S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అసలు-నకిలీ

టేబిల్ మీద చెల్లాచెదురుగా పడి ఉన్న పురాతన వస్తువులని చూసిన హోవర్డ్ ఆ టేబిల్‌ని దాటి ముందుకి వెళ్లబోతూ చటుక్కున ఆగి మళ్లీ దాని వంక చూశాడు. అతని గుండె లయ తప్పింది. కొద్దిగా ముందుకి వంగి ఆ పింగాణీ బొమ్మ వంక చూశాడు. అది ఫ్లూట్‌ని వాయించేవాడి బొమ్మ.
హాంకాంగ్‌లోని చియాంగ్స్ ఎంపోరియంలో పురాతన వస్తువులు దొరుకుతాయని అతను బస చేసిన హోటల్‌లోని రిసెప్షనిస్ట్ హోవార్డ్‌కి ఆ ఉదయమే చెప్పాడు. అక్కడ చైనీస్ ఆయుధాల నించి, ఒకప్పుడు చైనా గ్రామస్థులు ధరించిన మాసి చిరుగులు పట్టిన దుస్తుల దాకా అక్కడ లభిస్తాయని అతను చెప్పాడు.
హోవార్డ్‌కి పురాతన ఆయుధాల గురించి, దుస్తుల గురించి పెద్దగా తెలీదు. కాని పింగాణీ వస్తువుల గురించి బాగా తెలుసు. తన కళ్లు తనని మోసం చేయకపోతే చియాంగ్ దుకాణంలోని చెత్త సామాను మధ్య చైనీస్ పురాతన పింగాణీ వస్తువు తన కంట పడిందని హోవార్డ్ నమ్మాడు. ఫ్లూట్‌ని వాయించేవాడి ఆ బొమ్మ ఆరంగుళాల ఎత్తు మించి లేదు. దుమ్ము అలుముకున్న అది తళతళలాడటం లేదు. దాన్ని చేత్తో అందుకుని పరిశీలించాడు. అది చక్కగా వౌల్డ్ చేయబడి కొలిమిలో సరిగ్గా కాల్చబడిందని గ్రహించాడు.
చైనీస్ రాజుల సమాధుల్లో ఉంచిన పింగాణీ వస్తువులు అలాంటివే. ఎంతకాలం క్రితం? టేంగ్? అది టేంగ్ రాజులకి చెందినదైతే పది సంవత్సరాలు అటూ ఇటూగా కనీసం పనె్నండు వందల ఏళ్ల క్రితంది అయి ఉంటుంది. అంతదాకా తను సేకరించిన పింగాణీ వస్తువుల్లో అది తలమానికం అవుతుందని హోవార్డ్ భావించాడు.
అతని దగ్గరికి వచ్చిన మధ్య వయస్కుడైన ఓ చైనీస్ హోవార్డ్ వంక నవ్వుతూ చూస్తూ చెప్పాడు.
‘చాలా పాతది సార్’
అతని ఇంగ్లీష్ ఉచ్ఛారణ అర్థం అయేలా ఉంది.
‘మీరేనా మిస్టర్ చియాంగ్?’ ఆ వ్యక్తి బిజినెస్ సూట్లో ఉండడంతో హోవార్డ్ ప్రశ్నించాడు.
బదులుగా అవునన్నట్లుగా చియాంగ్ ముందుకి కొద్దిగా వొంగి అభివాదం చేశాడు.
‘అవును సర్. మీకు ఆసక్తికరమైంది ఏదైనా కనిపించిందా?’ అడిగాడు.
హోవార్డ్ గొంతు సర్దుకుని అడిగాడు.
‘ఈ పింగాణీ బొమ్మ నిజంగా పురాతనమైనదేనా?’
‘మా ఎంపోరియంలో నిజమైన పాత వస్తువులు తప్ప నకిలీ ఆధునికమైనవి ఒక్కటీ లేదు సార్’
‘ఇది ఏ పీరియడ్‌కి చెందినది?’
‘టేంగ్ డైనాస్టీకి. ఒరిజినల్ అని హామీ’
‘టేంగ్! దీని ధర ఎంత?’
‘మంచి కండిషన్‌లో ఉన్న టేంగ్ కాలానికి చెందిన పింగాణి బొమ్మలు ఇప్పుడు పెద్దగా మార్కెట్లో లేవు. అందుకని నేను చెప్పే ధర మీకు ఎక్కువగా తోచచ్చు’
‘ఎంతో చెప్పండి?’
