S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుర్రం ఎగరా వచ్చు! (కథ)

...................
కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
.................

‘విశ్వం నీ రొట్టె విరిగి నేతిలో పడ్డది!’
ప్లాంటు ఆఫీసులో పేపర్ వర్క్‌లో తల మునకలై ఉన్న నేను రూమ్‌లో ప్రవేశించిన వైకుంఠరావు వైపు ఏమిటన్నట్టు చూశాను.
‘జిఎంగారు వాళ్ల అమ్మాయికి మేచ్‌లు చూస్తున్నారు’ నా ఎదురుగా కూర్చుని ప్రారంభించాడు అతను.
‘అయితే?’
‘నీ బ్రదర్ ఇన్ లా పెళ్లికున్నాడని బాస్‌కి ఎవరో చెప్పారు. నన్ను పిలిచి నీతో మాట్లాడమన్నారు’
‘దానికీ నా రొట్టె విరిగి నేతిలో పడటానికి సంబంధం ఏమిటి?’ నవ్వుతూ అడిగాను.
‘అమాయకుడా! నీకన్నీ విడమరచి చెప్పాలి. ఈ కారణంగా నీకు ఆయనతో బంధుత్వం ఏర్పడిందనుకో. కంపెనీలో నీ స్థాయి అమాంతం పెరిగిపోదూ. ప్రతిసారి ప్రమోషన్ లిస్ట్‌లో నీ పేరు ముందుంటుంది. ఇన్నాళ్లకు నాకు నా చిరకాల స్నేహితుడికి మేలుచేసే అవకాశం వచ్చింది. నువ్వు సహకరించాలి మరి’
‘దానికేంగాని మా వాళ్ల అంతస్థు వాళ్లకి సరిపోతుందనుకోను’
‘ఆదిలోనే హంసపాదా? ముందు రెండు వైపుల వాళ్లనీ కలుపు తర్వాత వాళ్లే నిర్ణయించుకుంటారు. నాకైతే డెఫినిట్‌గా వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకం ఉంది. అమ్మాయి బంగారు బొమ్మ. ఒక్కతే కూతురు. ఇంజనీరింగు కంప్లీట్ అయింది. జిఎంకి ఉన్నదంతా ఆమెకే వస్తుంది’
జిఎం ది ఇవాళ్టి లెక్కల్లో సంపన్న కుటుంబం అనే చెప్పుకోవచ్చు. ‘ఎలా ఎదిగామని కాదు. ఎంత ఎత్తుకి ఎదిగామన్నది ముఖ్యం’ అని నమ్మే వాళ్లకి అతను చక్కటి రోల్ మోడల్. మూడు దశాబ్దాల క్రితం సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి ఔషధ పరిశ్రమలో చిన్న ఉద్యోగంలో ప్రవేశించినవాడు విలువలు ఒక్కొక్కటికీ తిలోదికాలు ఇచ్చి అంచెలంచెలుగా ఫ్యాక్టరీ హెడ్‌గా ఎదిగాడు. లాభసాటి ఆర్థిక వ్యూహాలతో స్వంత ఆస్తులు హెచ్చవేశాడు. హోదా వల్ల అమరిన అహంకారంతోపాటు సంపద ఇచ్చిన ఆడంబరం అతనికి అలంకారాలు.
మా అత్తమామలది మామూలు మధ్యతరగతి సంప్రదాయకమైన కుటుంబం. మంచి క్రమశిక్షణతో పెరిగి స్వయంకృషితో కెరీర్‌లో వృద్ధిలోకి వస్తున్న బావమరిది. రెండు కుటుంబాలకు హస్తి మశకాంతరం తేడా ఉంది. అలాంటప్పుడు వైకుంఠరావు ప్రతిపాదనకు ఎగిరి గంతేసి, నా స్వార్థం కోసం చొరవ తీసుకోవడం ఎంతవరకు సబబు?.. వౌనం వహించాను నేను.
‘ఏమిటాలోచిస్తున్నావు. అదృష్టం తలుపు తట్టమోతుంటే? అయినా నీతో కాదులే. మీ ఇంటికొస్తాను. మా చెల్లెమ్మతో మాట్లాడుతాను’ నా జవాబు కోసం ఎదురుచూడకుండానే లేచి నిష్క్రమించాడు వైకుంఠరావు.
