S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లిటిల్ ట్రబుల్ మేకర్

మధ్య గదిలో..
తెల్లటి గోడ మీద పెన్సిల్ పెట్టి గీతలు గీసుకుంటున్న నాకు..
పెరటి వాకిలి గుండా వెలుతురు ఇంట్లోకి ప్రసరించడం కనిపించింది.
అంటే.. ఆ వైపు తలుపు తెరిచే ఉందన్న మాట. తాతయ్య తోటలో దేవుడి కోసం పూలు కోసుకు వచ్చి, గడియ పెట్టకుండా వదిలేసి ఉంటారు..
లేదా..
పనిమనిషి సుబ్బులు వెళుతూ వెళుతూ తలుపు జేరవేసి వెళ్లిపోయి ఉండవచ్చు.
అంటే బయటకు వెళ్లిపోవచ్చన్న మాట.. వెళ్లి బయట ప్రపంచాన్ని చూసెయ్యొచ్చన్న మాట.
అమ్మమ్మ గానీ, తాతయ్యలు దరిదాపుల్లో లేరు.
భలే భలే.
ఇంకా చెప్పాలంటే, నేను అలా నా ఇష్టానుసారం, గోడ మీదే గీతలు గీసుకోవడం తాతయ్యకు అస్సలు ఇష్టం లేదు. ‘‘నువ్వు ఇంటికి వచ్చే ముందే ఇంటికి సున్నాలు వేయించానమ్మా. అలా పాడుచేస్తే ఎలా? మళ్లీ సున్నాలు కొట్టించాలంటే ఎంత ఖర్చు’’ అంటాడు.
అదే నాకు నచ్చదు. నా ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా ఉండాలని నాకు మాత్రం అనిపించదా?
అప్పుడప్పుడూ..
చుట్టం చూపుగా కాకినాడ నుంచి వచ్చే నానమ్మ అంటుంది.
గోడల మీద గొలుసుకట్టుగా, అల్లిబిల్లిగా ఉన్న నా ప్రాభవాన్ని చూసి ‘‘మా పాపయి పెద్దయ్యాక మంచి ‘ఆర్టిస్టు’ అవుతుంది. పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఇదే’’ అని.
అంటే, ఏమిటో సరిగ్గా తెలియకపోయినా ఆ మెచ్చుకోలు నాకు నచ్చేది.
తను అక్కడ ఉద్యోగంలో ఉందట. అందుకే, నన్ను అమ్మమ్మగారింటిలో ఉంచారు.
ఏది ఏమైనా కానీ..
బయటకు వెళ్లే ఆత్రంలో...
నా లేఖనాన్ని ఆపుచేసి, పెన్సిల్ని అక్కడే పడేసి.. బయటకు వచ్చేశాను.
ఎంత నెమ్మదిగా బయటకు వచ్చేయ్యాలనుకున్నా, నాకు తెలియకుండానే.. నా కాలి గజ్జలు ఘల్లుఘల్లుమంటాయి. దొంగను పట్టించేలా.
అవును మరి.
నేను ఇంకా రెండేళ్ల.. బుజ్జి పాపాయిని.
ఏ వస్తువునైనా కింద పడేసి పగలగొట్టేస్తాననీ, బయటకి వస్తే పెరటిలో మొక్కలు పీకేస్తాననీ.. ఇంట్లో నుంచి బయటకి రానివ్వకుండా కాపలా కాస్తుంటరు. పాలు తాగేసి బొజ్జున్నప్పుడు పర్వాలేదు గానీ, మెలకువగా ఉంటే, బయట ప్రపంచాన్ని చూడాలనీ.. కొత్త విషయాలు తెలుసుకోవాలనీ నాకు మాత్రం ఉండదా?
ఎప్పటికీ ఇలాగే, చిన్నదానిగానే ఉండిపోతానా?
అందుకే, నా ప్రయత్నం నేను చేస్తుంటాను.
అలా బయటపడిన నాకు..
పెరట్లో చాలా పూల మొక్కలు కనిపించాయి. వాటికి ఎరుపూ, తెలుపూ రంగుల్లో చాలా రకాల పూలు ఉన్నాయి. ముట్టుకోవాలని అనిపించి.. కాస్త ముందుకు వెళ్లాను.
అప్పుడు..
అక్కడ కనిపించింది.
నాలాగే ఉన్న .. ఒక చిన్ని పిట్ట.
గోధుమ రంగులో ఉండి, నల్లటి కళ్లతో... రెక్కల మీద తెలుపు రంగు చుక్కలతో చాలా బాగుంది.
మొక్కల మొదళ్లలో నిలిచి ఉన్న ‘నీటి’ని ముక్కుతో ఒడిసిపట్టుకుని తాగుతుంది. నన్ను చూసి కాస్త బెదిరినట్లు అనిపించడంతో నవ్వుతూ పలకరించా..
‘‘ఏయ్. పిట్టా. ఎప్పుడు వచ్చావ్ మా ఇంటికి? ఏం చేస్తున్నావ్’’ అని.
పొడవాటి ముక్కు, చిన్న చిన్న రెక్కలతో... గాలిలో ఎగిరే వాటిని పిట్టలంటారనీ.. నేను ‘ఆమ్’ తినకపోతే వాటికి పెట్టేస్తానని అమ్మమ్మ అనడంతో అది ‘పిట్టే’ అని నిర్థారణకు వచ్చి.
నన్ను ఎగాదిగా చూసిన ఆ పిట్ట..
తనలాగే చిన్నగా ఉన్న నన్ను చూసి.. నా వలన తనకు ఇబ్బంది ఏమీ లేదని భావించి, ధైర్యం తెచ్చుకుని ‘‘ఇప్పుడే వచ్చాను. పై నుంచి ఎగురుతుంటే ఈ మొక్కల మధ్య నీళ్లు కనిపిస్తే ఆగాను. దాహం అవుతుంటే.. నీళ్లు తాగుతున్నాను’’ అంటూ చెప్పింది. దాని మాటలకు అనుగుణంగా దాని ముక్కును కదిలిస్తూ.
అయ్యో! పాపం మట్టిలో ఒలికిపోయిన నీళ్లు తాగుతుందా! అని దాని వైపు జాలిగా చూస్తూ ‘‘నాకైతే బాటిల్ ఉంది. నాన్న కొనిచ్చారు. నేను రోజూ అందులోనే తాగుతాను’’ చెప్పా కాస్త గొప్పగా.
అది నా వైపు చూసి చిన్నగా నవ్వుతూ ‘‘మేము ప్రకృతిలో ఉండే వాళ్లం. ప్రకృతితోనే కలిసి బ్రతుకుతాం.
నేల మీద దొరికిన గింజల్నే తింటాం. నేల మీద దొరికిన నీళ్లనే తాగుతాం. మాకు అమ్మానాన్నా రెక్కలు వచ్చేంత వరకే రక్షణగా ఉంటారు. ఆ తరువాత ఆహారం కోసం మేమే గూటి నుంచి బయటకు వచ్చేస్తాం’’ చెప్పింది.
అప్పుడు నా గురించీ కొంత చెప్పాలని అనిపించి..
‘‘నేను అమెరికాలో పుట్టానట. అమ్మానాన్నకి అక్కడే ఉద్యోగాలు అవడంతో నన్ను తాతగారితో ఇక్కడకి పంపించేశారు.’’
‘‘అలా పంపుతూ నాన్న.. తొమ్మిది నెలల పిల్లనైన.. నా వెంట ఓ ఫోటో ఆల్బం కూడా పంపించారు’’.
‘‘అది నా కోసం నానే్న డిజైన్ చేశారట. ఆ ఆల్బంకు ఓ టైటిల్ కూడా రాశారు. నన్ను ఉద్దేశించి, ‘లిటిల్ ట్రబుల్ మేకర్’ అని.
‘‘అంటే, నేను అల్లరి బాగా చేసి వాళ్లకి.. ట్రబుల్స్.. కష్టాలు కలిగిస్తాననే కదా అర్థం. అప్పుడే పుట్టిన పిల్లలం.. మనం, అన్నీ తెలుసుకోవాలన్న తపనతో... తెలుసుకోవడం కోసం ఎంత కష్టపడతామో వాళ్లకేం తెలుసు?’’
‘‘వాళ్లూ ఒకప్పుడు మనలాంటి చిన్నవాళ్లే కదా! ఇప్పుడు పెద్దవాళ్లు అయిపోయి... మనకి అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. అమ్మమ్మా, తాతయ్యా ఎక్కడున్నారో! గమనించలేదు గానీ, తలుపు కొద్దిగా తెరిచి ఉండడంతో... ఇలా నీతో మాట్లాడగలిగాను’’ చెప్పా ఆనందంగా.
ఇంతలో..
ఇంట్లో నుంచి గట్టిగా వినిపించింది అమ్మమ్మ గొంతు. ‘‘ఏవండోయ్! పాపాయి ఏదీ. వెనుక వాకిలి తలుపు తెరిచి ఉందే’’ అని.
ఇక పరిస్థితి అర్థమైపోయింది నాకు.
పిట్టతో అన్నా జాలిగా ‘‘ఇప్పుడు తాతయ్య వచ్చేస్తాడు. నేను కోసి పారేసిన పూలను చూసి కోప్పడతాడు’’ అంటూ వాటిని అక్కడే వదిలేశాను.
ఆ కంగారుకి.. పిట్ట నా వైపు జాలిగా చూస్తూ ‘‘పర్వాలేదు. పెద్దవాళ్లు ఎప్పుడూ మనల్ని జాగ్రత్తగా.. ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. కొద్దిగా కోప్పడినా బాధ పడాల్సిన పనిలేదు. మన అల్లరి వాళ్లకు ముద్దూ, మురిపెమే’’ అంటూ చక్కా పోయింది.
‘‘ఒరేయ్. ఎక్కడున్నావురా! సహస్రా.. నీకు తోటలో ఏం పనమ్మా. ఎన్ని పూలు తెంపేశావు. బంతిపూలు కాబట్టి, సరిపోయింది... అదే, గులాబీ చెట్లు ముట్టుకుని ఉంటే, చేతికి ముళ్లు గుచ్చుకుపోవా?’’అంటూ నా వైపు పరిగెత్తుకు వస్తున్నాడు తాతయ్య..
నేను తాతయ్యకి దొరక్కుండా పరిగెత్తి.. వీధి వాకిలి వైపుకి వెళ్లి, మూసి ఉన్న తలుపు కొట్టాను. ఏదో చుట్టాన్ని వచ్చినట్లు.
అంతే..
ఘల్లుఘల్లుమనే నా గజ్జల సవ్వడి లోపలి నుంచి విన్నట్లుంది అమ్మమ్మ.. అమాంతం తలుపు తీసుకుని బయటకి వచ్చి.. నన్ను పట్టేసుకుని ‘‘హమ్మయ్యా! పాపాయి దొరికేసింది’’ అంటూ గుండెలకు హత్తుకుంది.
దొరికిపోయిన నేను చేసేది లేక గలగలా నవ్వేశాను. *

-పి.ఎల్.ఎన్. మంగారత్నం