S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తేడా తెలుస్తుంది

మనిషికి తన తోటిదే ప్రపంచం. తానున్నందుకే ఈ ప్రపంచం కూడా బాగుందనుకుంటాడు. చివరకు దేవుడిని కూడా తన రూపంలోనే ఊహించుకున్నాడు మనిషి. ఇక తమ గురించి తాము ఆలోచిస్తూ ఉంటే మనుషులకు తాము మాత్రం చాలా మామూలుగా ఉన్నామని, మిగతా వారంతా విచిత్రంగా ఉన్నారని అనిపిస్తుంది. ఆ మిగతా వారు కూడా వారికి మిగతా వారి గురించి అదే మాట అనుకుంటారు. అప్పుడు ఆ మిగతాలో మనం మిగులుతాం.
చైనా, పాకిస్తాన్‌లతో మన దేశం యుద్ధాలు జరిపిన రోజులవి. పాలమూరులో ఒక సినిమా హాల్‌లో టిక్కెట్ల కోసం వరుసలో నిలబడి ఉన్నాను. ఇంకా టిక్కెట్లు ఇవ్వడం మొదలుకాలేదు. వరస మాత్రం హనుమంతుడి తోకలాగ ఉంది. నా వెనుక ఒక సర్దార్జీ వచ్చి నిలబడి ఉన్నాడు. అంటే అది హిందీ సినిమా అని అర్థం. ఆ మనిషి పంజాబ్ నుంచి వచ్చాడు. బహుశా వ్యాపారం మీద వచ్చి ఉంటాడు. అతను ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి కాదని భావం. బుకింగ్ కిటికీ పక్కన మరో కిటికీ ఉంది. దాని మీద ఎమర్జెన్సీ బుకింగ్ అని రాసి ఉంది. అసలు అప్పటికి ఇంకా దేశానికి ఇందిరమ్మ బ్రాండ్ ఎమర్జెన్సీ గురించి అనుభవంలోకి రాలేదని గమనించాలి. వరుసలో నిలుచున్న సర్దార్దీ మాటలు కలుపుతూ ఎమర్జెన్సీ కిటికీ దేనికొరకు అని అడిగాడు. నిజంగానే నాకు తెలియదు. అదే మాట అతనికి చెప్పాను. ‘మీకు ఎమర్జెన్సీ అంటే ఏం తెలుస్తుంది?’ అని ఒక చిన్న ఉపన్యాసం దంచేశాడు. యుద్ధం తాకిడికి భయపడుతూ ఊళ్లోని దీపాలన్నీ ఆర్పివేసి బిక్కుబిక్కుమంటూ బతకడం గురించి చెప్పాడు. దక్షిణాది వారు ఇదంతా తెలియకుండా సుఖంగా బతుకుతున్నారు అన్నాడు. నిజంగానే దక్షిణ ప్రాంతానికి యుద్ధాల తాకిడి, దండయాత్రల ప్రభావం తక్కువని చరిత్ర చెపుతూనే ఉన్నది. ఎమర్జెన్సీ అనే మాటను సినిమా టికెట్లకు వాడినందుకు ఆయనకు చచ్చేకోపం వచ్చినట్టుంది. ‘మీ దక్షిణాది వాళ్లంతా పులుపు తింటారు, పిల్లల్ని కంటారు’ అనేశాడు. అతనితో వాదం వేసుకునే ధైర్యం నాకు అప్పట్లో లేకపోయింది.
ప్రపంచంలో అందరూ పిల్లలను కంటారు. కానీ పులుపు తినడం మాత్రం విచిత్రమయిన లక్షణమని నాకు ఆ తరువాతగానీ అర్థం కాలేదు. ఉత్తర భారతదేశంలో పులుపు కోసం నిమ్మకాయ, దానిమ్మ గింజల పొడి లాంటివి వాడతారు. చింతపండు వారికి దొరకదు. దిల్లీకి వెళ్లే ముందు అక్కడికి మాట్లాడి, ఏమయినా తేవాలా అని అడిగితే మా అన్నయ్యగారి అమ్మాయి మంచి చింతపండు తీసుకురమ్మని అడిగింది. మనకు చింతపండు లేనిదే దినం గడవదు. అక్కడి వారికి అదొక విచిత్రమయిన పదార్థం. దక్షిణాది వాళ్లుండే ప్రాంతాల్లో దుకాణదారులు చింతపండు అమ్ముతారు. కానీ దాని ధర ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది. కొంకణ దేశంలో ఖోకం అనే మరో పులుపు పదార్థాన్ని వాడటం కూడా గమనించాను. మన దగ్గర అది వెతికినా దొరకదు. హంపీలో బోలెడన్ని చింతచెట్లు ఉన్నా అక్కడి వాళ్లెవరూ పచ్చి చింతకాయలు వంటలో వాడేవాళ్లు కాదని నాన్న చెప్పాడు. పచ్చి చింతకాయలతో మజ్జిగ పులుసు కాస్తే లొట్టలేస్తూ తినేశారని నాన్న చెప్పడం బాగా గుర్తుంది.
