S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జయహో... జనయత్రీ..

జీవితంలో అనేక రూపాల్లో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నారు మహిళలు. తల్లి, చెల్లి, భార్య, కుమార్తె ఇలా అనేక పాత్రల్లో స్ర్తిలు తమ కుటుంబంతో పాటు సమాజంతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. మరో ప్రాణికి జన్మనిచ్చే అవకాశం కేవలం ఆడ వారికి మాత్రమే ఉంది. మాతృత్వం కారణంగా స్ర్తిలను దైవ సమానంగా కొలుస్తున్నారు. సహనానికి మారుపేరైన స్ర్తిని ‘్భమాత’తో పోల్చారు. అందుకే ప్రతి ఒక్కరూ వారు నివసించే దేశాన్ని ‘మాతృభూమి’ అని, మాట్లాడే భాషను ‘మాతృభాష’ అని పిలుస్తుంటారు. తెలుగు భాషలో పురుషుడితో పోలిస్తే స్ర్తికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. మహిళ, అతివ, ఇంతి, కొమ్మ, నాతి, నారి, నెలత, పడతి, ముదిత.. ఇలా లెక్కలేనన్ని పర్యాయ పదాలతో స్ర్తిలను పిలుస్తారు. ఒకప్పుడు అబల అనే ముద్రతో మహిళల్ని చిన్నచూపు చూసేవారు. నాటి అబలలు నేడు సబలలుగా మారి అంతరిక్షంలో సైతం అడుగిడి పురుషులతో సమానంగా దూసుకువెళుతున్నారు. ఇంత అభివృద్ధి పథంలో పయనిస్తున్నా ఇప్పటికీ ఆడపిల్ల పుట్టగానే మైనస్, మగపిల్లవాడు పుట్టగానే ప్లస్ అనే వారు లేకపోలేదు. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోని శిశువునే ప్రపంచాన్ని చూడకుండా అంతం చేస్తున్నారు. ఇప్పటికీ భ్రూణహత్యలు జరుగుతున్నాయి. నేటికీ మహిళలు అత్తింటి ఆరళ్లకు గురవుతున్నారంటే నాగరిక ప్రపంచంలో అనాగరికంగా బతుకీడుస్తున్నామా? అనే భావనలో జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నామని చెప్పక తప్పదు.
మూఢాచారాలకు స్వస్తి
ఒకప్పుడు సతీ సహగమనం అమలులో ఉండేది. బాల్య వివాహాలు చేసేవారు, వితంతు వివాహాలు జరిగేవి కావు. ఇటువంటి మూఢాచారాలను ఎదిరించి రాజారామమోహనరాయ్ వంటి ఎందరో సంఘ సంస్కర్తలు సతీ సహగమనాన్ని రూపుమాపారు. బాల్య వివాహాలను జరపకుండా అడ్డుకున్నారు. కందుకూరి వీరేశలింగం వంటి వారు వితంతువులకు తిరిగి పెళ్లి చేశారు. ఆయన భార్య రాజ్యలక్ష్మి స్ర్తి విద్యా వ్యాప్తికి కృషి చేశారు. ఈ పనులన్నీ చేయడం నేటి సమాజంలో చాలా తేలిక. కరడు కట్టిన మూఢత్వంతో మగ్గిపోయిన అప్పటి సమాజాన్ని ఎదిరించి చేయడం చాలా కష్టం. అయితే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదురోడి నిలబడి అనేకమంది సంఘ సంస్కర్తలు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయబట్టే నేడు స్ర్తి సబలగా ఎదగడానికి ఆస్కారం కలిగింది. అన్నింటి కంటే ముఖ్యం స్ర్తిలు విద్యావంతులు కావాలి. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అన్నారు. ఒక మహిళ విద్యావంతురాలైనట్లయితే తమకు జరిగిన అన్యాయాలను ప్రతిఘటించే శక్తి వస్తుంది. మహిళలకు సాధికారత వచ్చినట్లయితే దేశం పురోగమిస్తుంది. మహిళలకు విద్యా, ఉద్యోగం, ఆస్తి హక్కులను ప్రాథమిక హక్కులలో చేర్చాలి. స్ర్తిలు తమ కాళ్లపై తాము నిలబడి అభివృద్ధి చెందడాన్ని స్వావలంబన అంటారు. స్ర్తిల పక్షాన నిలబడి తన రచనల ద్వారా స్ర్తిలను చైతన్యవంతుల్ని చేసిన మహోన్నత వ్యక్తి గుడిపాటి వెంకటాచలం. ఒకప్పుడు చలం రచనలు బహిరంగంగా చదవడానికి సైతం ఎంతగానో భయపడేవారు. స్ర్తి స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని చలంపై అభాండాలు వేశారు. ఒక దశలో చలం భార్య సైతం అతన్ని వదిలేసి బంధువుల వద్దకు వెళ్లిపోయింది. లెక్కలేనంత మంది శత్రువులు బయలుదేరి ఇది బూతు సాహిత్యమని చలాన్ని వెలివేస్తే ఆయన కుటుంబంతో సహా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయారు. నేడు అటువంటి రచనలే స్ర్తివాదానికి ప్రేరణగా మారాయి. అదే కోవకు చెందిన మరో స్ర్తివాద రచయిత్రులు మల్లాది సుబ్బమ్మ, రంగనాయకమ్మ. వీరి రచనలు అప్పట్లో వివాదాస్పదమైనప్పటికీ స్ర్తిలలో చైతన్య భావాలు పెరగడానికి బలమైన పునాదులు పడ్డాయి.
