S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహావిజేత 12

30
మహారాజు అగ్నివర్మ సమక్షంలో చర్చ సాగుతున్నది.
‘మహారాజుగారి పాత్రను ఇలా తక్కువ చేస్తూ పోతే, మీరూ మేమూ కూడా అధికారుల దృష్టిలో చులకనై పోతామని నా బాధ’ తన మాటల బాణాల్ని వదిలాడు దుష్టబుద్ధి. ప్రసేనుడూ వంత పలికాడు.
ఈ మాటలలోగల ఆంతర్యాన్ని పసిగట్టారు గాలవులు. తన మనసు విప్పారు.
‘చంద్రహాసుడు అసామాన్య శౌర్య ప్రతాపాలతో దీప్తిమంతుడైనాడు. అతని చర్యల్నీ, ప్రతిచర్యల్నీ అన్నింటినీ ప్రజలు మెచ్చుకోవటమే కాక, అతని కోసం ఏ త్యాగాన్ని చేయటానికైనా సంసిద్ధులుగా ఉన్నారు. అడివప్ప నేతృత్వంలో సుశిక్షితులైన యుద్ధ విద్యా నిపుణులు, యువకులు అతనికి అండగా ఉన్నారు. ఈనాటి కళింద్ర సంగతి మీకు కొంతే తెలుసు’ అని ఆగి అందరినీ పరీక్షగా చూసి, ‘కీడెంచి మేలెంచమంటారు. చంద్రహాసుని తేకువతో, వీకతో కళింద్ర వారికి స్వాతంత్య్ర వాంఛ కలిగితే...’ అని క్షణం ఆగి ‘ఆలోచించండి..’ అని ఆపేశారు.
గాలవుల భాషణలోని తీవ్ర స్వరాన్ని గుర్తించి నివ్వెరపోయారు ప్రభువూ, చంపకమాలినీ. ఆయన ముందు చూపులో ధ్వనిస్తున్న జాగ్రత్తకి విస్మయం కలిగింది.
కొంత సమయం గడచిన తర్వాత ‘ఎదిరిని ఇరకాటంలో పెట్టడానికి పూనుకునే ముందు మన ఉచ్చుల్లో మనమే చిక్కుకునే పరిస్థితి రాకూడదు గదా! మీవంటి ధీమంతులకు నేను చెప్పేదేముంది అమాత్యా’ అన్నారు గాలవులు.
ఇప్పుడాయన పలుకుల్లో మార్దవం తొణికింది. హితోక్తి కదిలింది. అమాత్యుని ప్రజ్ఞ మీద ప్రశంసా ముందుకు వచ్చింది!
దుష్టబుద్ధికి గ్రుడ్లు తిరిగి, గుటక పడలేదు.
కొద్దిసేపటికి ఆ సమావేశం ముగిసింది.
దుష్టబుద్ధి పరిస్థితీ, ప్రసేనుడి దుస్థితీ - ‘మింగలేక కక్కలేక’ అన్నట్లున్నది. ఈదురుగాలికి, అందునా - ఎదురుగాలిలో నడుస్తున్నట్లున్నది!
31
సూర్యాస్తమయమై చాలాసేపు గడిచింది.
దుష్టబుద్ధి మందిరం. ఆయన పక్కగా ప్రసేనుడు.
ఉన్నట్టుండి ‘మహామాత్యా! నాదొక యోచన’ అన్నాడు ప్రసేనుడు. ‘చెప్పు’ ‘కరద మండలంలో శంబరుడు అని నాకొక మిత్రుడు ఉన్నాడు. అతనికి గిరిజనులలో ఒక వర్గం వారిపై మంచి పట్టు వున్నది. నేను అతనితో వ్యవహరించి చాలా కాలమైనా, స్నేహధర్మంగా అతను మనకు సహకరించవచ్చు...’
‘ఏ విధంగా?’ కొసచూపుతో అడిగాడు దుష్టబుద్ధి.
‘కరద మండలంలో నెమ్మదిగా తిరుగుబాటుని ప్రోత్సహిద్దాం. ఆ అగ్నికి కొన్ని సమిధల్ని చేకూర్చుదాం’
‘ఏ మార్గంలో?’
‘తమ వర్గం పట్ల చంద్రహాసుని విధేయులు వివక్ష చూపుతున్నారనీ, తమను అణచివేస్తున్నారనీ, భావోద్వేగాల్ని ప్రకోపింపజేయిద్దాం. చెప్పగా చెప్పగా అగ్గిరాజుకుంటుంది. అదేగాక, శంబరునికి ఒక ముఖ్య పదవిని ఎరగా వేద్దాం. జనంలో బలహీనమనస్కులూ, ఉద్రేకపరులూ ఎప్పుడూ ఉంటారు. అలాంటి ఒకరిద్దరి ఆత్మత్యాగాన్ని సాధించమని సూచిద్దాం. అది ఆందోళనని దురాందోళనగా మారుస్తుంది. అలజడి తీవ్రమవుతుంది’ అని ఆగి, ‘ఆలోచించండి. మీ యుక్తితో ఈ పథకాన్ని పటిష్టంగా రచించగలరు మీరు’ అన్నాడు.
దుష్టబుద్ధికి ప్రవాహంలో గడ్డిపోచ దొరికినట్లయింది.
ఇంతలో - విషయ రాకను సూచిస్తూ సందేశాన్ని తెచ్చాడు ప్రతీహారి.
ఆమెకూ, మదనునికీ తండ్రి మందిరంలోకి రాకపోకలకు ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదు.
ఆమెని చూస్తూ ‘రామ్మా’ అన్నాడు అమాత్యుడు.
‘స్వాగతం. అమాత్య పుత్రీ...’ అన్నాడు ప్రసేనుడు.
ఆమె వచ్చి కూర్చుంది. వారిరువురి ముందు గల సంభారాన్ని చూసి ముఖం చిట్లించుకుంది. ‘నాయనగారికి వారి ఆరోగ్యం దృష్ట్యా ఈ మధుసేవనాన్ని ప్రోత్సహించకండి సేనానిగారూ. మా కోరికని మన్నించండి’ అన్నది.
ప్రసేనుడు కళవళ పడి ‘లేదు తల్లీ లేదు. కేవలం మేము ఫలరసాల్నే సేవిస్తున్నామమ్మా’ అన్నాడు దోషరాహిత్యాన్ని వక్కాణించుకుంటూ.
‘ఏమో... ఎన్నిసార్లు వారించగలను నేను’ అన్నది కొంచెం విసుగుతో.
‘ఈ పిల్ల నేర్పులాడి. జాణ. ఇంతకన్న ఎక్కువ మాట్లాడటం శ్రేయస్కరం కాదు’ అనుకున్నాడు సేనాని. మిన్నకున్నాడు.
ఆమె తాను వచ్చిన పనిని తెలిపింది. ‘మీకు తెలుసు కదా నాన్నగారూ.. రాబోయే భాద్రపద, ఆశ్వయుజాలలో గణపతి ఉత్సవాలు - దేవీ ఉత్సవాలు జరుగుతాయి కదా - కృష్ణానదీ, కొయ్‌నా నదీ కలిసేచోట ‘ప్రీతీసంగం’లో. అట్లాగే కరద మండలంలో కొన్ని గుహలు కూడా దర్శనీయంగా ఉంటాయట. ఉత్సవ సందర్భంలో అక్కడ ఏనుగుల సంత కూడా జరుగుతుందట. దానికి తోడు ఇప్పుడు కళింద్ర మహా మండల భాగమైన అష్టమండలంలో అష్టలింగ ఆలయాలు ఎంతో ప్రత్యేకత కలిగినవట. సాక్షాత్తూ శ్రీరాముడే వాటిని ప్రతిష్ఠించాడని ప్రతీతి కదా. వాటినీ దర్శించవచ్చు. ఆ మండలంలోనే చౌండేశ్వరీదేవి ఉత్సవం మహా వైభవంగా జరుపుతారుట - భక్తులు. రాకుమారీ, విరజా, నేనూ, మా వయస్యల బృందం అందరమూ కలిసి ఈసారి ఆ ఉత్సవాలను తిలకించాలని నిర్ణయించుకున్నాము. మాతో మదనుడూ, ప్రసేనుల వారి కుమారుడు వజ్రసేనుడూ కూడా వస్తారు. మా యాత్రకు ఏర్పాట్ల సంగతి చూడటానికి ఎటూ ప్రసేనుల వారు ఉండనే వున్నారు. మీరు మహారాజుగారికి చెప్పి అనుమతి తీసుకోవాలి’
దుష్టబుద్ధీ, ప్రసేనుడూ ఒకరినొకరు చూసుకున్నారు.
