S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రిటిక్-క్రియేటర్

కథల పోటీలో
సాధారణ ప్రచురణకు
ఎంపికైన రచన
***
వికాస్ ఓ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నాడన్న వార్త కొంతమంది నెటిజన్లని ఆకర్షించింది. ఇప్పటిదాకా అతనో ఫిల్మ్ క్రిటిక్. ఒకరిద్దరు నిర్మాతలు కూడా దీన్ని గమనించారు.
* * *
అదో ప్రైవేట్ సంభాషణ.
అందులో ముగ్గురు నిర్మాతలు, ఓ మేధావి వున్నారు.
‘జనానికి ప్రీచ్ చేయటం వేరు. నేరుగా రంగంలోకి దిగటం వేరు. వికాస్‌గాడి ప్రతిభ ఏంటో త్వరలో చూద్దాం’ అన్నాడు రమేష్.
‘ఓ కోటి రూపాయలు పోయినా వాడితో నేనే ఓ సినిమా తీద్దాం అనుకున్నాను’ అన్నాడు మహేష్, అతనో పెద్ద నిర్మాత.
గ్లోబల్ మార్కెట్‌ని పెంచుకుందాం అనుకున్నప్పుడు వికాస్ దెబ్బ వారికి తగిలింది. అతను ఓ ఛానల్‌లో ప్రతి శుక్రవారం విడుదలయిన సినిమాలను సమీక్షిస్తుంటాడు. దాంతోపాటు అతనికో ‘బ్లాగ్’ ఉంది. ప్రతి సినిమాకి అతను రేటింగ్ ఇస్తుంటాడు. ప్రేక్షకులు అతని సమీక్షలకు ఎలా ప్రతిస్పందించినా స్టేట్స్‌లో మాత్రం వికాస్ ఇచ్చే రేటింగ్స్ ప్రభావం ఉండేది. అలాంటి సినిమాలను కొనటానికి ఇష్టపడేవారు కాదు.
పెద్ద హీరోల సినిమాల అభిమానులు అతనికి ఫోన్లు చేసి వార్నింగ్‌లు ఇచ్చేవారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే ఒక్క రివ్యూతో వాటి భవిష్యత్‌ని నాశనం చేస్తున్నాడని వికాస్ మీద ఆరోపణ.
‘మిమ్మల్ని కోట్లు ఖర్చుపెట్టి సంవత్సరాల తరబడి ఎవరూ సినిమాలు తీయమనటం లేదు. మేం కూడా వందలు ఖర్చు పెట్టి సినిమాలు చూస్తున్నాం. ఓ సినిమా బయటకి వస్తే ఏమైనా అంటాం’ అని వికాస్ జవాబు.
ఈ-పత్రికలు, ఛానల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వికాస్‌లాంటి వారు చాలామంది తయారయ్యారు. వెబ్‌మ్యాగ్స్, బ్లాగులు తండోపతండాలుగా పెరిగిపోయాక ఎవరికి వారు అనుకూలంగా, వ్యతిరేకంగా తీర్పులు చెబుతున్నాక ఇంకో పరిణామం వచ్చింది.
పైరసీకన్నా ‘వికాస్’ లాంటి వారు ప్రమాదం అనుకుని కవర్లు పంపించటం, ప్రకటనలు ఇవ్వటం, ఆ రకంగా పూర్తిగా నెగెటివ్ వ్యూస్ రాకుండా నిర్మాతలు కొంతకాలం మేనేజ్ చేశారు. ఇంతమందిని మేనేజ్ చేయటం కష్టం అనుకుని వదిలేశారు. తమ వంతు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా మేధావులతో ఓ యుద్ధం చేయిస్తున్నారు.
క్రిటిక్స్‌గా వున్నవారి అర్హత ఏంటి? వారు ప్రధానంగా కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. మిగతా క్రాఫ్ట్‌ల గురిచి వారికున్న అవగాహన ఏమిటి? సినిమా గురించి ఎవరయినా మాట్లాడొచ్చు. ఇలాంటి వారిని చూసి జాలిపడాలి అని ఉదాహరణలతో చెప్పటం, కొంతమంది నెటిజన్ల మీద ప్రభావం చూపించింది. కొంతమంది ప్రపంచవ్యాప్తంగా ఏ విమర్శకుడూ గొప్ప సినిమా తీయలేదన్నారు. వారి విమర్శతో సంబంధం లేకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసిన సినిమాల లిస్ట్ ఇచ్చారు. ఇవన్నీ వారి చర్చలో వచ్చాయి. అప్పటిదాకా వింటున్న గోపాల్ మాట్లాడాడు.
‘మనుషులకి అహం రకరకాలుగా ఉంటుంది. చాలామందికి సినిమాలకు పని చేయాలనుంటుంది. అవకాశాలు రావు. నిర్మాతలతో పరిచయం పెంచుకోవటానికి క్రిటిక్ అవతారం దాలుస్తారు. మొదట్లో తీవ్రంగా ఉంటారు. తర్వాత రాజీపడి నాలుగు డబ్బులు సంపాదించుకోవటానికి పరిమితం
అవుతారు. ఇలాంటి సగం జ్ఞానవంతుల పట్ల నిజమైన సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది’ అంటూ ఓ ఉదాహరణ చెప్పాడు.
‘అతనో పెద్ద క్రిటిక్. ఆంగ్ల పత్రికలకు రాస్తుంటాడు. అతనో యువ కెమెరామన్ గురించి ఏ మాత్రం ఫొటోగ్రఫీ బాగుండలేదని విమర్శించాడు. అతను గాయపడ్డాడు. ఆ రంగంలో నిష్ణాతుడయిన వ్యక్తి అలాంటి విమర్శ చేసుంటే వినయంగా స్వీకరించేవాడు. క్రిటిక్‌కి కెమెరా, లైటింగ్ లాంటి విషయాల మీద కనీస అవగాహన లేదు. అతని విమర్శ వల్ల ఆ యువకుడి అవకాశాలు దెబ్బతిన్నాయి’
‘ఎవరా క్రిటిక్? ఆ కెమెరామెన్ ఎవరు?’ అని ప్రశ్నించారు.
‘అవన్నీ అనవసరం. మన నిర్మాతల్లో చాలామందికి డబ్బు వెదజల్లటం తప్ప సినిమా గురించి తెలియదు. అందుకే అలాంటి క్రిటిక్స్‌ని ఫాలో అవుతారు. స్వంత నిర్ణయాలు తీసుకోలేరు. ఇప్పుడు మీడియా ప్రభావం నిర్మాతల మీద ఉంది. ఓ మంచి సినిమా తీయటం కంటే కాంబినేషన్ల మీద ఆధారపడతారు’ అన్నాడు.
‘్ఫర్ములాని ఫాలో అవకపోతే రిస్క్ కదా’ అన్నాడు మహేష్.
‘్ఫర్ములాకి మీరు ఇచ్చే నిర్వచనం వేరు. ఫార్ములా ప్రకారం తీస్తున్న సినిమాలు సంవత్సరానికి రెండు హిట్ అవుతున్నాయి. మిగతా వాటికి నష్టం వచ్చినా బయటకి చెప్పుకోవటానికి లేదు. నా దృష్టిలో ఫార్ములా అనేది మారుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి’
‘అదెలా కుదురుతుంది?’
‘కథలు మన కడుపులో పుడితే అదే వస్తుంది. కట్టుకథల్తో రాదు’
‘గోపాల్ కూడా వికాస్‌లా మాట్లాడుతున్నాడు’ అన్నాడు బుజ్జి.
‘నేను మంచి సినిమా వస్తే ఎంజాయ్ చేస్తాను. అలాంటి ప్రయత్నం చేసేవాళ్లకు నేను అభిమానిని’
‘వికాస్ అద్భుతం చేయబోతున్నాడంటారు’ అన్నాడు రమేష్.
గోపాల్ మాట్లాడలేదు.
* * *
వికాస్ సినిమాకి దర్శకత్వం చేయటం అనేది కూడా ఓ ఫీలర్ అని కొందరు అనుకున్నా అతను ఛానల్స్‌లో కనిపించటం లేదు. రివ్యూలు చేయటం లేదు. బ్లాగ్‌లో పోస్టింగ్‌లు లేవు. అసలు జరిగిందిది.
నవీన్ అనే ఓ ఎన్.ఆర్.ఐ. వికాస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యాడు. అతనికి వికాస్ నచ్చాడు. ఆ రోజు ఫోన్ చేసి తనని తాను పరిచయం చేసుకున్నాడు.
‘వికాస్ మీ గమ్యం ఏమిటి?’ అన్నాడు సూటిగా.
