S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రతిఫలాలు - ప్రేరణలు

ప్రతిఫలాలు రెండు రకాలుగా ఉంటాయి. వీటి కారణంగానే మనుషులు చర్యలకు దిగుతారు. అవే అంతర్గత ప్రతిఫలాలు, బహిర్గత ప్రతిఫలాలు. అంతర్గత ప్రతిఫలాలంటే మనకు ప్రేరణ కల్గించే సంతోషాలు, గుర్తింపులు, ప్రేమ, అవగాహన, సంతృప్తి, ప్రశాంతత, ఆమోదం మొదలయినవి. దీర్ఘకాల ప్రేరకాలుగా ఈ అంతర్గత ప్రతిఫలాలు విశేషంగా ఉపయోగపడతాయి.
బహిర్గత ప్రతిఫలాలు స్పష్టంగా కన్పిస్తాయి. అంటే ధనము, అవార్డులు, పదోన్నతులు, బహుమతులు వంటివి. ఇవే ప్రేరణను ఇస్తాయి. ఈ బహిర్గత ప్రతిఫలాలు సమకూర్చడం తేలికే. ఇవి తక్కువ కాల వ్యవథి ప్రేరణకు బాగా బలంగా ఉపకరిస్తాయి. దీనివల్ల ఒక ఇబ్బంది ఉంటుంది. వీటికి బానిసలుగా మారి నిత్యం వాటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
ఒకసారి బాహ్య ప్రతిఫలం కారణంగా మనిషి చర్యకు దిగాడంటే మరొకసారి చర్యకు దిగడానికి ఈ బాహ్య ప్రతిఫలం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంకా దుర్భరమైన పరిస్థితి ఏమిటంటే తాను చేసిన ప్రయత్నానికి నిరంతరం ఈ బాహ్య ప్రతిఫలాలు రావలని ఎదురుచూస్తూ ఉంటాడు.
నియంత్రిత ప్రతిస్పందన
ప్రేరణ అనేది తరచు సామాజిక నియంత్రణ, అనుభవాల ఫలితంగా ఉంటూ ఉంటుంది. అనుభవంగల యువకులు డబ్బుకు ప్రేరణ పొందుతారు. ఎందుకంటే డబ్బుతో సులువుగా తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు.
నిజానికి డబ్బు అనేది కాగితాల రూపంలోనే చలామణిలో ఉంది. కాని మిగిలిన కాగితాల మాదిరి కాకుండా ఈ కరెన్సీ కాగితాలకు విలువ ఉంటుంది. ఏడాది బిడ్డకు వంద రూపాయల నోటు ఇస్తే దానిని ఆ బిడ్డ నలిపి వేసి ముక్కముక్కలుగా చింపేస్తాడు. అదే నోటు ఏడేళ్ల పిల్లవానికి ఇస్తే దానిని తీసుకుని షాపునకు వెళ్లి ఏదోఒక వస్తువు అతడికి కావలసినది తీసుకుంటాడు.
అనుభవం కారణంగా ఒక్కొక్కప్పుడు ప్రేరణ ప్రతికూలంగా మారవచ్చు. వైఫల్యం అనే అనుభవాన్ని మనిషి జీవితంలో ఒక రంగం నుండి మరొక రంగానికి బదిలీ చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు ఒక యువకునికి ఉద్యోగాల ప్రయత్నంలో అనేకసార్లు వైఫల్యాలు ఎదురయ్యాయి అనుకుందాం. మంచి శిక్షణ తీసుకుంటే ఉత్తమమని కోచింగ్‌కి వెళ్లమంటే మళ్లీ వైఫల్యం అనివార్యంగా ఎదురవుతుందని వెళ్లడు.
నిజానికి అతడికి తగిన శిక్షణ లేక వైఫల్యాలు ఎదురవుతున్నప్పటికిని, కావలసిన శిక్షణ తీసుకునేందుకు ఇష్టపడక నిరాకరిస్తాడు.
ప్రేరణ లేక తంత్రమా?
ఒక్కొక్కప్పుడు ప్రేరణకు, తంత్రానికి మధ్యనున్న గీత మసగ్గా తయారయిపోతూ ఉంటుంది. ప్రేరణకు సంబంధించిన అనుకూల చర్యలు తంత్రానికి సంబంధించిన ప్రతికూల చర్యలుగా ఎప్పుడు మారిపోతాయి? తంత్రము అంటే ఒకరిని మోసగించే అతనిచేత తను చేయలేని పనిని చేయించడం. ప్రేరణ అంటే ఒక వ్యక్తి చేయగలిగిన పనిని అతనిని ప్రోత్సహించి చేయించగల్గడం. అయితే ఆ పనిని ప్రేరకుడు పూర్తిగా చేయలేకపోవచ్చు.
ఏదైనా చెయ్యమని ఒకరికి ప్రేరణ కల్గించాలంటే అతడికి ఆ పని చెయ్యాలనే కోరిక వున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇతరుల చేత తంత్రము ఉపయోగించి పని చేయించేందుకు వారిలో ఒక తప్పుడు కోరికను ప్రేరేపించవలసి వస్తుంది.
ఉదాహరణకు ఒక బేస్‌బాల్ టీమ్‌ను తీసుకుందాం. అందులో ఒక మోస్తరుగా ఆడే క్రీడాకారుడు ఇంకా బాగా ఆడగలడని కోచ్ నమ్మకం. కాని అతడు తన శక్తిని పూర్తిగా క్రీడపై కేంద్రీకరించడం లేదు. ఆ క్రీడాకారుడు కోచింగ్ తీసుకునేందుకు సమయానికి రావడం, కోచ్ సూచనలు తు.చ తప్పక పాటించడం చేస్తూ ఉంటాడు. కాని అతని నైపుణ్యాన్ని సంపూర్తిగా ప్రదర్శించేందుకు కావలసిన ఆవేశిత శక్తిని వినియోగించడం లేదు. బాగా ఆడాలనుకుంటున్నాడు కాని ఆ కోరికను ఆటలో చూపించలేక పోతున్నాడు.
ఈ క్రీడాకారుడికి ప్రేరణ కల్గించేందుకు అతడికి కొన్ని లక్ష్యాలు కోచ్ నిర్దేశిస్తాడు. వారం రోజుల్లో ఆ లక్ష్యాలను సాధించగల్గితే టీమ్‌లో ప్రత్యేక స్థానం కల్పిస్తానని కోచ్ వాగ్దానం చేస్తాడు. క్రీడాకారుడు తన క్రీడాపటిమను అభివృద్ధి చెందించుకునే ప్రయత్నం చేస్తాడు. కోచ్ కావలసిన మార్గదర్శక విధానాలు చెబుతాడు.
తంత్రము విషయంలో ఈ విధంగా జరగదు. ఒక కోచ్ ఉన్నాడనుకుందాం. అతడు అంతగా టీమ్‌ను పట్టించుకోడు. పైగా ఒక మంచి క్రీడాకారుడితో అతనికి విభేదాలు ఉన్నాయి. అతనిని ఎలాగైనా టీమ్‌లోంచి తప్పించాలనే ఆలోచనతో ఉంటాడు కోచ్.
ఒక మోస్తరుగా ఆడే క్రీడాకారుడిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. నువ్వు కొంచెం ఆటను అభివృద్ధి పరచుకుంటే ఆ మంచి క్రీడాకారుడి స్థానంలో నిన్ను ఉంచుతాను అని అతనికి చెబుతూ ఉంటాడు. పైగా ఆ మంచి క్రీడాకారుడు ఇతనిని తేలిగ్గా మాట్లాడాడని, దుర్భాషలాడుతున్నాడని అతనికి చెబుతూ ఉంటాడు.
దీనివలన ఈ సామాన్య క్రీడాకారుడికి మంచి క్రీడాకారుడిపై కోపం, ద్వేషం మొదలవుతాయి. ఆ మంచి క్రీడాకారుడిపై అపవాదులు, పుకార్లు పుట్టించడం మొదలుపెడతాడు. అంతేకాదు అతడి క్రీడాసామాగ్రిని దాచివేయడం, ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వచ్చేటట్లు చేయడం వంటి పనులు ప్రారంభిస్తాడు.

-సి.వి.సర్వేశ్వరశర్మ