S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సదాచారము (సిసింద్రి)

పద్మశయనపురం రాజ్యానికి రాజేంద్ర గుప్త కొత్తగా రాజయ్యాడు. అతని మంత్రిగా విమలాదిత్యుడు చాలా సంవత్సరాల నుండి అంటే రాజేంద్ర గుప్త తండ్రి కాలం నుండి సేవలందిస్తున్నాడు.
రాజేంద్రగుప్త రాజు ఒకరికి తాను నమస్కరించడం నామోషీగా భావిస్తాడు. వేరొకరు తనకు నమస్కరించడం తనను వెక్కిరించడ మనుకుంటాడు. ఈ విషయాన్ని మంత్రికి, రాజోద్యోగులకు చెప్పాడు. మంత్రి విమలాదిత్యునికది నచ్చలేదు.
‘ప్రభూ! నమస్కారం ఒక సంస్కారం. ఒకరికొకరు నమస్కరించుకోవడం సదాచారం, అది మర్యాద. మీ నాన్నగారు కూడా ఈ మర్యాదను పాటించారు’ అని నచ్చజెప్పబోయాడు. రాజు రాజేంద్రగుప్త ‘విమలాదిత్యగారూ! ప్రతి మనిషిలోని ఆత్మలో పరమాత్మ అంశ ఉంటుంది కాబట్టి ఒకరికొకరు నమస్కరించుకోవడం అనవసరం’ అని కొట్టిపారేశాడు. విమలాదిత్యుడేమీ అనలేక పోయాడు.
నమస్కార సంస్కారం తప్ప రాజేంద్ర గుప్తలో అన్నీ మంచి అలవాట్లున్నాయి. పాలనా సామర్థ్యం ఉంది. పద్మశయనపురం రాజ్యం కైలాసగిరి సామ్రాజ్యం అధీనంలోని సామంతరాజ్యం. కైలాసగిరి చక్రవర్తి మహేంద్రగుప్తకు కప్పం చెల్లించాలి.
చక్రవర్తి మహేంద్రగుప్త తన సామంత రాజులతో రాజధానిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి సామంతరాజులంతా తప్పకుండా రావాలని లేఖలు పంపించాడు.
రాజేంద్ర గుప్త మంత్రి విమలాదిత్యునితోపాటు కైలాసగిరికి వెళ్లాడు. సభలో చక్రవర్తి సింహాసనమీద కూచున్నాడు. వచ్చిన సామంత రాజులంతా సభలో ప్రవేశించగానే చక్రవర్తికి, తోటి సామంత రాజులకు నమస్కరించి వెళ్లి తమ ఆసనాల్లో కూచుంటున్నారు. చక్రవర్తి ప్రతి నమస్కారం చేసి క్షేమ సమాచారాలడిగి తెలుసుకుంటున్నాడు.
రాజేంద్రగుప్త మంత్రితో సహా సభలో ప్రవేశించి వెళ్లి తన ఆసనమీద కూచున్నాడు. మంత్రి విమలాదిత్యుడు చక్రవర్తికి నమస్కరించి వెళ్లి కూచున్నాడు. చక్రవర్తి రాజేంద్రగుప్తను తన దగ్గరకు రమ్మని పిలిపించుకున్నాడు. ‘మీ తోటి రాజులంతా పాటించిన సదాచారము నమస్కార సంస్కారాన్ని మీరెందుకు పాటించలేదు?’ అని అసహనంగా అడిగాడు. రాజేంద్రగుప్త ‘చక్రవర్తిగారూ! అది అనవసరం కదా! నమస్కార, ప్రతి నమస్కారాలతో సమయం వృధా అవుతుంది కదా!’ అని సమర్థించుకున్నాడు. చక్రవర్తికి కోపమొచ్చింది. ‘రాజేంద్రగుప్తా! మనిషి ఆచరించవలసిన సంస్కారాలలో నమస్కారం ప్రధానమైనది. ఆ మాత్రం సదాచారం తెలియని నీలాంటి వాడు రాజుగా పనికిరాడు. నీ స్థానంలో పద్మశయనపురానికి మరొకరిని రాజుగా నియమిస్తాము. నువు రాజభవనం ఖాళీ చేసి వెంటనే వెళ్లిపొమ్మ’ని ఆదేశించాడు.
రాజేంద్రగుప్తకు అప్పుడు తన తప్పు తెలిసింది. భయంతో వణికిపోతూ చక్రవర్తికి నమస్కరించి ‘నమస్కారానికింత ప్రాధాన్యత ఉంటుందని నాకు తెలియదు. నా తప్పు క్షమించండి. నన్ను రాజ్యభ్రష్టుని చేస్తే నేను బతుకలేను’ అని బతిమాలాడు.
చక్రవర్తి పక్కనున్న మహామంత్రి ‘మహారాజా! రాజేంద్రగుప్త తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి తమరు శాంతించండి’ అని విన్నవించాడు.
రాజేంద్ర గుప్త వెంటనే అందరికీ నమస్కారం చేసి, వెళ్లి మంత్రి విమలాదిత్యుని పక్కన కూచున్నాడు.
‘నా తప్పు తెలిసింది విమలాదిత్యా!’ అన్నాడు.
విమలాదిత్యుడు ‘రాజా! నమస్కారం చేయడంతో మనిషిలోని అహంకారం నశిస్తుంది. అది ఆత్మన్యూనత కాదు. అదో సదాచారము’ అన్నాడు.
అప్పటి నుండి రాజేంద్ర గుప్త నమస్కార సంస్కారాలను పాటిస్తూ తన రాజ్యంలోని వారందరితో ఆచరింపజేశాడు.

-ఐతా చంద్రయ్య