S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 7

నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. సినిమాల గురించి అంతో ఇంతో తెలిసిన వాడు దొరకటమే కాదు. అతనితో ఉండే అవకాశం కూడా దొరుకుతుందంటే... అంతకంటే కావలసింది ఏముంది?
మా మధ్య సంభాషణ ఇలా సాగుతుంటే పై బెర్త్ మీద ముసుగు పెట్టి పడుకున్న ఒకమ్మాయి ముసుగు తొలగించి ఒకసారి కింద కూర్చున్న మా వైపు చూసి మళ్లీ పడుకుంది.
చీకట్లో ఆమె మొహం కనపడలేదు కానీ అప్పటిదాకా మా సంభాషణ వింటుందని అర్థమైంది.
మా సంభాషణలో రహస్యాలు ఏమీ లేవు కాబట్టి, నేను తిరిగి సారథితో మాటల్లో పడ్డాను. ఎప్పటికో బాగా పొద్దుపోయాక పడుకున్న ఇద్దరం ఉదయం సికిందరాబాద్‌లో ట్రైన్ ఆగటంతో దిగాము.
ఆ తరువాత నేను సారథి గూటికి చేరాను. ఫిల్మ్‌నగర్‌కి దూరంగా... నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో రెండవ అంతస్తు మీద ఒక గది అది. నాలుగు గోడల మీద కప్పిన రేకుల కప్పు. నీళ్లు కింద నుండి తెచ్చుకోవాలి. నేను ఉండి వచ్చిన పరిస్థితులతో పోల్చుకుంటే అదేమీ పెద్ద బాధగా అనిపించలేదు.
పరిస్థితులన్నీ అవలోకనం చేసుకుంటే నా లక్ష్యానికి చేరువ కావటానికి మొదటి మెట్టు ఎక్కినట్లనిపించింది.
నాకున్న తక్షణ సమస్య డబ్బు జాగ్రత్త చేసుకోవటం. స్నానానికి వెళ్లినపుడు కూడా ఆ సంచి నా నుండి దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నాను. ఎందుకో ఆ డబ్బు గురించి సారథికి కూడా చెప్ప బుద్ధి కాలేదు.
‘నా గురించి అన్నీ అడిగావు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావ్?’ సారథిని అడిగాను వచ్చిన మరుసటి రోజు.
‘సినిమాలో కెమెరామేన్ దగ్గర ట్రాలీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను’
‘పని ఎక్కువ ఉంటుందా?’
‘పని ఉంటుంది. పని ఎక్కువ ఉన్న రోజున డబ్బులు కూడా ఎక్కువే వస్తాయి. అయితే సమస్య అది కాదుగా! ఏం పని చేయటానికి వచ్చాను? ఏం పని చేస్తున్నాను... అనుకుంటే అవమానంగా అనిపిస్తోంది. ఓడిపోయిన ఫీలింగ్ కలుగుతోంది’ నిరాశగా చెప్పాడతను.
‘మరి డబ్బులు బానే వస్తే మంచి ఇల్లు చూసుకోవచ్చుగా! ఇలాంటి ఇంట్లో ఉండడం ఎందుకు?’
‘నేను డబ్బులు బానే వస్తాయన్నాను కానీ, ఉన్నాయని అనలేదుగా! ఓడిపోయిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పానే! దాన్ని పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం. తాగి డబ్బులు తగలెయ్యటం’
సారథికి పని లేకపోవటంతో ఇద్దరం రెండు రోజులు కలిసి ఊరంతా తిరిగాం.
తరువాత సారథి తన పనికి వెళ్లిపోయాడు.
‘నాకు కూడా అక్కడ స్టూడియోలో ఏదో ఒక పని చూడకూడదూ!’ అడిగాను నేను.
‘నాకే ఠికాణా లేదు. నీ గురించి సిఫారసు చేయటమా? అయినా అవకాశం వచ్చినపుడు చూస్తాను. ఈలోపు నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో...’ అన్నాడు సారథి.
దానితో నేను పని కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే పని దొరికించుకోవటం అనుకున్నంత సులువు కాదని నెమ్మదిగా అర్థమైంది. కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగాను. వేడుకున్నాను. ప్రాధేయపడ్డాను. అయినా లాభం లేకపోయింది.
నెల రోజులు గడుస్తున్నా నా ప్రయత్నాల్లో ఏ పురోగతీ కనిపించటంలేదు.
మొదటి తారీఖు వచ్చింది. ఇంటి ఓనర్ అద్దె వసూలు చేసుకోవటానికి వచ్చాడు. సారథి దగ్గర అతనికి ఇవ్వటానికి డబ్బులు లేవు. ‘సార్! ప్రస్తుతం కొద్దిగా ఇబ్బంది ఉంది. ఒక వారం రోజులు గడువు ఇస్తే...!’ ప్రాధేయపడుతున్నాడు సారథి.
ఓనర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
తాగటానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే సారథి ఇంటి అద్దె ఇవ్వటానికి ఎందుకంత తాత్సారం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇద్దరం కలిసి ఉంటున్నాం కాబట్టి, బహుశా అద్దె డబ్బులు నన్ను ఇవ్వమని అతని ఉద్దేశమా అన్న అనుమానం వచ్చింది.
ఈలోపు ఓనర్ సారధినే కాకుండా నన్ను కూడా టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు.
‘ఒకళ్లు ఉంటామని ఇద్దరు ఉంటున్నారు. అయినా ఏమీ అనలేదు. మంచితనానికి రోజులుకావు. మర్యాదగా అద్దె అన్నా ఇవ్వండి. లేదా.. ఇల్లన్నా ఖాళీ చేయండి’ అని అల్టిమేటమ్ ఇచ్చి అక్కడే కూర్చున్నాడు.
సారథి ఓనర్ని బతిమాలుతూనే ఉన్నాడు.
నాకు ఏమీ పాలుపోలేదు. అప్పటికే ఈ గోలకి చుట్టుపక్కల వాళ్లు ఇటువైపు చూస్తున్నారు. ఓనర్‌కి డబ్బులు ఇచ్చి వదిలించుకోవటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాను. నెమ్మదిగా చాటుకు నడిచి నా డబ్బు సంచి నుండి అద్దెకు సరిపడే డబ్బులు బయటకు తీశాను.
‘సారథీ ఈ డబ్బులు ఆయనకు ఇచ్చి పంపు...’ అంటూ డబ్బులు సారధి చేతిలో పెట్టాను.
సారధి ఆ డబ్బులు ఓనర్‌కి ఇచ్చాడు.
‘నీకంటే ఈ కొత్త కుర్రాడే నయం. జేబులో నాలుగు రాళ్లు ఉన్నట్లున్నాయి. ముఖ్యంగా మాట పడకూడదన్న జ్ఞానం ఉన్నట్లుంది. ఖాళీ చేతులు ఊపుకుంటూ సిటీకి ఎందుకు వస్తారో తెలియదు నీలాంటి వాళ్లు...’ సారధిని ఉద్దేశించి అంటూ వెళ్లిపోయాడు ఓనర్.
సారథి తిరిగి మామూలు పనిలో పడ్డాడు. ఓనర్ అటు వెళ్లగానే సారథి నాకు థాంక్స్ చెప్తాడనీ, అంత డబ్బు నా దగ్గర ఎక్కడిదని అడుగుతాడనీ అనుకున్నాను. కానీ సారథి ఆ మాటే ఎత్తలేదు.
రెండు రోజులు యధాప్రకారం గడిచాయి.
ఒకరోజు సారధి రావటమే హుషారుగా ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ ఒక విస్కీ బాటిల్, రెండు బిర్యానీ పొట్లాలూ తెచ్చాడు.
‘ఏమిటి విశేషం?’ అడిగాను నేను.
‘ఇవాళ నా పుట్టినరోజు. సెలబ్రేట్ చేసుకోవటానికి నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? అందుకే మనిద్దరికీ తెచ్చాను...’ అన్నాడు.
‘నేను మందు తాగను’
‘ఇప్పుడు తాగు’ అన్నాడు డాబా మీద ఆరుబయట చాప పరుస్తూ.
‘కానీ, నేను ఎప్పుడూ తాగలేదు’ బిడియంగా అన్నాను.
విస్కీ బాటిల్ మూత విప్పతీసి మందు రెండు స్టీలు గ్లాసుల్లో పోస్తూ ‘అన్నిటికీ ఒక మొదలు అంటూ ఉంటుందిగా! ఈ పనికి ఇప్పుడు మొదలు అనుకో...’ అన్నాడు.
ఆ విధంగా మొదటిసారి మందు రుచి చూశాను.
ముందు చేదుగా ఉందనిపించింది.
తరువాత వగరుగా ఉందనిపించింది.
మరి కాసేపటికి అదే బాగుందనిపించింది.
తాగటం మొదటిసారి కాబట్టేమో రెండు పెగ్గులకే మత్తొచ్చింది.
మరో రెండు పెగ్గుల తరువాత ఒళ్లు తెలియకుండా పడిపోయాను.
తెల్లగా తెల్లారే వరకూ మళ్లీ మెలకువ రాలేదు. ఎండ మొహాన్ని మాడ్చేస్తుండటంతో మెలకువ వచ్చింది. అలవాటుగా నడుము తడిమి చూసుకున్న నాకు అక్కడ డబ్బు సంచీ తగల్లేదు.
పక్కకి తిరిగి చూస్తే అక్కడ సారథి లేడు.
* * *
నగరంలో మోసాలు ఎక్కువని తెలుసు. అయినా సారధి చేతిలో మోసపోవటం నాకు షాక్ కలిగించింది. అపార్ట్‌మెంట్ భవనం కూలిపోయి నా వాళ్లందరూ చనిపోయినప్పుడు తగిలిన షాక్ మరలా ఇంకోసారి తగిలింది.
నెల రోజులకు పైగా సారథితో కలిసి ఉంటున్నా అతని ఊరు పేరు కానీ, ఇతర వివరాలు కానీ తెలియదు. తెలిసినా ఇక ఆ డబ్బుల గురించి వెతుక్కోవటం అత్యాశే అని నాకు నెమ్మదిగా అర్థమైంది.
డబ్బులు పోతే పోయాయి. కనీసం సారథి చేసే ఉద్యోగం అయినా సంపాదించుకుంటే రోజులు గడవటానికి ఇబ్బంది ఉండదని భావించి ఆలస్యం చెయ్యకుండా స్టూడియోకి వెళ్లాను. సారథి బాస్‌ని కలిశాను.
సారథి ఫ్రెండ్‌నని చెప్పగానే గుర్రుగా చూశాడు.
‘ఏడయ్యా! చెప్పా పెట్టకుండా ఎటు పోయాడు సారథి?’ అని కోపంగా అడిగాడు ఆయన. ఆయన పేరు కళానిధి.
‘ఊరు వెళ్లాడు సార్! ఇప్పుడప్పుడే రాడు’ సారథి తరఫున నేనే అబద్ధం చెప్తూ అన్నాను.
‘ఊరు వెళ్లాడా? మళ్లీ రాడా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లిపోవటమేనా?’
‘అనుకోకుండా వెళ్లవలసి వచ్చింది సార్! వాళ్ల నాన్నకి ఆరోగ్యం బాలేదని కబురు రావటంతో అప్పటికప్పుడు వెళ్లిపోయాడు’
‘మరి ఎప్పుడు వస్తాడంట?’
‘చెప్పలేను సార్! అసలు రాకపోయినా ఆశ్చర్యం లేదు’
‘మీరందరూ ఇంతేనయ్యా! చేరేటప్పుడు బతిమలాడుకుని చేరతారు. వెళ్లిపోయేటప్పుడు కనీసం చెప్పను కూడా చెప్పరు. ఇప్పుడు అతని స్థానంలో వేరే వాళ్లని వెతుక్కోవాలన్నమాట...’ ఆలోచనగా అన్నాడు కళానిధి.
‘మీకు అభ్యంతరం లేకపోతే ఆ పని నేను చేస్తాను సార్’
‘నువ్వా?’
‘అవును సార్! జాగ్రత్తగా చేస్తాను. ఒక వారం చూడండి. మీకు సంతృప్తి కలగకపోతే నన్ను పనిలో నుండి తీసివేసినా బాధపడను’
కళానిధి ఏమీ మాట్లాడలేదు. నేను చేయవలసిన పని ఏమీ టెక్నికల్ పని కాదు. కాకపోతే కష్టపడి పని చేయాలి. ఆయనకు ఇంత త్వరగా మరొకరు దొరికే అవకాశం లేదు. అయినా ఆ పని ఇవ్వటానికి కూడా మరో ఐదు నిమిషాలు బతిమలాడించుకుని కానీ, ‘సరే...’ అనలేదు ఆయన.
ఆ విధంగా సినీ రంగంలోకి ప్రవేశించాను నేను.
సినిమా షూటింగ్‌కి అందరి కంటే ముందు వచ్చి, అందరూ వెళ్లాక ఆఖరున వెళ్లేది ఎవరయ్యా అంటే కెమెరా యూనిట్ వాళ్లే! అలాగే షూటింగ్‌లో జరుగుతున్న ప్రతి ప్రక్రియకీ అంతిమ లక్ష్యం కెమెరాల్లోకి ఎక్కటమే కాబట్టి, ఏదీ కెమెరా యూనిట్ దృష్టి దాటిపోదు.
చేరిన మొదటి రోజు నుండి ధ్యాస మొత్తం పని మీదే పెట్టాను. నేను చేయవలసిన పనిలో పెద్దగా నేర్చుకోవలసింది ఏమీ లేదు. సీనుకు ఏ విధమైన షాట్లు అవసరమవుతాయో కెమెరామేన్ డైరెక్టర్‌తో చర్చించి నిర్ణయిస్తాడు. ఆ షాట్‌కి అవసరమైన విధంగా ట్రాలీలూ, క్రేన్‌లూ అమర్చటం, ట్రాలీ తొయ్యటం, షూటింగ్ అయ్యాక మరలా దేనికది విడదీసి ప్యాక్ చేసుకోవటం లాంటి పనులు నేను చేయవలసి ఉంటుంది. ఆ పనులన్నీ రెండు రోజుల్లో అలవాటై పోయాయి.
నేను నా పని చేసుకుంటూనే చుట్టూ జరుగుతున్న విషయాలను ఆకళింపు చేసుకోవటానికి ఉత్సాహం చూపేవాడిని.
కొన్నాళ్ల క్రితం థియేటర్‌లో కూర్చుని ప్రొజెక్టర్ నుండి వస్తున్న వెలుగు నీడల్లో నుండి వెలువడుతున్న బొమ్మలను నోరు తెరచుకుని చూసిన నేను, ప్రస్తుతం ఆ వెలుగు నీడలు కెమెరాలో బంధింపబడటం గమనిస్తున్నాను.
తెర మీద కనపడే హీరో చెప్పిన డైలాగు విని ఆనందంతో, ఆవేశంతో ఈలలు వేసిన నేను - హీరో చూపిస్తున్న ప్రతిభకు అతని నటనతోపాటు అనేక మంది ఇతరుల కృషి ఉందని అర్థం చేసుకున్నాను.
డైలాగు చెప్పే నటుడితోపాటు, ఆ డైలాగు రాసిన రచయిత, పాట రాసిన కవి, ట్యూన్ కట్టిన సంగీత దర్శకుడు, వాద్యకారులు, నేపథ్య గాయకులు, దుస్తులు తయారుచేసిన కళాకారులు, మేకప్ ఆర్టిస్టులు, చుట్టూ కనిపించే సెట్టు తయారుచేసిన కళా దర్శకులు, వీటన్నిటినీ కెమెరాలో బంధించే కెమెరామెన్‌లు... ఇలాంటి ఇరవై నాలుగు కళలనూ సమన్వయపరచే దర్శకుడు, వీటన్నిటికీ పెట్టుబడి పెట్టి లాభనష్టాలు భరించే నిర్మాత... ఇలా ఎంతోమంది సమిష్టి కృషితో మంచి సినిమా తయారవుతుంది తప్ప ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రతిభతోనో అది సాధ్యం కాదని నాకు తెలిసింది. అంతేకాదు, నాకు మరో విషయం కూడా అర్థమైంది. ఈ సినీ రంగంలో పైకి రావాలంటే టాలెంట్‌తో పాటు పరిచయాలు చాలా అవసరం. కేవలం రిలేషన్స్ మెయింటెయిన్ చెయ్యటం చేతకాక అద్భుతమయిన కళాకారులు ఎందరో తెరమరుగయ్యారు. నా పని ఇంతవరకే అని గిరి గీసుకుని పనిచేస్తే పైకి రావటం కష్టం. అన్నిట్లోనూ చొచ్చుకు పోగలగాలి.
నేను ఈ పనిలో చేరి సంవత్సరం దాటింది. కళానిధి డిమాండులో ఉన్న సినిమాటోగ్రాఫర్ కావటంతో పనికి ఢోకా ఉండటం లేదు. నాకు చెడు అలవాట్లు ఏమీ లేవు కాబట్టి డబ్బులు కూడా బానే మిగులుతున్నాయి.
ఒకసారి రెండు షెడ్యూళ్ల మధ్య వారం రోజుల గ్యాప్ వచ్చింది. దానితో నాకు కూడా విశ్రాంతి లభించింది. తరువాత షెడ్యూల్ విశాఖపట్నం దగ్గర ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. అక్కడకు ఎప్పుడు వెళ్లవలసి ఉంటుందో కళానిధిని కనుక్కుందామని అతని ఇంటికి బయలుదేరాను.
కళానిధి ఇంట్లోకి నడవబోతుంటే, అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్న షరీఫ్ కనిపించాడు. అతను కళానిధి డ్రైవర్. నాకు కూడా బాగా పరిచయమే! నన్ను చూసి నవ్వాడు. నేను కూడా నవ్వాను.
‘రావయ్యా చంద్రం!... ఇప్పుడే సారు చిన్న పని చెప్పారు. ఆ పని మీద బయటకు వెళ్తున్నాను. నువు కూడా రారాదూ! కాస్త తోడుగా ఉంటుంది...’ అన్నాడు షరీఫ్.
‘కాదులే భాయ్! నేను సారుని కలుద్దామని వచ్చాను. నీతో బయటకు వస్తే మళ్లీ దొరుకుతారో, దొరకరో...’ అనుమానంగా అన్నాను నేను.
‘ఆ భయం ఏమీ అవసరం లేదు. మనం వెళ్తుంది ఆయన పని మీదే. మనం ఆ పని ముగించుకుని వచ్చేవరకు సారు బయటకు వెళ్లరు. కాబట్టి భయంలేదు పద...’ అంటూ నన్ను కారులోకి ఎక్కించుకున్నాడు షరీఫ్.
మొదటిసారి కారెక్కి ముందు సీట్లో షరీఫ్ పక్కన కూర్చున్నాను.
చల్లటి ఏసి గాలి మత్తుగా తగులుతుంటే మెత్తగా కారు ముందుకు దూకింది.
‘ఏదో ఒక రోజు నేను కూడా ఇలాంటి కారు కొనాలి..’ అనుకున్నాను.
‘కారు కొన్నా నడపటం రావాలి కదా!... నాకు అది కూడా రాదే!’ అని మూలిగింది మనసు.
‘నడపటం రాకపోతే ఏమయింది? షరీఫ్ లాంటి వాడినెవడినో డ్రైవర్‌గా పెట్టుకుంటే సరి...’ అని తృప్తిపడ్డాను.
‘ఈ కారు ఎంత ఖరీదు చేస్తుందేమిటి?’ షరీఫ్‌ని అడిగాను.
‘యాభై లక్షలు...’ గర్వంగా చెప్పాడు. ‘ఇట్లాంటి కార్లు సిటీలో రెండో మూడో ఉంటాయంతే...’
అంత డబ్బు పెట్టి ఒక కారు కొంటారంటే నమ్మబుద్ధి కాలేదు. కానీ షరీఫ్‌కి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది?
‘నీకు జీతం ఎంత ఇస్తారు?’ అని అడిగాను.
‘అయిదు వేలు’ చెప్పాడు షరీఫ్.
‘యాభై లక్షల కారు తోలే డ్రైవర్‌కి అయిదు వేల జీతమా?’
‘కారు ఎంతదయితే మనకేమి ఒరిగింది బ్రదర్! మనం చేయవలసిన పని ఒకటే కదా!’
‘నేను ఇలాంటి కారు కొనుక్కున్న రోజున నీకు డబుల్ శాలరీ ఇస్తాను...’ అనుకున్నాను.
‘ట్రాలీ తోసుకునే నేను కారు కొనుక్కోవాలి. కారు నడిపే షరీఫ్ మాత్రం అప్పటిక్కూడా ఇలాగే ఉండిపోవాలి...’ అనే నా ఆలోచనకు నాకే పెద్దగా నవ్వు వచ్చింది.
నా నవ్వు గమనించిన షరీఫ్ ‘ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్?’ అని అడిగాడు.
‘ఏమీ లేదు...’ తడబడుతూ అన్నాను నేను. నా మనసులో ఆలోచనలు బయటకు చెప్తే కారు ఆపి షరీఫ్ నన్ను ఇక్కడే దింపేస్తాడేమో అన్న భయం వేసింది. ‘ఇంతకీ మనం ఎక్కడకు వెళ్తున్నాం?’ మాట మార్చటానికి అడిగాను.
అడ్రస్ చెప్పాడు షరీఫ్. అది నగరంలో నేరాలకు పేరు పడ్డ ఒక ఏరియా.
‘అక్కడ కళానిధిగారికి పనేమిటి?’
‘మన సారు అప్పుడప్పుడూ నాకు డబ్బులిచ్చి పంపుతుంటారు. అక్కడ ఉండే ఒక నల్లటి వ్యక్తికి డబ్బులు ఇస్తే మనకి ఒక పార్శిల్ ఇస్తాడు. అది తెచ్చి సారుకి ఇస్తే మన పని అయిపోతుంది’
‘నల్లటతనా?’ అర్థంకాక అడిగాను.
‘అదే బ్రదర్! అదేదో దేశం వాళ్లు ఉంటారు కదా.. బాగా నల్లగా ఉంటారు’
‘ఆఫ్రికా వాళ్ళా?’
‘ఆ..! అదే!.. మనదేశం అతను కాదు. మన భాష కూడా రాదు’
నాకు అర్థం కాలేదు - కళానిధిగారు అంత కష్టపడి ఒక నీగ్రో అతని దగ్గర తెప్పించుకునే పార్సిల్ ఏమయి ఉంటుంది?
ఈ మధ్య పేపర్లలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం - కొందరు నైజీరియన్లు నగరాన్ని అడ్డాగా చేసుకుని రకరకాల చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని. డెబిట్ కార్డు మోసాల దగ్గర నుండి, డ్రగ్స్ సప్లై వరకు... వాళ్లు చేస్తున్న పనులను రోజూ పోలీసులు బయట పెడుతూనే ఉన్నారు.
మా ఇద్దరికీ తెలియని విషయం ఏమిటంటే కళానిధిగారు చాలా రోజులుగా డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. ఒక నైజీరియన్ ఆయనకి కావలసిన డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు.

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002