ప్రేమకానుక
Published Saturday, 11 June 2016మా అమ్మాయి స్వీడన్‌లో చదువుకుంటున్నది. సెలవులు వచ్చాయని రెండు వారాలపాటు మళ్లీ ఇక్కడికి వచ్చింది. ఉన్న కొద్దికాలంలోను కనీసం ఒక వారం ఆమె చెన్నైలో గడిపింది. చక్కగా పథకం వేసుకుని మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లోని సంగీత కచేరీలను వినడానికే తాను వచ్చిందని నాకు అర్థమయింది. హైదరాబాద్‌లో ఉన్న కొద్దికాలంలోను బుక్‌ఫెయిర్ జరుగుతున్నదని తనకు తెలుసు. మామూలుగానయితే నేను నా పిల్లలతో కలిసి బుక్ ఫెయిర్‌కు వెళ్లి పుస్తకాలు కొనడం అలవాటు. మా పాపకు ఈసారి ఆ వీలు కుదరలేదు. తన నేస్తాలతో కలిసి వెళ్లినట్టుంది. ఒక రాత్రి తన పద్ధతిలో టట్టడాయ్! అంటూ ఇంట్లోకి వచ్చి నాకొక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. అది టాబ్లాయిడ్ అంటే దినపత్రికను సగానికి మడిస్తే ఉండే సైజు పుస్తకం. ఏం పుస్తకమది? అక్కడే ఉంది నా ఆనందమంతా.
నేను ఉర్దూ నేర్చుకున్నాను. కొంచెం లోతుకు వెళ్లే ప్రయత్నమే చేశాను. నాకు చేతనయిన కవితలను కూడా చదివాను. రాశాను. అర్థంకాని కవితలను కూడా చదివాను. అందుకు కారణం ఒక మహాకవి. ఆయన ‘మసీదులో నన్ను మందు కొట్టనీయండి, లేదంటే దేవుడు లేని చోటు ఏదో చూపించండి’ అంటాడు. సులభంగా చెప్పిన కవితలో ఆయన భావాలు ఇంత సులభంగానూ అర్థమయ్యేట్టు ఉంటాయి. ఇక సమాసాలకు ఎత్తుకున్నాడంటే అంతకంటే కష్టంగా ఉండే కవిత్వం మరొకటి ఉండదు. ఆ కవిని గురించి నేను పుట్టినప్పుడే సినిమా వచ్చేసింది. ఆ సినిమాలోని ‘దిలె నాదా, తుఝే హువా క్యాహై’ అనే పాట చాలాకాలంగా అందరూ వింటూనే ఉన్నారు. ఆ పాటను ఎంతోమంది గాయకులు తమకు నచ్చిన రకంగా వరుస కట్టి పాడుకున్నారు. రేఖ్తా అనే వెబ్‌సైట్‌లో ఈ పాట మాటల పేజీలో కనీసం పదముగ్గురు పాడిన ఆడియో వీడియోలు ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. తెలుగు కవుల్లో ఎవరికయినా ఇంతటి వైభోగం జరిగిందా అన్నది ఆ అనుమానం.
మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ గురించి ఒక టీవీ సీరియల్ కూడా వచ్చింది. అసలు నిజానికి గుల్జార్ అనే ప్రసిద్ధ కవి హిందీ నటుడు సంజీవ్‌కుమార్ నాయకుడిగా గాలిబ్ చిత్రం తీయాలనుకున్నాడట. అది జరగకపోవడానికి చాలా కారణాలున్నాయి. పాపం ఆ మహానటుడు పోయాడు. అంతకు ముందే నసీరుద్దీన్ షా తానే ఆ వేషం వేయాలని గుల్జార్‌ను హెచ్చరించాడట. అప్పటికి నిజానికి అతను దిల్లీ స్కూల్ ఆఫ్ డ్రామాలో విద్యార్థిగా ఉన్నాడు. అతని కోసమే అన్నట్టు సినిమా ఆగిపోయింది. చాలాకాలం తరువాత గుల్జార్ దర్శకత్వంలోనే దూరదర్శన్‌లో గాలిబ్ సీరియల్ రావాలన్న నిర్ణయం జరిగింది. ఆ సీరియల్ ఒక అద్భుతం! నేను ఒక్క వారం కూడా తప్పకుండా దాన్ని చూశాను. షా గురించి ఇవాళ నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ‘్ఫటా పోస్టర్, నిక్‌లా హీరో’ అంటూ ఒక సినిమాలో అతను ఆటోడ్రైవర్‌గా కనిపిస్తాడు. ఆ సినిమా చూచిన తరువాత నేను ప్రతి ఆటోలోకి నసీరుద్దీన్ కోసం తొంగి చూసిన జ్ఞాపకం. ఈ సీరియల్ తరువాత మళ్లీ అదే భావం కలిగింది. గాలిబ్ అంటే అచ్చం ఇలాగే ఉంటాడని అనిపించింది. నిజానికి చాలామంది ప్రేక్షకులు ఆ మాటే అన్నారు. ఒకతను మరింత ముందుకు వెళ్లి ‘గాలిబ్’ అనగానే నాకు నసీరుద్దీన్ షా గుర్తుకు వస్తాడు అన్నాడు. నేను వెతికివెతికి టీవీ సీరియల్ సిడిలు సంపాదించాను. ఆ సీరియల్ వివరాలను చెపుతూ పోతే ఇక మిగతా సంగతులకు చోటు మిగలదు. ఎపిసోడ్‌లను ఎన్నిసార్లు చూచానో గుర్తులేదు. మొత్తానికి గాలిబ్ పట్ల నాకున్న ఆసక్తి మా అమ్మాయికి అర్థమయింది.
గాలిబ్ గతించి వంద సంవత్సరాలయిన సందర్భంగా గొప్ప ఉత్సవాలు జరిగాయి. అప్పట్లో ఒక ప్రత్యేక సంచికను విడుదల చేశారు. అందులో వ్యాసాలు రెండు మూడే ఉన్నాయి. చిత్రంగా పుస్తకం ఉర్దూలోకాక హిందీలో ఉంటుంది. రామ్‌కుమార్ శర్మ అనే ఒక కళాకారుడు గాలిబ్ కవితలకు చిత్రాలు వేశాడు. అటువంటి చిత్రాలు బోలెడు అంతకన్నా బోలెడు కవితలు జతచేసి అందించిన ప్రత్యేక సంచిక బుక్‌ఫెయిర్‌లో మా అమ్మాయికి కనిపించింది. వెంటనే కొని తెచ్చి నన్ను ఆమె ఆశ్చర్యం, ఆనందాలలో ముంచింది. ప్రత్యేక సంచిక అప్పట్లో 500 కాపీలు మాత్రమే అచ్చువేశారు. అందులో ఒకటి ఇప్పుడు నా దగ్గర ఉందంటే మరి ఆశ్చర్యంతోపాటు ఆనందం కూడా ఉంటుంది కదా.
గాలిబ్ ఆగ్రాలో పుట్టాడు. దిల్లీలో పెరిగాడు. ఎర్రకోటకు ఎదురుగా ఉండే చాందినీచౌక్ ప్రాంతంలో ఎడమపక్కన బల్లీమారాన్ అనే ఒక ప్రాంతముంటుంది. అందులో గలీ ఖాసిమ్‌ఖాన్ అనే వీధి ఉంటుంది. ఆ వీధులను వీధులని అనడానికి లేదు. అవి గొందులు. అందులోనే ఒకప్పుడు అసుదుల్లా గాలిబ్ కాపురమున్న ఇల్లు ఇప్పటికీ ఉంటుంది. ఎందుకో తెలియదుగానీ చాందినీచౌక్‌లో ఎన్నిసార్లు తిరిగినా నేను ఆ గల్లీలోకి వెళ్లి ఇల్లు చూడాలని అనుకోలేదు. ఇంటిని స్మారక భవనంగా ప్రకటించారట. అయినాసరే ఆ చుట్టుపక్కల వారెవరికీ ఆ ఇంటి మీదగానీ, గాలిబ్ మీదగానీ గౌరవం లేదంటారు.
ఆ మధ్యన ఒక పెద్దమనిషి ఇంటిని వెతుకుతూ వెళ్లి ఆ చుట్టుపక్కల పెద్ద మనుషులను కలవడం, వాళ్లంతా గాలిబ్ గురించి చిన్నచూపుగా మాట్లాడడం లాంటి వివరాలన్నీ ‘ద హిందూ’ అనే దినపత్రికలో చదివినట్టు జ్ఞాపకం. ఉర్దూ కవులలో గాలిబ్‌ను మించిన వారు లేరని ఈనాటికీ ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. ఆయన గతించి సుమారు ఒకటిన్నర శతాబ్దం గడిచినా నేటికీ ఆయన కవితలను తలకెత్తుకుని అందరూ మెచ్చుకుంటూ వింటారు. అయినా సరే ఆయన విశృంఖల జీవన పద్ధతి కారణంగా కొందరికి ఇనే్నళ్లయినా ఆయన మీద గుర్రుగానే ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
శ్రీనాథ మహాకవి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడంటారు. గాలిబ్ జీవితం మాత్రం అంతకన్నా కనకష్టంగా గడిచింది. అతని తీరే అందుకు కారణం అన్నా తప్పులేదు. ప్రతి నిత్యం మందు కొట్టడం మామూలే అన్నది ఆయన పద్ధతి. ఇంట్లో పెళ్లాం ఉన్నా సరే ఒక వేశ్య దగ్గరికి తరచూ వెళ్లడం సీరియల్‌లో కూడా చూపించారు. ఆ వేశ్య పాత్రలో నీనాగుప్తా అనే నటి జీవించింది. ఆ సీరియల్‌లో ఎవరూ నటించలేదు. అందరూ జీవించినవారే. గాలిబ్ బతికి ఉండగానే బిచ్చగాళ్లు అతని కవితలను పాడుతూ అడుక్కునేవారని ఒక ప్రతీతి ఉంది. దాన్ని వాడుకుని సీరియల్‌లో ప్రవేశపెట్టిన బిచ్చగాని పాత్ర మనసును పిండివేస్తుంది.
కవులు మరొక ఉద్యగం చేస్తే ఆలోచనలు సరిగా రావని ఇప్పటి కవులకు తోచదు బహుశా. తోచినా సరే బతుకు గాలిబ్ బతుకులాగే అవుతుంది. ప్రభుత్వం ఇవ్వవలసిన పెన్షన్ కొరకు గాలిబ్ ఒక దశాబ్దానికి పైగా పోరాడిన తీరు సీరియల్‌లోను బాగా చూపించారు. చివరికి అతను స్వయంగా వెళ్లనిదే పని జరగదని కలకత్తాకు పయనమవుతాడు. మధ్యలో చాలా నగరాల్లో బస చేస్తూ, ముషాయిరాలలో, చర్చలలో పాల్గొంటూ నాలుగు సంవత్సరాల తరువాత కలకత్తా చేరుకుంటాడు. అంతకాలం ఆయనకు అవసరాలు అందించి అందరూ ఆదరించారంటే కవులకు అప్పట్లో ఉండిన గౌరవం గురించి మనం ఊహించవచ్చు. కలకత్తాలో అవమానమే ఎదురవుతుంది. తిరుగు ప్రయాణం ఎంతకాలం జరిగిందో నాకు గుర్తులేదు.
సీరియల్‌లోని చివరి ఎపిసోడ్‌లు గుండెలను పిండేవిగా ఉంటాయి. జూదం ఆడుతున్నాడని గాలిబ్‌ను పట్టి బందిఖానాలో వేస్తారు. ఆ వివరాలను చూస్తున్న ప్రతిసారి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘దిలెనాదా’ కవితలోని మాటలు ప్రేమకు సంబంధించినవి. కానీ గాలిబ్ బ్రతుకు గురించి చెప్పిన కవితలు మరింత బరువుగా నాకు అనుక్షణం జ్ఞాపకం వచ్చేవి. ‘ఇప్పుడున్నాము, ఎంతకాలం ఉంటామో తెలియదు, ఇప్పుడున్నాము ఇక ముందు ఉంటామో లేదో తెలియదు’ అంటూ అతను చెప్పిన తత్త్వం వింటుంటే, మరి ఆ మనిషిలో అంతటి మొండితనం ఎందుకు ఉండేదో అర్థంకాదు.
నాకు ఈ మధ్యన వీడియో చూచే ఓపిక తగ్గింది. గాలిబ్ సీరియల్ చూచి కూడా చాలా రోజులయింది. అందుకేనేమో అమ్మాయి నాకు పుస్తకం తెచ్చి ఇచ్చింది. దాంతో కొంతకాలం జ్ఞాపకాల మధ్యన కాలక్షేపం జరుగుతుంది.