S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒంటరి సాక్షి

టిమోథీ వాట్‌కిన్స్ తన మిత్రుడి ఇంటి తలుపు తట్టాడు. లోపలికి వచ్చిన టిమోథీని చూసి తలుపు తీసిన మార్కో అడిగాడు.
‘ఏమిటంత నీరసంగా ఉన్నావు? ఏమైంది?’
ఐతే తన మిత్రుడు టిమోథీ విచారంగా కనిపించడం మార్కోకి ఆనందానే్న కలిగించింది.
‘ఇంత అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చావేమిటి?’ మార్కో మళ్లీ ప్రశ్నించాడు.
‘టిమోథీ, మార్కో ఇద్దరికీ మిస్ షెరాన్ పరిచయం. ఆమె మార్కోని కాదని టిమోథీతో డేటింగ్ చేస్తోంది. అది మార్కోకి బాధగా ఉంది. ఆ రాత్రి టిమోథీ, షెరాన్‌లు ఓ రెస్ట్‌రెంట్‌కి భోజనానికి వెళ్లారని మార్కోకి తెలుసు. వారి మధ్య ఏదైనా చెడిందా అనిపించడమే మార్కోకి ఆనందం కలగడానికి కారణం. ఆ వర్షం రాత్రి వారిద్దరూ భోజనం చేశాక షెరాన్ ఇంట్లో గడుపుతారన్న ఆలోచనే మార్కోకి అంతదాకా బాధని కలిగించింది.
వర్షానికి తడిసి, బురద కాళ్లతో, పాలిపోయిన మొహంతో వచ్చిన టిమోథీని చూడగానే వారిద్దరికీ చెడిందని అనిపించింది.
‘చెప్పు మిత్రమా! షెరాన్‌తో గొడవ పడ్డావా?’ మార్కో కుర్చీలో కూలబడ్డ టిమోథీని ప్రశ్నించాడు.
‘ఎవరికీ ఇది చెప్పుకోలేనిది. కాని ఎవరికైనా చెప్పి తీరాల్సింది. అందుకని నీ దగ్గరికి వచ్చాను’ టిమోథీ బలహీనంగా చెప్పాడు.
‘మంచి పని చేసావు. రిలాక్స్ అయి విషయం ఏమిటో చెప్పు’
అనునయంగా చెప్పి మార్కో ఓ గ్లాస్‌లో విస్కీని వొంచి అతనికి ఇచ్చాడు. టిమోథీ ఆ మొత్తం ఒక్క గుక్కలో తాగి చెప్పాడు.
‘మార్కో నేను ఒకర్ని చంపాను’
‘ఏమిటి? నిజమా?’
మార్కో అదిరిపడ్డాడు.
‘అవును’
‘షెరాన్‌నా?’
‘్ఛ! కాదు. ఓ అపరిచిత వ్యక్తిని. అంతదాకా నేను ఎన్నడూ చూడలేదు. నా కారు అతన్ని గుద్దే దాకా అసలు అతను రోడ్ మీద ఉన్నాడన్న సంగతే నాకు గుర్తులేదు’

మార్కో టిమోథీ పక్కన కూర్చుని అతని భుజం మీద అనునయంగా చేతిని వేసి చెప్పాడు.
‘జరిగింది మొదటి నించీ వివరంగా చెప్పు’
‘నీకు అదంతా చెప్పి నిన్ను ఇన్వాల్వ్ చేయడం సబబా అని ఆలోచిస్తున్నాను’ టిమోథీ తేరుకుంటూ చెప్పాడు.
‘బుద్ధిలేకుండా మాట్లాడకు. నీకు ఈ ఆపదలో ఎవరైనా సహాయం చేయగలిగితే అది నేనే’
‘సరే. నేను, షెరాన్ ఓ రెస్ట్‌రెంట్‌కి వెళ్లాం. అక్కడ భోజనంతో పాటు నేను డ్రింక్ తీసుకున్నాను. భోజనం అయాక కూడా కాక్‌టెయిల్స్‌ని తాగాను. అక్కడ నించి నేను బయలుదేరేప్పుడు తప్పతాగి లేను. అలా అని తాగకుండా కూడా లేను. ఇంకో మనిషి ప్రాణం నా చేతుల్లో ఉంటుంది అని తెలిస్తే అసలు తాగేవాడినే కాను’
‘నువ్వు షెరాన్‌ని ఆమె ఇంట్లో దింపి వస్తూండగా ఈ ప్రమాదం జరిగిందా?’ మార్కో ప్రశ్నించాడు.
