S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రశంస (స్ఫూర్తి)

స్కూల్ నించి ఇంటికి తిరిగి వచ్చిన సారస్వత్ తల్లితో చెప్పాడు.
‘నాకు ఇది అర్థం కావడం లేదు. నీతా ఈ ఊరు వచ్చి నాలుగైదు వారాలే అయింది. అకస్మాత్తుగా మా క్లాస్‌లో అంతా నీతాని ఇష్టపడుతున్నారు’
‘ఎందుకని?’ తల్లి ప్రశ్నించింది.
‘నాకు అర్థం కావడం లేదని చెప్పాగా. మామూలు బట్టలే వేసుకుంటుంది. అందరికన్నా అందంగా ఉంటుందా అంటే అదీ కాదు’
వారి సంభాషణ విన్న పక్కింటావిడ చెప్పింది.
‘నాకు తెలుసు’
‘మీకెలా తెలుసు? నీతాలోని విశేషం ఏమిటి?’ సారస్వత్ తల్లి అడిగింది.
‘నీతా పక్కిల్లే మా అక్కది. కాబట్టి వాళ్లింటికి వారం వారం వెళ్లినప్పుడల్లా నీతాని గమనించాను. నీతా ఎదుటి వాళ్లల్లోని మంచి విషయాలని గుర్తించి చెప్తూంటుంది’
‘అంటే? నాకు అర్థం కాలేదు’ సారస్వత్ అడిగాడు.
‘ఆంటీ.. మీ చీర రంగు బావుంది. మంచి సెలక్షన్ అని నన్ను కాంప్లిమెంట్ చేసింది. నువ్వు అందరికన్నా నవనవలాడే కూరలని తెస్తావు అని కూరలు అమ్మే బండివాడిని మెచ్చుకుంటూండగా విన్నాను. నిన్ను కూడా నీతా మెచ్చుకుని ఉండాలే?’ ఆవిడ అడిగింది.
‘అవును. మా అమ్మ రోజూ నా బూట్లు పాలిష్ చేస్తుంది కదా. నీ బూట్లు మన క్లాస్‌లోని అందరి బూట్లకన్నా మెరుస్తూంటాయి అని చెప్పింది’
‘మరి ఆ మాటలు వింటే నీకు సంతోషం వేయలేదా?’
‘వేసింది’
‘మన గురించి మంచిగా మాట్లాడితే మనకి సంతోషం వేస్తుంది. ఆ సంతోషం ఇచ్చిన వారి మీద ఇష్టం కలుగుతుంది’ పక్కింటావిడ చెప్పింది.
‘ఓ! నీతాకి క్లాస్‌లో అంతా ఎందుకు ఫ్రెండ్సో ఇప్పుడు అర్థం అయింది’
‘ఎదుటి వారిలోని మంచి లక్షణాలని పొగడాలంటే అది వారిని నిశితంగా గమనిస్తే కాని కుదరదు. లేదా అది ఉత్తుత్తి ముఖస్థుతి మాత్రమే అవుతుంది’
‘నిజమే. నీతా చెప్పేవన్నీ నిజాలే. ఓ రోజు నాతో ‘నీకు మీ నాన్న మంచి పెన్ కొనిచ్చారు. పెన్ లావుగా ఉంటే దస్తూరి కుదురుగా ఉంటుంది. పెన్ సన్నదైతే దస్తూరి అంత కుదురుగా రాదు’ అని చెప్పింది’ సారస్వత్ చెప్పాడు.
‘ఇతరుల్లోని మంచిని గమనించడానికి నీతా కొంత సమయాన్ని వెచ్చిస్తోంది. చాలా మంది చెడ్డ విషయాలని అసలు సమయం వెచ్చిచ్చకుండా కనుక్కుంటారు. అంటే ఊహించి కల్పిస్తారు. అలాంటి వారికి శత్రువులు తప్ప మిత్రులు ఏర్పడరు’ సారస్వత్ తల్లి చెప్పింది.
‘అవునండి. నీతా మంచిది కాబట్టే మంచిని ఇట్టే గుర్తిస్తుంది. చెడ్డవి గమనించినా బహుశ పట్టించుకోదనుకుంటున్నాను. మా బామ్మ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి’ పక్కింటావిడ చెప్పింది.
‘ఏమిటవి?’ సారస్వత్ ఆసక్తిగా అడిగాడు.
‘తేనెటీగ మకరందాన్ని ఇచ్చే పూలని వెదికి వాటి మీద వాలుతుంది తప్ప చింతపండు రసం మీద వాలదు అనేది’
‘ఇక మీదట నేను కూడా నీతా మార్గంలోనే వెళ్తాను’ సారస్వత్ చెప్పాడు.
బి జెనరస్ విత్ కాంప్లిమెంట్స్

మల్లాది వెంకట కృష్ణమూర్తి