతారు. ఉల్లాసానికి పసుపు, బాధ్యతకు ఆకుపచ్చ, బలానికి నలుపు, దయాగుణానికి గులాబీ, నిజాయితీకి ఎరుపు, శక్తికి ఆరంజ్, నమ్మకానికి నీలం రంగు.. ఇలా ఒక్కోరంగు ఒక్కో భావానికి ప్రతీకలుగా విశ్వసిస్తూ ‘ఫ్రెండ్‌షిప్ బ్యాండ్’లను స్నేహితుల చేతికి కట్టడం ఓ సంస్కృతిగా మారింది.

జీవన వికాసానికి.. ‘విటమిన్- ఎఫ్’ (ఫ్రెండ్‌షిప్ అనే విటమిన్)
అవసరం

* కొంత వయసు వచ్చాక స్నేహితుల సంఖ్య స్థిరంగా ఉంటుందని తేలింది. కొత్తస్నేహితులు మన జీవితంలోకి వచ్చాక పాతవారిలో ఇద్దరిని దూరం చేసుకుంటామని పరిశోధనలు చెబుతున్నాయి.
* మనుషుల్లాగానే జంతువులకూ స్నేహబంధం ఉంటుందని మరో పరిశోధనలో తేలింది. ముఖ్యంగా చింపాంజీ, బబూన్, గుర్రాలు, హైనా, గబ్బిలాలు, ఏనుగులు, డాల్ఫిన్‌లలో స్నేహబంధం ఉంటుందట. ఇది పరిశోధనల్లో తేలిన అంశం.
* స్నేహితులు లేనివారికన్నా ఉన్నవారి ఆరోగ్యం 50శాతం మెరుగ్గా ఉందని, వారికి స్నేహితులనుంచి లభించే సాంత్వన, భరోసా ఈ పరిస్థితికి కారణమని బ్రిగ్‌హామ్ యంగ్ యూనివర్శిటీ పరిశోధనల్లో తేలింది.
మంచి స్నేహితులున్నవారి జీవితకాలం ఎక్కువగా ఉందని వారు నిరూపించారు.

-పి.ఎస్.ఆర్.