మన దేశంలో ఉండే వైవిధ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. వంద మైళ్లు ప్రయాణం చేస్తే చాలు తిండి తీరు మారిపోతుంది. ఇక ఏకంగా దేశం ఆ చివరికి వెళ్లిపోతే తీరు మారడం కాదుకదా పూర్తి తారుమారు అవుతుంది. దిల్లీలో నేను మోమాటం లేకుండా మా అన్నయ్యగారి అమ్మాయి ఇంట్లో ఉన్నాను. లేకుంటే తిండికి తలవాచి తిరిగి వచ్చుండేవాడిని. అక్కడి వారికి ఆలుగడ్డలు, క్యాబేజి లాంటివి ఉడకేసుకు తినడం తప్ప మరొకటి తెలియదు. మనలాగ వేపుడు కూరలు ఎందుకోగానీ తినరు. మీ దగ్గర పొడి కూరలు దొరకవా అని ఒకచోట అడిగాను. హోటేల్ మనిషి ధీమాగా దొరుకుతాయి అన్నాడు. రెండు రొట్టెలు, కూర పట్టుకురమ్మన్నాను. వంకాయ కూర అని తెచ్చాడు. వంకాయ ముక్కలను నీళ్లలో ఉడికించి ఇంత ఉప్పు, కారం వేసినట్టుంది. అడిగితే ఇదే పొడికూర అంటూ వాదానికి కూడా దిగాడతను. మా అమ్మాయి, అల్లుడు నన్ను ఇంట్లో వదిలి దక్షిణానికి వెళ్లినా ఆ ఒకటి, రెండు వారాల్లో నేను తిండి కోసం పడ్డ తిప్పలు చెప్పనలవికానివి.
నేను వాళ్ల తిండి గురించి విమర్శిస్తూ రాసినట్టున్నాను. ఇక వాళ్లు దక్షిణ భారతదేశంలో తిండి గురించి వర్ణిస్తూ వెక్కిరించడం చెవులారా విన్నాను. మైదాతో రొట్టెలు చేస్తారని, మరేవేవో తింటారని వాళ్లు ఎంత ఆనందంగా చెప్పుకున్నారో నాకింకా గుర్తుంది. ఒక మిత్రుడిని మా ఊరికి రావచ్చు కదా అని మాట వరసకు పిలిచాను. ‘ఎందుకు నాయనా, ఆ తిండి తినలేక చావడానికా?’ అని మోమాటం లేకుండా అడిగేశాడు. మనం మిగతా వాళ్ల తిండి గురించి మాట్లాడుతున్నప్పుడు మనలో కూడా అదే ఆనందం కనిపిస్తుందని నాకు అప్పుడు అర్థమయింది. వైవిధ్యానికి అంతం ఎక్కడుందో తెలియదుగానీ, దిల్లీలో సీతాఫలమంటే గుమ్మడికాయ. ఇక మన దగ్గర సీతాఫలం అని పిలిచే పండును ఎర్రని కాగితాల్లో చుట్టి పైవరసల్లో పెట్టి చాలా అపురూపంగా అమ్ముతుంటారు. అలా అమ్ముతున్న పళ్లను మన దగ్గర ఊరికే ఇస్తామన్నా ఎవరూ తినరు. అంటే అవి అంత నాసిగా ఉంటాయన్నమాట.