‘వెయ్యి డాలర్లు సార్’
‘హాంకాంగ్ డాలర్స్?’
‘నో సర్. అమెరికన్ డాలర్స్. వృధా చేసేందుకు మీకు సమయం ఉంటే తప్ప దయచేసి బేరం ఆడకండి. వెయ్యి డాలర్లు సరసమైన ధర. పురాతన వస్తువుల గురించి తెలిసిన ఎవరైనా అది నిజమే అంటారు’
‘నేను ఎవర్నీ అడగక్కర్లేదు మిస్టర్ చియాంగ్. అది సరైన ధర అని నాకు తెలుసు’
అమెరికాలోని పింగాం పురాతన వస్తువులని సేకరించే వారు టేంగ్ వంశానికి చెందినవి అపురూపంగా భావిస్తారని హోవార్డ్‌కి తెలుసు. కారణం చైనా కమ్యూనిస్ట్ దేశంగా మారాక అక్కడి నించి బయటికి పురాతన వస్తువులు రావడం నిలిచిపోయింది. నెల క్రితమే హోవార్డ్ న్యూయార్క్‌లోని ఓ షాపులో టేంగ్ వంశానికి చెందిన ఓ పింగాణీ వస్తువుని మూడు వేల ఒక్క వంద డాలర్లకి కొన్నాడు. అది దీనంత తీర్చిదిద్ది లేదు.
‘మీరు ట్రావెలర్స్ చెక్స్ అంగీకరిస్తే దీన్ని తీసుకుంటాను’ చెప్పాడు.
చియాంగ్ మళ్లీ ముందుకి వొంగి అభివాదం చేశాడు.
‘్థంక్ యూ సార్’ చెప్పాడు.
అతను షాపు తలుపు తెరుచుకుని వెనుక గదిలోకి వెళ్లి లోపల తుక్కు కాగితాలు ఉన్న పెట్టెని, పత్తిని తెచ్చి పత్తితో ఆ బొమ్మ మీది దుమ్ముని తుడిచాడు. దాన్ని ఆ పెట్టెలో ఉంచి మూసి మూత తెరచుకోకుండా టేప్‌ని అతికించాడు. దాన్ని మళ్లీ పాత దినపత్రికలో చుట్టి టేప్ అతికించాడు.
‘మా ఎంపోరియంలో మీకు ఇంకేమైనా నచ్చాయా? చూడండి. ఇంకా మంచివి చాలా ఉన్నాయి’
‘టేంగ్ పింగాణీలు ఉంటే తప్ప ఇంకేం వద్దు’
చియాంగ్ తలెత్తి చూసి అడిగాడు.
‘మీరు పురాతన వస్తువుల డీలరా సర్?’
‘కాదు. సేకరణదారుడిని. చైనీస్, పర్షియన్, రోమన్ పింగాణీ వస్తువుల్ని మాత్రమే సేకరిస్తూంటాను. ఐతే దీన్ని ఇటీవలే ఆరంభించాను. వీటి గురించి ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను’
‘కాని దీన్ని చూడగానే మీరు టేంగ్ పింగాణీగా గుర్తు పట్టారు’ చియాంగ్ మెచ్చుకోలుగా చెప్పాడు.
హోవార్డ్ ట్రావెలర్స్ చెక్స్ మీద సంతకం చేసి ఇచ్చాక అంతకు మునుపు దాని మీద ఉన్న సంతకంతో పోల్చి చూసి వాటిని డ్రాయర్లో వేసి చియాంగ్ చెప్పాడు.
‘కొద్దిసేపటి క్రితం టేంగ్ పింగాణీలు దొరకడం ఈ రోజుల్లో కష్టం అని మీకు చెప్పాను. అది నిజం. కాని రెడ్ చైనాలో సరైన కాంటాక్ట్స్ ఉన్న వారికి అవి అందుతూనే ఉన్నాయి’
‘మీకూ అలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయా?’
చియాంగ్ అభివాదం చేశాడు.
‘అంటే మీ దగ్గర ఇంకా టేంగ్ పింగాణీ వస్తువులు ఉన్నాయా?’
చియాంగ్ నవ్వుతూ మళ్లీ అభివాదం చేశాడు. హోవార్డ్‌లో ఉత్సాహం ప్రవేశించింది.
‘ఎక్కడ ఉన్నాయి? ఎంపోరియంలోనేనా?’
‘ఇంకెక్కడ ఉంటాయి. దయచేసి నాతో రండి మిస్టర్...?’
‘హోవార్డ్’
అతని వెంట హోవార్డ్ కర్టెన్ తెరచుకుని లోపలికి నడిచాడు. ఎదురుగా మూడు షెల్ఫ్‌లు కనిపించాయి. ఓ తాడు లాగి చియాంగ్ లైట్స్ వెలిగించాడు. షెల్ఫ్‌ల మీద గాజులు, టీ పాట్స్, వెండి చాప్‌స్టిక్స్ లాంటివి కనిపించాయి. ఓ అరలో పింగాణీ వస్తువులు కనిపించాయి. వాటి దగ్గరికి వెళ్లి చూశాడు. ఇందాక తను కొన్న టేంగ్ పింగాణీ బొమ్మలా అవి అసలైన పురాతనమైనవిగా కనిపించాయి.
సంగీత వాయిద్యాలని వాయించేవారు, గుర్రాలు, సైనికులు... మొత్తం ఇరవై ఎనిమిది బొమ్మలు ఉన్నాయి. ఒకటి అందుకుని కిటికీ దగ్గరికి వెళ్లి సూర్యుడి వెలుగులో దాన్ని పరిశీలించాడు.
‘టేంగ్. ఇది నిజమైంది. మంచి కండిషన్‌లో ఉంది. చాలా చవక’ చియాంగ్ నవ్వుతూ చెప్పాడు.
‘ఇందాక మీకు చెప్పినట్లుగా నేను వాటిని కొత్తగా సేకరిస్తున్నాను. నకిలీవి ఏవో, అసలైనవి ఏవో కచ్చితంగా తెలుసుకోలేను. కాని ఇవి నిజమైనవిగా కనిపిస్తున్నా, చైనా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లాక టేంగ్ నకిలీలు మార్కెట్లోకి చాలా వచ్చాయని విన్నాను’
‘మీరు చెప్పింది నిజమే. కానీ నాకు చైనాలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పాగా’
‘చాలా మంచి కాంటాక్ట్స్ అయి ఉండాలి’
‘అందుకే ఇవి నిజమైనవని మీకు మాట ఇస్తున్నాను. ఒకోటి వెయ్యి డాలర్లే.
‘కాని ఇవి అసలైనవని ఎలా నమ్మడం? పర్యాటకుల కోసం వీటిని వందల సంఖ్యలో తయారుచేసి ఇలాంటి దుకాణాలకి అమ్మకానికి పంపి ఉండచ్చుగా?’
‘మిస్టర్ హోవార్డ్. ఇవి టూరిస్ట్ సావనీర్లని మీ అనుమానమా?’
‘సారీ. కాని అవును’
‘నేను మిమ్మల్ని తప్పు పట్టను సర్. హాంకాంగ్ మార్కెట్‌లో అలాంటివి చాలా ఉన్నాయి అని నాకు తెలుసు. కాని ఇవి అవి కావు. ఇవి అసలైనవి మీరు నిర్ధారణ చేసుకోవచ్చుగా?’
‘ఎలా?’
‘వీటిని నిపుణుడైన వాడికి చూపించి అతని అభిప్రాయం తీసుకుని’
‘అలాంటివారు ఎవరున్నారు?’
‘మీరు అమెరికన్ కదా?’
‘అవును’
‘మీరు ఎక్కడి నించి? న్యూయార్క్?’
‘అవును’
‘మీకు ఫిలడెల్ఫియా తెలుసు కదా? పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉందది’
‘తెలుసు’
‘అక్కడ ఉన్న ప్రొఫెసర్ కాంగ్ సాన్ ఫేట్‌కి వీటిని చూపించి నిర్ధారించుకోవచ్చు’
‘ఆయన ఎవరు?’
‘ప్రపంచంలోని పురాతన చైనీస్ వస్తువుల వ్యాపారంలో ఉన్నవారంతా ఆయన పేరు విని ఉంటారు. ఆయన విర్నర్ కాలేజీలోని ఓరియెంటల్ ఆర్ట్స్ విభాగానికి హెడ్. మీరు చైనీస్ పురాతన పింగాణీని సేకరిస్తూ ఆయన పేరు వినకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ హోవార్డ్. మీ అమెరికన్స్‌లో నిజాయితీ అధికం. అతను నిర్ధారించాకే నాకు డబ్బు చెల్లించండి’
‘నేను విన్నాను. అందుకే మీరు ప్రతిపాదించింది అంగీకరిస్తున్నాను మిస్టర్ చియాంగ్. ఈ ఇరవై ఎనిమిది బొమ్మలని నేను నా వెంట తీసుకెళ్లి ఆయన్ని కలుస్తాను. ఆయన ఇవి పురాతనమైనవే అని చెప్తే మిగతా మొత్తానికి మీకు చెక్ పంపుతాను. ఈ ప్రతిపాదనకి థాంక్స్. ఇవి అసలైనవి లేదా నకిలీవైనా సరే. ఇవి చాలా అందంగా ఉన్నాయి.’
చియాంగ్ అభివాదం చేసి చెప్పాడు.
‘్ధర కన్నా అది ముఖ్యం’ చియాంగ్ వాటిని జాగ్రత్తగా పేక్ చేసి ఇచ్చాడు.
* * *
ప్రొఫెసర్ కమ్ సూన్ ఫేట్ బి.ఏ, ఎం.పీ, పిహెచ్‌డి, ఎంఎఫ్‌ఏ అన్న బోర్డ్‌ని అతని గది బయట హోవార్డ్ చదివాడు. ఐతే అతని వయసు ముప్పై ఐదు దాకానే ఉంటుందని గ్రహించి ఆశ్చర్యపోయాడు. అతని కళ్లజోడు అతని మొహంలో కనపడే తెలివితేటలని పెంచుతోంది.
‘బిజీగా ఉండే మీరు నాకు కొంత సమయం కేటాయించినందుకు థాంక్స్’ అతని ముందు కుర్చీలో కూర్చున్నాక హోవార్డ్ చెప్పాడు.
‘చైనీస్ పింగాణీని ప్రేమించే ఎవరికైనా నేను నా సమయాన్ని కేటాయిస్తాను మిస్టర్ హోవార్డ్. ముఖ్యంగా వాళ్లు నాకు కన్సల్టింగ్ ఫీజ్‌ని ఇస్తున్నప్పుడు’ అతను చిరునవ్వు నవ్వాడు.
‘మీ ఉత్తరంలో మీరు టేంగ్ వంశానికి చెందిన పింగాణీ వస్తువులు తెస్తున్నానన్నారు. అవి అసలువి కావేమోనన్న అనుమానాన్నికూడా వ్యక్తపరిచారు అవునా?’
‘అవును. నా దగ్గర ఉన్నవి విలువైనవో నకిలీవో దయచేసి చెప్పగలరా? నా దగ్గర ఇరవై తొమ్మిది బొమ్మలు ఉన్నాయి. అన్నీ ఒకేసారి ఒకరి నించే కొన్నాను’
‘కాని ఆ ఒకరి నిజాయితీ గురించి మీకు తెలీదు. అవునా?’
‘అవును’
‘అతను పాత వస్తువులు అమ్మే వ్యాపారస్థుడో లేదా డబ్బు అవసరం అయి అమ్మే సేకరణదారుడో అయి ఉండచ్చు కదా? అమెరికన్ షాపులో కొన్నారా?’
‘లేదు. హాంకాంగ్‌లో. పర్యాటకులకి సావనీర్లని అమ్మే షాపది’
తనతో తెచ్చిన తోలు సంచీ లోంచి మెత్తటి కాగితాల్లో చుట్టిన ఆ ఇరవై తొమ్మిది బొమ్మలని తీసి అతని ఎదురుగా టేబిల్ మీద ఉంచాడు. అతను వాటిని ముట్టుకోకుండా ముందు దీక్షగా కాసేపు పరిశీలించాడు. తర్వాత తన సన్నటి చేతిని చాపి ఒకదాన్ని అందుకుని, డ్రాయర్లోంచి శక్తివంతమైన ఓ భూతద్దాన్ని తీసుకుని ఆ పింగాణీ వస్తువుని అన్ని వైపులా తిప్పి నాలుగైదు నిమిషాలు పరిశీలించాడు. అలా ఒకదాని తర్వాత మరొకటి చొప్పున ఆ ఇరవై తొమ్మిది బొమ్మలు పరీక్షించాక బల్ల మీద ఓ వైపు ఇరవై ఏడు, మరో వైపు రెండు బొమ్మలు ఉంచాడు.
మొత్తం పరిశీలించడానికి అతనికి గంట పైనే పట్టింది. హోవార్డ్‌కి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనా తన పనిలో నిమగ్నమై పోయిన అతన్ని ప్రశ్న వేసి భంగపరచడానికి జంకాడు. ఆ నిపుణుడు తన పనిని ముగించాక చెప్పాడు.
‘ఈ ఇరవై ఏడింటిలో నాకు ఎలాంటి సందేహం లేదు’
‘నకిలీవనా?’
‘అసలైన టేంగ్ పింగాణీలవి. ఎలాంటి అనుమానం లేదు. ఈ రెంటిలో ఒకటి కచ్చితంగా నకిలీదే. ఇంకోటి చెప్పలేను. వీటిని అమ్మిన వ్యక్తిని మోసగాడు అని నిర్ధారించే హక్కు నాకు లేదు. అవకాశం లేదు’
‘అవి మాత్రం నకిలీవే అంటారా?’
‘అవును. ఇది నకిలీది దీనికి ఎంత చెల్లించారు?’ దాన్ని పక్కకి జరిపి అడిగాడు.
‘వెయ్యి అమెరికన్ డాలర్లు’
‘అవకాశం ఉంటే వెనక్కి ఇచ్చి దాన్ని తీసేసుకోండి. ఇది పనె్నండేళ్ల క్రితంది. కొంత నిర్లక్ష్యంగా కూడా కాల్చి ఉండచ్చు. లేదా పనె్నండు నించి పాతిక ఏళ్ల క్రితం చేసిన తెలివైన నకిలీ పనివాడి పని అయి ఉండచ్చు. రంపపు పొట్టు, మట్టి కలిపిన కుండలో దీన్ని కనీసం పదేళ్లు ఉంచారు. అందువల్ల పాతదిలా కనిపిస్తుంది. కాని టేంగ్ బొమ్మల్లోని ముక్కు అంచుకి, దాని అంచుకి చాలా తేడా ఉంది. సూక్ష్మమైన తేడా అయినా అది పెద్ద తేడా కాబట్టి దీని ఖరీదు పది డాలర్లని మించదు. కాబట్టి దీన్ని తిప్పి పంపండి. నమ్మకం లేనప్పుడు కొనడం దేనికి? కాకపోతే మీరు మరో నూట ఏభై డాలర్లని ఖర్చు చేస్తే దీన్ని శాస్ర్తియంగా లేబరేటరీలో పరీక్షించచ్చు. ఆ లేబొరేటరీ ఎడ్రస్ ఇస్తాను. కాని నా సలహా అది దండగని. ఇంతదాకా నకిలీలుగా పసి కట్టినవన్నీ లేబ్ టెస్ట్‌లో కూడా నకిలీవిగానే రూఢి అయ్యాయి. నకిలీది చేసేవాడు అసలు దానిలా చేయలేడు. సంతకం ఫోర్జరీ చేస్తే ఎలా చిన్న తప్పు అది ఫోర్జరీ పట్టిస్తుందో అలా అవయవ నిర్మాణంలోని చిన్న తప్పుని కూడా నేను పసిగట్టగలను. దీన్ని నేను మరోసారి పరీక్షించాల్సి ఉంది. ఒకటి రెండు చోట్ల పెద్ద తేడాలు కనిపించాయి - సూక్ష్మమైనవి’ ఆయన తన కంటికి ఇంకో భూతద్దం తీసి అమర్చుకుని, దాని టేబిల్ లేంప్ వెలుతురులో మరో ఐదారు నిమిషాలు పరిశీలించాక లైట్‌ని ఆర్పాడు. భూతద్దాన్ని తీసేసి చెప్పాడు.
‘ఇదీ అసలైనదే. కాని ఆ ఇరవై ఏడు చెప్పినంత నమ్మకంగా మాత్రం చెప్పలేను. ఇరవై ఎనిమిదిలో ఆ నకిలీది ఎలా కలిసిందో? బహుశా ఆ షాపతన్ని వీటిని సరఫరా చేసినవాడు మోసం చేసి ఇచ్చి ఉంటాడు’
‘లేదు. ఇది వేరే చోట ఉంది. మిగిలిన ఇరవై ఎనిమిది మరోచోట ఉన్నాయి’
‘అంటే నకిలీదని తెలిసి, దీన్ని అసలుదిగా మీకు అంటగట్టి ఉంటాడు. లేదా ఫోర్జరీది అని తెలీక కూడా అమ్మి ఉండచ్చు. ఎందుకంటే నేను చూడని’
‘్థంక్స్’ చెప్పి హోవార్డ్ నకిలీ వాటి కాగితాల మీద ఇంటూ గుర్తు పెట్టుకున్నాడు. వాటిని తీసుకుని బయటికి నడిచాడు.
* * *
రెండు వారాల తర్వాత డాక్టర్ ఫేట్‌కి హాంకాంగ్‌లోని చియాంగ్ నించి ఫోన్‌కాల్ వచ్చింది.
‘చెప్పండి అంకుల్’ కంఠం గుర్తు పట్టిన ఫేట్ చెప్పాడు.
‘ఇవాళ నాకు పోస్ట్‌లో హోవార్డ్ నించి ఇరవై ఏడు వేల డాలర్లకి చెక్ వచ్చింది. అందులోని సగం ఎప్పటిలానే మీ అమ్మ అకౌంట్‌కి బదిలీ చేశాను’
‘్థంక్స్ అంకుల్. మీరు ఎవర్ని పంపినా అసలువని నేను నమ్మిస్తాను అని హామీ. కాని అంకుల్, ఇంత దాకా ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్లు లేరు. అంతా చెక్స్ పంపారు.అంత డబ్బుని వాళ్లు మోసం చేయకుండా ఇస్తారని మీరు ఎలా గ్రహించగలరు?’ ఫేట్ ప్రశ్నించాడు.
‘ఆర్థిక లావాదేవీల్లో వారు తొంభై తొమ్మిది శాతం నమ్మకంగా వ్యవహరిస్తారు. నేను స్టేన్‌ఫోర్డ్‌లో చదివేటప్పుడు ఏంత్రోపాలజీ ప్రొఫెసర్ పాశ్చాత్యుల మెదళ్లు ఎలా పని చేస్తాయో వివరించాడు. ఒకటి అసలుది అని నమ్మితే, దాంతోపాటు కొన్న దాని పక్కది కూడా అసలువే అని నమ్ముతారు. ఇది ఆయన ఇచ్చిన ఉదాహరణ. ఓ అమెరికన్ ఓసారి రెడ్ ఇండియన్స్ ఒకరి వెనుక మరొకరు నడుస్తారని తన మిత్రుడికి చెప్పాట్ట. అది ఎలా తెలుసని అడిగితే ఇద్దరు రెడ్ ఇండియన్స్ ఒకరి వెనుక మరొకరు నడవడం చూశాను అన్నాట్ట. దాన్ని నమ్మి రెడ్ ఇండియన్స్ తెగ అందరికీ దాన్ని ఆపాదించడం వెస్ట్రన్ మైండ్ చేసే పని’
‘హోవార్డ్ డబ్బు పంపుతాడని మీకు ముందే ఎలా తెలుసు?’
‘ఆ ప్రొఫెసర్ చెప్పిన మరొకటి నేను మర్చిపోలేదు. అమెరికన్ సంస్కృతిలో నిజాయితీగా వ్యవహరించడం ప్రధాన భాగం. ఎదుటి వారు చెప్పేది తూర్పు వైపు వారు, అంటే మనం అది నిజం అని రుజువు అయ్యేదాకా నమ్మం. కానీ అది అబద్ధం అని రుజువు అయ్యేదాకా పశ్చిమంలో నివసించేవారు నిజమని నమ్ముతారు. అందువల్ల హోవార్డ్‌ని నమ్మచ్చు అనుకున్నాను. పైగా హాంకాంగ్ హిల్టన్‌లో పనిచేసే నీ కజిన్ సియాన్ నా షాపు చిరునామా హోవార్డ్‌కి చెప్పాక హూరుూజ్ హూ అనే అమెరికన్ పుస్తకాన్ని చూసాడు. అలా అతని పేరుని బట్టి తోళ్ల వ్యాపారంలో కోట్లు గడించిన వ్యక్తి అని తెలుసుకున్నాడు. అంత ఆస్థిపాస్తులు గలవాడు ఇరవై వేల డాలర్లని ఎగ్గొట్టి బావుకునేది ఏమీ లేదు. అమెరికన్స్‌కి దేశభక్తి అధికం. ‘మీ అమెరికన్స్‌లో నిజాయితీ అధికం’ అనే మాట వేశాను. తన దేశ గౌరవాన్ని అతను పాడు చేయదలచుకోలేదు. బహుశా నేనా మాట అనకపోతే ఆ ఇరవై ఏడు వేల డాలర్లకి కక్కుర్తి పడేవాడేమో? ఎవరికి తెలుసు?’
‘అందుకే మీరు ఈ వ్యాపారంలో లక్షలు ఆర్జించారు. అంతేకాదు. నన్ను ఈ కోర్స్ చేయమని ఎందుకు చెప్పారో కూడా అర్థం అయింది’ ప్రొఫెసర్ ఆనందంగా చెప్పాడు.
*

(జేమ్స్ హోల్డింగ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి