S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవ్వడమే ఒక టానిక్

పార్క్‌కి వెళ్లినప్పుడల్లా ఓ గమ్మతె్తైన దృశ్యం కనపడుతుంది. ఓ ఇరవై మంది నిల్చోని బిగ్గరగా నవ్వుతూ కన్పిస్తారు. సరదాగా మాట్లాడుతూ నవ్వుకోవడం కాదు. నవ్వాలని నవ్వడం. దాన్ని ఓ క్లబ్‌గా కూడా పిల్చుకుంటారు. అదే లాఫింగ్ క్లబ్. జీవితంలో నవ్వడం మరిచిపోయి ఉదయం అందరూ జమకూడి నవ్వుతూ ఉంటారు.
నవ్వడం మంచిదే. నవ్వుతూ ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఎదుటి వారు క్రింద పడితే వాళ్లని చూసి నవ్వడం ఎంత తప్పో, నవ్వకుండా ఒక్కరోజు గడపడటం అంతకన్నా పెద్ద తప్పు.
జీవితంలో నడక మరిచిపోయాం. ఇప్పుడంతా పరుగు. ఈ పరుగు పందెంలో నవ్వడం మర్చిపొయ్యాం. సినిమాలో ఏదైనా హాస్య సంఘటన కన్పించినా నవ్వడానికి మొహమాటం. పక్కవాడు ఏమనుకుంటాడోనని గొంతు మూసుకొని నవ్వడం. హాయిగా బిగ్గరగా నవ్వడం మర్చిపొయ్యాం. చిన్ననాటి స్నేహితులు కన్పించినప్పుడు అక్కడ ఎవరూ కొత్తవాళ్లు లేనప్పుడు మాత్రమే బిగ్గరగా నవ్వుతున్నాం.
నా చిన్నప్పుడు నవ్వు వచ్చినప్పుడు నవ్వేవాళ్లం. ఏడుపొస్తే ఏడ్చేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బిగ్గరగా నవ్వే సన్నివేశం కన్పించినా నవ్వడం లేదు. నాగరికత హోదాలో వచ్చిన మార్పు.
ఇప్పటి పిల్లలు ఐదారు సంవత్సరాల వరకే నవ్వి ఎగిరి గంతేస్తున్నారు. ఆ తరువాత సినిమాల్లో హాస్య సన్నివేశం కనిపించినా వాళ్లు నవ్వడం లేదు. దస్తీ నోరు దగ్గర పెట్టుకొని నవ్వుతున్నారు.
కాలక్రమంలో మనిషికి ప్రకృతికి మధ్యన దూరం పెరిగిపోయింది. అంతా కృత్రిమత్వం. ఆరుబయట పడుకోలేని పరిస్థితులు. ఆరుబయలు లేని కాలం. చెట్లకి దూరం. మట్టికి దూరం. గాలికి దూరం. నిప్పుకి దూరం. పంచభూతాలకి దూరం. ప్రకృతికి దూరమైన మనిషి నవ్వుకి దూరమైపోతున్నాడు. ఇప్పుడు పార్క్‌ల్లో కృత్రిమంగా నవ్వుతున్నాడు.
ఇప్పటి తరం కనీసం ముసిముసి నవ్వులు కూడా నవ్వడంలేదు. సెల్‌ఫోన్లకి, ఐపాడ్‌లకి, లాప్‌టాప్‌లకి అతుక్కుపోయిన వ్యక్తులు ఫోన్లల్లో కూడా నవ్వడం మానేశారు. ఏవో బొమ్మల ద్వారా నవ్వుతారు.
బిగ్గరగా నవ్వి ఎంతకాలం అయ్యిందని ఎవరినైనా అడగండి. జవాబు చెప్పడానికి ఎంతో కొంత సమయం తీసుకుంటారు. సమాధానం చెప్పలేరు. కనీసం ఓ చిన్న చిరునవ్వు నవ్వి ఎంతకాలం అయ్యిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొమ్మని అడగండి. నవ్వుతున్నట్లైతే రోజుకు ఎన్నిసార్లు నవ్వుతున్నారో అడగండి?
ఈ పరుగు ప్రపంచంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ పరుగులో మనం గుణాత్మక జీవితం గడపటం గురించి మర్చిపోయాం. ఒక్కరోజు బిగ్గరగా నవ్వకపోతే, చిన్న చిరునవ్వు నవ్వకపోతే మనం గుణాత్మకమైన జీవితాన్ని గడపడం లేదని భావించాల్సి వస్తుంది.
ఇప్పటి జీవితంలో ఒత్తిడి ఉంది. గతంలో లేనంతగా ఒత్తిడి ఉంది. ఏ మాత్రం రికామి దొరకడం లేదు. అయినా మనం హోటళ్లకి వెళ్తున్నాం. సినిమాలకి వెళ్తున్నాం. గతంలోకన్నా ఎక్కువగా షికార్లకి వెళ్తున్నాం. నవ్వే పరిస్థితుల్లో కూడా మనం నవ్వడం లేదు. మనం ఒత్తిడిలో వున్నప్పుడే ఎక్కువగా నవ్వాలి. నవ్వాల్సి వచ్చినప్పుడు హాయిగా బిగ్గరగా నవ్వాలి. నవ్వినప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుంది. అది ఆరోగ్యానికి మంచిది.
ఇంకా ఎందుకు ఆలోచిస్తారు?
జీవితాన్ని అనుభవించండి.
మనసారా నవ్వండి.
...................................................................................
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.

-జింబో 94404 83001