‘తెలుగులో గుడ్ సినిమా రావాలనుకుంటున్నాను. ఈ రంగంలో నేను యాక్టివిస్ట్‌ని. నాకు ఏ వేదిక దొరికినా అదే మాట్లాడుతున్నాను’
‘గుడ్ సినిమా అంటే మీ అభిప్రాయం’
‘కలెక్షన్లు మాత్రమే వసూలు చేసేది కాదు. ఏ కంటెంట్ లేని సినిమాలను రెండు వేల థియేటర్లలో రిలీజ్ చేసి మొదటి వారం ఓపెనింగ్స్‌ని బట్టి సినిమాని నిర్ణయించటం కాదు. తెలుగు సినిమా అభిమానం, కులం, కలెక్షన్ అనే అంశాల చుట్టూ ఉంది. అందుకే మంచి సినిమా రావటంలేదు’
‘మీకు సినిమాకి చెంది అన్ని విభాగాల్లో పట్టు ఉందా?’
‘అఫ్‌కోర్స్. నేను సాహిత్యం చదువుతాను. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాను. హాలీవుడ్ నుండి వరల్డ్ మూవీస్ దాకా అన్నీ చూస్తుంటాను’
‘గుడ్. మీకో ప్రపోజల్. ఇప్పుడు రెడ్ కెమెరాలు వచ్చాయి. నేను మీకు నలభై లక్షలు ఇస్తాను. కొత్తవారితో సినిమా తీయండి. కథ విషయంలో నేను కలిగించుకోను. మీరు డైరెక్ట్ చేస్తానంటే చేయండి’ అంటుంటే కొద్దిక్షణాలు మాట్లాడలేకపోయాడు.
‘వికాస్‌గారూ...’ అన్నాడు అనుమానం వచ్చి.
‘వింటున్నాను నవీన్‌గారూ...’
‘మరీ నలభై లక్షలు అంటున్నారు...’
‘అలాంటి కథను ఎన్నుకోండి. సినిమాకి బడ్జెట్ కూడా అవసరం. ఇదో ప్రయోగం అనుకోండి. ఇంకో పది లక్షలు ఇస్తాను. అది నా కమిట్‌మెంట్. డబ్బులు వస్తే ఇవ్వండి. లాభాలు మీరు పంచుకోండి. ఈ మధ్య కో-ఆపరేటివ్ బేసిస్‌లో సినిమాలు తీస్తున్నారుగా’ అన్నాడతను.
‘ఆలోచిస్తాను’ అన్నాడు.
‘మీరు ఎప్పుడు ఓ.కె అంటే అప్పుడు మనీ ట్రాన్ఫర్ చేస్తాను. బట్ ఇంతకుమించి ఒక్క రూపాయి ఇవ్వను. మీరు సామాజిక అంశాల మీద కూడా మాట్లాడుతుంటారని నేను విన్నాను. ఎలాంటి కథాంశం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదని ఇంకోసారి చెబుతున్నాను’
‘్థంక్స్ నవీన్‌గారూ’ అన్నాడు.
అప్పటికప్పుడు వికాస్ మిత్రులతో, శ్రేయోభిలాషుల్తో సమావేశం అయ్యాడు. అందరూ సంతోషపడ్డారు.
కొత్త నటీనటులతో సినిమా తీసినా పేడింగ్ కింద సీనియర్ ఆర్టిస్టులని తీసుకుంటే బిజినెస్ అవుతుంది అన్నారు కొంతమంది.
‘వికాస్ నువ్వు సినిమా తీస్తున్నావంటేనే ఎదురుచూస్తారు. ముఖ్యంగా మనకి అనేక వేదికలున్నాయి. ఛానల్స్ నీకు సహకరిస్తాయి. మనం ఫేస్‌బుక్‌లో, వాట్సప్‌లో, యూ ట్యూబ్‌లో ప్రచారం చేద్దాం. మనకు సినిమా ఓ వారం రోజులు ఆడినా చాలు. శాటిలైట్ రైట్స్ ఉంటాయి. మనం అన్ని అవకాశాలు వాడుకుందాం’ అన్నారు ఇంకొందరు.
నవీన్ ఏభై లక్షలు పంపించాడు.
ఎలాంటి హడావిడి లేకుండా సినిమా మొదలయింది. నవీన్‌ని మాత్రం ఆహ్వానించారు. ‘నేను బిజీగా ఉన్నాను. ఫస్ట్ కాపీ వచ్చాక నేను వస్తాను. ఆల్ ది బెస్ట్’ అన్నాడు నవీన్.
సినిమా పూర్తి అయ్యాక ప్రమోషన్ మొదలుపెడదాం అనుకున్నారు. మొదటిరోజు షాట్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు వికాస్‌కి అందులోని ఇబ్బందులు అర్థం అయ్యాయి. ఇప్పటివరకు సినిమాలు చూసిన అనుభవం తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అతనే కథ - స్క్రీన్‌ప్లే - మాటలు సమకూర్చాడు.
దానికి ముందు తనను అభిమానించే ఓ రచయితతో ఓ వెర్షన్ డైలాగులు రాయించి, ఫైనల్ వెర్షన్ తయారుచేసుకున్నాడు. అయినా ఎప్పటికప్పుడు సెట్స్ మీద మార్పులు, చేర్పులు చేస్తున్నాడు. ముందు అతని డైలాగులు పలకటం నటులకు కష్టంగా ఉంది.
అదే సమయంలో ‘శరత్’ అనే మరో యువకుడు ఎలాంటి హడావిడి లేకుండా ఓ సినిమా మొదలుపెట్టాడు. అందుకుగాను రెండు సంవత్సరాలు కష్టపడి ఓ కథ తయారుచేసుకున్నాడు. కొంతమంది నిర్మాతలను కలుసుకుని కథ చెప్పాడు.
‘ఇలాంటి కథల్ని మేం తీస్తాం అని ఎలా అనుకున్నారు?’ అన్నారంతా. శరత్‌కి సినిమా అంటే అభిమానం - ప్రాణం. అతను ఐ.టీ. ప్రొఫెషనల్. స్టేట్స్‌లో జాబ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు - ఈ కథను నా స్వంత డబ్బుతో తీస్తాను అని. తను అనుకున్న బడ్జెట్‌కి సరిపోయే డబ్బు పక్కన పెట్టాక తన జాబ్‌కి రిజైన్ చేయాలనుకున్నప్పుడు అతనికి మరింత హైక్ ఇస్తామన్నారు. శరత్ తిరస్కరించాడు.
ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో అతనికి స్టేట్స్‌లో ఓ కెమెరామన్‌తో పరిచయం అయింది. అతనే గోపాల్ చెప్పిన వ్యక్తి. అప్పట్లో గాయపడ్డ అతను తెలుగు సినిమా రంగాన్ని వదిలి స్టేట్స్ వచ్చాడు. ఇప్పుడతను ఓ పెద్ద హాలీవుడ్ కంపెనీలో పని చేస్తున్నాడు.
‘మీరు నా సినిమాకి పని చేయగలరా?’ అని అడిగాడు శరత్.
‘తెలుగు సినిమాకా?’ అన్నాడతను అదోలా.
‘తెలుగులోనే తీయాలనుకుంటున్నాను. నా మాతృభాష కాబట్టి. నేను ఎన్నుకున్న కథాంశం మాత్రం మానవాళికి చెందింది. మీకు కథ చెబుతాను’ అన్నాడు శరత్.
‘తెలుగులో క్రిటిక్స్...’ అంటుంటే
‘మనం క్రిటిక్స్ కోసం సినిమా తీయటంలేదు. మీ గురించి నేను విన్నాను’ అన్నాడు. అతని పేరు రామకృష్ణ. అతను తలూపి...
‘ఓ రకంగా నాకు మంచి జరిగింది శరత్. ఆ రోజు గాయపడకపోతే, నేను ఆ రొచ్చులోనే ఉండేవాడిని. ఒక్కోసారి అలాంటి విమర్శల వల్ల మంచే జరుగుతుంది. అయినా మీరు ఆలోచించుకోండి. చిన్న సినిమాలు అక్కడ బతకడంలేదు’
‘నాకు తెలుసు. మన ఇండియన్ సినిమాలో లార్జర్ దేన్ లైఫ్ హీరో పాత్రల సృష్టి జరుగుతోంది. తెలుగులో ఇంకాస్త ఎక్కువ. సినిమా నాకు వ్యాపారం కాదు. ఇది డిజాస్టర్ అనుకుని దిగుతున్నాను’
‘ఇదే మీ చివరి సినిమానా?’
‘కాదు. మొదటి సినిమా. మళ్లీ వెనక్కి రావచ్చు. మళ్లీ సంపాదిస్తాను. అప్పుడు మరో సినిమా. నా జర్నీ అలా సాగుతుంది. సినిమాకి సినిమాకి మధ్య ఓ పక్కన నేను తీయబోయే కథ, అందుకు కావలసిన డబ్బూ తయారవుతుంటాయి’ అన్నాడు శరత్.
‘బాగుంది. మీ మొదటి సినిమాకి నేను పని చేస్తున్నాను’ అన్నాడు రామకృష్ణ. అలా ఆ ప్రయాణం మొదలయింది.
వికాస్ సినిమా పూర్తయింది.
అప్పటి నుంచి ప్రచారం మొదలయింది. కొన్ని ఏరియాలయినా బిజినెస్ చేయాలనే పట్టుదలతో ప్రోమోస్ కట్ చేశారు.
‘ప్రీవ్యూ’లు వేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు.
చిన్న సినిమాల్ని విడుదల అయ్యాక మాత్రమే తీసుకుంటాం - ప్రేక్షకుల రెస్పాన్స్‌ని బట్టి అంటున్నారు. విడుదల చేయటానికి ఎప్పటికప్పుడు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్స్ దొరకడంలేదు. ఏ మాత్రం గ్యాప్ వచ్చినా అయిదారు చిన్న సినిమాలు ఒకే వారం విడుదల అవుతున్నాయి.
నవీన్ ఇచ్చిన ఎవౌంట్ కంటే పది లక్షలు ఎక్కువ అయ్యాయి అనుభవం లేకపోవటంతో. రెండు మూడు నెలలు గడిచిపోయాయి. ఈలోగా నవీన్ వచ్చి ఆ సినిమా చూశాడు. పూర్తయ్యాక బయటకు వచ్చి కారు ఎక్కబోతూ వికాస్‌కి హేండ్‌షేక్ ఇచ్చి ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
ఇంకా వేచి ఉండటం అనవసరం అనుకుని వికాస్ మూడు థియేటర్లలో విడుదల చేశాడు తమ సినిమాని. అదే రోజు మరో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
రెండో రోజు పూర్తి అయ్యాక ఆ సినిమాని తీసేయటం ఓ విషాదం అయితే ఛానల్స్‌లో గాని, పత్రికల్లో గాని రివ్యూ రాకపోవటం వికాస్‌కి పెద్ద షాక్‌ని కలిగించింది.
* * *
శరత్ సినిమా పూర్తి అయింది. అప్పుడు కొన్ని ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వటం జరిగింది. అందులో ‘రామకృష్ణ’ గురించి ప్రత్యేక ఆర్టికల్స్ వచ్చాయి. ఓ తెలుగువాడి ప్రతిభను హాలీవుడ్ గుర్తించింది. మనం మాత్రం అతను ఎందుకూ పనికిరాని వాడని పంపించేశాం అని అందులో వచ్చింది.
‘శరత్ ఓ సాహసం చేశాడు. అతను రెగ్యులర్ సినిమా తీయవచ్చు. అందుకు అతను అంగీకరించలేదు. నా దృష్టిలో సాహసమంటే అరవై కోట్లు పెట్టి ఓ మషాళా సినిమా తీయటం కాదు. అలాగే ఏభై లక్షల్లో కోటి రూపాయలతోనే అమెచ్యూర్ సినిమా తీయటం కాదు’ అన్నాడు రామకృష్ణ.
గోపాల్ ఇవన్నీ చదివాడు.
మహేష్‌కి ఫోన్ చేసి ‘మనం ఆ సినిమాని ఓసారి చూస్తే బాగుంటుంది’ అన్నాడు. శరత్ సినిమాని చూశారు. ఓ దృశ్య కావ్యంలా ఉంది. ఈ దేశంలో ప్రధాన సమస్య అయిన ‘్భమి’ అందులో వస్తువు. అది వంద గజాలు కావచ్చు. వందలాది ఎకరాలు కావచ్చు. ఆ సమస్యని అత్యంత సహజమైన పాత్రల్తో అద్భుతంగా చిత్రించాడు.
అంతలోనే అతన్లోని వ్యాపారి బయటకు వచ్చాడు.
‘ఇది ఆడుతుందా?’ అన్నాడు.
‘నిన్ను వాళ్లు కోట్లు ఇవ్వమనటం లేదు కదా’ అన్నాడు గోపాల్ అతను ఆలోచిస్తుంటే...
‘నీ బ్యానర్ నుండి వస్తుందంటే ఇనీషియల్స్ ఉంటాయి. థియేటర్లు నా చేతిలో వున్నాయి. ఓ మంచి చిత్రాన్ని పంపిణీ చేసావన్న పేరు వస్తుంది. ముందు శాటిలైట్‌కి నువ్వు అమ్మగలవు’ అన్నాడు.
‘మా ఇంట్లో వారికి చూపిస్తాను’ అన్నాడు మహేష్.
వారందరూ చూశారు. ‘బాగుంది’ అన్నారు. మహేష్ అప్పుడు శరత్‌ని కలవాలనుకున్నాడు.
* * *
వికాస్‌కి నవీన్ నుండి ఓ లేఖ వచ్చింది.
డియర్ వికాస్-
మీ అభిప్రాయాలు, మీ నేపథ్యం గురించి తెలుసుకున్నాక మిమ్మల్ని సినిమా తీయమన్నాను. అందులో నేను జోక్యం చేసుకోలేదు. మీరు ఎలాంటి సినిమా తీశారు! మీరు నమ్మే వాటిని, మీరు రావాలనుకునే మార్పుని ఈ సినిమాలో చూపించలేకపోయారు. ఈ సినిమా ద్వారా ‘మెయిన్‌స్ట్రీమ్’లోకి రావాలనుకున్నారు. ప్రతి దర్శకుడూ తన సినిమా బాగుంది అనుకుంటాడు. మీరూ అలానే నమ్మారు. మీరు ఇంకో రకంగా తీసినా అది ఫెయిల్ కావచ్చు. కానీ ఓ మంచి చిత్రం తీశాడనే పేరు మిగిలేది. ఇప్పుడు అసలయిన విమర్శ - ఆత్మవిమర్శ మీరు మీ సినిమా మీద చేసుకుంటారనుకుంటాను.
ప్రీచింగ్ కంటే ఎక్కువగా జనంలోకి వెళ్లటం మంచిది. సినిమా పెట్టుబడితో కూడుకున్నది. అందుకే ఇంకొకరు మీ మీద ఇన్‌వెస్ట్ చేయటానికి సాహసించేలా మీరు ఎదగాలని కోరుకుంటున్నా.
* * *
మహేష్ శరత్ ముందు ఓ ప్రపోజల్ ఉంచాడు.
‘పూర్తిగా కొత్తవారితో ఇలాంటి సినిమా తీశారు. నాకు మీ నుండి ఓ మల్టీ స్టారర్ సినిమా కావాలి. నేను వంద కోట్లు అయినా పెట్టుబడి పెడతాను. మల్టీ లాంగ్వేజెస్‌లో తీస్తాను. అయితే ముందు కథ నాకు నచ్చాలి. అది కమర్షియల్‌గా ఉండాలి’ అనేది సారాంశం.
‘ఈ సినిమా విడుదల అయ్యాక నేను స్టేట్స్ వెళ్లిపోతాను’ శరత్ అన్నాడు.
‘అదేంటి. సినిమా మీద ప్రేమతో వచ్చారు కదా’
‘ప్రేమతోనే వెనక్కి వెళ్తున్నాను’
అర్థం కానట్లు చూశాడు.
‘ఈసారి నేను అనుకుంటున్న సినిమాకి ఎక్కువ బడ్జెట్ కావాలి. మీరు వంద కోట్లు ఇస్తానన్నా నేను చేయగలిగేది ఉండదు. అది తిరిగి వస్తుందో రాదో తెలియదు. ముందు హీరోలకున్న ఫాలోయింగ్‌ని బట్టి కథను మలచాలి. ఇంకా కమర్షియల్ ఫార్ములాలు చొప్పించాలి. అవి నేను చేయలేను. నా ఆలోచనలు, అవగాహన మేరకు నేను సినిమా తీసుకుంటాను. నష్టం నాది కావాలి. అప్పుడే ప్రతి రూపాయి ఎంత విలువయినదో అర్థం అవుతుంది’
‘ఇలాంటి వారిని చూడటం ఇప్పుడే’ అన్నాడు మహేష్.
‘సినిమా మీద ప్రేమంటే నా వరకు ఓ వందకోట్లు ఖర్చు చేసి ఓ మామూలు కమర్షియల్ తీసి ఫలితం కోసం ఎదురుచూడటం కాదు. అంత డబ్బుతో ఓ వంతెన కట్టించొచ్చు. ఇంకేదయినా మంచి పని చేయవచ్చు’ అన్నాడు.
అతను తలూపి చిన్నగా నవ్వుతూ
‘మీ సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అది సాహసమైనా!’ అన్నాడు.

**
పి.సృజన్‌సేన్
ఎఫ్ నెం.909, సఫైర్ బ్లాక్
మై హోమ్ జ్యువెల్
మదీనాగూడా, మియాపూర్
హైదరాబాద్-500 049
98495 16999

-సృజన్‌సేన్