S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహావిజేత 5

‘యోగశాస్త్ర రహస్యాల ప్రకారం మానవ దేహంలో 107 జీవమర్మ స్థానాలు వున్నవి. వానిలో 64 అతి ప్రమాదకర స్థానాలు. వాటిలో ఎక్కడైనా తీవ్రహతి ఘట్టిస్తే ఎంతటి శత్రువులూ నిక్కినీలిగి కుప్పకూలవలసిందే. ఆ అరవై నాలుగు స్థానాల్లో మీకు కేవలం పదకొండు స్థానాలే చూపాను. అక్కడ ఎలా దెబ్బవేయాలో చూపించాను. వాటిని మీరు మననం చేస్తూ ఉండండి. అభ్యాసానికి కూడా పొరపాటున వాటి జోలికి పోకూడదు మీరు. జాగ్రత్త. కారణం తెలుసుగా’ అని ఆగారు. మళ్లీ అందరి వైపు సూటిగా చూస్తూ, ‘మన సాధన అంతా మిత్రుల మధ్య కదా జరిగేది. పొరపాటున ప్రయోగం చేసినా పర్యవసానం తీవ్రంగా ఉంటుంది’ అన్నారు. ‘అవును. నిజమే’నంటూ అందరూ తలలాడించారు. ‘అలాగే జాగ్రత్తగా ఉంటాం గురువుగారూ’ అన్నారు.
కుళిందకుడు ఇదంతా చూస్తూ కూర్చున్నాడు.
అప్పుడు పురుషోత్తములు ప్రభువుకు తమను తాము పరిచయం చేసుకోమని శిష్యులకు సూచించారు. ప్రభువు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ప్రతిసారీ కొత్తగా మళ్లీ విద్యార్థులు పరిచయం చేసుకోవటాన్ని ఆనవాయితీగా మార్చారు ఆచార్యులవారు.
ముందుగా అక్షయుడు లేచాడు. ‘మండలేశ్వరులు కుళింద ప్రభువుల పుత్రుడిని. పేరు అక్షయుడు’
‘రాజగృహ ప్రధాన ద్వారపాలకుడు బూమ్మన కొడుకుని పేరు పోరన్న’
‘ప్రభువుల కడ వేత్రధరుడు వెంగన్న కుమారుడిని ప్రభూ. నా పేరు హల్లప్ప’
ఇలా అందరి పరిచయాల తర్వాత చివరగా చంద్రహాసుడు లేచాడు. ‘కుళిందక ప్రభువుల ఆదృత పుత్రుడిని. నా పేరు చంద్రహాసుడు’ అన్నాడు చిరునవ్వుతో.
పురుషోత్తములకు మనసు నొచ్చుకుంది. ప్రభువుకు కోపం వస్తుందేమోననే భీతి కూడా కలిగింది. తీక్షణంగా చంద్రహాసుని వైపు చూశాడు. ప్రభువుల పెదవులపై సన్నగా చిరునవ్వు విరిసింది. ‘బాగుంది. కానీయండి’ అంటూ లేచాడు ప్రభువు. అడివప్ప వున్న వలయం దగ్గరికి నడిచాడు. ఆచార్యులూ అనుసరించారు.
‘చంద్రహాసుడు సత్యం పలికాడు. అతడిపై కినుక వహించకండి. మేము అతని దత్తర స్వీకరణని అధికారికం చేయలేదు కదా’ ఆచార్యులను చూస్తూ అన్నాడు ప్రభువు.
‘అవునవును’ అన్నారు పురుషోత్తములు. యధాలాపంగా తనకు తాను చెప్పుకుంటున్నట్లు అన్నాడు. ‘తమకు తెలిసిన నాటి నుంచీ చంద్రహాసునిది ఒక విలక్షణ తత్వం. ఆ వయసులోని పిల్లల ప్రవర్తనకు భిన్నంగా ఉండేవాడు. పరిణత మేధ, వయస్సును మించిన ఆలోచనా విధానం, నడవడి అన్నీ విలక్షణంగానే ఉన్నాయి. విద్యాభ్యాసంలో తెలివితేటలు చూపేవారిని నేను చాలామందిని చూశాను. కానీ, విద్యతోపాటు ఇతర యుద్ధ విద్యా సాధనలోనూ, మాటతీరులోనూ, ఇతరులకు తన సహాయ సహకారాల్నీ, సూచనల్నీ అందించటంలోనూ అతని వ్యక్తిత్వం ప్రస్ఫుటవౌతుంది.
అతనికి విషయ సమన్వయ శక్తి పరిణత మేధ ఉత్తమంగా ఉన్నాయి. కష్టాలు ఎదుర్కొని నిలిచి, కడకు భిక్షాటన చేసుకునే స్థితి నుండీ వచ్చిన వానికి - ఇంత జ్ఞానం, సంస్కారం వొనగూడడం అనేది చాలా అరుదైన సంభవం. జననాంతర పుణ్యమే అయి ఉంటుంది.
సాలోచనగా ముందుకు సాగాడు ప్రభువు.
బాలికలూ, యువతులూ వున్న అగ్గిడి దగ్గరకు వచ్చాడు ప్రభువు. అక్కడవున్న ఒక తినె్న మీద కూర్చున్నాడు.

పురుషోత్తముని చూస్తూ ‘మీరు బోధనని కానివ్వండి’ అని వెళ్లమన్నట్టుగా సూచించాడు.
‘చిత్తం’ అంటూ వెనక్కు వెళ్లాడాయన.
యువతులు బరిగోల తిప్పటం, శత్రువు మీదికి ఉరకటం, నేర్పుగా పొడవగలగటం నేర్చుకుంటున్నారు వాళ్లు. అడివప్ప శిష్యురాండ్రలో గతంలో సాధన పూర్తి చేసుకున్న యువతి శిక్షణనిస్తోంది.
పక్కగా మరి కొందరు బాలికలు అదే బరిగోలతో క్రూర జంతువులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటున్నారు. వారిలో పద్మినీ, దుర్గీ కూడా వున్నారు. వీరికి ఒక యువ యోధుడు శిక్షణ నిస్తున్నాడు.
ఇక్కడ పరిచయాల్ని చేయించలేదు అడివప్ప.
కొంత సమయం గడిచింది. ఇంతలో ‘లేబగలు’ గంట మోగింది. అన్ని పరిచ్ఛేదాల్లో శిక్షణ ఆగింది.
ప్రభువు లేచాడు. అందరూ నిలబడ్డారు. అడివప్ప, నేను నిలుస్తాను ప్రభూ’ అంటూ నమస్కరించారు.
ప్రభువు తల పంకించి ముందుకు కదిలాడు.
ప్రభువు ఆలోచన చంద్రహాసుని గురించి పురుషోత్తములు చెప్పిన గుణగణాల మీదే పరిభ్రమిస్తోంది.
13
తెల్లవారింది.
నగరంలో రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారంతా చర్చలు చేస్తున్నారు. బాటలన్నీ సందడిగా ఉన్నాయి.
పంగలగుట్ట మీది సమాచారం అందరికీ తెలిసినా, తర్వాత ఏమి జరిగినదనేదే - ఇప్పుడందరి ముందూ నిలిచిన ప్రశ్న.
కొందరు ‘ఆ దోషులిద్దరూ అసలు కుంతలవాసులేనేమో’ అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానం దుష్టబుద్ధి తెలిసిన పెద్ద వారి నుంచీ వ్యక్తవౌతోంది. ఏమైనా నగర జన జీవనంలో ఇప్పటికిదొక ప్రత్యేక సంచలనంగా మారింది.
ఏ ప్రత్యేక ఘటనా లేకుండా సాయంకాలమయింది.
చంద్రహాసుడు, అక్షయుడు కలిసి రాచనగరుకు తూర్పున అర్ధయోజన దూరంలోగల విష్ణు పర్వతేశ్వరాలయ సముదాయానికి వచ్చారు. చల్లగాలి వీస్తోంది. ఉండుండి గుడిగంటలు మోగుతున్నాయి. గారచెట్టు మీది పిట్టలు అవ్యక్త మధుర ధ్వనుల్ని ప్రసారం చేస్తున్నాయి. వాతావరణమంతా పరమాహ్లాదకరంగా ఉంది. పర్వతేశ్వర స్వామి దర్శనమూ, పూజా అయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నడుస్తున్నారిద్దరు. ప్రాంగణమంతా భక్తులతో నిండి ఉంది. ఎక్కువ మంది ప్రసాదాలు ఆరగిస్తున్నారు. అక్కడ నుంచీ విష్ణ్వాలయంలోకి ప్రవేశించి చంద్రహాసుడూ, అక్షయుడూ.
చీకటి పఱచుకుంటోంది.
ఆలయ ప్రాంగణంలో కొందరు భజన పాటలను గానం చేస్తున్నారు. వారి చేతులలోని తాళాలు లయబద్ధంగా మోగుతున్నాయి. ప్రజల బాసకు వనె్న చినె్నలద్ది సింగారం చేసినట్టు శ్రుతిసుభగంగా రసనాస్వాదంగా ఉంది భజన పాట. కొందరు పిల్లలు కోలాటం కర్రలతో ఆడుతూ, వలయంగా తిరుగుతూ నృత్య భంగిమలతో గొంతులు కలుపుతున్నారు. పాటలోని అక్షరాలు - వెదజల్లిన పూలరేకుల్లా అనిపించాయి చంద్రహాసుడికి.
స్వామి అర్చన పూర్తి చేసుకుని వచ్చి, ప్రక్కగా ఉన్న కళ్యాణ మండపం మెట్లమీద కూర్చున్నారిద్దరూ. ఎదురుగా అశ్వత్థ వృక్షం ఆకులు గలగలలాడుతున్నై.
ఉన్నట్టుండి చంద్రహాసుడు తన కంఠంలోని ఒక స్ఫటికమాలని చేతిలోకి తీసుకుని, మాలకు మధ్యగా అమరి వున్న ఒక స్ఫటికాన్ని చూపుతూ, ‘అక్షయా! ఇది నీవు చూసి ఉండవు. చూసినా దాని ప్రత్యేకత నీకు తెలిసి ఉండదు. నేనెప్పుడూ ప్రత్యేకించి నీకు చెప్పలేదు. ఇది విష్ణుస్ఫటికం! ఆనాడు నేను మా దాది వకుళా కుంతలపురంలోకి ప్రవేశించే ముందు బీమానదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో చాలామంది బాలబాలికలు నదీ తీరంలో ఆడుకుంటూ వివిధ ఆకృతులలో వున్న చిన్నచిన్న రాళ్లను ఏరుకుంటూ కనిపించారు. నేనూ ఏరడం మొదలుపెట్టాను. ఒక చిన్న సాలగ్రామాన్ని చూసి ముచ్చటపడి మింగేశాను. మా దాది కంగారుపడింది. నాకేం కాలేదు. ఆ తర్వాత ఇదిగో ఈ స్ఫటికం కనిపించింది. తీసుకున్నాను. ఇది ప్రత్యేకంగా కనపడుతున్నదని ఒక సన్యాసి స్వామికి చూపించింది మా దాది. ఆ స్వామి దీనిని పరీక్ష చేసి ‘ఇది విష్ణుశిల, దీనిని ధరించినవాడు సకల విద్యా పారంగతుడవుతాడనీ, అపారమైన శక్తియుక్తులు లభిస్తాయ’నీ చెప్పాడు. ఆనాటి నుంచీ ఇది నా కంఠహారంలో కుదురుకుంది’
అంతా విని అక్షయుడు ఆశ్చర్యపోయాడు. ‘విశేషమే. అందుకే నీకు విష్ణ్భుక్తి ఎక్కువ!’ నవ్వుతూ అన్నాడు.
‘అవునేమో’ తమ్ముని ప్రశంసకు మురిసిపోయాడు చంద్రహాసుడు.
అక్కడి నుండీ నిదానంగా కదిలాడు చంద్రహాసుడు.
చంద్రహాసుని గాంభీర్యాన్ని చూసి పక్కనే నడుస్తున్న అక్షయుడు మాట కలపలేకపోయాడు. క్షణంలో చంద్రహాసుని లోని మార్పుకి అతనికి ఆశ్చర్యం కలిగింది.
ముఖమంటపం వరకూ నడిచారిద్దరూ. అక్కడికి రాగానే చంద్రహాసుడి దృష్టి ఒక స్తంభం మీదకి పోయింది. పాంచాల లక్షణాలలో ఒక వీర సుందరమూర్తి ప్రతిమ ఆ స్తంభము మీద శిల్పించబడి ఉంది. ఈ దేవాలయానికి ఎప్పుడు వచ్చినా అతనికి ఒక పారవశ్యం, అనుభూతీ లభిస్తాయి. ఎక్కువసార్లు అతడీ ఆలయానికి రావడానికి అది కూడా ఒక కారణమయి ఉండవచ్చు.
ఆ స్తంభము మీది మూర్తి జవనాశ్వారూఢుడై పట్టా కత్తిని ఝళిపిస్తున్నాడు.
అశ్వం ముందరి రెండు కాళ్లనూ గాలిలో నిలిపి ఆ క్షణంలోనే తన డెక్కలతో శత్రువు గుండెల్ని ఛేదించే భంగిమలో ఉంది.
చంద్రహాసుడికి ఈ శిల్ప మూర్తిలో ముమ్మూర్తులా తన తండ్రి రూపురేఖల సామ్యం కనిపిస్తూ ఉంటుంది. తాదాత్మ్యతతో దాని వైపుగా చూస్తూ నిలబడిపోయాడు. చిన్ననాటి జ్ఞాపకాలు మనసున కదిలాయి.
సరిగ్గా అప్పుడు ఇదే భంగిమలో తన తండ్రి సుధర్మికుల వారిని తాను కడసారి చూశాడు.
శత్రువులు కోట ప్రాకారానికి ఆవల ముట్టడి చేస్తున్నారని వినగానే, ఇలాగే అశ్వారూఢులై, అంతఃపుర ప్రాంగణంలో తల్లి వద్దకు వచ్చి వీడ్కోలు తీసుకున్నారు మహారాజు. ఆ క్షణంలో తన తల్లి ముఖంలో కించిత్తు కూడా ఆందోళన తొణకలేదు. తనను చేతులతో ఎత్తి పట్టుకుని తండ్రికి దగ్గరగా తీసుకువెళ్లింది.
మహారాజు సన్నని లేత నవ్వుతో ప్రేమమీర వంగి తన మూర్ధాఘ్రాణం చేసి ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ అనీ ‘నిరంతరాభ్యుదయ ప్రాప్తిరస్తు’ అనీ దీవించి వెళ్లిపోయారు.
తండ్రి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ దృశ్యం తన మనస్సును వేధిస్తూనే ఉంటుంది. తండ్రి దీవెన ప్రభావమేమో - తనకు కళింద్ర మహామండలేశ్వరుని ప్రాపు అయాచితంగా లభించింది. తన పూర్వ పుణ్యసుకృతం - ఇది. తన పట్ల మేధావినీదేవి అనునయం మాతృప్రేమను మరిపిస్తుంది. అక్షయుడు, పద్మిని కూడా స్వంత అన్నలాగానే తనను భావించి గౌరవిస్తున్నారు. అంతా తన అదృష్టం!
‘ఇక మనం కదులుదాం అన్నా’ అంటున్న అక్షయుని పిలుపు చంద్రహాసుని ప్రస్తుతంలోకి లాగింది. ‘ఆఁ... అలాగే’ అంటూ చుట్టూ చూశాడు.
అప్పటికి చీకటి బాగా ముసిరింది. దీపతోరణాల వెలుగు ఆలయ ప్రాంగణానికి ధవళిమని పంచుతోంది.
ఒకపక్క సత్య సుందర శివమైన వాస్తవం. మరో భావనలో ఈ విశ్వమంతా స్వామి విష్ణువు విసిరి ఆడుతున్న పిండి గోలీల ఇంద్రజాలంలా అనిపిస్తోంది చంద్రహాసునికి. ఇద్దరూ ఆలయం వెలుపలికి వచ్చారు. సారధి రథాన్ని వీరి ముందుకు తెచ్చాడు.
-చంద్రహాసుడూ, అక్షయుడూ ప్రయాణిస్తున్న రథం దేవాలయం నుండి నిండా అరక్రోసు దూరం వచ్చింది.
ఎదురుగా కనిపించే దృశ్యం వారిని ఆకర్షించింది.
బాటకు పక్కనే ఉన్న ఒక మాళిగ ముందు జనం కలకలంగా మాట్లాడుకుంటున్నారు.
రథాన్ని నిలుపమన్నాడు చంద్రహాసుడు. అతడూ అక్షయుడూ దిగి మాళిగ ముందుకు వెళ్లారు. జనం వీరిని చూచి ప్రక్కకి తప్పుకుని దారినిచ్చారు. వినయంగా తలలు వంచి నమస్కరించారు.
లోపలి నుంచీ ఒక స్ర్తి విలాపం - పెద్ద స్వరంతో వినిపిస్తున్నది. రెండడుగులు ముందుకు వేసి గుమ్మం వద్ద నిలిచి ‘ఏం జరిగింది?’ అని అడిగారు.
ఒక వృద్ధురాలు గుండెలు బాదుకుంటూ ముందుకొచ్చింది. ‘చూడండి ప్రభూ... చూడండి. ఈ ముసలితనంలో ఉన్న ఒక్కగానొక్క మనవడూ నన్ను అన్యాయం చేసి వెళ్లిపోవాలని ఎంతకు తెగించాడో చూడండి. ఎవరు నాకు దిక్కు? నా బతుకుని బండలు చేసిపోతాడంట’ అని రోదిస్తోంది.
‘జరిగిందేమిటో చెప్పమ్మా?’ అని అనునయంగా అడిగాడు చంద్రహాసుడు.
మరో అడుగు లోపలికి వేసి ఆమెకు సమీపంగా వొంగి నిలిచాడు. పాతిక సంవత్సరాల వయసున్న యువకుడు శరీరం నిండా గాయాలతో నేలపై పడున్నాడు. మూలుగుతున్నాడు. ముఖం విచ్ఛాయబారింది.
‘ఏమయింది?’ ఈమారు అక్షయుడు అడిగాడు.
పక్కనున్న ఒక పెద్దాయన చెప్పాడు. ‘అదొక చిత్రమైన కథ ప్రభూ. వీడికి ఒక నెల రోజుల నుంచీ ఒక పిచ్చి కల వస్తున్నదిట. కలలో ఒక పులి కనిపించి, నేను నీకు మేలు చేస్తాను. నన్ను విడిపించు. భయపడకు. నీకు ఏ విధమైన అపకారం చేయను. నన్ను విడిపించ’మని మొర పెట్టుకుంటోందిట. రోజూ వస్తున్న ఈ కలను ఎలా అర్థం చేసుకోవాలో తెలీటం లేదని చెప్తూనే ఉన్నాడు మాతో. ఏం చెప్పాలో తోచలేదు మాకు. ఈ రోజు మధ్యాహ్నం - ఆ పక్కన అడవి మొదట్లో ఉన్న వన్యమృగ రక్షణ ప్రాంగణంలోనికి.. వెళ్లాడుట. తలవరుల కళ్లుగప్పి లోపలికి పోయి పులిబోను తలుపు కొద్దిగా పైకి లేపాడుట. పులి పట్టి గీరి, రక్కి పెట్టింది. వీడి కేకలూ, అరుపులూ విని రక్షక భటులెవరో వచ్చి పులిబోను తలుపు మూసి వీణ్ణి ఇవతలకు లాగారు. ఇదీ జరిగింది’ ముగించాడాయన.
అక్షయుడూ, చంద్రహాసుడూ ఆశ్చర్యపోయారు. వారికి ఆ యువకుడి పైన జాలి కలిగింది. అతని అమాయకత్వం చూసి విస్తుపోయారు. అతని అమ్మమ్మ పక్కగా కూర్చుని ఆమె చేతుల్ని అందుకుని, ‘చాలా అదృష్టవంతుడమ్మా నీ మనుమడు. ఇక ఏమీ ప్రమాదం లేదు. నీ జీవికకు ఇబ్బందేమీ ఉండదు. స్థిమితపడు. బాధపడకు’ అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను సముదాయించాడు చంద్రహాసుడు. అక్షయుని వైపు తిరిగి ‘ఈ యువకునికి మనమేమైనా సహాయం చేయగలమా’ నెమ్మదిగా అతనికి మాత్రమే వినపడేలాగా అడిగాడు. ‘చేద్దాం’ అన్నాడు అక్షయుడు.
‘నీ పేరేమిటి తల్లీ’ చంద్రహాసుని ప్రశ్నకు ఆమె తన పేరు ‘మాచమ్మ’ అనీ, తన మనుమని పేరు ‘ముదువొల్ల’ అనీ చెప్పింది.
‘సరి. వీరు అక్షయులు. మన ప్రభువు కుళిందకుల వారి కుమారులు. నీ మనుమడిని వచ్చి వీరిని కలవమను. వస్తామమ్మా’ అంటూ బయటకు వచ్చాడు చంద్రహాసుడు. అతని వెనగ్గా అక్షయుడూ వచ్చాడు.
మాచమ్మ చెయి మోడ్చింది. ఇదంతా అరమోడ్పు కన్నులతో చూసిన ముదువొల్ల కూడా చేతులు జోడించాడు.
దారిలో అక్షయుడు చంద్రహాసుడి వివేకం గురించి ఆలోచించాడు. ‘అన్న పద్ధతే వేరు. తానుగా నిర్ణయం తీసుకోకుండా, రాచమర్యాదకు తగినట్లు, నా అనుమతి తీసుకుని వారికి మాట ఇచ్చాడు’ అని విశే్లషించుకున్నాడు. చంద్రహాసుని పట్ల అతనికి గౌరవం ఇంకా పెరిగింది.
రథం వేగాన్ని పెంచుకుంది. దీపాల వెలుగులో చందనావతి నగరం వైభవమూర్తిలా విరాజిల్లుతోంది.
14
ఆ మర్నాడు - అక్షయుడు ముసలమ్మ మాచమ్మనూ మనుమడు ముదువొల్లనూ పిలిపించి- ద్వారపాలకుల పెద్ద అయిన రామప్పకు అప్పగించాడు. ముదువొల్లకు శిక్షణను ఇప్పించి అతనికి తగిన ఉపాధి నివ్వమని ఆదేశించాడు. చంద్రహాసుడు అక్షయుని అభినందించాడు.
15
ఆ రాత్రి - కుళిందకుల వారి ఆంతరంగిక మందిరంలో - ప్రభువు, అక్షయుడు, చంద్రహాసుడు, అడివప్ప కూర్చుని వున్నారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
చంద్రహాసుడు చెప్పిన విషయాన్ని విన్న ప్రభువు మనస్సులో పరిపరి ఆలోచనలు పరుగులెత్తుతున్నాయి. అడివప్ప ఈ పరిణామాల పర్యవసానాన్ని గురించిన తలపులలో మునిగాడు. అక్షయుడు చంద్రహాసుని వైపు పరీక్షగా చూస్తున్నాడు.
చంద్రహాసుడు భావోద్వేగంలో ఉన్నాడు. తన ముందున్న ముగ్గుర్నీ పరీక్షగా చూశాడు. ప్రభువుకు విన్నవించింది జరిగిన వాస్తవం మాత్రమే. ఇప్పుడిక జరగవలసిన కర్తవ్యం గురించి చెప్పాలి. క్షణమాత్రం తటపటాయించి ఆ వెంటనే ఒక నిశ్చయానికి వచ్చి పెదవి విప్పాడు.
‘కరద మొత్తం కలిపి ఒక చిన్న మండలం. అయితే పర్వత ప్రాంతం కావటం వలన మండలాధీశుడు వీరశివుడు తన దొంగాటలు సాగించ గలుగుతున్నాడు. అతని సైన్యం ఆడుతున్న ‘దోబూచి’ ఆటకు ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చింది. నిజానికి వీరశివుడు బలాన్నీ, బలగాన్నీ సైన్యమనే కంటే ‘దండు’ అంటేనే చాలు’
‘అదీ అక్కర్లేదు. అదొక దళం మాత్రమే’ అక్షయుడు మాట కలిపాడు.
‘అవును ప్రభూ. ఆ దళ సభ్యులకి తెలిసింది - కొండలలో అడవులలో మాటువేసి దొంగ దెబ్బతీయటమే వారికి చేతనవును. ఎదురు నిలిచి పోరాడే సత్తా వారికి లేదు’ అడివప్ప అందుకున్నాడు.
‘గురువుగారు అనుభవశీలురు. వారు నేర్పిన యుద్ధ నైపుణ్యాలన్నీ మాకు పెట్టిన రక్షగా ఉన్నాయి’
చంద్రహాసుని వీరత్వ ప్రకటనని గమనించాడు ప్రభువు.

మిగతా వచ్చేవారం

-విహారి 98480 25600