వైకుంఠరావు జిఎంకి రాంబంటు. బయట ఫ్లాట్లు, సైటులు కొనిపెట్టడాలు, గవర్నమెంటు ఆఫీసులలో పనులు లాంటి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు. ఉద్యోగ విధులు మాత్రం ఆఖరి ప్రాధాన్యతలో ఉంటాయి. అతనికి క్రమం తప్పకుండా పదోన్నతులు. ‘్భలే పట్టావయ్యా చండశాసనుడిని!’ అని ఎవరు గేలి చేసినా ‘నా విద్య నేను ఉపయోగించుకుంటున్నాను’ అని ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాడు.
సాయంత్రం ఫ్యాక్టరీ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి వైకుంఠరావు తన శ్రీమతితో సహా ప్రత్యక్షం. నా భార్య వసంతకి బ్రెయిన్ వాష్ పూర్తయినట్టుంది. ఆమె మొహం వెలిగిపోతోంది.
‘చెల్లెమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మీ వాళ్లు వచ్చి అమ్మాయిని చూడటమే తరువాయి. సన్ డేకి ప్రోగ్రాం పెట్టమన్నారు బాస్. ఆయన కేంప్ కెళ్తున్నారు. అట్నుంచి వచ్చాక ఫుల్ బిజీ.. ప్లాంటులో సేఫ్టీ కాన్ఫరెన్స్, మార్కెటింగ్ వాళ్ల ఇయర్లీ మీటింగు ఉన్నాయి. ఓ పక్క వైజాగ్‌లో కొత్త ఫ్లాటు రిజిస్ట్రేషన్. మేడమ్‌గారివి, అమ్మాయి గారివి ప్రోగ్రాంలు కూడా. అన్నింటికి టైం కుదిరే విధంగా ప్లాన్ చేశారు. నీకు తెలుసుగా ఎంత మెటిక్యులస్‌గా ఉంటారో. మీ వాళ్లు సండేకి రావాలి మిస్ అవకూడదు. నీదే బాధ్యత’ కాఫీ తాగుతూ చెప్పాడు వైకుంఠరావు.
వైకుంఠరావు దంపతులు వెళ్లాక ‘వసంతా నువ్వు తొందరపడుతున్నావు. మనం వాళ్లతో తూగలేం. అంతస్థులు వేరు. ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి’ శ్రీమతిని హెచ్చరించాను.
‘మన’ ఏమిటి మీ స్థాయి తక్కువ కావచ్చు గాని మా పుట్టింటి వాళ్లది తక్కువేం కాదు. మా చెల్లి స్టేట్స్‌లో ఉంది. మా తమ్ముడిది బేంక్ మేనేజర్ జాబ్. మీ కంపెనీల్లాంటివి అప్పుల కోసం వాడి బ్రాంచికే క్యూలు కడుతూ ఉంటాయి. ఇక ఆస్తులంటారా? పిల్లల్ని చదివించడంలో పడి మా అమ్మానాన్న వాటి మీద దృష్టి పెట్టలేదు గాని ఎంతసేపు అమర్చుకోవడానికి. కొత్త రాజధానికి దగ్గర్లో ఉన్న పాతిక ఎకరాలలో రెండు అమ్మితే చాలు మీ జిఎం.ని మించి పోతారు. ఫ్లాట్లు, కార్లు లైఫ్ స్టయిల్ ఇట్టే పూర్తిగా మార్చెయగలరు’ స్వాతిశయం కంటె ఈ సంబంధం జారిపోకూడదన్న ఆతృత స్పష్టంగా ఆమె మొహంలో కనిపిస్తున్నది.
ఆమె ఉబలాటానికి ఎలా అడ్డుకట్ట వేయాలో నాకు తెలియటంలేదు.
ఫ్యాక్టరీ అత్యున్నత అధికారి గూర్చి సంస్థ ఉద్యోగులందరికీ బాగా తెలుసు. అవినీతికి మారుపేరు. ప్రాజెక్టు ప్రారంభం నుంచీ ఉన్నవాడు. కాంట్రాక్టులలో పర్సంటేజి, ఉద్యోగుల పదోన్నతులలో అక్రమాలు, ఆశ్రీత పక్షపాతం అన్నిటిలో అతనిది అందె వేసిన చేయే. అంతేకాదు టెర్రర్ మేనేజిమెంట్ అతని వ్యవహారశైలి. అందువల్లే ఇంత పెద్ద కర్మాగారం లాభాల బాటలో నడుస్తున్నదని అతని గాఢ నమ్మకం.