‘అవును. నేను ఆమె గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను. ఓ చౌరస్తాకి చేరుకుంటూండగా దూరం నించి ఓ లారీ కనిపించింది. అది వెళ్లిపోయింది కాని అందులోంచి ఓ మనిషి నడి రోడ్డు మీదకి దిగుతాడని నేను ఎదురుచూడలేదు. నేను ఆ చౌరస్తా దగ్గరికి నా కారు చేరుకునేదాకా వర్షంలో ఆ వ్యక్తి నాకు కనపడలేదు. అకస్మాత్తుగా లిఫ్ట్‌ని కోరుతూ చేతిని ఊపుతూ, రోడ్‌ని క్రాస్ చేస్తూండగా సడన్ బ్రేక్ వేశాను. ఆ రోడ్ మీది నీళ్లవల్ల నా కారు టైర్లు జారాయి. నేను అంత వేగంగా కారు నడుపుతున్నానని నాకు అంతదాకా తెలీదు. కారు పేవ్‌మెంట్ ఎక్కి ఆ అపరిచితుణ్ని గుద్దిన శబ్దం వినిపించింది. నేను కారుని ఆపి దిగి చూస్తే ఆ వ్యక్తి నాకు రోడ్ మీద ఎక్కడా కనపడలేదు. నేను డేష్ బోర్డులోని టార్చ్‌లైట్‌ని తీసుకుని పరిగెత్తుకెళ్లి చూశాను’ టిమోథీ చెప్పడం ఆపాడు.
‘అతను కనపడ్డాడా?’
‘ఆ. పేవ్‌మెంట్ అవతల నేల మీద కనిపించాడు. అతని తల నించి రక్తం కారుతోంది. ఎలాంటి కదలిక కాని, మూలుగు కాని లేదు. అతను మరణించాడు’
‘అది ఎలా చెప్పగలవు? స్పృహ తప్పి ఉండచ్చుగా? రోడ్ దిగి అతని దగ్గరికి వెళ్లి చూశావా?’ మార్కో అడిగాడు.
‘లేదు. అంత రక్తం చూశాక నాకు భయం వేసింది. వెంటనే నీ దగ్గరికి వచ్చాను. అతను తల పగిలి మరణించి ఉంటాడు’
‘అక్కడ నీ గుర్తులేమైనా వదిలావా? అతని మరణానికి, నీకు సంబంధం ఉందని తెలియజేసేవి ఏమైనా వదిలావా?’
‘నాకు తెలీదు’
‘ఐతే మనం వెంటనే వెళ్లి చూడాలి’
‘మార్కో! నిన్ను ఇందులోకి ఈడ్చటం నాకు ఇష్టంలేదు’
‘అది మర్చిపో. మనిద్దరం వ్యాపారంలో మాత్రమే భాగస్థులం కాము. ఒకరి కష్టాల్లో ఒకరు కూడా. ఆలస్యం చెయ్యకుండా వెళ్దాం పద’
టిమోథీ నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు.
‘నేనంటే నీకు ద్వేషం అనుకున్నాను. ముఖ్యంగా షెరాన్ అంటే నీకు ఇష్టం. కాని ఆమె నాతో డేటింగ్ చేయడం నీకు మనస్థాపంగా ఉంటుందని నమ్మాను’
‘టిమోథీ! నేను నువ్వు ఊహించిన దానికన్నా ఉత్తముడ్ని అని తెలుసుకో. పద’
హైవే చీకటిగా, తడిగా ఉంది. కారు హైవేలోని ఆ చౌరస్తాకి చేరుకున్నాక టిమోథీ చెప్పాడు.
‘అక్కడే. కుడివైపు’
మార్కో కార్‌ని అక్కడ ఆపి టార్చ్‌లైట్ తీసుకుని చెప్పాడు.
