S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కరపత్రాలు (స్ఫూర్తి)

సచ్ఛీంద్ర పక్కింటి ఆయనకి ఓ ఫర్నిచర్ దుకాణం ఉంది. ఆయన ఓ రోజు సచ్ఛీంద్రని అడిగాడు.
‘నీకు వేసవి సెలవులు కదా? ఉద్యోగస్థులకి బదిలీ అయే సమయం ఇది. నాకో పని చేసి పెడతావా? నీకు కొంత డబ్బిస్తాను’
‘ఏమిటది?’
‘రోజూ సాయంత్రం ఐదున్నర నించి ఆరున్నర దాకా సెంటర్‌లో నిలబడి నేను ఇచ్చే కరపత్రాలని ఆ దారిలో వెళ్లే పెద్దవాళ్లకి ఇవ్వాలి. వారానికి రెండు వందల ఏభై రూపాయలు ఇస్తాను’
సచ్ఛీంద్ర అందుకు ఒప్పుకున్నాడు.
‘నేను మీ నాన్న అనుమతి కూడా తీసుకున్నాక పనిలోకి వెళ్దువుగాని’ ఆయన చెప్పాడు.
సచ్ఛీంద్ర తల్లితో ఎక్సయిటింగ్‌గా పక్కింటి ఆయన చెప్పింది చెప్పాడు.
‘అది తేలికైన పనే అమ్మా! పక్కింటాయనతో నాన్నని కూడా సరే అనమని చెప్పు’ కోరాడు.
సోమవారం సాయంత్రం నించి సచ్ఛీంద్ర ఆ పనిలోకి ప్రవేశించాడు.
‘ఎలా ఉందా పని?’ సచ్ఛీంద్ర సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే తల్లి అడిగింది.
‘బావుంది. స్కూటర్ మీద వెళ్తూ లైట్స్ దగ్గర ఆగిన వాళ్లకి ఇస్తున్నాను’
బుధవారం సాయంత్రం సచ్ఛీంద్ర పది నిమిషాల ముందే ఇంటికి తిరిగి రావడం తల్లి గమనించింది.
‘ఏం? వచ్చేసావే?’ అడిగింది.
‘ఇవాళ నా ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడటానికి వెళ్తున్నానమ్మా. ఆలస్యం కాకూడదని వచ్చేశాను’
‘కాని పక్కింటాయన నిన్ను ఐదు నించి ఆరు దాకా కదా సెంటర్‌లో నిలబడమని కోరింది?’
‘నేను దాదాపు అన్ని కరపత్రాలని ఇచ్చేసానమ్మా. ఇంక పదో, పదిహేనో మాత్రమే మిగిలాయి. వాటిని రేపు ఇస్తాను’
‘ఓ నిమిషం కూర్చో. నీతో మాట్లాడాలి’ తల్లి కోరింది.
‘ఏమిటి? త్వరగా చెప్పు. నాకు టైమైంది’ కూర్చుని విసుగ్గా చెప్పాడు.
‘నీకు పక్కింటాయన చెప్పిన రెండు వందల యాభై కాకుండా రెండు వందల నలభై రూపాయలే ఇచ్చాడనుకో. అది సబబేనా?’ తల్లి అడిగింది.
‘సబబెలా అవుతుంది? రెండు వందల ఏభై ఇస్తానన్నాక అంతా ఇవ్వాలి’
‘నువ్వు రోజుకి ఎంతసేపు పని చేస్తావని ఆయనకి మాట ఇచ్చావో మరి అంతసేపు పని చేయకపోవడం సబబా?’ మళ్లీ ప్రశ్నించింది.
సచ్ఛీంద్ర బదులు చెప్పలేక నేలచూపులు చూశాడు. తర్వాత చేతిలోని క్రికెట్ బ్యాట్‌ని యథాస్థానంలో ఉంచి మిగిలిన కరపత్రాలని పంచడానికి వెళ్లాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి