మందే లేని రోగం!
Published Saturday, 21 March 2020‘‘మీరు మందివ్వాలండి డాక్టర్‌గారూ.. నన్ను కాల్చుకు తింటున్నాడు.. దుర్మార్గుడు.. దౌర్భాగ్యుడు.. ఛీఛీ వాడితో కాపరమేంటండీ..!’’
* * *
‘హోమియో క్లినిక్’కి హడావిడిగా వచ్చి, లోపలికి దూసుకొచ్చి, మందులు కడుతూన్న డాక్టర్ పక్కన కొంచెం దూరంగా కుర్చీలో కూలబడిపోయింది ఆమె. మే నెల.. సాయంత్రం నాలుగయినా ఎండ నిప్పులు చెరుగుతూనే ఉంది. వసారాలో ఇంకో పది మంది ఆడామగా రోగులు అసహనంగా కుర్చీల్లో కూర్చున్నారు.
పై మాటలన్న ఈ నడి వయస్సు ఇల్లాలు, తన కొంగుతో మొహం మీద ధారగా కారిపోతున్న చెమట తుడుచుకుంటూ మళ్లీ అంది.. ‘‘డాక్టర్ మార్తాండంగారూ, మీ గురించి చాలా మంచిగా విన్నాను. అందుకే వచ్చాను. మీరు మందివ్వాలండి. తత్‌క్షణం తీసికెళ్లి వాడి నోట్లో పడెయ్యాలి.’’
అరవయ్యేళ్ల డాక్టర్ మార్తాండం తన పని ఆపి చిరాగ్గా అన్నాడు. ‘‘మీ పేరేమిటి?’’
‘‘రుద్రాణి’’
‘‘అమ్మా రుద్రాణిగారూ, మీరు కూడా అక్కడ వసారాలోకి వెళ్లి వాళ్ల పక్కన కూర్చోండి. వరసలో రండి. నన్ను ఇబ్బంది పెట్టకండి.’’
‘‘అహఁహఁ అది కాదండీ, ఇవ్వాళ ఆదివారం. కనక ఇంట్లో ఉండడు. బయటికెళ్లాడు. రాత్రి ఏ వేళకో కొంపకొస్తాడు. ఈ లోపల నా పిల్లలు ఆడుకొని ఇంటికొస్తారు. ఆ టైముకి నేను వాళ్లకి అందుబాటులో ఉండాలి గదా, కనక దయచేసి, ముందర నాకిచ్చి పంపించండి, ప్లీజ్!’’
మార్తాండం అన్నాడు. ‘‘సరే.. మీ అనారోగ్యమేమిటో చెప్పండి?’’
విసురుగా రుద్రాణి అంది. ‘‘నాకు రోగమేమిటండీ! ఏమీ లేదు.. సుత్తిలా ఉన్నాను. ఏవో చిన్నచిన్నవి తప్ప. ఉన్నదంతా వాడికే.’’
‘‘ఎవరు?’’
‘‘ఎవరేమిటండీ, నా మొగుడు’’ ఆమె స్వరం పెరిగింది. కానీ ఇంతలో తలనెప్పిగా ఉన్నట్లు, తిరుగుతూ ఉన్నట్లు, అటూఇటూ తిప్పుతూ ఆమె కళ్లు మూసుకొంది. కుర్చీలో వెనుక్కు ఆనుకొంది. అరచేత్తో కణతలు నొక్కుకుంది. ఇంకా కారుతున్న చెమట తుడుచుకొంది. అంది, ‘‘మొగుడు కాదు, మొద్దులు. పిశాచి, ఛస్తే నా మాట వినడు. పేరుకి కాలేజీ లెక్చరర్. కాలేజీ నించి వచ్చిరాంగానే నా ఎదురుగా కూర్చుని ట్యూషన్లు చెప్పుకోవచ్చు గదా, అహఁ ఎటో పోతాడు... రెండు నెలల కిందట ట్రాన్స్‌ఫర్ అయి ఈ ఊరు రాకముందు మా అమ్మగారి ఊళ్లో మండల కేంద్రంలో ఉండేవాళ్లం. కనక ఇంటిపట్టున ఉండేవాడు. ఈ టౌనుకొచ్చాక చూడండి. తుపాకి గుండుక్కూడా అందట్లేదు! ఎటు పోతాడో తెలీదు. వీళ్లు యోగులు, సన్యాసులు. ఇంకా కుర్రాళ్లు ఇట్లా’’ అంటూ ఎవరెవరితోనో తిరుగుతాడు. నేనేం మాట్లాడినా ‘‘నీకు తెలుసుకోవాలని లేదు. కనక ఊరుకో’’ అంటాడు. ‘‘నాకేమీ తెలీకుండానే ఇద్దరు పిల్లల్ని కన్నానంటారా? లాభం లేదు, మందు మింగిస్తేనేగానీ మారడు. మందివ్వండి.’’
‘‘సరే.. దేనికివ్వమంటారు?’’
రుద్రాణి తన ఎరుపు జీరలున్న కళ్లు ఒకమాటు తుడుచుకొంది. తన గుండె మీద ఒకసారి చేత్తో రాచుకుంది. స్వరం హెచ్చించి అంది.
‘‘దేనికేమిటండీ.. నన్ను ‘నోరుమూసుకో’ అనే అహంకారానికి, ‘నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో’ అనే నిరంకుశత్వానికి ‘నీకేం తెలుసని నాకు బోధిస్తున్నావు?’ అనే ఈసడింపుకి... ఇంకా ఎన్నని చెప్పమంటారు? అసలు వాడు నాకు మొగుడేంటండీ, నక్కకో కుక్కకో కావలసినవాడు! నా ఖర్మ కాలి నాకయ్యాడు... దానికి!’’
మార్తాండం తన పక్కన మందులు కడుతున్న అసిస్టెంట్ అమ్మాయి వైపు చూసి ‘‘ఏఏ గ్లో’’ అన్నాడు.
ఇంకా కోపంగా రుద్రాణి అంది. ‘‘మందివ్వమంటే ఏఏ అనీ పోపో అనీ ఎకసక్కెంగా అంటారేంటి! ఇదేనా మీరు మందులిచ్చే పద్ధతి?’’
మార్తాండం, ‘‘అమ్మా మీరు ఎండలో వచ్చారు. ముందర కాసిని మంచి నీళ్లు తాగండి’’ అన్నాడు.
ఆ అమ్మాయి కూజాలో నీళ్లు గాజు గ్లాసుతో తీసుకొచ్చి ఇచ్చింది. రుద్రాణి గటగటా తాగేసింది. ‘‘మందు!’’ అంది.
మార్తాండం వినిపించుకోలేదు. వరండాలో ఉన్న రోగుల్ని పిలుస్తూ వాళ్లకి మందులిచ్చే పనిలో పడిపోయాడు.
* * *
ఇంచుమించు గంట గడిచింది. అంతవరకూ కళ్లు మూసుకుని కూర్చునున్న రుద్రాణి కొంచెం శాంతపడింది. పాతరోగులు వెళ్లిపోయారు. కొత్త రోగులొచ్చారు.
కనక మార్తాండం ఆమెవైపు చూసి, ‘‘ఇప్పుడు చెప్పండమ్మా, మీ ఆయనకి ఏ రోగానికిమ్మంటారు?’’
రుద్రాణి మళ్లీ చర్రుమంది, ‘‘మధ్య మధ్య.. నన్నొదిలేసెయ్ నీ దోవన నువ్వు పో.. అంటుంటాడు. ముందర ఈ విడాకులడిగే రోగానికివ్వండి. ఇంకా రోగాలు నక్షత్రాలన్నున్నయ్యి. తర్వాత చెబుతాను.’’
మార్తాండం ఆ కింద అరలో ఉన్న పెద్ద సీసావైపు చెయ్యి చూపించాడు.
ఆ అమ్మాయి ఆ సీసాలో మాత్రలు పొట్లం కట్టి అతనికిచ్చింది.
మార్తాండం ఆ పొట్లాన్ని రుద్రాణికిస్తూ ‘‘మీ ఆయనకి తెలీకుండా ఈ మాత్రల్ని మంచినీళ్లల్లో కలిపి కరిగించి ఆయన అన్నం తినే ముందు ఆ గ్లాసుని అక్కడ పెట్టండి. ఆయన ఆ నీళ్లు తాగాలి అంతే.’’ అన్నాడు.
రుద్రాణి కళ్లు మెరిసాయి. ‘‘పవర్‌ఫుల్ మందే కదండి!’’
‘‘యమ పవర్‌ఫుల్! అయితే అది ఈ రోజుకే ఇచ్చాను. రేపటి కోసం రేపు మళ్లీ మీరు ఇదే టైమ్‌కి రండి. నేనుండను. ఈ అసిస్టెంట్ ఆ పొట్లం ఇస్తుంది.. రేపే రావాలి. సుమా!’’
‘‘తప్పకుండా వస్తానండి. థాంక్స్! మీ ఫీజు...’’
‘‘రోగాలు అన్నీ తగ్గాక చూద్దాంలెండి. వెళ్లి రండి.’’
రుద్రాణి ఆదరాబాదరా వెళ్లిపోయింది.
* * *
మర్నాడు రుద్రాణి మళ్లీ అదే టైముకి చెమట కక్కుకుంటూ ఇస్సు ఇస్సు.. అనుకుంటూ వచ్చింది. మార్తాండం లేడు.
అసిస్టెంట్ అమ్మాయి రుద్రాణికి మంచినీళ్లిచ్చింది. ‘‘కొంచెం సేపు ఎదురుచూడండి. ముందొచ్చిన వాళ్లను పంపించి మీకిస్తాను.’’ అంది. అరగంటయ్యాక రుద్రాణి చేతికి పొట్లం ఇస్తూ ‘‘నిన్నటిలాగే ఇవ్వాళ కూడా ఆయన తాగే నీళ్లల్లో కలిపెయ్యండి.. మీరు రేపు కూడా ఇట్లాగే వస్తే ఈమాటు వారానికిస్తాను.’’
తేటతేరిన మొహంతో రుద్రాణి ‘‘వెళ్లొస్తానమ్మా..’’ అని వెళ్లిపోయింది.
* * *
మూడోనాడు కూడా రుద్రాణి రాగానే ఆ అసిస్టెంట్ ఆమెకి మంచినీళ్లిచ్చి గంట కూర్చోపెట్టింది.
రుద్రాణి తీసుకుంది. నవ్వుతూ ఆరు పొట్లాలు ఆమెకిచ్చి, ‘‘రోజుకొకటి రాత్రిపూటే వేయండి. ఆయనకు తెలిసిపోలేదుగదా.. కొంపదీసి? మళ్లీ మంగళవారం రండి.’’ అంది ఆ అమ్మాయి.
రుద్రాణి సర్రున లేచింది. ‘‘్ఛస్తే తెలీదు. ఆ సన్నాసికి తెలిసేటట్లు ఇస్తానా! హుఁ’’ అంటూ వెళ్లిపోయింది.
* * *
మళ్లీ మంగళవారం మార్తాండం ఉన్నాడు. రుద్రాణి లోపలకొస్తూనే ‘‘నమస్కారం డాక్టరుగారూ’’ అంటూ కుర్చీలో కూర్చుంది.
ఇలా అంది.. ఆయనలో ఏదో నలుసంత మార్పు కనిపిస్తోందండి.. అయినా నమ్మలేం లెండి... ఎందుకంటే తన గెజిటెడ్ హోదా, తన జీతం, తెలివి గల పెళ్లాం తనకున్నదనే విషయం, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు ఇవ్వేవీ ఆయనకు పట్టవు గదా! మొన్నటికి మొన్న ఆదివారం నాడు చేపల చెరువు చెంగప్పనీ, ఎదురింటి ఏణాంకాన్నీ, పచారీ కొట్టు పన్నగ శాయినీ, తాపీ మేస్ర్తి తపనరావునూ, మా అబ్బాయి మన్మథనీ ఇలా అందర్నీ పోగేసుకుని నాలుగ్గంటలకే వెళ్లిపోయాడు. అవతలి వీధిలో ఎలిమెంటరీ స్కూలులోకిట. ‘‘ఎందుకండీ?’’ అని నేనడిగితే, ‘‘నీకర్థమయ్యి ఛస్తుందా.. పాడా..’’ అని సమాధానం... ఆ మొండితనానికే నాకు మతిపోతోంది! డాక్టర్‌గారూ, ఇంకో వారం రోజుల్లో ఆయన రోగం కుదరాలండీ!’’
మార్తాండం నవ్వుతూ అసిస్టెంట్ చేత ఆమెకు మంచినీళ్లు, మందు పొట్లమూ ఇప్పించాడు. ‘‘ఇది ఇంకా పవర్‌ఫుల్ మందమ్మా’’ అన్నాడు.
రుద్రాణి తృప్తిగా వెళ్లిపోయింది.
* * *
వారం తర్వాత రుద్రాణి మళ్లీ వచ్చేటప్పటికి ఎండలు ఇంకా పేలిపోతున్నాయి.
అయినా ఆమెకు మొహంలో పూర్వపు ఎండ ప్రతాపం లేదు. అంత చెమట లేదు. డాక్టర్ పక్కన ప్రశాంతంగా కూర్చుంది.
మార్తాండం, ‘‘ఎలా ఉంది పరిస్థితి?’’ అన్నాడు.
చిరునవ్వుతో అంది రుద్రాణి. ‘‘పావలా మారాడండి. మీ మందులు పనిచేస్తున్నాయి. కానీ ఇంకా ముప్పావలా. ఎప్పటికి మారేను!’’
మొన్నటికి మొన్న, ‘‘రాజుగారు రాజ్యం స్థాపించి పట్ట్భాషేకం చేసుకున్న రోజు ఇది. చాలామందిని కలిస్తేగానీ పని అవ్వదు. రాత్రికొస్తాను... అన్నట్టు నా జేబులో ఇరవై వేలుండాలి, ఏమయ్యింది?’’ అన్నాడు.
‘‘నేనే తీశాను’’ అన్నాను.
‘‘ఏడ్చినట్టుంది. నాకు చెప్పక్కర్లేదా?’’ అన్నాడు. నాకొళ్లుమండింది. నేనన్నాను. ‘‘మీకు చెప్పేదేమిటి? పెళ్లిలో మీ ఇల్లూ వాకిళ్లూ, పొలాలూ, షేర్లూ, సింగారాలూ అన్నీ నాకప్పగించారని చెప్పే కదా నాకు తాళి కట్టారు. ఇప్పుడు మళ్లీ నేను లెక్క చెప్పాలంటారేంటి?’’ అన్నాను.
‘‘ఆయన కోపంగా, ‘నీ బొంద, నీకు పీతబుర్రా ముంజు గుజ్జూను! అతివాగుడు మాత్రం ఆకాశమంత!’’ అన్నాడు.
నేనన్నాను, ‘‘ఏంటి, నేను బి.టెక్ తెలుసా? లూజుగా మాట్లాడకండి. అసలు ఇరవై వేలూ నేనివ్వనయ్యా’’ అన్నాను.
‘‘ఆయన, అఘోరించు. నెత్తినేసి రుద్దుకో!’’ అన్నాడు.
ఒక చిన్న కాగితం ముక్క మీద, ‘‘అర్పణ.. ఇరవై వేలు - వాగ్దానం’’ అని రాసుకొని జేబులో పెట్టుకున్నాడు. వెళ్లిపోయాడు... కానీండి, ‘నీ బొంద’ అని నన్ననటం ఎస్సాల్టు కాదా డాక్టరుగారూ?’’
మార్తాండం అన్నాడు, ‘‘ఎస్సాల్ట్ అంటే మీదికి రావటం. మీరు ఇన్సల్ట్ అనబోయి ఎస్సాల్ట్ అన్నట్టున్నారు.’’
‘‘అవునవును.. ఇన్సల్టే.. అసలు లాంగ్వేజిలో నేను కొంచెం పూర్‌లెండి... ఏం, అది ఇన్సల్ట్‌కదాని’’!
‘‘మీరు బి.టెక్ గదా ఉద్యోగంలో చేరలేదా?’’
‘‘అతగాడు తన ఆస్తి అంతా నాకు అప్పగించినప్పుడు, నేనే సర్వాధికారిణిని అయినప్పుడు నేను ఇంకెవిడి కిందో పని చేయటమేంటి!’’
‘‘అసలయినా పిల్లలకి సంస్కారం ఎవరు నేర్పుతారు? అందుకనే ఉద్యోగంలోకి వెళ్లలేదు.’’
‘‘మంచి పని చేశారు’’ మార్తాండం మొహంలో వెలుగు మెరిసింది.
‘‘సరే, ఇప్పుడిహ లాభం లేదు. ఆయనకి దిమ్మతిరిగే మంచి మందివ్వండి!’’
‘‘చెప్పారుగా ఆయన విషయం. ఇప్పుడు సూపర్, యమ, వీర, స్పెషల్ పవర్‌ఫుల్ మందిస్తున్నాను. వారం వాడించి మళ్లీ రండి.’’
మందు పొట్లాలు తీసుకుని రుద్రాణి వెళ్లింది.
* * *
తర్వాతి రెండు మంగళవారాలూ రుద్రాణి వచ్చింది.
కానీ అసిస్టెంట్, ‘‘డాక్టర్‌గారు ఆలిండియా హోమియో పల్స్ కాన్ఫరెన్స్‌కు ఢిల్లీ వెళ్లారమ్మా. ఆయన చెప్పిన మందులే తీసుకెళ్లండి’’ అని మందు ఇచ్చింది.
* * *
జూన్ నెల వచ్చింది. గాడ్పులు వస్తున్నాయి.
రుద్రాణి వచ్చేటప్పటికీ, మార్తాండం క్లినిక్ లోపల్నించి వసారాలోకొచ్చి ఆమెను సగౌరవంగా ఆహ్వానించాడు.
ఆమె ముఖం వడిలిపోయి లేదు. చెమట లేదు. గాడ్పు ప్రభావం ఉండీ లేనట్టుంది. ముఖంలో కాంతి తొంగి చూస్తోంది. అసలు ప్రసన్నంగా ఉంది. నిటారుగా ఆమె కూర్చోగానే అతను, ‘‘ఉభయకుశలోపరి! పరిస్థితి ఏమిటమ్మా?’’ అన్నాడు.
ఆమె అంది. ‘‘ఆయన ఈ ఆరు వారాల్లో తొంభై శాతం మారిపోయారు డాక్టర్‌గారు.. ఎలా మారారా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. నన్ను ఒక్క పొల్లు మాట అనటం లేదు. ఏదన్నా తేడా మాట ఆయన అన్నప్పటికీ దాన్ని పట్టించుకోవాలని నాకూ అనిపించటం లేదు. ‘‘లోకంలో ఏ ఇద్దరి మధ్య అయినా ఏవో చిన్నచిన్నవి ఉంటయ్యి గదా!’’ అని నేనే సర్దుకుపోయాను.’’
‘‘మంచిది.. సరేగానీ, ఆ తిరుగుళ్లు, ఆడామగా అందర్నీ కలవటం...’’
చటుక్కున రుద్రాణి కంగారుగా అంది. ‘‘రామ, రామ! ఆయన ఎప్పుడూ ఏ ఆడదానితోనూ అతిగా మాట్లాడటమే నేను చూడలేదు! అసలు వక్కపొడి వ్యసనం కూడా ఆయనకు లేదండి! ఆయన, ఆయన... నా పాలిట... పురుషోత్తముడు. కాదని అనలేను..’’
మార్తాండం చిరునవ్వుతో అన్నాడు. ‘‘ఓహో అలాగా అంత మాట ఎలా అనగలిగారేమిటి?’’
‘‘ఊఁఊ... మరండీ ఒక విశేషం జరిగింది...
మీకు టైముందా?’’
‘‘చెప్పండి, మందులు అమ్మాయి కడుతోంది లెండి.’’
‘‘మరండీ, ఒక రోజున ఆయన నాతో, ‘‘వచ్చే ఆదివారం మనింటికి యోగులు లాంటి వారొస్తున్నారు. వారికి భోజనం పెడతావా? అన్నారు. నేను, ‘‘ఇంత చిన్న విషయాన్ని కాదని తేడా తెచ్చుకోవటం దేనికి? అనుకొని, ‘‘సరే, రమ్మనండి’ అన్నాను. ఆదివారం నాడు వారు వచ్చారు. ఆ నలుగురు పెద్దవారు. వాళ్లు నా వంటను మెచ్చుకొన్నారు. ఒకాయన ఏదో క్షేత్రం వాడట అన్నాడు. ‘‘అక్కయ్యగారూ, బీరకాయ చెక్కుతో నేనెప్పుడూ తినని ఇంత అద్భుతమైన పచ్చడి ఎలా చేయగలిగారమ్మా, మీది చెయ్యి కాదు, అన్నపూర్ణాదేవి గరిటె!’’ ఇంకా ఆయన ప్రాంతం హైదరాబాదుట. మీ ఇల్లు చాలా నీట్‌గా ఉంది అక్కయ్యగారూ!’’ ఇలా వాళ్లు మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగిపోయింది డాక్టర్‌గారు. వాళ్లు నా కన్నా పెద్దవాళ్లయ్యి కూడా ‘అక్కయ్యగారూ’ అంటూంటే సిగ్గుతో చచ్చిపోయాననుకోండి!...
‘‘ఇది సరే. వాళ్లూ మా ఆయనా ఒక గంట సేపు మా హాల్లో కూర్చుని ఏం మాట్లాడుకొన్నారంటే. ఢిల్లీలో కృష్ణ మందిరాన్ని కొంతమందొచ్చి కూలగొట్టారుట. ఎవడో ఒక త్రాష్టుడు పావుగంటలో తాను దేశంలో అందర్నీ చంపేసి త్రివర్ణపతాకం బదులుగా తన జెండా పెడతానన్నాడట! మన అమ్మాయిల్ని పాకిస్తాన్‌కు ఎత్తుకెళ్లిపోయి మతం మార్చేస్తున్నారట. ఫాదర్‌లు కూడా పుస్తకాలు పంచిపెట్టి మన అమ్మాయిల్ని మార్చెయ్యటానికి పని చేస్తున్నారట... ఇంకా కాశ్మీర్ గురించీ, కేరళ గురించీ ఏవేవో మాట్లాడుకున్నారనుకోండి. కానీ అమ్మాయిల గురించి అనగానే నా కూతురు గతి కూడా అంతేనేమో అని గుండె గుబేలుమంది. .. ఇంక లోపలకొచ్చేశాను. నా కూతురు బుద్ధిగా చదువుకుంటోందనుకోండి.
‘‘ఇంత విషయం నాకు తెలియటానికి వాళ్లని మా ఇంటికి మా వారు తీసుకురావటమే కారణం గదా! అదీ కథ! డాక్టర్‌గారూ, మా ఆయన మా ఇంట్లో ఉండడు. నా కూతురు గతేంటండీ?’’
మార్తాండం నవ్వుతూ అన్నాడు. ‘‘మీరేం భయపడకండి. మనల్ని మనం కాపాడుకోటానికే ఆ నలుగురూ తమ జీవితాన్ని సమాజం అనే సాన మీద అరగదీసుకుంటున్నారు. కనుకనే వారిని మీ వారు యోగులు అన్నారు. ఇలాంటి వారు దేశంలో వేలమందున్నారు. .. అసలు ఒక పని చెయ్యండి. మీ ఇద్దరు పిల్లల బాగుల్ని చూడమని వాళ్లతో అనండి. వాళ్లే మీ పిల్లల్ని మోడీ, సుష్మాల్లాగా తీర్చిదిద్దుతారు. మిమ్మల్నింక లోకంలో ఈగ కూడా ముట్టదు.’’
‘‘అయితే వాళ్లని మళ్లీ భోజనానికి ఆహ్వానించమని మా ఆయనతో ఆయన కానీ... ఆయన.. ఇంకా మారాలిగా!’’
మార్తాండం నవ్వాడు. ‘‘ఇప్పటికొచ్చిన మార్పుకే మీకు ఆయన అనుకూలమయ్యాడు. ఇంకా పూర్తిగా మారాలంటున్నారు మరి?’’
‘‘అవునవును. పూర్తిగా మారాలి. అసలు రోగం తిరగబెట్టకూడదు కూడా! రాబోయే శార్వరి ఉగాదినాడు మా ఇంట్లో పూర్తి కాంతి వెలగాలి!’’
‘‘కనుక మందు ఆపకండి. ప్రతి వారమూ తప్పక వచ్చి తీసుకెళ్లండి.’’
రుద్రాణి తన పర్సు తెరుస్తూ ‘‘మీ ఫీజు...’’
‘‘మీ వారిని రమ్మనండి. మేం చూసుకుంటాం.’’
‘‘సరే’’ రుద్రాణి వెళ్లిపోయింది.
* * *
నాలుగు రోజుల తర్వాత నలభై ఏళ్ల ఆసామీ వచ్చి కూర్చుని మార్తాండంతో రుద్రాణి నా భార్య. నా పేరు సావర్కర్.... ఆరు వారాల క్రితం వరకూ మా ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటోంది. ఏమిటండీ విషయం?’’
మార్తాండం అన్నాడు. ‘‘నీళ్లలో కలిపి ఇచ్చిన మందులు. మొదట్లో ఆర్నెసికం ఆల్బం అదే, ఏఏ ఇంకా గ్లోనాయిన్, నమ్స్‌వామికాలు, తర్వాత వన్ ఎమ్‌లో లాకేసిస్.’’
‘‘ఇన్ని మందులు రోజూ నాకెక్కించారా?’’
‘‘మీక్కాదు. మీ ఆవిడకి.’’ మార్తాండం నవ్వాడు.
‘‘మరి రోజూ నాకూ ఇప్పించారుగా. రహస్యం పసిగట్టానె్లండి.’’
‘‘మీకిచ్చినవి మందు కలపని ఉత్తుత్తి మాత్రలు.
..మేస్టారూ, మీరు సంఘసేవకులని మొదటిరోజే నాకర్థమైపోయింది.
ఏ రోగానికైనా నేను మందివ్వగలను. దేశద్రోహం రోగానిక్కూడా! కానీ, కానీ, దేశభక్తికి ఇవ్వలేను! దేశభక్తి రోగానికి మందే లేదు సార్. అసలది రోగం కన్నా బలమైన భూతం సార్! ఆవహిస్తే వదలదు!’’
సావర్కర్ హఠాత్తుగా లేచొచ్చి మార్తాండాన్ని కౌగలించుకొన్నారు. ఇద్దరూ గాఢంగా హత్తుకున్నారు. ‘‘ఇంతకీ మా ఆవిడకి ఏమిటి?’’ ‘‘ఇప్పుడే బి.పి. ఆమెలో ప్రవేశిస్తోంది.’’ వీరిద్దరికీ శుభం పలుకుతున్నట్లు బయట వర్షం మొదలైంది.