S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహావిజేత 10

వీటిలో ప్రముఖమైనది - గిరిజనుల పాడిపంటల ఫలసాయాన్ని మెరుగుపరచడం. మొక్కలను నాటి, వృక్షాలను పెంచీ వాటి సంబంధమైన ఫల కుసుమాల ఉత్పత్తీ, పుట్టతేనె, ఔషధీయ వస్తు సంబారాల తయారీ వంటి రాబడినిచ్చే అంశాల పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. ప్రజలంతా సంతోషించి నూతన ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం స్వచ్ఛందంగా అందుతున్నది. దీనితో వారి ఆర్థిక పరిస్థితి మెరుగయింది. రాజ్యానికి రావలసిన షడ్భాగము, పన్నులు, అనుపులు - వలసినంతగా వచ్చినై. వీరశివుని పాలన నాటికన్నా మెరుగయిన బ్రతుకులను సుఖ సంతోషాలతో గడుపుతున్నారు ప్రజలు.
కుంతల అధికారులకు ఈ వివరాలన్నింటినీ తెలియజేశారు కళింద్ర అధికారులు. ఇదంతా చంద్రహాస -అక్షయుల ఆలోచనలతో, నైపుణ్యంతో, శ్రమతో, పథకాల ఆచరణతో సాధ్యమైందనే వాస్తవంగా కుళిందకునికీ ఇతర ప్రముఖులకూ తెలుసు! వారు ఎంతో ఆనందించారు.
కరద ఆదాయంలో నాల్గవ పాలును ‘శాశ్వతం’గా కుంతల వారికి అందించేందుకు - కప్పం ఒప్పందానికి స్వచ్ఛందంగా ప్రతిపాదననిచ్చాడు కుళిందకుడు. ఆ ప్రతిపాదన సంగతి గాలవులకు, చంపకమాలినికి తెలియజేశాడు.
మహారాజుకు చేరిన ప్రతిపాదన - సహజంగానే దుష్టబుద్ధికి అందజేయబడింది. నిప్పుల్లో ఉప్పు పోసినట్లయింది. పెటపెట లాడిందాయన మనస్సు. కళింద్ర వారి ‘అడగక ఇచ్చిన’ విధేయతా సంపద వలన తన వ్యూహం బెడిసికొట్టిందని చిరచిరలాడాడు. ఈ వ్యవహారమంతా మడమశూలలా బాధించసాగింది!
26
కళింద్ర రాజధాని చందనావతి, మహారాజు సమావేశమందిరం. ముఖ్యులంతా కూర్చుని వున్నారు. వారిలో నిర్మాణ శాఖకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు.
చంద్రహాసుడు తనకుగా వచ్చిన ఆలోచనలేమైనా ఉంటే, ముందు ఆ ప్రతిపాదనలను సంబంధిత శాఖాధికారులకూ ఆ తర్వాత - ఆచార్యులకూ, అడివప్పకూ, సైన్యాధిపతికీ వివరిస్తాడు. వారి చర్చలు అయిన తర్వాత వారి సలహాలూ సూచనలతో తుది నిర్ణయానికి అవి ప్రభువు వద్దకు చేరుతాయి. ఈ ప్రక్రియ ప్రకారమే ఇప్పుడీ ప్రధాన ప్రతిపాదన కూడా రూపుదాల్చింది.
‘చెప్పండి. ఎవరిదీ ప్రతిపాదన? ఎందుకు వచ్చింది? కారణాలతో సహా వివరించండి’ అన్నాడు ప్రభువు.
అందరూ చంద్రహాసుని వైపు చూశారు.
చంద్రహాసుడు చెప్పసాగాడు. ‘ప్రభూ! ఆనాడు కరద మండలం మీదికి దండు వెడలినప్పుడు, మన కోట ప్రాకారం దాటుతుంటే గమనించిన విషయం ఇది. కోట దుర్భేద్యమయిన గండశిలలతో నిర్మింపబడినదే అయినా అక్కడక్కడా కోట గోడలు బీటలు వారి వున్నాయి. కళింద్రపై కనె్నత్తి చూసే ధైర్యం ఎవ్వరికీ లేకున్నా, మన నిర్మాణాన్ని మనం సక్రమంగా సంరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉంది కదా! అందువలన కోట మరమ్మతులకు నేనూ అక్షయుడూ కలిసి ప్రతిపాదనలను తయారుచేయించాము. వాస్తు శాస్తజ్ఞ్రులూ, కోట నిర్మాణ సాంకేతిక వర్గమూ, కర్మకరుల ప్రతినిధులూ - అందరూ వీటిని పరిశీలించి వారివారి సూచనలనిచ్చారు. తుది నిర్ణయం ప్రభువులది’
ఆ వెంటనే అక్షయుడు, ‘కోట మరమ్మతుల ప్రతిపాదనలో కీలక అంశం ఒకటి వున్నది. ఇది కూడా ‘అన్న’ చేసిన ప్రతిపాదనే. మనది మూడు ప్రాకారాలు కలిగిన జలదుర్గం. కోట చుట్టూ వున్న అగడ్త చాలావరకూ పూడికకు సిద్ధమైంది. దానినీ తీయించాలి. ఈ పూడిక పనిలో వచ్చే మట్టిని ఎక్కడిదానినక్కడే వినియోగించుకోవటానికి అవకాశం ఉంది. దానికై మొదటి ప్రాకారానికి గల రెండు గోడల మధ్యన ఉపరితలంలో ఒక బాటని నిర్మించే పథకాన్ని సిద్ధం చేశాము. దాన్నీ చిత్తగించమని నా మనవి’ అన్నాడు.
సాంకేతిక విజ్ఞులు ఈ ప్రతిపాదనని చాలా ఉపయుక్తమైన కార్యంగా కొనియాడారు. దీనివలన వొనగూడే ప్రయోజనం విలువైనదని వివరించారు. చంద్రహాసుని ఆలోచనలో అతని ముందుచూపూ, పరిణతీ కనిపిస్తున్నదని కూడా ప్రశంసించారు.
ఆ తర్వాత - ఆ ప్రతిపాదనలకు సంబంధించిన ఆర్థికాంశాలను గురించీ, కావలసిన వస్తు సంబారాల గురించీ చర్చ జరిగింది. పనిని ఎప్పుడు మొదలుపెట్టాలో నిర్ణయం జరిగింది. ప్రభువు ఆ పనుల నిర్వహణకి తన అనుమతిని తెలియజేశాడు.
సమావేశం ముగిసింది.
ఇష్టాగోష్టి జరుగుతోంది. ఆచార్యుల వారు చంద్రహాసుని భుజం తట్టి - ఒక్కొక్క వ్యవహారం ఆధారంగా - వ్యక్తిగా, సమిష్టిలోని ఒక సభ్యునిగా నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటున్న వైనం మా అందరికీ సంతోషం కలిగిస్తోంది. రాజ్యక్షేమానికి నీ వంటి యువకుల చాకచక్యం, సమర్థత అంది వస్తున్నాయి. సంతోషం. శుభం భూయాత్’ అన్నారు.
‘అంతా గురువుల ఆశీర్వాదం. ఆపైన ప్రభువుల ఆదరం’ కైమోడ్చి అన్నాడు చంద్రహాసుడు. ‘మరి.. ఈ తమ్ముని సహాయం...!’ అని ప్రశ్నార్థకాన్ని వదిలాడు అక్షయుడు. ‘అదే అసలైన అండ కదా! నీ సహకారమే తొలి మెట్టు కదా!’ అన్నాడు అడివప్ప. ‘అవును గురువుగారూ, అక్షయుని దత్తత గురిచి నేను గొప్పలు చెప్పుకుంటే ఆత్మస్తుతి కిందకు వస్తుంది కదా!’ ‘అవునవును’ అంటూ అందరూ నవ్వుకున్నారు.
ఆవలగా ఉన్న కుళిందకుడు ఈ ముచ్చటనంతా గమనించి మనసారా నవ్వుకున్నాడు.