ఆఫీసర్లయినా కార్మికులైనా అతనికి నెపం దొరకాలే గాని మొహం వాచేలా చీవాట్లు పెడతాడు. సమయం సందర్భం చూడకుండా ఎవరినైనా దుర్భాషలాడటానికి ఏ మాత్రం వెనుకాడడు. మెమోలు, అభియోగ పత్రాలు, ఉద్వాసనలు నిత్యకృత్యాలు. నిజానికి సంస్థ లాభాల్లో ఉండటానికి కారణం కార్మికుడి నుంచి విభాగాధిపతుల వరకూ ఎక్కువమంది పని గుర్రాలే. దృష్టి ఉత్పత్తి లక్ష్యాల మీదే. పే స్లిప్‌ల్లో హెచ్చుతగ్గులు, ఓ టి లెక్కలు తప్ప మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోని తత్వం. అదీగాక పని చేస్తున్నది ప్రైవేటు రంగం, ఔషధ పరిశ్రమ కావడంతో దూషణ భూషణ తిరస్కారాలు అన్నీ పైవాడి చిత్తం ప్రకారమే ఉంటాయి. రియాక్టర్‌లలో తయారయే బేచ్‌లు రాశిలోగాని నాణ్యతలోగాని ఏ మాత్రం తేడా వచ్చినా తమకు నచ్చని ఎవరినో ఒకరిని బలి పశువు చేస్తారు’ అన్న సత్యాన్ని అంగీకరించేవారు కనుక జిఎం ఆగడాలకి అడ్డే లేదు..
‘ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న సామెత అయరాలా నిజమని ఆయన ముద్దుల పట్టి క్రిందటి సారి మా ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు నిరూపించింది.
ఆ వేళ తనకింకా గుర్తే. ప్లాంటు కంట్రోలు రూమ్ నుంచి ప్రొడక్షను మీటింగుకు వెళ్లేందుకు తను సిద్ధం అవుతున్నాడు. షిఫ్ట్ ఇంజనీర్ పిచ్చయ్య మా డిపార్ట్‌మెంట్ తరఫున ఎజెండా తయారుచేయడంలో నాకు సాయపడుతున్నాడు. ఇంతలో సుడిగాలిలా ప్రవేశించిందో యువతి. బిలబిలమంటూ వెంట వచ్చారు ఇరవై మంది బృందం. హు ఈజ్ పిచ్చయ్య ప్రశ్నించింది ఆ యువతి, ధాష్టీకంగా.
పిచ్చయ్య ఒక్క క్షణం తేరిపార చూశాడు. ‘ఎస్ పిచ్చయ్యని నేనే!... ఎవరు మీరంతా? వాడ్డుయు వాంట్?’
‘ఐయామ్ యువర్ జిఎమ్స్ డాటర్! వీళ్లంతా నా క్లాస్‌మేట్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్!’ భుజాలు ఎగరేస్తూ అన్నది దూసుకువచ్చిన యువతి.
‘అది సరే, ప్లాంటులో ఉన్నప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ సేఫ్టీ డిపార్ట్‌మెంటు వాళ్లు చెప్పే ఉంటారు కదా! మీకిచ్చిన హెల్మెట్లు చేతుల్లో కాదు, తలల మీద ఉండాలి’ ఆమె డాబుసరి మాటలు పట్టించుకోకుండా హెచ్చరించాడు పిచ్చయ్య అందర్నీ.
ఒక్క జిఎం గారి అమ్మాయి తప్ప అందరూ శిరస్త్రాణాలు వేసుకున్నారు వెంటనే.
‘నేను చెప్పింది మీకూ వర్తిస్తుంది. ఏక్సిడెంట్లు జరిగేటప్పుడు మీ బేక్‌గ్రౌండ్లు పరిగణనలోకి రావు తెలుసా?’ ఆమెను ఉద్దేశించి అన్నాడు పిచ్చయ్య. బృందంలో కొంతమంది తమకు వస్తున్న నవ్వుల్ని ఆపుకుంటున్నారు.
తన నేస్తాల్ని అనుసరించక తప్పలేదు నాయకురాలికి.
‘మేం మీ డిపార్ట్‌మెంట్ విజిట్‌కి వస్తున్నామని నీకు ఇంటిమేషన్ రాలేదా?’ ప్రశ్నించింది దబాయింపుగా. మరోసారి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ.
‘ఇట్ మేక్స్ నొ డిఫరెన్స్. వెంట ఈయన ఉన్నాడుగా!’ అన్నాడు పిచ్చయ్య సేఫ్టీ సూపర్‌వైజర్‌ని చూపిస్తూ. ‘లెట్ అజ్ స్టార్ట్! మీక్కావల్సింది ఇక్కడి ప్రాసెస్ డిటైల్స్ కదా, ఐ విల్ ఎక్సప్లయిన్..’ అందరూ కంట్రోల్ పేనల్‌కి దగ్గరగా వచ్చి నిలబడండి’ సూచన ఇచ్చాడు తన ఇంట్లోంచి లేచి ముందుకు నడిచి. విద్యార్థులందరూ ఆ విధంగానే సర్దుకున్నారు. పొట్టిగా ఉన్న జిఎం కుమార్తె మాత్రం పేనల్ ముందున్న టేబిల్ మీదకు ఒక్క ఎగురు ఎగిరి కూర్చున్నది. ‘కేరీ ఆన్ పిచ్చయ్యా!’ అంటూ.
పిచ్చయ్య సంగతేమో గాని ఆమె తీరు నాలో అసహనం రేకెత్తిస్తున్నది. వచ్చింది కాలేజి ప్రాజెక్టు విషయమై. జ్ఞాన సముపార్జన కోసం. జిఎం తన తండ్రి అయినంత మాత్రాన అంత అతిశయ ప్రదర్శన అవసరమా?
పిచ్చయ్య పేనల్ పైభాగంలో ఉన్న లైన్ డయాగ్రమ్ చూపించి ప్లాంటు ప్రాసెస్ గురించి, వివరణ మొదలుపెట్టాడు. అతని వివరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విధి నిర్వహణలో ఎంత సమర్థుడో విషయ పరిజ్ఞానంలోనూ అంతే. సందర్శకులెవరైనా వారివారి అవగాహన స్థాయినిబట్టి అరటి పండు ఒలిచి పెట్టినట్టు చెప్తాడు. ఓపికగా వారి ప్రశ్నలకి జవాబులు ఇస్తాడు. విద్యార్థులైతే ఏ సెమినార్‌లోనో మంచి లెక్చర్ విన్నంత సంతృప్తితో బయటికి వెళ్తారు. అతని ఫోను నెంబర్ కూడా తీసుకుని మరీ వెళ్తారు. అవకాశం దొరికినప్పుడల్లా నేనూ అతని ముందు విద్యార్థినయిపోతాను.
పిచ్చయ్య చెప్పింద శ్రద్ధగా వింటూ ఆమె తోటి విద్యార్థులందరూ నిలబడి పాయింట్లు రాసుకుంటున్నారు. జిఎం ముద్దుల పట్టి మాత్రం దిక్కులు చూస్తూ విలాసంగా కూర్చున్న భంగిమలోనే వెనక్కి చేతులు ఆన్చి, టేబిల్ క్రిందకు వేళ్లాడుతున్న కాళ్లు ముందుకు వెనకకూ ఆడిస్తున్నది. దృశ్యం మరీ కంపరంగా ఉంది.. ‘ఇలా రా అమ్మాయి. ఇక్కడ కూర్చో’ మీటింగుకి వెళ్లేందుకు ఉద్యుక్తుడనయ్యాను ఖాళీ అయిన నా కుర్చీని చూపిస్తూ.
ఆ అమ్మాయి తనున్న చోటు నుంచి కదిలే ప్రయత్నం చేయలేదు. సరికదా ‘ఇంత పెద్ద కంపెనీ, నాలుగు చైర్స్ వేయించవచ్చు కదా మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా...’ అంటున్నది.
‘మేడమ్, ముందు ఆ టేబిల్ నుంచి కిందకి దిగండి. మీ ఫ్రెండ్స్ అందరూ నిల్చుని లేరూ? బేడ్ మానర్స్ మాట అటుంచి ఊగుతున్న మీ కాళ్లు ఎదురుగా ఉన్న ఎమర్జెన్సీ బటన్ మీద పడితే ప్లాంటు అంతా షట్ డౌన్ అవుతుంది. ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని పెద్ద సైరన్ మోగుతుంది. అది మోస్ట్ అన్‌వాంటెడ్ సిట్యుయేషన్. వెసల్స్‌లోని బేచ్‌లు సర్వనాశనం అవుతాయి. కంపెనీకి లక్షల నష్టం! ప్లీజ్ గెట్ డౌన్!’ ఇటు తిరిగి కఠినంగా అన్నాడు పిచ్చయ్య ఆమెని ఉద్దేశించి.
పిచ్చయ్య గద్దింపుతో అమ్మాయి మొహంలో కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు. ‘పదండే ఇక్కడ తెలుసుకున్నది, నేర్చుకున్నది ఇంక చాలు! మనం అర్జెంటుగా పండితులయిపోనక్కర్లేదు’ అంటూ టేబిల్ మీద నుంచి దిగి విసావిసా బయటికి నడిచింది.
మిత్ర బృందం ఆమెను లక్ష్యపెట్టలేదు. ‘ఏమనుకోకండి సార్! ఆవిడంతే. మీరు కానీయండి. ప్లీజ్’ అంటూ పిచ్చయ్య తన వివరణ తిరిగి ప్రారంభించే వరకు వదలలేదు.
పిచ్చయ్య చర్య ఎంత సమర్థనీయం అయినప్పటికీ పర్యవసానాలు మాత్రం నేను భయపడ్డట్టే సంభవించాయి.
‘ఏమిటనుకుంటున్నాడు ఆ పిచ్చయ్య. ఎవరితో ఎలా బిహేవ్ చెయ్యాలో తెలియదా? ఏరొగెంట్ ఫెలో నా డాటర్ కనక సరిపోయింది. ఎవరైనా విఐపిలు వచ్చినా అంతేనా? మంత్రులు వస్తారు, ప్రజా ప్రతినిధులు వస్తారు. పొల్యూషన్ కంట్రోలు వాళ్లు వస్తారు. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ వస్తారు. ఇలాంటివి జరిగితే చాలా ఇక్కట్లలో పడతాం. నువ్వు ముందు వాడి సెక్షన్ మార్చెయ్. ఇట్ ఈజ్ టూ బేడ్ ఆన్ యువర్ పార్ట్ ఆల్సో. నీ సమక్షంలోనే ఇదంతా జరిగింది. నువ్వేం చేస్తున్నట్టు... మరొకసారి ఇలా రిపీట్ అయితే ఐ విల్ టేక్ యు టు టాస్క్’ ఆగ్రహంతో ఊగిపోయాడు... అప్పటికప్పుడు పిచ్చయ్య పర్సనల్ ఫైల్ తెప్పించి కసిగా రెడ్ ఇంక్‌తో రిమార్క్ రాశాడు. ఇంకో ఐదేళ్ల వరకూ పదోన్నతి నిషిద్ధం చేస్తూ.
కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని వారించలేని నిస్సహాయ పరిస్థితి నాది. పిచ్చయ్య కెరీర్‌పై జరిగిన దాడి, విభాగాధిపతినైన నా మీదే నిందా వాక్య ప్రయోగం ఇప్పటికీ నా మనసును తొలిచివేస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో ఇంత దారుణంగా ప్రవర్తించే వ్యక్తితో అన్నీ మరచి కుటుంబ సంబంధం కలుపుకోవడం కొరివితో తల గోక్కొనడం కాదూ...
‘మీదంతా చాదస్తం. ఆఫీసు రాజకీయాలు ఇలాంటి వాటిలోకి తీసుకురాకండి. ఈ రోజుల్లో ఎవరూ అమాయకులు కారు. ప్రయోజనాలు నెరవేరడానికి ఎవరు ఏ పద్ధతులు అయినా అవలంబిస్తారు. తప్పేముంది. హాయిగా అవకాశం వచ్చినప్పుడు పరిస్థితిని మనకనుకూలంగా మలచుకోవాలి. గుండు కొమ్ముల అనుమానాలు పెట్టుకొని మరేం అడ్డు తగలకండి;’ నా నోరు మూయించింది శ్రీమతి. నా అభిప్రాయాలు వెల్లడి చేయగానే.
ఫోనులో తన వాళ్లకి రంగుల సినిమా చూపించడం ప్రారంభించింది పదేపదే.. ‘అన్నీ ప్లస్ పాయింట్లే. బంగారం లాంటి సంబంధం. పెట్టుపోతలకి లోటుండదు. చదువుకి చదువు. అందానికి అందం.. మన స్టేటస్ అమాంతం మారిపోతున్నది.
‘వసంతా ఏమిటి నీ స్పీడు? మనవాడు కనీసం అమ్మాయి ఫొటో చూడాలి. జాతకాలు కుదరాలి. పెళ్లిచూపులవాలి. ఇంటర్వ్యూ జరగాలి. అన్నీ బైపాస్ చేసేస్తున్నావు’ హెచ్చరించాను.
‘ఏం చేయకూడదా? నాకంటే శ్రేయోభిలాషి ఎవరున్నారు నా తమ్ముడికి. వాడెప్పుడో నాకు ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు. నువ్వు అమ్మాయిని సెలెక్ట్ చేసి చూపించు తాళి కట్టేస్తాను అని హామీ కూడా ఇచ్చేశాడు. తగ్గ అమ్మాయి కోసమే కదా ఇన్నాళ్లూ వెతికింది. కాళ్ల దగ్గరికి వచ్చిన సంబంధం. అన్నీ బావున్నప్పుడు వద్దంటే సిరి రా మోకాలడ్డటమే’
ఊరి నుంచి నా అత్తమామలు, అబ్బాయి వచ్చారు.
‘కార్యక్రమం మర్నాడైతే బాగుంటుంది వసంతా. నాకు అనుకోకుండా ముఖ్యమైన పని పడింది ఆదివారం... మన వాళ్లకూ రెస్టు దొరుకుతుంది. దూర ప్రయాణం చేసి వచ్చారు కదా!’ ప్రతిపాదించాను...
‘ఆపండి బాబూ మీ శల్య సారథ్యం. చివరి వరకూ ఆటంకాలు పెడుతూనే ఉంటారు. ప్రోగ్రాం అనుకున్నట్టు జరగాల్సిందే. అసమ్మతి వాదులు ఉన్నా, లేకపోయినా మేం మేనేజ్ చెయ్యగలం లెండి. వైకుంఠరావు అన్నయ్యగారు ఉన్నారుగా!’ శ్రీమతి తన హుషారులో నా పని ఏమిటో కూడా తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు.
ఎలాగైతేనేం నా పరోక్షంలోనే పెళ్లిచూపుల తతంగం పూర్తయింది.
నా పని పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి ఇంటిల్లిపాదీ సమావేశంలో ఉన్నారు. మా బావమరిది వాళ్ల అక్క మీద ఫైర్ అవుతున్నాడు. ‘నన్ను అనవసరంగా రప్పించేవు కదే. నువ్వు ముందు చూడవలసింది కదా! అమ్మాయి నా పక్కన నిలబడితే భుజాల వరకూ అయినా రాదు’
‘వెరీసారీ రా తమ్ముడూ! ఆ వైకుంఠరావు ఒకటే ఊదరగొట్టాడు. అయినా మీ బావగారిని అనాలి. ఈ గ్రీకు వీరుడి లాంటి బావమరిదికి ఆ పొట్టి పిల్ల ఎలా మేచ్ అవుతుందన్న ఇంగితం ఉండొద్దూ? ఆ అమ్మాయి నాకు తెలుసు అంటూ ఏవేవో మాట్లాడారు కాని.. అసలు సంగతి దాచారు.. ఛ! ఎంత సంబరపడ్డాను పెద్ద సంబంధం అని’ వాపోతున్నది శ్రీమతి.
నా వైపుగా అల్పపీడనం మారుతోంది. నాకు లోలోపున ఆనందం. కారణం ఏదయితేనేం కాగల కార్యం గంధర్వులే తీర్చారు. వ్యక్తిత్వాల విశే్లషణలో పడి నేను మరచిపోయిన అంశం మీద అబ్బాయి కుండబద్దలు కొట్టాడు.
‘పొట్టీ పొడుగు ఏముంది? మిగతావన్నీ నచ్చాయి కదరా నాన్నా. మరోసారి ఆలోచించండి అక్కా తమ్ముళ్లిద్దరూ. జాతకాలకి ఢోకా లేదంటున్నాడుగా ఆ వైకుంఠం’ అత్తగారి సలహా.
తర్జనభర్జనలు జరుగుతుండగానే, ఫోన్ మోగింది. అట్నుంచి వైకుంఠరావు. ‘జిఎం గారు అడుగుతున్నారు. మీ వాళ్లకి ఓకే కదా.. అయినా నిన్న నువ్వు లేవేమిటి? పెళ్లి పెద్దవు అంత ముఖ్యమైన పని ఏం వచ్చింది? జిఎంగారు చాలా ఫీలయ్యా రు తెలుసా!’
‘ఇంకా ఫీలవుతారు అసలు విషయం తెలిస్తే. నాకు గాని మా వాళ్లకిగాని ఈ మేచ్ ఎంత మాత్రం ఇష్టంలేదు. మేం డ్రాప్ అవుతున్నాం!’
ఎదురుచూడని పరిణామం. నేను పేల్చిన బాంబుకి నోట్లో వెలక్కాయ పడ్డది వైకుంఠరావుకి. ఎలాగో తేరుకుని ‘మై గాడ్! ఇప్పుడెలా? సార్ ప్రొసీడ్ అయిపోతున్నారు. పెళ్లి ముహూర్తం కోసం రేపే పంతులుగారితో ఎపాయింట్‌మెంట్. నేను కళ్యాణ మండపం ఫిక్సింగ్‌లో ఉన్నాను. విశ్వం ఇది అన్యాయం. ఇప్పుడు వెనక్కి వెళ్తే మనిద్దరికీ ఏం జరుగుతుందో తెలుసా?..’ అరచినంత పని చేశాడు వైకుంఠరావు.
‘తెలుసు. అయినా అన్యాయం ఏముంది దీనిలో. మేమేమీ ముందుకు వెళ్లమని ఆయనగారికి చెప్పలేదే. అంతా అతని ఇష్టమేనా? ఇదేమైనా ఫ్యాక్టరీ వ్యవహారమా? మాకూ ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా..’
నా ఎదురుదాడికి నిరుత్తరుడయ్యాడు వైకుంఠరావు. ఫోను కట్ చేసి ఇటు తిరిగేసరికి అందరి మొహాల్లో ప్రశాంతత. ‘హమ్మయ్య చెప్పేశారు కదా!’ మెచ్చుకోలుగా చూసింది శ్రీమతి.
‘అసలే మీ బాస్ రావణాసురుడు కదా. ఆఫీసులో ఇబ్బందులు రావూ? అయినా ఇంత ధైర్యం ఎలా వచ్చిందండి మీకు’ కాసేపు ఆగి ఆశ్చర్యంగా అడిగింది.
‘అదంతే. ఎల్లవేళలా ఒక్కళ్లదే కాదు టైము. మాకూ టైమ్ వస్తుంటుంది. నేను ఇప్పుడు ఉద్యోగం మారుతున్నాను. ఎక్కువ జీతం, ఎక్కువ స్థాయి. ఇవాళ నేను వెళ్లిన పని అదే. మా పోటీదారు కంపెనీతో మాట్లాడుకొని వచ్చాను. రేపే ఇక్కడ రిజిగ్నేషన్ ఇస్తున్నాను. నాతోపాటు పిచ్చయ్యని కూడా తీసుకుపోతున్నాను. ఇక ఎంత మాత్రం కాపురుషుడి పడగ నీడలో మేం వొదిగి వొదిగి ఉండనక్కరలేదు...’ ధీమాగా ప్రకటించాను.

చింతా జగన్నాథరావు
50, బాలాజీ అపార్ట్‌మెంట్స్
సీతమ్మపేట, విశాఖపట్నం-530 016
9848236995

-చింతా జగన్నాథరావు