S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నయాపైస (సండేగీత)

వీడి తల మీద నయాపైస పెట్టినా పైసకి ఎవరూ కొనరు అన్న మాటని వినేవాళ్లం. పైస అంటే ఏమిటో ఇప్పుడు ఆశ్చర్యం.
ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ విలువ రోజురోజుకీ పడిపోతోంది. నా చిన్నప్పుడు ఎన్నో నాణేలు కన్పించేవి. అందులో ముఖ్యమైంది నయాపైసా. అది గుండ్రంగా వుండేది. రాగి, ఇత్తడి లోహాలతో తయారై ఉండేది. కొంతకాలం తరువాత దాని రూపు మారింది. సత్తు పైసగా మారిపోయింది. రెండు పైసల బిళ్ల, ఐదు పైసల బిళ్ల, చారాణా ఆఠాణా, రూపాయి బిళ్లలు ప్రధానంగా ఉండేవి. కొంతకాలం తరువాత ఇరువై పైసల బిళ్ల కూడా వచ్చింది. అందులో కొంత బంగారం కలిపారన్న వదంతితో అది అదృశ్యమైంది. నయాపైస, రెండు పైసలు, ఐదు పైసలు, చారాణా ఆఠాణా కూడా అదృశ్యమయ్యాయి. చారాణాకి మారకపు విలువ లేదని రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడో ప్రకటించింది. మిగతా నాణేలకి ప్రకటించలేదు కాని అవి కూడా మార్చావస్థలోనే ఉన్నాయి.
అప్పుడప్పుడు ఆఠాణా కన్పించేది. ఈ మధ్య కాలంలో అది కూడా కన్పించకుండా పోయింది. రూపాయి బిళ్ల కన్పిస్తుంది. కానీ దానికి ఏ మాత్రం విలువ ఉన్నట్టు కన్పించడంలేదు. ఎవరన్నా దానం అడిగి నప్పుడు రూపాయి బిళ్ల ఇస్తే అతను దానివైపు అసంతృప్తిగా చూసి తీసుకుంటున్నాడు. అది కూడా ఇవ్వనప్పుడు కూడా అంత అసంతృప్తిగా అతను చూసి ఉండడు.
నా చిన్నప్పుడు నయాపైసకే ఎంతో విలువ ఉండేది. చారాణా సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూసే పరిస్థితి ఉండేది. నయాపైసతో పల్లీల పొట్లం వచ్చేది. చారాణా ఉంటే ఇద్దరు స్నేహితులం వన్ బై టూ చాయ తాగేవాళ్లం. ఓ ప్లేట్ పకోడి తినేవాళ్లం. మా అక్కలు తమ అత్తవారింటికి వెళ్తూ చారాణని, ఆఠాణాని ఇచ్చేవాళ్లు. వాటితో ఆ రోజు ఎంతో ఆనందంగా గడిచేది. కానిగిరీ బడిలో రెండు ఆఠాణాలని నెల ఫీజుగా ఇచ్చేవాణ్ణి. వాటినే ఆనందంగా మా కుంటి పంతులు సార్ తీసుకునేవాడు.
ఓ పైసా దానం చేయండి అని అప్పుడు ధర్మం అడిగేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పది రూపాయలు ఇస్తేనే కాస్త కృతజ్ఞతాపూర్వకంగా మనవైపు చూస్తున్నారు. నా చిన్నప్పుడు పైస దానం ఇస్తేనే వాళ్ల కళ్లల్లో మెరుపు కన్పించేది. చారాణాని ఆఠాణాని ఇస్తే పిల్లల కళ్లల్లో మెరుపు కన్పించేది. మరి ఇప్పుడు...? నయాపైస, ఇతర నాణేల ఆత్మలకు శాంతి కలుగుగాక.