S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిద్ర సుఖమా?

కుంభకర్ణుడి పేరులో భకారము అనగా భ అనే అక్షరం ఉంది. విభీషణుడి పేరులో కూడా భ ఉంది. రావణుడి పేరులో లేదు. దానవులలో గొప్పవాడయిన రావణాసురుని పేరు రాభణుడు అయితే బాగుంటుందని సంస్కృతంలో శ్లోకం చెప్పి ఒక కవి చమత్కరించాడు. సందర్భం కాకున్నా నాకు ఇక్కడ కుంభకర్ణుడితో పని. రావణుడు ఏవేవో వరాలు కోరుకున్నాడు. అయినా సరే కథ కావలసిన రకంగానే ముగుస్తుంది. వరాలు అడగవలసిన వంతు కుంభకర్ణుడికి వచ్చింది. వాడు నిర్దయ కావలె అని అడగదల్చుకున్నాడట. కానీ రాక్షసుడు, అంటే సాక్షరుడు కాడు. చదువు తలకెక్కనివాడు. అన్న మాత్రం మహా పండితుడు. నిర్దయ అని పలకబోయి కుంభకర్ణుడు నిద్ర అని అడిగాడట. ఇంకేముంది మనకు బాపు మార్కు రామాయణం సినిమాలో సరదాగా చూడడానికి చక్కని సన్నివేశాలు చేతికి చిక్కాయి. వాడు పడుకుని ఉంటాడు. యుద్ధంలో వాడి అవసరం వస్తుంది. మరి వాడిని నిద్ర లేపాలి. మామూలుగా అందరిలాగే ఉంటే తట్టి లేపొచ్చు. కానీ వీడు ఎందుకో మహా పర్వతంలాగా అందరికంటే పెద్దగా ఉన్నట్టు చూపిస్తారు. రాక్షసులంతా కుంభకర్ణుడి మీదికి ఎక్కి శూలాలతో పొడిచి, చెవుల్లో బాకాలు ఊది నానా గోల చేసినట్టు చూపిస్తారు.
నాతో మొదలు కుంభకర్ణుడికి తమ్ముడి లాంటి వాళ్లం ఈ ప్రపంచంలో చాలామందిమి ఉన్నాం. ఒక బాబు గురించి చెప్పాలని ఉన్నది. అతను గానీ, వాళ్ల ఇంట్లో వాళ్లు గానీ ఆంధ్రభూమి, అందులో ఆదివారం, అందులో లోకాభిరామమ్ చదవరని నా నమ్మకం. ఇంట్లో పెద్దవాళ్లు చదివినా సరే సంగతి గుర్తు చేసుకుని నవ్వుకుంటారు తప్ప, నా మీద వాళ్లకు కోపం రాదు. అప్పట్లో మేము ఉండేది ఫ్లాట్స్ అని బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఇళ్ల సముదాయం. కింద ఇంట్లో తలుపులు బిడాయించుకుని ఒక కుర్రవాడు పడుకుని ఉన్నాడు. వాడు మరీ చిన్నవాడేం కాదు. గాఢంగా నిద్రపోయాడు. అది మధ్యాహ్నం సమయం. వాళ్ల అమ్మ పని నుంచి ఇంటికి వచ్చింది. కొడుకు ఇంట్లోనే ఉన్నాడని సంతోషించింది. బెల్ నొక్కింది. వాడు రాలేదు. తలుపు దబదబా కొట్టింది. వాడు రాలేదు. కిటికీలో నుంచి అరిచింది. వాడు రాలేదు. ఈ కట్టిన బహు గృహ సముదాయాలు చిత్రంగా ఉంటాయి. ఏ మూడో అంతస్తులోనో ఉన్న ఇంటికి రాకపోకలు జరపడానికి ఒకటే తలవాకిలి అంటే ప్రధాన ద్వారం. ఇంట్లోకి మరో దారి ఉన్నా అది ఆకాశం మధ్యలో ఉంటుంది. ధైర్యం చేసి వచ్చిన దొంగలకు తప్ప మామూలు వాళ్లకు పనికిరాదు. గంటసేపు గోల చేసినా కుర్రవాడు తలుపు తీయలేదు. ఆ కాలంలో సెల్‌ఫోన్లు లేవు. మామూలు ఫోన్ వాడు ఎత్తడం లేదు. గోలంతా విని ఉన్న ఒకరిద్దరు మగ పురుషులం కూడా అక్కడికి చేరాం. భవనం వాచ్‌మెన్ పెద్ద వయసు గలవాడు. ఉన్న వాళ్లలో నేనే కొంచెం బలశాలిలాగ కనిపించాను. గునపం అనే గడ్డపార ఒకదాన్ని సంపాయించి వాళ్ల ఇంటి గొళ్లెం ఊడగొట్టాను. ఈ గోలకు ఆ బాబు నిద్ర లేచాడు. కానీ ఏం జరుగుతున్నదీ వానికి అర్థమయినట్టు లేదు. గొళ్లెం విరిచి మేము లోపలికి కాలుపెడితే వాడు నవ్వుతూ మా వేపు చూచిన తీరు నాకింకా గుర్తుంది.
నిద్ర అంటే ఇష్టం లేని వారు ఎవరు? నేను ప్రశ్న అడుగుతున్నాను నిజమే గానీ జవాబు కూడా నాకు తెలుసు. కొంతమంది చాలా తక్కువ నిద్ర పోతారు. నా చుట్టుపక్కలే అటువంటి వాళ్లు ఉన్నారు. నేను మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దున్నపోతు లాగ పడుకుంటాను. ఇంతకూ దున్నపోతులను పెంచి పోషించిన నేను ఉన్నమాట చెపుతున్నాను. దున్నపోతులు మాత్రం నాలాగ నిద్రపోవు. అవి అన్ని పశువులలాగే అవసరం ప్రకారం మాత్రమే నిద్రపోతాయి. ఆవిడెవరో ఒక బాబును గాడిద కొడకా అన్నదట, ‘వీడా, నా కొడుకు!’ అటంచు అంటే అనుచు అంటే అంటూ పక్కనే ఉన్న గాడిద విని ఏడ్చిందంట. సరే, మొత్తానికి నాకు తిండి సరిగా పెట్టకున్నా కొంప మునగదు గానీ కంటినిండా నిద్ర మాత్రం కావాలి.
పగటి పూట నిద్ర అలవాటు లేదు. రాత్రి పడుకుంటే మళ్లీ లేచేది లేదు. అందుకు తగిన పద్ధతిని నాన్న నేర్పించాడు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒంటికి పోయి రావాలి, కాళ్లు కడుక్కోవాలి, కడుపునిండా నీళ్లు తాగాలి. ఈ పనుల తరువాత పడుకుంటే ఇవాళటి వరకు నేను మధ్యలో లేవనుగాక లేవను. మూత్రవిసర్జన తరువాత కాళ్లు కడుక్కోకుండా పడుకుంటే కలలు వస్తాయని నాకు ఒక నమ్మకముండేది. కాళ్లకు కలలకు సంబంధం లేదని తెలుసు. అయినా నమ్మకాలు నమ్మకాలే. అవి ఇప్పుడు లేవని నేనే తెలుసుకున్నాను. ఒంటికి పోకుండా పడుకుంటే మధ్యలో నిద్ర పాడవవచ్చు. లేచి వెళ్లవలసిన అవసరం రావచ్చు. నీళ్లు తాగకుండా పడుకుంటే వాతావరణం కారణంగా దప్పి పుట్టవచ్చు. కనుక నిద్ర పాడవుతుంది. ఇవన్నీ నా అనుభవంలోని విషయాలు. అందరికీ ఇదే రకంగా అలవాటు ఉంటుందని నేను అనుకోను. అరవయ్యేళ్లు దాటి చాలాకాలమయింది, నాకు మాత్రం ఇప్పటికీ ఎటువంటి అడ్డు లేకుండా హాయిగా నిద్ర వస్తుంది.
ఆలోచనలు అతిగా ఉంటే తల నేలకు తగలగానే నిద్ర రాదు. నేను మరి ఆలోచించకుండా ఉండలేను. కనుక పడక చేరిన తరువాత కూడా మెదడులో సినిమా లేదా సంగీత కచేరిలాగ ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. చాలాసేపటి వరకు నిద్ర రాదు. ఏకంగా గంటలపాటు మనసులోనే నాకు నేనే ఉపన్యాసాలు ఇచ్చుకునే సందర్భాలు కావలసినన్ని ఉన్నాయి. కానీ నిద్ర వచ్చిందంటే మాత్రం ఇక ప్రపంచం గురించి తెలియదు.
బాధ్యతలు అన్నీ నావేనని, ఈ ప్రపంచం అనే బొంగరం నేనూ అనే ములికి అంటే మేకు మీద తిరుగుతున్నదని అనుకున్నంత కాలం చీమ చిటుక్కుమంటే మెలకువ వచ్చేది. అదంతా అబద్ధం అని అర్థమయిపోయింది. కనుక ఇప్పుడు ఏనుగు ఘీంకరించినా నిద్ర లేచేది లేదు. ఇక కాలింగ్ బెల్ మోగితే లేస్తానా? కానీ ఈ ప్రశ్నకు లేస్తాననే అనుభవం చెపుతున్నది. మొత్తానికి చెప్పదలచుకున్నది ఒకే ఒక్క విషయం. నా మెదడుకు నేనే పాఠాలు చెప్పుకున్నాను. బహుశా దీన్ని ఆటో సజెషన్ అంటారేమో నాకు తెలియదు. నిజంగా అవసరం వచ్చినప్పుడు నిద్ర మెలకువ అవుతుంది. అవసరం లేదనుకుంటే హాయిగా పడుకుంటాను.
నిద్ర అన్నది శరీరానికి తిండి, ఊపిరిలాగే చాలా అవసరం. నిద్ర గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జరిగాయి కూడా. చిత్రంగా నా కూతురు స్వీడన్ అనే దేశంలో ఉబ్‌సలా అనే ఊళ్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన న్యూరాలజీ శాఖలో నిద్ర గురించి పరిశోధనలు చేస్తున్నది. నా కూతురు గదా, మా అమ్మాయికి కూడా నాలాగే నిద్ర యావ ఎక్కువ. తన పరిశోధన గురించి చెప్పినప్పుడు నేను ‘నీవు పడుకుంటే నీ నిద్ర గురించి మిగతా వాళ్లు పరిశోధిస్తే బాగుంటుంది’ అన్నాను. ఈ మధ్యన మా అమ్మాయి ఒక సంగతి చెప్పింది. వాళ్లు పరిశోధిస్తున్నది నిద్రలేమి ప్రభావాల గురించి అని. కనుక ఆమె కార్యకర్తలను రాత్రి మొత్తం నిద్రపోనివ్వకుండా చూస్తూ వాళ్ల శరీరాలలో కలిగే మార్పులను పరిశీలిస్తున్నదట. తెల్లవారిన తరువాత ఇంటికి వచ్చి తిని పడుకుంటున్నదట. మొదలే అది స్వీడన్ దేశం. అక్కడ పగలు, రాత్రులు మన పద్ధతిలో ఉండవు. పగలంటే దినమంతా పగలే. అలా కృంగిన సూర్యుడు ఇలా మళ్లీ మొలుస్తాడట. పరిశోధన ముగిసేలోగా మా అమ్మాయి నిద్ర పద్ధతి మారిపోయేట్టుంది.
నిద్ర కారణంగా శరీరం మరొకసారి కొత్తదవుతుంది. మెదడులో విషయాలు లైబ్రరీలో పుస్తకాలు సర్దినట్టు సర్దుకుంటాయి. కనుక ఎవరికి అవసరమయినంత కాలం వాళ్లు నిద్రపోవడమే మంచిది. ఈ అవసరం గురించి కూడా పరిశోధనలు జరిగాయి. పద్ధతులూ ఉన్నాయి. మొత్తానికి నిద్ర సుఖం కాదు, అవసరం.

కె.బి. గోపాలం