S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యువ సామాజ్య్రంలో జనజంఝాటం (జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం)

భూగోళంపై మానవాళి మనుగడ రోజురోజుకీ కష్టమైపోతోంది. జనవిస్ఫోటనమే అందుకు కారణమని దశాబ్దాల క్రితమే నిర్ధారించారు. అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న జనాభా అన్ని అనర్థాలకు మూలకారణం. జనసంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంవల్ల ఆర్థిక, సామాజిక, వైద్యఆరోగ్య రంగాల్లో ప్రజల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. పేదలు తట్టుకోలేని కష్టాల్లో కూరకుపోతూంటే సంపన్నులు మరింత ఎదుగుతున్నారు. ఇతర గ్రహాల్లో మానవ మనుగడకు అవకాశాలపై పరిశోధనలు చేస్తున్న నేటి తరం...్భగోళంపై బతుకుతున్న ప్రజల జీవనప్రమాణాల పెంపుపై దృష్టి సారించడం లేదు. అయితే ఇప్పుడు ఒక ఆశారేఖ కన్పిస్తోంది. ప్రస్తుత జనాభాలో 52 శాతం యువతే ఉన్నారు. అంటే పది నుంచి 26 సంవత్సరాల లోపు వారన్నమాట. ఉన్నత ఆశయాలు, లక్ష్యాల నెరవేర్చడానికి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఈ శక్తి అతిపెద్ద వనరు. అందుకే అద్భుతాలు సాధించే శకం ఆరంభమైందని చెప్పొచ్చు. జనాభా పెరుగుదల, అదుపు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఎప్పుడూ చెప్పే అంశాలు అందరికీ తెలుసు. కానీ మనకెందుకులే అన్న ఉదాసీనతే ముప్పు తెచ్చిపెడుతోంది. ఆ ఉదాసీన వైఖరిని తుదముట్టించి జనాభా అదుపుపై ప్రజాచైతన్యానికి ఊపిరిలూదేందుకే ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో భాగమైన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కార్యక్రమం సభ్య దేశాల్లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకోవడం అవసరం.
* * *
క్రీ.శ. 1000 సంవత్సరంలో కేవలం 4 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఆ సంఖ్య రెట్టింపవడానికి సుమారు 750 సంవత్సరాలు పట్టింది. 1804నాటికి 100 కోట్లకు, 1927నాటికి 200 కోట్లకు, 1960 నాటికి 300 కోట్లకు, 2000నాటికి 600 కోట్లకు ప్రపంచ జనాభా పెరిగిపోయింది. ఈ లెక్కను పరిశీలిస్తే 1920 తరువాత జనాభా విస్ఫోటనం సంభవించింది. 1960-2000 సంవత్సరాల మధ్య కేవలం నలభై ఏళ్లలో 300 కోట్ల జనాభా పెరిగిపోయింది. ఈ జనాభా విస్ఫోటనంలో...1987 కీలకమైన గుర్తుగా మిగిలిపోయింది. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరినది ఆ ఏడాది జూలై 11వ తేదీగా ప్రపంచ గణాంకశాఖ అంచనావేసింది. ఆ రోజునే ప్రపంచ జనాభా దినోత్సవంగా పరిగణిస్తూ 1989నుంచి అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత జనాభా, 2014 లెక్కల ప్రకారం 740 కోట్లు. వీరిలో 52 శాతం ముప్ఫై ఏళ్ల లోపు యువత. ప్రస్తుతం జనాభా పరంగా చైనా (138 కోట్లు) అగ్రస్థానంలోను, భారత్ (132కోట్లు)రెండోస్థానంలోను, అమెరికా (324 మిలియన్లు) మూడో స్థానంలో ఉన్నా మరో ముప్ఫై ఏళ్లలో భారత్ మొదటి స్థానానికి చేరుకోబోతోంది. నాలుగైదు స్థానాల్లో ఇండోనేసియా, బ్రెజిల్ ఉన్నాయి. భారత్‌లో జనాభా పెరుగుదల, నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై జనసంఖ్య స్థిరతఖోష్ మార్గదర్శిగా నిలుస్తోంది. కాగా 2050నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
* * *
ప్రపంచంలో అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఐదు దేశాలకు గుర్తింపు ఉంది. కేవలం 11 వేలమందితో ఉన్న తువలు మొదటి స్థానంలో ఉంది. 12,809మందితకో నౌరు, 20,016మందితో పలవు, 28,503మందితో శాన్ మరినొ, 32,170మందితో మొనాకో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
* * *
జనాభా పెరుగుతున్నకొద్దీ పట్టణీకరణ వేగవంతమైంది. ఇప్పటికీ మూడొంతులు జనాభా పల్లెల్లోనే ఉంది. అదే పరిస్థితుల్లో పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయి. 20 సంవత్సరాల క్రితం కోటి జనాభా ఉన్న నగరాలు వేళ్లమీద లెక్కగట్టే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య వందల సంఖ్యకు చేరుతోంది.
