S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అదొక ప్రపంచం

మరో ప్రపంచం పిలిచింది అన్న శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ పుట్టినరోజు, గిట్టిన రోజు గడచిన రెండు మూడు నెలల్లోనే జరిగాయి. ఆయన చెప్పిన మరో ప్రపంచం ఎలాగుంటుందో కానీ రచయితలు, కవులు మాత్రమే బతికేది ఒక ప్రపంచం ఉంది. అది ఒక ప్రపంచం. అంటే అదో ప్రపంచం. అంటే అదొక ప్రపంచం. మొత్తానికి ఆ ప్రపంచంలోకి చాలామంది తొంగి చూడరు. నేనూ అంతో ఇంతో రచయితను కనుక నాకు అందులోకి వీసా దొరుకుతుంది. ఈ మధ్యన మరింత ఎక్కువగా దొరుకుతున్నది.
నా ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉన్నాయి. అయినా నాకు ఒకనాడు సగటున రెండు మూడుకన్నా ఎక్కువ కాల్స్ రావు. నేను చేసే కాల్స్ అంతకన్నా తక్కువగా ఉంటాయి. వచ్చే కాల్స్ మాత్రం నిజంగా పనికివచ్చేవిగా ఉంటాయని వేరుగా చెప్పనవసరం లేదు. ఆ మధ్యన ఒక కాల్ వచ్చింది. ఫోన్‌లో శివరాజు సుబ్బలక్ష్మి అని పేరు కనిపించింది. ఎవరావిడ అని అడిగేవారికి వంద నమస్కారాలు. ఆమె తమకు తాముగా చిత్రకారిణి, రచయిత్రి, కవయిత్రి కూడా. ఆమె ప్రస్తుత వయసు 91 సంవత్సరాలు. సెలబ్రిటీ భార్యాభర్తల గురించి సిద్ధాంతాలున్నాయి. ఆమెను అందరూ బుచ్చిబాబుగారు భార్య అని మాత్రమే చెపుతుంటారు. ఇంతకూ ఎవరు ఈ బుచ్చిబాబు అని అడిగే వాళ్లకు కూడా నా నమస్కారాలు. నా పేరులో కూడా బుచ్చి అన్న మాట ఉంది. నేను కూడా బుచ్చిబాబు గారిలాగే రేడియోలో ఉద్యోగం చేశాను. అయితే నాకు, ఆయనకు పరిచయం కలిగే అవకాశమే లేకపోయింది. ఒక నవలతోనే (చివరకు మిగిలేది) గొప్ప పేరు సంపాదించుకున్న ఆ రచయిత కథలు మరీ బలమయినవి. ఆయన చిత్రకారుడు కూడా. సాహిత్య పరిశోధకుడు, అంతర్జాతీయ సాహిత్య పాఠకుడు. ఇలా ఎన్ని లక్షణాలయినా చెప్పవచ్చు. మొత్తానికి గడిచిన సంవత్సరం ఆయన పుట్టి నూరేళ్లయినందుకు శతాబ్ది వత్సరంగా సాగింది. ప్రారంభ సమయంలో అంటే ఏడాది క్రితం జరిగిన కార్యక్రమంలో బుచ్చిబాబు గురించి ఉపన్యసించే అవకాశం నాకు దక్కింది. అప్పట్లో సుబ్బలక్ష్మిగారు ఒక సమావేశాన్ని బెంగుళూరులో ఏర్పాటు చేశారు. ఆమె తమవారితో అక్కడ ఉండడం మాత్రమే అందుకు కారణం. కానీ బుచ్చిబాబు అభిమానులు జంట నగరాలలో ఎక్కువగా ఉన్నారు కనుక సమాపన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో చేయాలని ఆవిడకు ఆలోచన వచ్చింది. కార్యక్రమానికి నన్ను పిలవడానికని ఆమె ఫోన్ చేశారు. ఇక నేను వెళ్లకుండా ఉండగలనా?
చిత్రం ఏమిటంటే సుబ్బలక్ష్మిగారితో నాకు గత కొన్ని సంవత్సరాలుగా మాత్రమే పరిచయం. ఎప్పుడూ మేము వ్యక్తిగతంగా కలిసింది లేదు. పరిచయం ఫోన్‌లోనే కొనసాగింది. బుచ్చిబాబుగారు స్వయంగా అనువాదం చేసుకున్న కథలను సేకరించే ప్రయత్నం నేను చేశాను. మరికొన్ని కథలను నేను అనువదించాలని, వాటిని పుస్తకంగా వేయాలని సుబ్బలక్ష్మిగారి కోరిక. అది బహుశా త్వరలోనే తీరుతుంది.