ఎక్కడివారికైనా సరే మరో చోటి వారి తీరు విచిత్రంగా కనపడుతుందని పిండితార్థం. అది మన పద్ధతిలాగ లేకపోతే మనకు విచిత్రమే. భారతదేశాన్ని పడమటి దేశాల వారు కూడా ఈ రకంగానే వర్ణించుకుని చెప్పుకుంటారట. ఇప్పటికీ మన దేశంలో నగరాల్లో కూడా వీధుల్లో ఏనుగులు, లొట్టెపిట్టల మీద ఎక్కి తిరుగుతుంటారని, ఇక్కడ జనంలో సగం మందికయినా మాయలు, మంత్రాలు తెలిసి ఉంటాయని అనుకునేవాళ్లు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. మన దేశంలో రంగుల టెలివిజన్ కూడా వచ్చిన తరువాత ‘మీకు టీవీ అంటే తెలుసా?’ అని చేతులు తిప్పుతూ అడిగిన తెల్లదొరను నేను కళ్ళారా చూచాను. ‘బాబూ మాకు ఈ ఊళ్లోనే టీవీ స్టేషన్ కూడా ఉంద’ని అప్పట్లోనే చెబితే అతను బిత్తరపోయాడు.
మన దేశం గురించి పరిచయం చేస్తున్న ఒక వ్యాసాన్ని నేను ఒకప్పుడు ఇంటర్నెట్‌లో చదివాను. ‘ఆ దేశంలో దేవుళ్లు, స్వామీజీలు, ప్రాచీన కళ, ఆశ్రమాలు, గుళ్లు, లెక్కలేనన్ని శిథిలాలు మాత్రమే గాక మరో కొన్ని అంశాలు కూడా లేకపోలేదు. అక్కడ అంతులేని అడవులు, ఎడారులు, కొండలు ఉన్నాయి. వాళ్ల దగ్గర బోలెడంత సంపద ఉంది’ ఇలాగ సాగింది ఆ వ్యాసం. మన దేశం సాంకేతికంగా, చదువుల్లోను ఇంత సాధించిన తరువాత కూడా ప్రపంచం దృష్టిలో ఏనుగులు, పులుల దేశంగానే మిగిలిపోయిందని అర్థమా? పడమటి దేశాల నుంచి పరిశోధకులు, పర్యాటకులు వచ్చి మన దగ్గర జరిగిన ప్రగతిని చూస్తున్నారు. ఏం చూడదలుచుకుని వస్తే వారికి అదే కనపడుతుంది. నిజంగానే మన దేశం హీట్ అండ్ డస్ట్ అంటే వేడి, దుమ్ము కలది. లెక్కకు మించిన ప్రజలు, పర్యావరణ కాలుష్యం మన దగ్గర ఉన్నాయి. మనకు మాత్రం ఇదంతా మామూలుగా మన జీవితాలతో పెనవేసుకుపోయి కనిపించే పరిస్థితి. బయట వారికి మాత్రం ఇవి భయంకరంగా కనపడతాయి. యూరోప్ నుంచి వచ్చిన ఒక మిత్రుడు తానున్న నాలుగు రోజులు మంచినీళ్లు ముట్టకుండా బియర్ తాగి బతికాడు. వాళ్లకు మన దేశం అంత భయంకరంగా కనిపిస్తుంది.
ప్రపంచంలోకెల్లా పెద్దదయిన సినిమా పరిశ్రమ మన దేశంలోనే ఉంది. ఆఫ్రికాతో పోల్చదగిన అధ్వాన్నమయిన బతుకు తీరు మన దేశంలోనే ఉంది. అదే రోడ్డు మీద ఆడి కారు నడుస్తుంది, ఎద్దుల బండి నడుస్తుంది. హార్లే డేవిడ్‌సన్ మోటార్ సైకిళ్లు మన దగ్గర కూడా అమ్ముతున్నారు. అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఒకవేపు, అంతులేని బీదతనం మరోవేపు, అందర్నీ ఆకర్షించే అద్భుత కళలు ఒకవేపు, లంచగొండితనం మరోవేపు మన దేశంలో కనిపిస్తాయని నేను చదివిన వ్యాసంలో రాసుకున్నారు. నిజమే కదా! మన దేశంలో రుతుపవనాలు, బంతిపూలు, పేడ, దుమ్ము, రంగులు, శవాలు, పొగ, బూడిద, అన్నింటికన్నా మించి ప్రగతి సంగతి గురించి కట్టుకథలూ ఉన్నాయట. ఇవన్నీ ఇంకో దేశంలో లేవా? పడమటి వారికి మాత్రం మన దేశంలో ఇవే కనబడతాయి.

కె.బి. గోపాలం