* * *
పేదదేశాల్లో సగటు మనిషి రోజుకు 1 డాలర్ ఖర్చుపెట్టడం అసాధ్యమవుతోంది. దాదాపు మూడొంతులు దేశాల్లో ఇదే పరిస్థితి. ముఖ్యంగా సహారా ప్రాంత ఆఫ్రికా దేశాల్లో గడ్డు పరిస్థితులున్నాయి.
* * *
వైద్య, ఆరోగ్యం, విద్య రంగాల్లో వెనుకబాటుతనం వల్ల, అవగాహన లేకపోవడంవల్ల, చిన్నతనంలోనే వివాహం కావడం వల్ల, అవాంఛిత గర్భం వల్ల జనాభా పెరుగుదల పేదదేశాల్లో విపరీతంగా ఉంది. సమస్త సమస్యలకూ ఇదే కారణం. పేదరికంవల్ల ఆయుఃప్రమాణం తగ్గిపోతోంది. అభివృద్ధి చెందిన దేశాలకు, పేద దేశాలకు మధ్య ఈ విషయంలో అంతరం కనీసం 20 సంవత్సరాలుగా ఉంది. పేదరికం తాండవిస్తున్న సబ్‌సహారా ప్రాంత ఆఫ్రికా దేశాల్లో ప్రజల ఆయుఃప్రమాణం అతి తక్కువగా ఉంది. అక్కడి వారి సగటు ఆయుఃప్రమాణం కేవలం 51.5 సంత్సరాలు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లోనైతే దాదాపు 20 సంవత్సరాల తేడా ఉంటోంది. పశ్ఛిమఐరోపా దేశాల్లో సగటు ఆయుఃప్రమాణం 80.3 సంవత్సరాలైతే అమెరికాలో 79.3 సంవత్సరాలు. జపాన్ వంటి అభివృద్ధి చెందిన ఆసియా దేశాల్లో 70 సంవత్సరాలుగా ఉంది.
* * *
జనాభాకు తగ్గట్టు సౌకర్యాలు, వైద్యసేవలు, పారిశుద్ధ్యం, వౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల మరణాలు అధికంగానే ఉంటున్నాయి. ప్రతి 20 సెకండ్లకు ఓ చిన్నారి మరణిస్తున్నాడు. సగటున ప్రతి పది మందిలో ఒకరికి మంచినీటి వెసులుబాటు లేనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక అనేక కారణాలవల్ల 4.2 కోట్లమంది వలసబతుకులు గడుపుతున్నారు. ఈ భూమీద 70కోట్లమంది మహిళలు చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకున్నవారు. ఒక్క 2015లోనే 1.5కోట్లమంది బలవంతంగా పెళ్లి చేసుకున్నారంటే ప్రపంచం ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి.
* * *
ఈ ప్రపంచంలో ప్రాధామ్యాలను ఎంచుకునే విచక్షణ నేర్పే విద్య అందుబాటులో లేదు. ఈ భూగోళంపై ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అది కావాలన్న స్పృహకూడా లేనివారి సంఖ్య దాదాపు సగం. ప్రతి సెకండ్‌కు సగటున 4.3 జననాలు, 1.8 మరణాలు సంభవిస్తున్నాయి. ఔషధాలు, వ్యవసాయం, పట్టణీకరణ, సాంకేతికత, అక్షరాస్యత, వ్యాధినిరోధక చర్యలువంటి జనాభా పెరుగుదలకు కారణమవుతున్నాయి. అయితే ఈ సౌకర్యాలు అత్యవసరమే. దానిని జీవనప్రమాణాల మెరుగుకు ఉపయోగించుకోవాలి. జనాభా ఇదేవిధంగా విస్ఫోటనం చెందితే ఈ సౌకర్యాలు కొరగావు.
సుమారు 40 పేద దేశాల తమ దేశంలో ఆహారోత్పత్తులన్నింటినీ ధనిక దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఆయా దేశాలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నాయి.
* * *
ప్రస్తుతం ఈ విశ్వంలో ఉన్న మానవులందరినీ ఒకరిపక్కన ఒకరిని నిలబెడుతూ వస్తే 500 చదరపు మైళ్ల విస్తీర్ణం స్థలం అవసరమవుతుంది. అంటే ఓ లాస్‌ఏంజిలిస్ నగరమంత. అందువల్ల మనిషి జీవించడానికి, మెరుగైన జీవనప్రమాణాలతో ఎదగడానికి కావలసినంత చోటుంది. ఇప్పుడిప్పుడే మరో గ్రహానికి తరలిపోవలసిన పరిస్థితి ఏమీ లేదు. ఉన్న వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం, పారిశుద్ధ్య, ఆరోగ్య, విద్యారంగాల్లో సమాజాన్ని చైతన్య పరచడం ఇప్పటి యువతపై ఉన్న ప్రధాన బాధ్యత. అది నెరవేరిస్తే జనాభా నియంత్రణ సులభమవుతుంది.

-రవళి