తెలుగు యూనివర్సిటీలో శత జయంతి కార్యక్రమం సమాప్తి సభకు చాలా ముందుగా వెళ్లాను. సహజంగానే సుబ్బలక్ష్మిగారు కూడా ముందే వచ్చి ఉన్నారు. వెళ్లి నమస్కరించాను. పేరు చెప్పుకున్నాను. పండులాంటి ఆమె ముఖంలోకానీ, మరే రకంగా గానీ వయసు జాడ కనిపించలేదంటే నమ్మండి. ఆమె నడి వయసు మనిషిలాగ నవనవలాడుతూ ఉన్నారు. ఆ చక్కనమ్మకు దిష్టి తగలకుండా ఉండునుగాక! ఆమె కలకాలం బతుకునుగాక! మళ్లీ ఒకసారి ప్రణాళిక గురించి జ్ఞాపకం చేసుకున్నాము. ‘ఆ పనేదో నేను పోయేలోగా జరగాలి నాయనా’ అన్నారు ఆమె. నాకు కళ్లనీళ్ల పర్యంతమయింది. ఆ పెద్ద మనిషి నేను వెళ్లినప్పుడు లేచి నిలబడ్డారు. మరీ పెద్దమనిషి, పడిపోతారేమోనని నేను ఆమెను పొదివి పట్టుకున్నాను. ఆమె కూడా నన్ను అంత ఆప్యాయంగాను చుట్టుకున్నారు. ఆ దృశ్యం ఆప్యాయతకు గుర్తుగా కనిపించిందేమో. వాళ్ల మనవడు పరుగెత్తుతూ వచ్చి ఫొటోలు తీశాడు. కార్యక్రమం చాలా బాగా నడిచింది. ఆ అదో ప్రపంచం ఎలాగుండాలో అలాగే ఉంది. హాలు నిండా అదో ప్రపంచం పౌరులే. అందరూ కలం బలం గలవారే.
అక్కడ ఉండగానే నాకు మరొక వార్త తెలిసింది. కృష్ణమోహన్‌గారు పోయారు. అయితే ఏమిటట? ఆయనెవరు అని మీరడిగితే ఆశ్చర్యం లేదు. ఎవరికీ తెలియకుండా సాహిత్య సేవ చేసిన మనిషి ఈ ప్రొఫెసర్ కృష్ణమోహన్. ఆయన గురించి లోకాభిరామంలో ఒకప్పుడు నాలుగు మాటలు చెప్పినట్టున్నాను. కానీ కృష్ణమోహన్ గారి గురించి మొత్తం ఒక పుస్తకం రాయవలసిన అవసరం ఉంది. ఆయన కోసమయినా నేను ఒకసారి జకార్తాకు వెళ్లి రావలసి ఉంది. ఆయన ఎప్పుడూ ఆ నగరాన్ని జకార్తా అనలలేదు. ప్రతిసారీ యోగ్యకర్త అని మాత్రమే అనేవారు.
పందిరి కృష్ణమోహన్‌గారు అమెరికాలో చదువుకున్నారు. అక్కడే కలకాలం పని చేశారు. కానీ చివరి రోజులు మాత్రం భారతదేశంలో గడపాలని వచ్చేశారు. ఆయన బాపూజీ శాంతి సిద్ధాంతం గురించి పరిశోధన పత్రం రాసి పి.ఎచ్‌డి పట్టా పొందారు. ఆ పుస్తకం అచ్చయ్యింది కూడా. అందుకు జితేంద్రబాబు కారణం. కృష్ణమోహన్‌గారు గత కొన్ని రోజులుగా బెంగుళూరులో ఒక ఆసుపత్రిలో ఉన్నారని తెలుసు. నేను ఈ మధ్యనే బెంగుళూరు వెళ్లి వచ్చాను కూడా. మరి ఎందుకని కృష్ణమోహన్‌ను కానీ, సుబ్బలక్ష్మి గారిని కానీ కలవడానికి ప్రయత్నించలేదు. నా దగ్గర జవాబు లేదు. ఉండి చెప్పినా బాగుండదు. కృష్ణమోహన్‌ను కలవడానికి ప్రయత్నించక పోవడంలో అర్థం ఉంది. ఆయనకు జ్ఞాపకశక్తి పూర్తిగా నశించిందని తెలుసు. నేను వెళ్లినా గుర్తించరని తెలుసు. కాళన్న అనే కాళోజీ నారాయణరావు విషయంలో ఇదే జరిగింది. వెళ్లి పలకరిస్తే బాధగా ఒక నవ్వు నవ్వి ‘ఎవ్వరు యాదికి వస్తలేరు’ అన్నారాయన.