‘సరి. నేను మాట్లాడుతాను’ అన్నాడు దుష్టబుద్ధి.
‘నిర్ణయాన్ని త్వరగా తెలిపితే మా ప్రయత్నంలో మేము ఉంటాము’ తండ్రిని వేగిరపెడుతూ అన్నది విషయ.
‘బాగుంది’ అన్నాడు ప్రసేనుడు.
‘ఏం బాగుంది?’ దుష్టబుద్ధి కించిత్ వెటకారంగా అన్నాడు.
ప్రసేనుడు నొచ్చుకున్నాడు.
‘చాలా సమయం ఉంది తల్లీ. తప్పక వెళుదురుగాని’ కూతుర్ని చూస్తూ ఆప్యాయంగా అన్నాడు దుష్టబుద్ధి.
విషయ వెళ్లిపోయింది.
ఆ వెంటనే ప్రసేనుడూ లేచాడు.
‘కూర్చోండి ప్రసేనా!’ అని పానపాత్రని చేతపట్టాడు. ప్రసేనుడు కూర్చున్నాడు.
‘వీరందరి యాత్రా మనకే విధంగానైనా ఉపయోగిస్తుందేమో - ఆలోచించండి’ కొంత తడవు ఆగి, ‘రాచకుటుంబం వారి విహార యాత్ర నిర్వహణ కళింద్ర వారి నెత్తిన పెట్టి...’ అని నసిగాడు ప్రసేనుడు.
‘ఊఁ.. పెడితే’ ఉత్సుకతతో రెట్టించాడు దుష్టబుద్ధి.
‘తర్వాత దాని వైఫల్యానికి పథకం వేయవచ్చు’
ప్రసేనుడి మాటలు విని నిశితంగా అతని కళ్లల్లోకి చూశాడు దుష్టబుద్ధి. వౌనంగా దీర్ఘాలోచనలోకి దిగాడు. చాలా సమయం నిశ్శబ్దంలోనే గడిచింది. ‘మీ ఆలోచనని మీరు కొనసాగించండి. ఏ దిశగా ముందుకు వెళ్లగలమో నేనూ యోచిస్తాను’ అని లేచాడు దుష్టబుద్ధి.
‘ఒక కొస అందింది. రెండవ కొసని పట్టుకోవాలి’ అని పైకి అనుకున్నాడు. ‘అవు’నంటూ నిష్క్రమించాడు ప్రసేనుడు.
32
నింగి నుంచీ వానతీగలు వేలాడుతున్నై.
‘వాటిని పట్టుకుని ఆకాశానికి ఎగబ్రాకితే!’ చిత్రమైన ఊహ! చేతులతో వర్ష బిందువుల్ని ప్రిదుల జేస్తున్నది విషయ. చిన్ననాటి ఆట అది. ఆ ఆనందహేల ఆమెకు నూతనోత్సాహాన్ని కూరుస్తున్నది.
మధుర భావనలతో మనసు మురుస్తున్నది. ప్రియుని సహితంగా ఈ నవ వర్ష ప్లావితాన్ని ఆనందించగలిగితే? - హృదయాంతరాలలో ఒక చిలిపి ఊహ.
‘ఉన్నట్టుండి తన మదిలో ఈ ఊహలు ఎందుకిలా పరుగులు తీస్తున్నై?’ అనిపించింది విషయకు. బహుశ ఈ రోజు నాన్నగారు ఆంతరంగిక మందిరంలోని సంఘటనే కారణమేమో - అనుకున్నది. సిగ్గు కలిగింది. ఆ సంఘటన మనసులో మెదిలింది.
కరద నుండి వచ్చిన శంబరుడూ, ప్రసేనుడూ, అమాత్యులూ - ముగ్గురూ సంభాషించుకుంటున్నారు. తాను వింటూ కూర్చున్నది.
ఆ సంభాషణ ఆది మధ్యాంతాలన్నీ ‘చంద్రహాసుడు’ అనే కుళిందకుని స్వీకృత పుత్రుని గురించే! శంబరుని నోట వచ్చిన ప్రతి పలుకూ, ప్రతి వర్ణనా తాను విన్నది. ధైర్య, సాహసాలలో అతన్ని ఇంద్ర వరప్రసాదిగా చెప్పుకోవచ్చునట!

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600