‘చిరంజీవ, చిరంజీవ’ అని రెండుసార్లు అనుకున్నాడు. అవి - చంద్రహాస అక్షయులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిండు దీవెన!
27
కళింద్ర కోట మరమ్మత్తులు సాగుతున్నై.
అంతర్భాగం ప్రాంగణాలలో మంటపాలూ, వేదికలూ వంటి కొత్త ఏర్పాట్లు కూడా పూర్తి చేయబడినవి.
కోట పునరుద్ధరణ అయింది. దానికి మరికొన్ని అందాలనూ అమర్చారు. నగర ప్రజలంతా నేటి కోటను చూసి సంబరపడిపోతున్నారు. ఇటు మండలేశ్వరుడు, ఇతర రాజ ప్రముఖులూ, రాజ్యాధికారులూ, అటు సామాన్యులూ చంద్రహాస అక్షయుల చొరవని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బహుథా ప్రశంసిస్తున్నారు.
ఆ సాయంత్రం-
చంద్రహాస అక్షయులూ, దుర్గీ పద్మినీ - విష్ణ్వాలయానికి వచ్చారు. అర్చనాదికాలు అయినవి. ప్రాంగణంలో మంటపం మెట్ల మీద కూర్చుని ఇష్ట భాషణలో నిమగ్నులైనారు.
అప్పుడు ఈ ప్రసక్తి తెచ్చాడు అక్షయుడు, ‘ఊపిరి సలుపనీయని రాచకార్యాల నుంచీ ఇప్పటికి కొంచెం వెసులుబాటు చిక్కింది. కోట పనులు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక మంచి పని చేస్తే?’
‘మంచి పనే..? ఆఁ..! నీ ఆలోచన నుంచే వస్తున్నదా సోదరా?’ అని పరిహాసమాడింది పద్మిని. కినుకతో ‘నేనంటే మరీ పరిహాసంగా ఉంది నీకు. ఏం బాగాలేదు’ అని ముఖం ముడుచుకున్నాడు. దుర్గి అన్నది ‘అక్షయులకి ముక్కు మీదే ఉంటుంది కోపం. చాల్లేగానీ ముందా మంచి పని చెప్పండి మహాశయా!’
చంద్రహాసుడు సన్న నవ్వుతో వేచి చూస్తున్నాడు.
అటూ ఇటూ అందరినీ చూస్తూ ‘నగర ప్రజలకు కోట ప్రాంగణంలో మహాన్న సంతర్పణ చేయిస్తే...?’ అన్నాడు అక్షయుడు.
తటాలున తలెత్తి, కించిదాశ్చర్యంతోనూ, మనస్ఫూర్తిగానూ ‘అద్భుతమైన ఆలోచన’ అన్నాడు చంద్రహాసుడు. అన్న పలుకుల్లోని ఉత్సాహమూ, ప్రశంసా చాలా ఉత్తేజాన్ని కలిగించాయి అక్షయుడికి.
కళ్లల్లో వెలుగులు నింపుకుని అన్న చూపులో చూపులు కలిపి, క్రమేపీ వినమ్రంగా తలవంచుకున్నాడు. పద్మిని ‘చాలా బాగుంది. మా అన్నకి కూడా కొత్తగా మంచిమంచి స్వంత ఆలోచనలు వస్తున్నయ్’ అన్నది.
అక్షయుడు తలెత్తి ఆమెకేసి గుర్రుగా చూశాడు. వెంటనే ‘ఎగతాళి కాదు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది పద్మిని.
‘నాకు మరీ మరీ సంతోషంగా ఉంది’ అని మాటలను వొత్తి పలుకుతూ ‘ముఖ్యంగా మన మిత్రులందరినీ కలుసుకోవచ్చు. దానితోపాటు రాజుగారి విందంటే మాటలా మరి. బంగారం లాంటి అవకాశం’ అన్నది దుర్గి. నలుగురూ నవ్వుకున్నారు.

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600