కృష్ణమోహన్‌గారి తండ్రి పందిరి మల్లికార్జునరావుగారు. ఆయన గత శతాబ్ది రెండవ సగంలో కినె్నర అనే సాహిత్య పత్రికను నడిపించారు. పందిరి కుటుంబం వారు కులవృత్తిగానే వ్యాపారం చేసేవారు. అయితే ఆసక్తి కొద్దీ అదో ప్రపంచం లేదా అదొక ప్రపంచంలోని వారు. మల్లికార్జునరావుగారి ఇల్లు మద్రాసులో సాహిత్య కేంద్రం. ఆ రోజుల్లోని పండితులు, కవులందరూ అక్కడికి తప్పకుండా వచ్చేవారు. మల్లికార్జునరావు గారు కెమిస్ట్రీ గురించి ముక్క కూడా తెలియకుండా ఒక చక్కని తల నూనె ఫార్ములా తయారుచేశారు. అది ఆ కాలంలో బాగా అమ్ముడయింది. వచ్చిన లాభాలతో ఆయన సాహిత్య పత్రికను నడిపించారు. ఈ విషయాలను గమనిస్తే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి అమృతాంజనం, భారతి పత్రిక గుర్తుకు రాక తప్పవు. కినె్నరలో అలనాటి పెద్దలందరూ విలువయిన వ్యాసాలు రాశారు. కృష్ణమోహన్‌గారు ఆ వ్యాసాలన్నింటినీ ఏడెనిమిది సంపుటాలలో విషయం ప్రకారం విడదీసి అచ్చువేశారు. ఆ పుస్తకాల కంపోజింగ్ జరుగుతున్న సమయంలోనే నాకు వారితో పరిచయమయింది. పుస్తకాల తయారీ విషయంగా నేను చేసిన సలహాలు ఏమిటో నాకు నిజంగా గుర్తు లేవు. అయినా అన్ని సంపుటాలలోను మొదటి పుటల్లోనే పెద్దవాళ్ల సరసన నా పేరు కూడా వేయడం కృష్ణమోహన్ గారి పెద్ద మనసుకు నిలువెత్తు నిదర్శనం.
అచ్చయిన సంపుటాలను నిజంగా సాహిత్య రంగంలో కృషిచేసే కొంతమంది పెద్దలకు ఇవ్వాలని, విశ్వవిద్యాలయాలు, మరిన్ని సంస్థల గ్రంథాలయాలకు కూడా ఇవ్వాలని పథకం వేశాము. రకరకాల కారణాలుగా ఆ పని ఇంకా మిగిలే ఉంది. వాటిని సరైన చోటికి అందించే విధంగా నేను కొన్ని సలహాలు చేశాను. కృష్ణమోహన్ ఒప్పుకున్నారు. ఈలోగా వారి ఆరోగ్యం పాడయింది. పుస్తకాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కృష్ణమోహన్ లేరు. పుస్తకాలు ఆయన ఉద్దేశం ప్రకారం తగిన చోటికి అందాలి. అందుకొరకు ప్రయత్నం బహుశా నేను మొదలుపెట్టాననే అనుకుంటాను.
మల్లికార్జునరావుగారి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. పేరున్న ఒక వ్యక్తి ఒక చిన్న పుస్తకం రాశారు. అది ఆ వ్యక్తిత్వానికి న్యాయం చేకూర్చలేదని నేనన్నాను. నిజంగా మా నాన్నగారి గురించి మంచి పుస్తకం రావాలి, అది మీరే రాయాలని కృష్ణమోహన్ అన్నారు. ప్రఖ్యాత వ్యక్తి ఒకరు రాసిన వ్రాతప్రతి ఒకటి నాకిచ్చారు. అది కూడా ఆహా ఓహో పద్ధతిలో సాగింది తప్పిస్తే మల్లికార్జునరావుగారి గురించి అందులో విశేషాలు లేవు. ఇప్పుడు నేను పుస్తకం రాయడానికి పూనుకుంటే విషయాలు చెప్పడానికి కృష్ణమోహన్ ఏరి? అదో ప్రపంచంలో ఎవరికయినా పందిరి వారి గురించి తెలుసా?

కె.బి. గోపాలం