S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషి పరిమళం

భూషణం బజారు కెళ్తోంటే, ‘‘కరివేపాకు కొనుక్కు రండి. మరీ పిసినారిగా మూడు రూపాయలదీ, అయిదు రూపాయలదీ కాదు. పది రూపాయలు పెట్టి ఇన్ని రొబ్బలు తెండి. రేపు మీ పుట్టినరోజు కదా, మీకిష్టమైన పులిహోర చేస్తాను’’ అంది రమ.
‘‘వావ్. ఎన్నాళ్లకెన్నాళ్లకి. కాస్త ఇంగువ వెయ్ ఘుమఘుమలు అదిరిపోతాయి.’’
‘‘అలాగే మహానుభావా. వట్టి చేతులు ఊపుకుంటూ వచ్చి ‘అయ్యో - మరచిపోయానే’ - అనకండి సుమా’’ నవ్వింది.
‘‘మరచిపోయే ప్రసక్తే లేదు. ఈ భూషణాన్ని తక్కువగా అంచనా వేయకోయ్.’’
‘‘మీరు అభూషణమని తెలుసుగానీ, కాస్త నాలుగు పక్కలా వెదికైనా సరే తీసుకురండి. ఈమధ్య ఎంచేతో కరివేపాకు బజారుకి ఎక్కువగా రావట్లేదు.’’
‘‘ఎండల ఎఫెక్టేమో. ఇవాళ నా కోసమైనా వచ్చి తీరుతుందిలే’’ ఉత్సాహంగా రైతు బజారుకెళ్లాడు.
కాయగూరలు కొని ఆకుకూరల వైపు వెళ్లాడు. పాలకూర, బచ్చలికూర, తోటకూర, కొత్తిమీర ఉన్నాయి గానీ కరివేపాకు ఎక్కడా కనిపించలేదు. ఆరా తీస్తే, ‘‘మార్కెట్‌కి తక్కువగా వచ్చింది. గంటలోనే అమ్ముడైపోయింది’’ అన్నారు.
‘‘అరె. అలా ఎలా అయిపోయిందోయ్. నాకు అర్జెంటుగా కావాలే. ఇప్పుడెలా?’’
‘‘బయట తట్టల వాళ్ల దగ్గర దొరకొచ్చు. ప్రయత్నించండి.’’
గబగబా బైటికెళ్లి అందర్నీ అడిగాడు. ఎవరి దగ్గరా లేదు.
‘‘ఇదేంటబ్బా. హఠాత్తుగా కరివేపాకు కల్పవృక్షమై పోయింది!’’ లోపల అనుకోబోయి, పైకే అనేశారు.
‘‘పది రోజులు కిందట వచ్చిన గాలివానకి చాలా చెట్లు కూలిపోయాయండి’’ ఒకరు చెప్పారు.
నిరాశగా వెనుదిరిగారు. మార్గమధ్యలోని ప్రతి కాయగూరల కొట్టు దగ్గరా ఆగి మరీ కనుక్కున్నాడు. ఎక్కడా దొరకలేదు. నీరసంగా ఇంటికెళ్లాడు.
‘‘అలా ఉన్నారేంటి. కరివేపాకు దొరకలేదా?’’
తల అడ్డంగా ఊపాడు.
‘‘ఇప్పుడెలాగండీ. ఎన్ని ఉన్నా కరివేపాకు సువాసనే వేరు!’’
‘‘ఇంకెలాగూ మ్యానేజ్ చెయ్యలేమా. ఎలాగూ తీసి పారేసేదేగా!’’
‘‘అదేనండి కరివేపాకు గొప్పతనం. ఇలా వేస్తాం, అలా తీసిపారేస్తాం. ఆలోగానే పులిహోరని, దప్పళాన్ని, రసాన్ని, వేపుళ్లని, దేనికైనా సరే చక్కని పరమళాన్ని ఇచ్చేస్తుంది!’’
‘‘పాయింటే. కానిప్పుడెలా?’’
‘‘ఈసారికి నూడుల్స్ చేసేస్తాను.’’
అయిష్టంగానే తలాడించాడు. అతడికి చాలా ఆశాభంగంగా, అసంతృప్తిగా ఉంది. ‘‘ఇరుగూ పొరుగూ ఎవర్నైనా అడిగితే?’’
‘‘అడిగి లేదనిపించుకోవడమే తప్ప ఎవరూ రెండాకులు విడవరు అంతా పిసినారి పెద్దమ్మలే’’ అంది. అయినా ఆశ చావక ఇరుగు పొరుగు ఇళ్లల్లో అడిగింది.
‘‘కరివేపాకుని చూసి పది రోజులయ్యింది’’ అన్నారు.
ఎన్నడూ లేనిది పిల్లలు కూడా, ‘‘డాడీ బర్త్‌డేకి పులిహోర చెయ్యలేదేం మమీ’’ అనడిగారు.
కరివేపాకు దొరకలేదని చెబితే సిల్లీగా ఉంటుందనిపించి, ‘‘వినాయక చవితికి చేసుకుందాం’’ అంది.
‘‘ఇప్పుడు చేసుకుంటే అప్పుడు మళ్లీ చేసుకోకూడదా?’’ కూతురు లా పాయింటు తీసింది.
‘‘నువ్వో గడుగ్గాయివి. నీకు చెప్పలేం గానీ, చెప్పింది విను. పెట్టింది తిను’’ కసరుకున్నట్టుగా అంది రమ.
‘‘డాడీ, నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’’ అన్నాడు పదేళ్ల కొడుకు.
‘‘ఈమాత్రానికే లక్ దాకా ఎందుకు లేరా’’ నవ్వాడు భూషణం. లోపల మాత్రం, ‘కరివేపాకే కదా అనుకుంటాం గానీ, ఇవాళ రేపు అది దొరకడమే ఓ అదృష్టమై పోయింది.’’ అనుకోకుండా ఉండలేకపోయాడు.
బజారుకెళ్లగానే మొదట కరివేపాకు కోసం చూడటం. దొరికితే అది కొనేసి మిగతా వాటి కోసం వెళ్లడం అలవాటుగా మారిపోయింది భూషణానికి.
అనుకోకుండా ఓ పల్లెలోని బ్యాంకు బ్రాంచికి ఎంక్వైరీ నిమిత్తం వెళ్లాడు.
అక్కడి పచ్చదనం, పచ్చని చెట్లు భూషణానికి బాగా నచ్చాయి. ఏదో ఆశ మొలకెత్తగా ప్యూన్ని పిలిచి అడిగాడు ‘‘ఇక్కడ కరివేపాకు మొక్క దొరుకుతుందా?’’
‘‘ఆయ్. సూత్తానుండండి...’’ బుర్ర గోక్కుంటూ అన్నాడు.
ఆఫీసు పనిలో పడ్డాడు. తవ్వినకొద్దీ పాములు బయటపడుతున్నాయి. మేనేజరు చెమటలు కక్కుతూ, గుటకలు మింగుతూ, కాలుగాలిన పిల్లిలా భూషణం చుట్టూ తిరగసాగారు.
ఇంతలో ప్యూను రెండు కరివేపాకు మొక్కలు తీసుకుని వచ్చాడు. అమాంతం వాటిని లాగేసుకుని భూషణం దగ్గరకి పరుగెత్తుకొచ్చాడు మేనేజరు. ‘‘సార్. సాధించేశాను సార్. మీ కోసం ఊరంతా గాలించి రెండు మొక్కలు తెచ్చేశాను. బుట్టెడు కరివేపాకు కూడా కారులో పెట్టిస్తాను సార్...’’
మొక్కల వంక పరమానందంగా చూస్తూ అందుకున్నాడు. ‘‘ఇవి చాలు. థాంక్సోయ్...’’
మేనేజరు పొంగిపోయాడు. ‘‘మీ కోసం సన్నజాజులు, మల్లెపూవులు వగైరావగైరా అరేంజ్ చెయ్యమన్నారా సార్!’’ చేతులు నలుపుకుంటూ, కన్ను గీటుతూ మెల్లగా అడిగాడు.
‘‘ఆ అలవాట్లు లేవులే. అద్సరేగానీ ఎన్ని సెంటు సీసాలు కుమ్మరించినా ఈ గబ్బు వాసన పోయేట్టు లేదు. మరీ అడ్డంగా తినేశావేంటి? ఇది నీ సొంత జాగీరనుకున్నావా?’’ కళ్లెర్ర జేశాడు భూషణం.
అతడు గబుక్కున భూషణం కాళ్ల మీద పడిపోయాడు. ‘‘సార్, మీరే రక్షించాలి. పిల్లలు గలవాణ్ని. మీ ఋణం ఉంచుకోను సార్...’’
‘‘మెక్కిందంతా కక్కెయ్యగలవేమో చూడు, ఉద్యోగం పోకుండా చూస్తాను...’’
‘‘సార్...’’ కాళ్లు గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు మేనేజరు.
‘‘నాకు అసహ్యం తెప్పించకు. పదిమందికి మేలు చేస్తానని నిన్ను మేనేజర్‌గా వేస్తే, నువ్వు చీడపురుగులా మారిపోయావు. సిగ్గులేదూ!’’ స్ట్ఫా ముందు కస్సుమనేసరికి బిక్క చచ్చిపోయాడు మేనేజరు.
క్యాంపు నుంచి తిరిగి వస్తూనే ‘‘ఏమోయ్. నీకు గొప్ప గిఫ్ట్ తెచ్చాను’’ అన్నాడు భూషణం.
‘‘చెవి కమ్మలా?’’ ఆశగా అడిగింది రమ.
‘‘బంగారం కంటే విలువైంది. కరివేపాకు మొక్కలు. వీటిని బాల్కనీలోని మన కుండీల్లో పాతెయ్. తాలింపులోకి కావాల్సినప్పుడల్లా నాలుగు ఆకులు అలా తుంచి, ఇలా వేసుకోవచ్చు.’’
రమ పెన్నిధి దొరికినట్టు మురిసిపోయింది. ‘‘ఇంటి పెరట్లో తులసి మొక్క ఉన్నా లేకపోయినా కరివేపాకు మొక్క మాత్రం ఉండి తీరాల్సిందేనండీ’’ అంది మొక్కల వంక అపురూపంగా చూస్తూ.
‘‘మా రమ వాక్కు వేదవాక్కే. నో అప్పీల్ అన్నట్టు రమా, ఈ మొక్కల్ని బాల్కనీలో బాగా ఎండ పడే చోట పెట్టు. ఎండ ఎంతెక్కువ పడితే అంత బాగా ఎదుగుతుంది.’’
‘‘మనలాగా అపార్టుమెంటుల్లోగాక సొంతింట్లో ఉండే వాళ్లు అదృష్టవంతులు. హాయిగా పెరట్లోనో ఇంటి ముందో బోలెడన్ని మొక్కలూ చెట్లూ పెంచుకోవచ్చు!’’ నిట్టూర్చింది.
‘‘ఉన్నంతలోనే కాళ్లు ముడుచుకోవాలోయ్. ఆ సరిపెట్టుకోవడం, సర్దుకుపోవడమే మన తారక మంత్రం!’’
‘‘మీకంతా వేళాకోళమే!’’
రెండు మొక్కల్నీ కలిపి ఒకే కుండీలో నాటింది రమ. తులసి మొక్కతో బాటు వాటికీ రోజూ నీళ్లు పోయసాగింది.
మొక్కలు రెపరెపలాడుతూ ఎదిగాయి. దాంతో బాటు వాటి సువాసనా పైకీ కిందికీ వ్యాపించ సాగింది.
పై పోర్షన్ ఆవిడ ముక్కు ఎగరేస్తూ వచ్చి, ‘‘మీ ఇంట్లోంచి కరివేపాకు వాసన గుప్పుమని వస్తోంది. మొక్కలు పెంచుతున్నావా రమా’’ ఆరా తీసింది.
‘‘అహహ లేదు లేదు...’’ అంది ఆవిడ లోపలకి రాకుండా తలుపుకి అడ్డంగా నిలబడి.
తాలింపుల్లో తాజా కరివేపాకు వేస్తూండటంతో భూషణంతో బాటు పిల్లలూ చాలా బావుందంటూ రమని ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. ఇదివరకు రసం కాస్తే మొఖం చిట్లించుకునే పిల్లలు ఇప్పుడు ‘‘రసం చాలా బావుంటోంది మమీ’’ అంటున్నారు.
నాల్రోజుల తర్వాత ఏదో పని మీద ఇంట్లోకొచ్చిన కింది పోర్షన్ ఆవిడ, మాటిమాటికీ బాల్కనీలోకి తొంగి చూడటం చూసి గతుక్కుమంది రమ.
బలవంతంగా ఆవులిస్తూ అంది ‘‘నాకు నిద్రొస్తోంది. మీరు వెళ్తే...’’
‘‘ఇదిగో వెళ్లిపోతున్నా...’’ అంటూ చొరవగా బాల్కనీలోకెళ్లింది.
అక్కడ గుబురుగా ఉన్న కరివేపాకు మొక్కల్ని చూసి ముఖం చాటంత చేసుకుంది.
‘‘కరివేపాకు మొక్కలు చాలా బాగున్నాయి రమా. చక్కని సువాసన వస్తోంటే ఎక్కడ్నుంచబ్బా అని జుట్టు పీక్కుంటున్నాననుకో’’ అంటూ గబుక్కున నాలుగు రొబ్బలు విరిచేసింది.
‘‘వద్దు వద్దు...’’ అని ముందుకొచ్చి వారించింది రమ. ‘‘నీదంతా ఉత్త భయం. ఏమీ అవ్వదు. రేపటికి రెట్టింపు చిగురిస్తుంది చూడు’’ అంటూ తిప్పుకుంటూ వెళ్లిపోయిందావిడ.
ఆ మర్నాడు ఇరుగమ్మా పొరుగమ్మా వచ్చి ‘‘మాకో నాలుగు ఆకులు కోసియ్యి రమా’’ అనడిగారు.
‘‘ఇందాకే అన్నీ కోసి పులిహోరలో కలిపేశాను’’ చటుక్కున అబద్ధమాడేసింది.
వాళ్లు అపనమ్మకంగా చూసి, ‘‘కరివేపాకు భాగ్యానికి ఎలా అందో చూడు!’’ అని చెప్పుకుంటూ వెళ్లిపోయారు.
‘‘ఇక రోజూ దాడి చేస్తారేమో ఖర్మ. వీళ్ల నుంచి తప్పించుకోవడం ఎలాగండీ’’ దిగులుగా అంది భూషణంతో.
‘‘పోనీ లేవే. అడిగింది కరివేపాకే కదా. ఊరికే వస్తున్నదే కదా. అడిగిన వారికల్లా లేదనుకుండా రెండాకులు విదిలించు.’’
‘‘ఒక్క రోజుకే మొక్క మాడైపోతుంది!’’
‘‘అవ్వదు. కోసే కొద్దీ చిగురిస్తుంది. పైగా కరివేపాకు దానం శ్రేష్ఠం అన్నారు.’’
‘‘ఎవరు?’’
‘‘నేనే’’
‘‘మీకన్నీ హాస్యాలే ఆ మొక్కని మీరెంత కష్టపడి తెచ్చారో మరచిపోయారా. కరివేపాకు లేనందున మీ పుట్టినరోజుకి పులిహోర చెయ్యలేక పోయానన్న బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. ఎవరేమనుకుంటే అనుకోనీండి. నేను మాత్రం కరివేపాకు కోసివ్వను. ఏదో మన అదృష్టం కొద్దీ మంచి రకం మొక్కలు దొరికాయి. అన్నట్టు ఈ మొక్కలిచ్చిన ఆ మేనేజరుకి ఏమైనా ఫేవర్ చేశారా?’’
‘‘బ్యాంకుకి పెద్ద కన్నం పెట్టాడు. అందుకని కరివేపాకులా తీసి పారేశాను. సస్పెన్షన్‌లో ఉన్నాడు’’
‘‘పాపం!’’
‘‘పాపాత్ముల గురించి ఆ పదం వాడకూదు.’’
‘‘మరి పుణ్యాత్ములెవరో?’’
‘‘నలుగురికీ చేతనైనంత సాయం చేసేవారు!’’
‘‘ఇల్లు గుల్ల చేసుకునా!’’ నవ్వింది.
కరివేపాకు మొక్కలు ఏపుగా ఎదిగాయి. కుండీ చిన్నదైంది. పెద్ద సిమెంటు తొట్టి తెచ్చి దానిలోకి మార్చారు. బాల్కనీలోకి ఉదయం పదింటిదాకా చక్కగా ఎండ వస్తుందేమో జంట మొక్కలు రెపరెపలాడుతూ విస్తరిస్తున్నాయి.
దాని సువాసన నలు దిక్కులకూ ఎక్కువగా వ్యాపిస్తోంది. దాంతో కరివేపాకు కోసం వచ్చే జనం ఎక్కువయ్యారు. ఆకుల్లేవు, చిగురు లేదు, మొక్కకు చీడ పట్టింది అంటూ వంకలు పెడుతోంది. మరీ తప్పనప్పుడు, మొహమాటం అడ్డొచ్చినప్పుడు, సణుక్కుంటూనే రెండు రొబ్బలు ఇస్తోంది రమ.
ఇంట్లో మాత్రం ధారాళంగా వాడేస్తోంది. వారానికోసారి కరివేపాకు పచ్చడి చేసి వారమంతా ఉపయోగిస్తోంది. కరివేపాకు ఎండబెట్టి, పొడి చేసి, అక్కకీ, చెల్లికీ ‘‘ఇడ్లీలో
నంజుకోడానికి బావుంటుంది’’ అంటూ పంపిస్తోంది.
హఠాత్తుగా పల్లెలో ఉంటోన్న భూషణం తల్లి ఆరోగ్యం విషమించింది. ఫోన్ రావటం ఆలస్యం దొరికిన ట్రైన్లో దొరికిన టిక్కెట్ తీసుకున్నారు. ఇంటికి తాళం వేసి హడావిడిగా బయల్దేరారు.
‘ఇప్పుడో ఇంకో గడియకో చిలక ఎగిరి పోద్ది’ అనుకున్నది వారం రోజులు సాగింది.
తిరిగి వెళ్లలేక, అక్కడే ఉండలేక నానా ఇబ్బందీ పడ్డారు.
స్కూలు పోతోందని పిల్లలు గొడవ పెట్ట సాగారు. భూషణానికి అదనపు శలవు మంజూరవ్వడంతో అతడు కాస్త స్థిమితంగానే ఉన్నాడు. రమకి కరివేపాకు మొక్క బెంగ పట్టుకుంది.
‘‘ఎప్పుడెళ్తామో తెలీకుండా ఉంది. అక్కడ కరివేపాకు మొక్క ఎలా ఉందో ఏమో, చెంబుడు నీళ్లు పోసే దిక్కు లేక ఎండి మాడిపోతుందేమోనండీ’’ కళ్లొత్తుకుంది రమ.
‘‘పాయింటే. జాగ్రత్తగా చూసుకోమని ఇరుగు పొరుగుకి అప్పజెప్పి రావాల్సిందేమో!’’ సాలోచనగా అన్నాడు.
‘‘అప్పుడు వాళ్ల దిష్టి కళ్లు పడి ముందే మాడి మసైపోతుంది!’’
భార్య వంక చిత్రంగా చూశాడు భూషణం. ముఖం తిప్పేసుకుందామె.
ఇంతలో ‘‘తులసి నీళ్లు పోయండి’’ అని అరిచారెవరో.
గబగబా భూషణం, రమ, పిల్లలూ ముసలావిడ దగ్గరకు పరుగెత్తారు. తులసి నీళ్లు ఆవిడ నోరు బలవంతంగా విడదీసి పోశారు.
ఆవిడ గుటక వేయలేదు. ఘొల్లుమన్నారంతా.
ఊరంతా తరలి వచ్చింది. ‘దొడ్డమ్మ దొడ్డమ్మ’.. అంటూ పోయినావిడ గురించి ఎన్నో చెప్పుకొచ్చారు.
ఇంటి పెరట్లోని పూల మొక్కలకు పూచిన పూలు, చెట్లకు కాచిన కాయలూ పండ్లూ వాడకంతటికీ పంపకాలు పెట్టేదిట. కూరకేం లేదని ఎవరొచ్చి నోరు తెరచి అడిగినా కూరగాయలో, ఆకుకూరలో ఏవోటి పెట్టేదిట గానీ వట్టి చేతుల్తో వెళ్లనిచ్చేది కాదుట. అసలలా పెట్టడానికే దొడ్డి నిండా రకరకాల మొక్కలూ చెట్లూ పెంచేదిట!
పండగలకూ పబ్బాలకూ దొడ్డమ్మ ఇంటి ముందరి మామిడి చెట్ల ఆకులు కావాల్సినన్ని కోసుకెళ్లే వారట.
మంగళవారం, శుక్రవారం అని లేకుండా ఏ రోజున ఏ వేళ కోసుకెళ్లినా పనె్నత్తు మాటనేది కాదుట.
మామిడికాయల కోసం పిల్లలు రాళ్లు విసుర్తోంటే వారించి, కొంకె ఉన్న కర్రతో స్వయంగా కోసిచ్చేదట. పచ్చడి సీజన్లో ప్రతి ఇంటికీ పరక మామిడి కాయలు చొప్పున పంపేదట. బాగా పీచు ఉన్న రకాలని చెప్పి ఊరంతా ఆ చెట్టు కాయల్తో పచ్చళ్లు పెట్టుకునే వారట.
బ్రహ్మోత్సవాల్లో, గణపతి నవరాత్రుల్లో గుడికి రోజూ కొబ్బరికాయలు దొడ్డమ్మే పంపేదిట!
ఆ కబుర్లు వినే కొద్దీ తనలో తను క్రుంగిపోసాగింది రమ.
తన కళ్లకి తనే మరుగుజ్జుగా కనిపించసాగింది.
‘‘అత్తయ్యగారు అక్షరాలా దొడ్డమ్మే. అంతా ఆవిడ గురించి ఎంత గొప్పగా చెబుతున్నారో చూడండి. ఆవిడేమీ వేలూ, లక్షలూ ఇవ్వలేదు. గుప్పెడు ఆకులూ, కాసిని కాయలూ ఇచ్చింది. ఆ మాత్రం దానికే దేవతలా పొగిడేస్తున్నారు. మనిషి పోయినా మంచి మిగిలిపోతుందంటారు. అది ఇదేనేమో!’’ భర్తతో అంది రమ.
‘‘ఏం ఇచ్చారు. ఎంత ఇచ్చారు అన్నది ప్రధానం కాదు. ఉపయోగపడేది మనసారా ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం. నలుగురికీ చేతనైన సాయం చేయడంలోనే ధన్యత ఉంటుంది. రోజూ కరివేపాకు మనకు బోధించే పాఠం ఇదే!’’ అన్నాడు భూషణం.
రమ నిశ్చలంగా చూస్తూండిపోయింది.
తిరుగు ప్రయాణంలో దారి పొడవునా రమది ఒకటే పాట. ‘‘కరివేపాకు మొక్క బతికుంటే బావుణ్ను!’’. ఒకటే ప్రార్థన. ‘‘కరివేపాకు మొక్క బతికి ఉండేట్టు చూడు దేవుడా!’’ ఒకటే ఆరాటం . ‘‘కరివేపాకు మొక్క చల్లగా ఉండాలి!’’ ఒకటే ఆశయం. ‘‘కరివేపాకు మొక్క పది కాలాల పాటు పచ్చగా ఉండాలి!’’
ఇంటి తలుపు తీస్తూనే బాల్కనీలోకి పరుగెత్తింది రమ.
కరివేపాకు మొక్క చాలా వరకూ ఎండిపోయింది. దీనంగా ఉంది. కొన్ని చివుళ్లు మాత్రం ఆశజెండాల్లా పచ్చగా ఉన్నాయి. పరుగునెళ్లి నీళ్లు తెచ్చిపోసింది.
ఆ దుస్థితికి తనే కారణమనిపించింది. బావురుమంటూ కూలబడింది.
భూషణం ఓదార్చినా ఆమె కన్నీళ్లు ఆగలేదు. పిల్లలు సైతం సానుభూతిగా చూశారు.
మర్నాడు ఇద్దరు మనుషులొచ్చారు.
‘‘వీళ్లెందుకోయ్’’ భూషణం అడిగాడు.
‘‘మీరే చూడండి’’
వాళ్లు సిమెంటు కుండీని, దానిలోని కరివేపాకు మొక్కలతో సహా జాగ్రత్తగా తీసుకుపోయారు. వారి వెనుకే వెళ్లిన రమ మరి పది నిమిషాలకి తిరిగొచ్చింది.
‘‘ఇదేం పిచ్చి పని రమా? ఆ మొక్కల్ని ఏం చేశావ్? నీళ్లు పోయగానే మళ్లీ చిగురిస్తాయి. అవి త్వరగా ఎండిపోవే.’’
‘‘నాకు తెలుసండీ. అవి ఎప్పటికీ పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. కుండీని మన అపార్ట్‌మెంట్స్ టెర్రస్ మీద పెట్టించాను. ఇక రోజంతా ఎండ తగుల్తుంది. రోజూ నీళ్లు పోస్తూండమని పెంట్ హౌస్‌లోని వాళ్లకీ, వాచ్‌మ్యాన్‌కీ చెప్పాను. అఫ్‌కోర్స్ నేనూ పోస్తూంటానె్లండి. చూస్తూండండి ఇక ఆ కరివేపాకు మొక్క చెట్టుగా మారుతుంది. మన అపార్ట్‌మెంట్స్‌లోని వాళ్లందరికీ కావాల్సినంత కరివేపాకు అందిస్తుంది’’ సంబరంగా చెప్పింది రమ.
అభినందిస్తూ చూశాడు భూషణం.
పిల్లలు ‘‘భలే భలే’’ అంటూ చప్పట్లు కొట్టారు.

- సింహప్రసాద్