S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజకీయ బ్రహ్మచారులు

పెళ్లైన బ్యాచిలర్ మోదీ
భారత ప్రధాని నరేంద్రమోదీది పరిస్థితి కొంచెం భిన్నం. ఆయనకు వివాహం అయినప్పటికీ, చాలా ఏళ్ల నుంచి బ్రహ్మచర్యమే పాటిస్తున్నారు. ఆయన దేశం కోసం పనిచేయాలని ఉందని చెబితే, భర్త ఆశయ సాధనకు సహకరించాలన్న సదాశయంతో తాను కూడా ఆయన లక్ష్యానికి సహకరించానని మోదీ భార్య ఏనాడో మీడియాకు చెప్పారు. ఒకరకంగా మోదీ ఈ స్థాయికి రావడానికి కారణం కూడా కుటుంబ బంధాలు లేకపోవడమే. అందుకే దేశంలో ఎంతోమంది ప్రధానులుగా చేసినప్పటికీ, లాల్‌బహుదూర్ శాస్ర్తీ, మోదీపై ఇంతవరకూ ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. అదే మోదీ కూడా కుటుంబచట్రంలో చిక్కి ఉంటే ఆయన విజయ ప్రస్థానం గుజరాత్ దగ్గరే నిలిచిపోయేది.

రాజకీయాల్లో ఉన్న వారికి కుటుంబం ఉంటే బోలెడన్ని పితలాటకాలు. అసలే పొలిటికల్ సన్ స్ట్రోక్స్ సీజన్. వారసులు, వారి వారసుల కోసం అధికారం ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనకేసుకోవాలి. అంతకంటే ముందు పార్టీ భవిష్యత్తు కోసం అడ్డదారులు తొక్కాలి. లేకపోతే పార్టీ నడవదు. కుటుంబం పెరగదు! అదే బ్రహ్మచారులయితే ఈ లంపటాలేవీ ఉండవు. ఎవరి కోసం అడ్డదారులు తొక్కాల్సిన అగత్యమూ ఉండదు. ఇప్పుడు భారత రాజకీయాల్లో బ్యాచిలర్ లీడర్లు ఎక్కువవుతున్నారు. అందుకే వారి పాలనలో అవినీతి కూడా అతి తక్కువగా ఉంది. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల్లో కూడా బ్రహ్మచారులే ఎక్కువగా దర్శనమిస్తున్నారు.
భారత రాజకీయాల్లో బ్రహ్మచారి నాయకులు పెరుగుతున్నారు. తొలి నుంచీ రాజకీయాల్లో ఉన్న బ్రహ్మచారులు, తమ రాజకీయ ప్రస్థానాన్ని బ్యాచిలర్‌గానే ముగిస్తున్నారు. ప్రధానంగా దేశంలో కీలక రాష్ట్రాలకు బ్యాచిలర్లే ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. కేంద్రంలో కొందరు మంత్రులు కూడా ఇంకా బ్యాచిలర్లుగానే ఉన్నారు.
తమిళనాడు జయలలిత కూడా అవివాహితురాలు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి నుంచి ముఖ్యమంత్రి స్ధాయికి ఎదిగిన తర్వాత కూడా పెళ్లి చేసుకోలేదు. ఆమెకంటూ ప్రత్యేకంగా కుటుంబమేమీ లేదు. తన ప్రాణమిత్రురాలు శశికళ తనయుడైన సుధాకర్‌ను దత్తత తీసుకుని, ఆయన పెళ్లికి ఆకాశమంత పందిరి వేసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాజా ఎన్నికల్లో మళ్లీ ఆమె ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పెళ్లికాకపోయినా ఆడంబరాలు ఎక్కువేనని, చీరలు, చెప్పులు, నగలపై మమకారం ఎక్కువేనని ఆమె ఇంటిపై అధికారులు జరిగిన దాడులు రుజువు చేశాయి.
ఇక పశ్చిమ బెంగాల్ బెబ్బులి మమతాబెనర్జీ కూడా బ్రహ్మచారిణి. కేంద్ర మంత్రిగా పనిచేసి, తిరిగి రాష్ట్రానికి వచ్చి, దశాబ్దాలపాటు బెంగాల్‌లో పాతుకుపోయిన వామపక్షాలపై చావుదెబ్బకొట్టిన ఈ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి.. చాలా సాదాసీదాగా జీవనం గడుపుతున్నారు. ఇప్పటికీ కాళ్లకు రబ్బరు చెప్పులు, ఖద్దరు ముతక చీరలు మాత్రమే ధరిస్తున్నారు. ఆర్భాటాలకు దూరంగా, అత్యంత సాధారణ జీవనం గడుపుతూ ఇతరులకు ఆదర్శంగా ఉన్న దీదీ ఇంతవరకూ పెళ్లిచేసుకోలేదు.
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తన బ్యాచిలర్ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఒడిషా నుంచి వరసగా ముఖ్యమంత్రిగా గెలుస్తూ వస్తోన్న నవీన్, ఇటీవల తన ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి రాసి ఇచ్చి తన దాతృత్వం చాటుకున్నారు. అవినీతికి దూరంగా ఉండే అతి తక్కువ సీఎంలలో ఒకరిగా గుర్తింపు పొందారు. మొన్నటి వరకూ పాండిచ్చేరి సీఎంగా ఉన్న రంగసామి కూడా అవివాహితుడే.
హర్యానా బిజెపి సీఎం మనోహర్‌లాల్ ఖత్తర్ కూడా అవివాహితుడే. ఆరెస్సెస్‌లో సంఘటనా మంత్రిగా ఉన్న ఆయన సారథ్యంలోనే బిజెపి విజయం సాధించింది. ఆయన నీతి, నిజాయితీనే సీఎంను చేసింది. తాజాగా అసోంలో చరిత్ర సృష్టించిన సర్బానంద సోనోవాల్ కూడా పెళ్లికాని బ్రహ్మచారి. ఇప్పటివరకూ ప్రజల కోసం తప్ప,కుటుంబం కోసం ఆలోచించని సోనోవాల్ అసోం సీఎం అయ్యారు.
ఎన్డీఏలో ఉన్న మూడోపెళ్లికాని సీఎంగా సర్బానంద దర్శనమిస్తారు.
ఇక కేంద్రమంత్రి ఉమాభారతి కూడా బ్రహ్మచారిణి. ముఖ్యమంత్రి నుంచి కేంద్రమంత్రిగా ఎదిగిన ఆమె కూడా ఆర్భాటాలకు దూరంగా, సాదాసీదా జీవితమే గడుపుతున్నారు. యుపికి చెందిన మరో కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్ సాధ్వి నిరంజన్ జ్యోతి కూడా బ్యాచిలర్ జీవితం గడుపుతున్న నాయకురాలే. కాగా బిజెపిలో దాదాపు డజను మంది బ్రహ్మచారులు ఎంపీగా కొనసాగుతున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌లో మెజారిటీ శాతం ఇంకా బ్రహ్మచారులుగానే కొనసాగుతున్నారు. వారంతా స్వయంక్‌సేవక్‌గా జీవితాలు గడుపుతున్నారు. కొనే్నళ్లపాటు ప్రచారక్‌గా పనిచేసిన ఇప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేటు వయసులో, అంటే 1990లో వివాహం చేసుకున్నారు. కశ్మీర్, మహారాష్ట్ర, అరణాచల్‌ప్రదేశ్, తాజాగా అసోం రాష్ట్రాల్లో బిజెపి విజయంలో కీలకపాత్ర పోషించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ఏపి-తెలంగాణలో బిజెపి సంస్థాగత కార్యనిర్వహక కార్యదర్శులుగా చేస్తున్న రవీంద్రరాజు, మంత్రి శ్రీనివాస్, శ్యాంప్రసాద్, మరో కీలక నేత భాగయ్య, అసోం విజయంలో రాంమాధవ్‌తోపాటు మరో కీలకపాత్ర ధారి పేరాల చంద్రశేఖర్ కూడా అవివాహితులే కావడం ప్రస్తావనార్హం.
‘ఇండియానే ఇందిర -ఇందిరే ఇండియా’ అని పొగిడించుకున్న ఇందిరాగాంధీ మనమడు రాహుల్‌గాంధీ కూడా బ్యాచిలర్ జీవితం గడుపుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ యువరాజు మీడియాకు ఎప్పుడు తారసపడినా ఎప్పుడూ వినిపించే ఒక సాధారణ ప్రశ్న. మీ పెళ్లి ఎప్పుడు అని! దానికి ఆయనిచ్చే రొటీన్ సమాధానం కూడా దానికంటే ప్రాధాన్యమైన అంశాలు చాలా ఉన్నాయని!! బ్యాచిలర్ జీవితం మీద విరక్తి కలిగినప్పుడు మాత్రం ఎవరికీ చెప్పాపెట్టకుండా, పార్లమెంటు జరుగుతున్నా సరే.. అమ్మ దగ్గర సెలవు తీసుకుని మరీ విదేశాలకు వెళుతుంటారు. ఇండియాలోనే ఉంటే అలా కేరళలో సరదాగా తిరిగివస్తుంటారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి అవివాహితే.
సైకాలజీ ప్రకారం పెళ్లి కాని బ్రహ్మచారులు ఎవరి మాట వినరంటారు. అందరూ తాము చెప్పిందే తప్ప, ఎదుటివారు చెప్పింది వినాలని కోరుకోరు. పెళ్లికాకుండా సుదీర్ఘకాలం బ్యాచిలర్లుగా ఉండే చాలామందిలో అభద్రత, అనుమానం ఎక్కువ అని సైకాలజిస్టుల విశే్లషణ. నలుగురితో కలవకపోవడం, ఒంటరితనానికి అలవాటుపడటం, సమాజాన్ని చూసి ఒకవిధమైన ఈర్ష్యతో ఉండటం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ప్రస్తుతం ఉన్న ఒకరిద్దరి బ్యాచిలర్ సీఎంలలో ఉన్నాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పెళ్లయిన వారితో పోలిస్తే పెళ్లికాని వారిలోనే నియంత లక్షణాలు ఎక్కువన్నది మరొక సర్వే చెప్పిన విషయం. అయితే, ఇలాంటి లక్షణాలు ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ, అవసానదశలో ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయితోపాటు, స్వయంసేవక్ జీవితం గడుపుతున్న వారి విషయంలో మచ్చుకు కూడా కనిపించవని రాజకీయ వర్గాలు విశే్లషిస్తున్నాయి.

-మార్తి సుబ్రహ్మణ్యం