‘ఇంకో కారు వస్తూంటే నువ్వు కారు దిగి బోనెట్ తెరచి కారు పాడైనట్లు నటించు’
‘మార్కో...’
‘నువ్వు నాకు తర్వాత థాంక్స్ చెప్పచ్చు’
మార్కో హై వే పక్కన నిలబడి కిందకి చూశాడు. అతనికి అది తన జీవితానే్న మార్చేసే రోజు అనిపించింది. తన మిత్రుడికి సహాయం చేస్తున్నట్లు నటించి తర్వాత పోలీసుల దగ్గరకి వెళ్లి టిమోథీ మీద ఫిర్యాదు చేయడంవల్ల షెరాన్ తనకి దక్కుతుంది. వ్యాపారంలోని అతని భాగస్వామ్యం కూడా అతను జైలు నించి తిరిగి వచ్చేదాకా రద్దవుతుంది.
టార్చ్‌లైట్ వెలుగులో అతనికి ఏ శవం కనిపించలేదు. నెమ్మదిగా లైట్‌ని చుట్టుపక్కల ప్రసరించి నిశితంగా చూశాడు. అక్కడ పొదల్లోని కొమ్మలు తాజాగా విరిగిన గుర్తులు కనిపించాయి. అక్కడ ఓ మనిషి పడ్డాడని తెలిసిన వారు చూస్తే అది నిజం అని తెలిపే గుర్తులు కనిపించాయి. కాని అతను ఏడీ? అతనికి స్పృహ వచ్చి మళ్లీ రోడ్ మీదకి వచ్చిన గుర్తులు కనిపించాయి. బహుశ ఎవరో అతన్ని ఎక్కించుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఉండచ్చని మార్కోకి అనిపించింది. అతను మాయం అవడానికి ఇంకో కారణం తోచలేదు. కిందకి దిగి నిశితంగా చూస్తే రక్తంతో తడిసిన ఓ చేతి రుమాలు కనిపించింది. కాని వర్షానికి దాని మీది రక్తం మొత్తం కొట్టుకుపోయి తెల్లగా ఉన్న అది ఎవరిదో తెలియజేసే ఎలాంటి గుర్తులు లేవు. బహుశ అతను ఇప్పుడు ఏదో హాస్పిటల్‌లో పక్క మీద పడుకుని చికిత్స పొందుతూండవచ్చు. అతను తనకి జరిగింది ఫిర్యాదు చేసినా పోలీసులు సీరియస్‌గా తీసుకుని ఉండరు. బహుశ అతను మరణిస్తే అప్పుడు పోలీసులు దాన్ని సీరియస్‌గా తీసుకుని ఉండేవారు.
మార్కోకి ఇంకో పథకం చటుక్కున తట్టింది. అందువల్ల టిమోథీ తమ జీవితాల్లోంచి శాశ్వతంగా నిష్క్రమిస్తాడు. తన, షెరాన్ జీవితాల్లోంచి. రోడ్ ఎక్కి మళ్లీ వెళ్లి కార్లో డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు.
‘మనం తక్షణం ఇక్కడ నించి వెళ్లాలి’ కారు స్టార్ట్ చేస్తూ చెప్పాడు.
‘పోయాడా?’ టిమోథీ కొద్దిసేపాగి అడిగాడు.
‘ఆ. అతని శవాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా పూడ్చి పెట్టాలని అనుకున్నాను. కాని అది అనవసరపు తలనొప్పిని తేవచ్చు’
‘నేనిప్పుడు హంతకుడ్ని మార్కో’ అతను బాధగా చెప్పాడు.
‘అది నేను నమ్మను. వర్షంలో ఎవరికైనా పొరపాట్న డ్రైవింగ్‌లో ప్రమాదం జరుగుతూంటుంది’
‘నేను ప్రేమించే యువతిని పెళ్లి చేసుకోబోతున్నాను. చక్కటి ఆదాయం వచ్చే వ్యాపారంలో భాగస్వామిని. మరుక్షణంలో హంతకుడ్ని. రోడ్డుకి అడ్డంగా నిలబడ్డ ఆ దౌర్భాగ్యుడి వల్ల నా జీవిత గమనం తారుమారై పోయింది’ టిమోథీ ఆవేదనగా చెప్పాడు.
‘అది నిజం. దాన్ని నువ్వు అంగీకరించి తీరాలి’ మార్కో సానుభూతిగా చెప్పాడు.
‘నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏ క్షణంలో వస్తారో అని నాకు భయంగా ఉంది’
‘తాగి కారు నడపడం పెద్ద నేరం. కాని ఆ సమయంలో నువ్వు తాగి ఉన్నావని వారికి తెలీదు. షెరాన్ చెప్పచ్చు. చెప్పకపోయినా ఆ సమయంలో నువ్వు ఎక్కడ నించి వస్తున్నావని వారు విచారణ చేస్తారు. ఆ ప్రమాదానికి గంట ముందు నువ్వు బార్‌లో తాగి అక్కడ నించి వస్తున్నావని నీ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ ద్వారా తెలుసుకుంటారు. ఆ బిల్ ద్వారా ఏ మేర తాగావో తెలుసుకుంటారు. కాబట్టి తాగి లేను అని చెప్పడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనుకుంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నాలా ఆలోచించే పరిస్థితిలో లేవు కాబట్టి’
కొద్దిసేపాగి మళ్లీ మార్కో చెప్పాడు.
‘వర్షం రావడం మంచిదైంది. నీ కారు టైర్ గుర్తులు కొట్టుకుపోయాయి’
టిమోథీ మాట్లాడలేదు.
మార్కో మళ్లీ కాసేపాగి చెప్పాడు.
‘కాని ఆలోచిస్తే ఇదంత తేలిగ్గా పోయే వ్యవహారం అనిపించడంలేదు. నీ కారు అతన్ని
తాకాక అతని దుస్తులకి నీ కారు రంగు అంటుకుంటుంది. దాన్నిబట్టి ఫోరెన్సిక్ నిపుణులు అది ఏ మేక్‌దో కనిపెట్టగలరు. ఆ మేక్ కార్లన్నిటినీ పరిశీలిస్తారు. ఇంకా ఎన్నో ఇలాంటి మనకి తెలీని క్లూలు వాళ్లకి లభిస్తాయి అనుకుంటాను’
మరి కొద్దిసేపాగి చెప్పాడు.
‘ఇందులోంచి నువ్వు బయటపడే దారి ఒకటి ఉంది అనిపిస్తోంది’
‘ఏమిటది?’ టిమోథీ కంఠంలో ఆశ ధ్వనించింది.
‘మా ఇంటికి వెళ్లాక నేను నా దగ్గర ఉన్న నగదు మొత్తం నీకు ఇస్తాను. అది తీసుకుని ఇంకో ఊరు వెళ్లిపో. కనీసం వెయ్యి మైళ్ల దూరంలోని ఊరికి’
‘పారిపొమ్మంటున్నావా?’
‘పోనీ నీకు ఇంకో మంచి దారి ఉంటే చెప్పు’
టిమోథీ బదులు మాట్లాడలేదు. కొద్దిసేపాగి మార్కో మళ్లీ చెప్పాడు.
‘అతని శవం గురించి రేపు పోలీసులకి తెలీగానే నీ కారు గురించి వేట మొదలవుతుంది. నువ్వు ఇంకో కారు కొంటే వారి అనుమానం రెట్టింపు అవుతుంది. అదే కారుని నడిపిస్తే పట్టుబడటం తథ్యం. కొత్త ఊళ్లో, కొత్త పేరుతో దాక్కున్న నిన్ను వారు ఎప్పటికీ కనుక్కోలేకపోవచ్చు. పరిష్కరింపబడని హత్యా నేరాలు అమెరికాలో వేల సంఖ్యలో ఉన్నాయి’
‘అందువల్ల నా వ్యాపారంలోని భాగస్వామ్యానికి, ఆదాయానికి, ముఖ్యంగా నా షెరాన్‌కి నేను దూరం అవుతాను’ టిమోథీ బాధగా చెప్పాడు.
‘ప్రపంచంలో ఇంకా చాలా వ్యాపారాలు, చాలా భాగస్వామ్యాలు ఉన్నాయి. చాలామంది షెరాన్లు కూడా ఉన్నారు. స్వేచ్ఛగా జీవిస్తావా? లేక ఇరవై ఏళ్లు జైలు జీవితం గడిపి బయటకి వస్తావా అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. నీ జీవితం. నీ ఇష్టం’
‘ఆ తర్వాత ఇక జీవితం ఏముంటుంది?’
వారి మధ్య ఆ తర్వాత మాటలు లేవు. కారు మార్కో అపార్ట్‌మెంట్ ఆవరణకి చేరుకునేటప్పటికి వర్షం ఆగిపోయింది.
ఇద్దరూ లిఫ్ట్‌లో ఏడో అంతస్థులోని అతని అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నారు. టిమోథీ కిటికీ దగ్గరికి వెళ్లి తలుపు తెరచి తాజా గాలిని పీల్చుకున్నాడు.
‘ఏమంటావు?’ మార్కో అడిగాడు.
‘సరే. ఇంకో ఊళ్లో, ఇంకో కొత్త పేరుతో, కొత్త జీవితాన్ని ఆరంభిస్తాను. నీ దగ్గర ఎంత డబ్బుందో చూడు’ టిమోథీ కోరాడు.
మార్కో తన పర్స్‌ని తెరిచి కొంత మొత్తాన్ని తీశాడు. తర్వాత డ్రాయర్ తెరచి మరి కొంత తీసి పెద్ద నోట్లని మాత్రం లెక్క పెట్టి చెప్పాడు.
‘పదిహేను వందల డాలర్ల దాకా ఉన్నాయి. ఇది పెద్ద మొత్తం కాదు కాని కొత్త జీవితాన్ని ఆరంభించడానికి మాత్రం ఉపయోగించేంత’
టిమోథీ దాన్ని లెక్కపెట్టుకోకుండా జేబులో ఉంచుకుని చెప్పాడు.
‘నేను చట్టం నించి పారిపోయే హంతకుడిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు’
‘ఆ మాట ఇక మర్చిపో’ మార్కో మృదువుగా కోప్పడ్డాడు.
‘ఓసారి హంతకుడు అయ్యాక కలిగే ప్రయోజనం ఇంకో హత్య చేయడానికి భయం పోతుంది. ఎందుకంటే పట్టుబడ్డా రెండుసార్లు మరణశిక్షని అమలుపరచలేరు కదా?’
‘నువ్వు మానసిక వత్తిడితో ఉన్నావని నాకు తెలుసు. ఆలస్యం చేయకుండా బయలుదేరడం మంచిది. నువ్వు పోలీసులకి ఎంత దూరమైతే అంత మంచిది’
‘ఈ వర్షానికి నేను హంతకుడ్ని అనే లింక్ గల అన్ని గుర్తులు కొట్టుకుపోయాయనే ఆశిస్తాను. కాని లింక్‌గా ఓ సాక్షి మాత్రం నిలబడి ఉన్నాడు. ఓ ఒంటరి సాక్షి’
‘ఒంటరి సాక్షా? ఎవరు? ఆ లారీ డ్రైవరా? అతను చూశాడంటావా?’
‘కాదు. ఆ సంగతి తెలిసిన నువ్వు ఎప్పటికైనా పోలీసుల ముందు నోరు తెరవచ్చు’
మార్కో గడ్డం కింద టిమోథీ బలంగా కొట్టాడు. అతనికి కళ్ల ముందు నక్షత్రాలు కనిపించాయి. మార్కో తూలుతూ రెండు అడుగులు వెనక్కి వేశాడు. తక్షణం అతని భుజాలని పట్టుకుని అమాంతం కిటికీలోంచి బయటకి తోసేశాడు. తర్వాత ఒంగి కిటికీ కింద కార్పెట్‌ని మడతలు పడేలా లాగాడు. మార్కో ఆ కార్పెట్ తగిలి ఆ కిటికీలోంచి బయటపడ్డాడని పోలీసులు తర్వాత తనకి చెప్తారని టిమోథీ భావించాడు.
షెరాన్‌తో పాటు మార్కో భాగస్వామ్యం కూడా ఇప్పుడు తనదే అనుకుంటూ అతను ఆ అపార్ట్‌మెంట్‌లోంచి బయటకి నడిచాడు.

(టాల్‌మేజ్ పోవెల్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి