S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇవి మామూలు సినిమాలేనా?

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం మారింది. ఎవరూ ఉత్తరాలు రాసుకోవడం లేదు. అందుకు బదులుగా ఈమెయిల్, ఈ మధ్యన వాట్సాప్ ఇలాంటివి అందరూ విరివిగా వాడుకున్నారు. చేతిరాత చేతకాకుండా అయింది. తెలుగు కూడా టైప్ చేయనవసరం లేకుండా చెపితే విని రాసే వెసులుబాటు వచ్చింది. ఇక పాట, సినిమాల గురించి చెప్పనవసరమే లేదు. ఎక్కడ చూసినా అన్ని రకాల మనుషులు పాట వింటూ, లేదా వీడియో చూస్తూ కూర్చుని ఉండడం కనిపిస్తున్నది.
నాకు హాల్‌కు వెళ్లి సినిమా చూసే ఓపిక ఏనాడూ లేదు. భవిష్యత్‌లో చూడవలసిన సినిమాలన్నీ యూనివర్సిటీ కాలం వరకు చూసినట్లు ఉన్నాను. ఆ తర్వాత సినిమాలు చూడడం లేదు. కొంతకాలం సి.డి.లు సంపాదించి ఇంట్లోనే సినిమాలు చూసేవాళ్లం. ఈమధ్య నాది కూడా తగ్గింది.
ఇంటర్నెట్ పుణ్యమా అని, యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వాటి సాయంతో ప్రపంచంలోని అన్ని సినిమాలను చూడగలుగుతున్నాను. మా అబ్బాయి అమెరికాలో తన కంప్యూటర్‌లో పెట్టే సినిమాలను కూడా ఫ్లెక్స్ అనే ఒక యాప్ ద్వారా చూడగలుగుతున్నాను. కనుక ఈమధ్యన అప్పుడప్పుడు ఒకటి అరా సినిమాలు చూస్తున్నాను. ఆశ్చర్యంగా అందులో ఈమధ్యన బోలెడన్ని హిందీ సినిమాలు చూసినట్టు నాకే అర్థం అవుతున్నది. చూసిన సినిమాలలో ఒక్కటి చాలా కాలం అయిన తర్వాత కూడా గుర్తున్నది అంటే అవి చాలా మంచి సినిమా అయి ఉంటుంది అని నా అనుమానం. అమ్మాయి, అబ్బాయి సంబంధం గురించి సినిమాలు చూడడం అరవయ్యారు దాటిన నా వంటి వాడికి అంత సంతోషంగా ఉండదు. కానీ నేను ఈమధ్యన చూసిన హిందీ సినిమాలు ఈ రకం కిందికి వస్తాయని నాకు అర్థం అయింది. ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా.. అని ఒక సినిమా. పాత పద్ధతి మనిషిని కనుక అది నాకు అంతగా నచ్చలేదు. అందులో పేరున్న నటులు కూడా ఉన్నారు. కథ విచిత్రంగా ఉంది. దానికి చెప్పిన తీరు అంతకన్నా విచిత్రంగా ఉంది. చివరకు తేలేది ఏమిటంటే ఆ సినిమా ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ గురించినది. ఈ విషయం గురించి నాకు కొన్ని గట్టి నమ్మకాలు ఉన్నట్టు నాకే అనుమానం మొదలైంది. అదేదో అసాధ్యమైన విషయం అని నాకు అనుమానంగా ఉన్నట్టుంది. సినిమా బాగున్నా దాన్ని నేను మర్చిపోయాను. గుర్తు చేసుకుంటే కూడా వివరాలు అంతగా మనసు తెర మీదకు రావడం లేదు. బాగా డబ్బులు పెట్టి హంగులుగా తీసిన సినిమా కూడా నా ఆలోచనల్లో నుంచి అమాంతం ఎగిరిపోయింది.
అంతకుముందు మరొక సినిమా చూశాను. అది బహుశా నెట్‌ఫ్లిక్స్‌లో చూసినట్టు ఉన్నాను. కొంతకాలం సినిమా పేరు మాత్రం మరిచిపోయాను. బాగా జ్ఞాపకం చేసుకుంటే అది మళ్లీ మనసు తెరమీద కనిపించింది. మసాన్ అని సినిమా పేరు. అంటే స్మశానం కానీ విడిగా చెప్పనవసరం లేదనుకుంటాను. కథ మొత్తం వారణాసిలో నడుస్తుంది. నేను వారణాసికి వెళ్లాను కానీ అంత ఎక్కువగా తిరగలేదు. నది వెంట జరుగుతాయని చెప్పే దహనాలు, వాటిలోని తప్పుడు పద్ధతులు, చూడడానికి నాకు అవకాశం దొరకలేదు. ఈ సినిమాలో ముఖ్యాంశం స్మశానం. అయినా సినిమాలో రెండు వేర్వేరు కథలు ముందుకు సాగుతూ ఉంటాయి. విడివిడిగా సాగుతూ ఉంటాయి. వాటిని దర్శకుడు మార్చి మార్చి చూపించిన పద్ధతి చిత్రంగా ఉంది. ఈ సినిమా ఫ్రాన్స్ దేశం వారి సహాయంతో తీశారట. ఆ దేశంలో సినిమాకు బహుమతి కూడా ఇచ్చారట.
భారతదేశంలో కూడా ఈ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. ఇది ఐదు సంవత్సరాల నాటి సినిమా అంటే నాకు ఆశ్చర్యంగా తోచింది. ఇటువంటి సినిమాలు తీస్తే మన దేశంలో ప్రజలు చూస్తారు అన్న నమ్మకం నాకు లేదు. మసాన్ అనే ఈ సినిమా థియేటర్లో ఆడిందా? అందులో హైదరాబాద్‌కు వచ్చిందా? తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పాలి. మనకు దేశంలో సినిమాలకు మొత్తం తొమ్మిది కథలు మాత్రమే ఉన్నాయని ఎక్కడో చదివినట్టు గుర్తు. అమ్మాయి, అబ్బాయి తోటల్లోనూ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రజలకు బాగుంటుంది. ఈ స్మశానం సినిమాలో కూడా ప్రేమ ఉంది. కానీ అది పాటలు పాడే దాకా వెళ్లినట్లు లేదు. అయితే సినిమాలో కనీసం మూడు పాటలు ఉన్నాయి. అవి ఉన్నట్టు సినిమా చూస్తున్నప్పుడు నాకు తోచలేదు. అంటే పాటలను అంత బాగా కలిసిపోయేలా వాడుకున్నారన్న మాట.
సినిమాల గురించి రాసినప్పుడు కథలు వివరంగా చెప్పడం నాకు అలవాటు లేదు. అప్పుడు ఈ వ్యాసం చదివిన తరువాత సినిమా చూడడానికి ప్రయత్నంచే వాళ్లకు గొప్ప సస్పెన్స్ మిగలదని నా అనుమానం. ఈ సినిమాలో ఒక సంస్కృత పండితుడు ఉన్నాడు. అయితే అతను సంస్కృత పాఠాలు చెబుతూ బతకడం లేదు. నది ఒడ్డున అంత్యక్రియలు, తద్దినాలు చేసుకునే వాళ్లకు అవసరమైన సామగ్రి ఆయన అమ్ముతుంటాడు. అక్కడ సాయంగా చిన్న కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రవాడు కథలో మళ్లీమళ్లీ వస్తాడు. నదిలోకి దూకి భక్తులు వేసిన డబ్బులు తేవడం, ఆ పేరున పోటీలు పడడం, పందాలు వేసుకోవడం వారణాసిలో మామూలుగా జరుగుతూ ఉంటాయేమో తెలియదు. ఈ సినిమాలో మాత్రం ఈ విషయాన్ని భలేగా చూపిస్తారు.
సంస్కృత పండితుడుగారికి ఒక కూతురు ఉంటుంది. అమ్మాయి ఏదో చిన్నాచితక ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సహజంగా ఈ కాలం పిల్లల పద్ధతిలో ఒక కుర్రవాడితో కాలం గడపడానికి ప్రయత్నించడం, పోలీసులు వచ్చి పట్టుకోవడం సినిమా మొదట్లోనే కనిపించి మొత్తం కథ గురించి లేనిపోని ఆలోచనలను రేకెత్తిస్తాయి. పట్టుబడ్డ కుర్రవాడు చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుని చస్తాడు. అమ్మాయి మిగులుతుంది. సినిమాలో విలన్ ఉండాలి కదా? ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను అమ్మాయి తండ్రిని భయపెట్టి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తుంటాడు. తిండి కూడా లేని ఆ బీద తండ్రి నానా తంటాలు పడుతుంటారు. ఆ అమ్మాయికి ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఆమె గతం తెలిసిన ప్రతి వాడు ఆమెను మరో దృష్టితో మాత్రమే చూస్తాడు. ఇది కథలో ఒక భాగం మాత్రమే!
మరొక భాగం ఒక ప్రేమ కథ. స్మశానంలో శవాలను కాల్చే డోమ్ కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు ఉంటాడు. వాడు చదువులో మంచి దిట్ట. కానీ కులవృత్తి చేయక తప్పదు. శవాలను కెలకడం, ఆ పనిలోని అస్తవ్యస్త ధోరణులు ఆ అబ్బాయికి నచ్చవు. అతను అనుకోకుండా ఒక పై కులం అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. అది ప్రేమగా మారుతుంది. వాళ్లిద్దరు ముద్దు పెట్టుకోవడం గురించి ఈ సినిమాలో గొప్పగా చూపించినట్టు పత్రికల వాళ్లందరూ గోలగోలగా రాశారు. నాకు నిజానికి ఆ సన్నివేశం గుర్తు లేదు అంటే అది కథలో అంతా కలిసిపోయిందని అర్థం. అమ్మాయికి సాహిత్యంలో ఎక్కడా లేని అభిమానం ఉంటుంది. ఈ అబ్బాయికి ఆ సంగతి ఏమిటో కూడా తెలియదు. అటువంటి ఇద్దరికీ స్నేహం కలగడం, అది ప్రేమగా మారడం అత్యంత ఆశ్చర్యకరమైన కథాంశం. అటువంటి కథను రాసిన వాళ్లు, సినిమా తీసినవాళ్లు చాలా గొప్ప విజయాన్ని సాధించారని నా నమ్మకం. కనుకనే సినిమా నాకు చాలా కాలం మెదడులో ఒక మూలన గుర్తుండిపోయింది. ఈ కుర్ర జంట ఇద్దరూ కలిసి బైక్ మీద ఎక్కి తిరుగుతుంటారు. సినిమా మొదట్లో బాపన పిల్ల చేసిన ధైర్యం వీళ్లు చేయలేకపోతారు. వీళ్లు చిన్న పిల్లలు. కుర్రవాడికి చదువుకోవాలనే కోరిక నిండుగా ఉంటుంది. ఈ కాలం స్మార్ట్ ఫోన్ ప్రేమ, కలుసుకునే పద్ధతులు. తిరిగే తీరు పాతకాలపు ప్రేమ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. కనుక ఈ సినిమా నాకు కొంచెం మంచిగా ఉంటుంది. నీవు లేక లేరు లేరు లాంటి అర్థం లేని ప్రేమ పాటలు ఇందులో లేవు. ఉన్న పాటలు గమ్మత్తుగా ప్రత్యేకంగా కనిపించకుండా వినిపించిన అనుభవం వింతగా ఉంది. స్మశానంలో పని చేసే వాళ్ల బతుకుల గురించి కూడా సినిమాలో బలంగా చూపించారు. మనకు అలాంటి విషయాలు ఊహకు కూడా రావు. వారణాసి నిజంగానే విచిత్రమైన విషయాలకు నిలయం. ఈమధ్యనే నేను అతిష్ తాసీర్ రాసిన పుస్తకం చదివాను. అది నవల కాదు. అనుభవాల క్రమం. ఆ రచయిత, అతని కుటుంబం కులం గురించి పట్టించుకోని ఉన్నత వర్గాల వారు. నిజానికి ఆ రచయిత గురించి, అతని ఆలోచనలను గురించి ఈమధ్యన పత్రికలలో కూడా వచ్చినట్టుంది. అతను కూడా వారణాసి నగరంలోని ప్రజల నమ్మకాలు, బతుకు పద్ధతులు చాలా వివరంగా గమనించి, విమర్శించి చెప్పాడు. ప్రస్తుతం ఒక డాక్యుమెంటరీ కూడా తీస్తున్నాడు. ఆ ప్రభావంతో ఉన్నామేమో, నాకు ఈ సినిమా కూడా అంతగానూ మనసుకు హత్తుకుపోయింది. సాంఘిక ధోరణులు మారుతున్న ఈ కాలంలో పాతకాలం నాటి విలువలు, ప్రమాణాలకు ఎదురవుతున్న ప్రతిఘటనలు, పరిస్థితులు నాకే కాదు, అందరికీ ఆసక్తికరంగా ఉంటాయి.
ఒక సినిమా చూడదలుచుకున్నప్పుడు చాలామటుకు కాలక్షేపం, లేదా సరదా కోసం అందరూ చూస్తారు. నాకు అంత ఓపిక లేదు. కాలక్షేపం అవసరం కూడా లేదు. అందులో నేర్చుకోవడానికి ఏమైనా ఉంటుందేమో అని సినిమాల్లోకి కూడా తొంగి చూస్తాను. అందుకే ఈ సినిమా నన్ను అంతగా కదిలించి మాట్లాడేస్తున్నది. కనీసం రాయిస్తున్నది. సినిమాలో కనిపించిన వారందరూ కొత్త వాళ్లే అని నాకు తోచింది. కానీ అందరూ బ్రహ్మాండంగా నటించారు. నిజంగా జరిగిన సన్నివేశాలలో వీళ్లు స్వయంగా పాల్పంచుకున్నారేమో అనిపించింది. ఎంతో సహజంగా ఉంది సినిమా.
ఒకప్పుడు సినిమా చూస్తే పెద్ద వయసు మనిషిని ఒక్కడిని చూపించి కుర్రవాడు అనుకోవాలని భావించేవారు. ఇప్పుడా సమస్య లేదు. ఈ సినిమాలో ఒక్కరు కూడా పాత్రకు తగిన వారు కాదు అనిపించలేదు. సంస్కృత పండితుడు వేషం వేసిన పెద్ద మనిషి, ఆ తర్వాత నాకు చాలా సినిమాల్లో కనిపించాడు. అతను మంచి పేరు సంపాదించుకున్న నటుడనే అనుమానంగా ఉంది. అతని గురించి ఆరాలు తీయాలి. నటించిన సినిమాలు కొన్ని మళ్లీ చూడాలి. ఇది నా మనసులో మిగిలిన భావం. ఒక రచన చదివిన తరువాత, ఒక సినిమా చూసిన తరువాత ఇటువంటి భావన మనసులో మిగిలిన అంటే తప్పకుండా గొప్ప రచన, గొప్ప నటన మనం చూసినట్టు లెక్క. ఈ సినిమా దర్శకుడు అనుభవం లేని వాడట. ఆ తర్వాత మరో రెండు సినిమాలు తీసి విజయం సాధించటం గురించి కూడా కనిపించింది. అనుభవం గలవారు, పాత పద్ధతుల ప్రభావం కింద కొట్టుకుపోతారు. కొత్తగా రంగంలోకి అడుగుపెట్టిన వారు అమాయకంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు వాళ్లకు కలిగే విజయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈమధ్యనే మరొక సినిమా చూశాను. మోతిచూర్, చక్నాచూర్ తర్వాత అనే ఈ సినిమా చాలా అసాధారణంగా ఉంది. ఇటువంటి సినిమా తీయడానికి ఎంత ధైర్యంగా ముందుకు వచ్చారు అని ఆశ్చర్యం కలిగించింది. ఇందులో ఎవరూ బాగా నటించలేదు. అందరూ అనుభవం లేని వాళ్లు. హాస్యం సృష్టించాలంటే నటులకు టైమింగ్ ప్రకారం కదలడం గురించి మంచి అవగాహన ఉండాలి. చార్లీ చాప్లిన్ విజయం వెనుక ఈ టైమింగ్ అన్న రహస్యం నిలిచి ఉంటుందని చాలా కొద్దిగా అర్థం కాకపోవచ్చు. మనవాళ్లు సినిమాలలో మాటలతో హాస్యం పండించాలని చూస్తారు. హాస్యనటుల కదలికలతో మాత్రం హాస్యం చూపించడం మన వాళ్లకు చేతకాదు. కానీ ఈ సినిమాలో అటువంటి సందర్భాల్లో చూపించాలని ప్రయత్నం చేశారు. చతికిల పడ్డారు.
హీరో ఎంతకాలమైనా పెళ్లి కాని బ్రహ్మచారి. ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఏనుగు పిల్లలు లాంటి అమ్మాయిని చూపించి తమరు ఆడపిల్ల. ఇక నేను మగపిల్లవాడిని. కనుక మనం పెళ్లి చేసుకోవడానికి అంతకంటే కావాల్సింది ఏముంది అంటాడు. వాళ్ల పక్కింట్లో ఉండే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆమె హీరో కంటే పొడుగ్గా ఉంటుంది. అంతకంటే పొడుగువాడి కోసం పగటి కలలు కంటుంది. విదేశాలకు వెళ్లాలన్నది ఆమె కల. హీరో సింగపూర్‌లో ఉన్నాడు కనుక వాడిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుంటుంది. కానీ హీరో ఉద్యోగం పోతుంది. ఈ చిన్న అంశం మీద శిల్ప మొత్తం నడుస్తుంది. అది సరదాగానే ఉన్నట్టుంది. లేకపోతే నేను దాన్ని ఏకబిగిన చూడగలిగే వాడిని కాదు. అయినా సినిమా అయిపోయిన తర్వాత అదేదో అసంతృప్తి మిగిలింది. ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. ఇటువంటి సినిమాలు తీసి బజార్లోకి పంపించడం చాలా ధైర్యంతో కూడిన పని. ఇది బహుశా మళ్లీ పాత సినిమా కాదు. ఇంటర్నెట్ బలం పుంజుకున్న తర్వాత తీసిన సినిమా అయి ఉంటుంది. ఈమధ్య హిందీ సినిమాలు ఎక్కువగా భోపాల్లో జరుగుతున్నాయి. అంటే బొంబాయి గొప్పతనం కొంత తగ్గింది అన్న మాట. ఈ సినిమాలో అమ్మాయి అనడానికి, అబ్బాయి అనడానికి అక్కడి స్థానిక పద్ధతిలో మోడా, మోడీ అనే మాటలు వాడారు నాకు అది ఒకటి మాత్రం గుర్తుంది. హీరో, హీరోయిన్ ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. వాటికి గేట్లు కూడా ఉంటాయి. మధ్యలో పెద్ద గోడ ఉండదు. చిన్న గోడ కూడా ఉండదు. సినిమాలో చాలా సార్లు హీరో, హీరోయిన్లు కూడా ఆ కంచె మీదుగా దూకి అవతలి ఇంట్లోకి చేరడం చూపిస్తారు. హద్దులు దాటడం గురించి, పాత పద్ధతులను తోసిపుచ్చడం గురించి సూచనగా ఇది నాకు కనిపించింది. ఇటువంటి సినిమాలు చూసిన తరువాత మరికొన్ని సినిమాలు చూడొచ్చునంత ధైర్యం మొదలైంది. ఏముంటుందిలే, అన్న నిస్పృహకు వీళ్లంతా సమాధానాలు చెబుతున్నారు.
ఇంట్లో నుంచి బయటికి వెళ్లే అవసరం లేదు. ముగిసిన దాకా సినిమా చూడనవసరం లేదు. అయినా సరే నేను సినిమాలు చూడను అంటే, నా వంటి వారిని ఎవరూ ఏమీ చేయలేరు.

-కె.బి.గోపాలం