రచయిత్రుల సునామీ
1950వ దశకపు రెండవ భాగం నుండి 1980వ దశకం వరకు రచయిత్రులు ఒక సునామీలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఇల్లిందల సరస్వతీదేవి, ఆచంట శారదాదేవి, మాలతీచందూర్, శ్రీదేవి, లత, వాసిరెడ్డి సీతాదేవి, యద్దనపూడి సులోచనారాణి, బీనాదేవి, ద్వివేదుల విశాలాక్షి డి. కామేశ్వరి ఇలా ఒకరిని మించి మరొకరు అన్నట్లు ఇంటింటా ప్రాచుర్యం పొందారు. ఒక దశలో పురుషులు సైతం స్ర్తిల పేర్లతో రచనలు చేశారు. అందుకే 1980వ దశకాన్ని తెలుగు సాహిత్యంలో స్ర్తిల దశాబ్దంగా పేర్కొన్నారు. అప్పటి వరకు కవిత్వం తమదే అనుకున్న పురుషుల భ్రమలను స్ర్తిలు బద్దలుకొట్టారు. కేవలం మహిళా రచయిత్రులు నవలకే పరిమితం కాలేదు. కథ, కవిత్వం ఇలా అనేక ప్రక్రియల్లో తమదైన శైలితో రాణించారు.
దూసుకువెళుతున్న స్ర్తిలు
కాలం మారింది. నాటి కాలంలోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి పాలకురాలు రజియా సుల్తానా, ఝాన్సీలక్ష్మీభాయ్, రాణి రుద్రమ, చాంద్‌బీబీ వంటి వారు కత్తిపట్టి కదనరంగంలో తమ ప్రతాపాన్ని చూపారు. 20వ శతాబ్దంలో అనేకమంది స్ర్తిలు ఎన్నో రంగాలలో రాణించారు. హోమ్‌రూల్ లీగ్ వ్యవస్థాపకరాలు అనిబిసెంట్, మార్గరెట్ థాచర్, 17 సంవత్సరాలుగా భారత ప్రధానిగా పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీలంక తొలి అధ్యక్షురాలు సిరిమానో భండారు నాయకే, సంఘ సంస్కర్త సుసన్నా అరుంధతీరాయ్, మానవ కంప్యూటర్ శకుంతలాదేవి, అమ్మలా అన్నార్తుల్ని అక్కున చేర్చుకున్న మదర్ థెరిస్సా, ఒలంపిక్ పతక గ్రహీత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి, సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, మహిళాభివృద్ధికి కృషి చేసిన దుర్గ్భాయి దేశ్‌ముఖ్, వ్యోమగామి కల్పనాచావ్లా, సామాజికవేత్త మేథాపాట్కర్, బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్, స్ర్తి విద్య కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న అఫ్గనిస్థాన్‌కు చెందిన మలాల, భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు సునీతా విలియమ్స్ స్ర్తివిద్యకు పాటుపడిన సమాజ సేవకురాలు సావిత్రీభాయి పూలే, గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి సానియామిర్జా, బాడ్మింటన్ క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్, చదరంగం క్రీడాకారిణి పద్మశ్రీ ద్రోణంపల్లి హారిక ఇలా మహిళలు అన్ని రంగాలలో స్ర్తిలు దూసుకుని వెళుతున్నారు. ఆటో డ్రైవర్లు, మహిళా కండక్టర్లు, పోలీసు, మిలటరీ విభాగాలలో సైతం చేరి దేశరక్షణలో సైతం తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మన దేశంలో అనేక మంది మహిళలు పలు రంగాలలో తమ ప్రతిభను చాటుకున్నారు. శారీరకంగా కూడా స్ర్తి పురుషుడితో పాటు సమానమే అని ఎందరో నిరూపించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బచేంద్రిపాల్, రెండుసార్లు ఎవరెస్ట్ అధిరోహించిన సంతోష్‌యాదవ్, ఎవరెస్ట్ అధిరోహించిన తొలి దివ్యాంగురాలు అరుణిమ సిన్హా, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మోటార్‌బైక్‌పై వెళ్లిన రోషినీ శర్మ, తొలి మహిళా ఫిజీషియన్ ఆనందిభాయ్ గోపాలరావు జోషి, తొలి ఆటో డ్రైవర్ పూనాకు చెందిన షీలాదవేర్, భారత సంతతికి చెందిన తొలి ప్రపంచ సుందరి రీటా ఫరియా పావెల్, ఇంగ్లీషు ఛానలెను ఈదిన అరతసహా, క్రికెట్ రంగంలో రాణిస్తున్న మిథాలిరాజ్, రాష్టప్రతిగా పనిచేసిన ప్రతిభాపాటిల్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్ అంజలిగుప్త, తొలి న్యాయమూర్తి ఎం.్ఫతిమాబీవి, తొలి అడ్వొకేట్ కరోలియా సోరాబ్జీ, తొలి ఐ.ఎ.ఎస్. అన్నాజార్జి, ఐ.పి.ఎస్. అధికారి కిరణ్‌బేడి, ఎయిర్‌క్రాఫ్ట్ నడిపిన సరళ థాక్రల్, బాక్సింగ్‌లో సత్తా చాటిన మేరీకోమ్, ఎయిర్‌లైన్స్ తొలి మహిళా పైలెట్ దుర్గాబెనర్జీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సోలో ఉమెన్ పైలెట్ హరిత కౌర్ డియోల్, ఇండియన్ ఆర్మీలో రాణిస్తున్న ప్రియ జింగన్, గాయనిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన లతా మంగేష్కర్, మన దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలానీ, కేబినెట్ మంత్రి విజయలక్ష్మి పండిట్, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన మీరాకుమార్, తొలి గవర్నర్ సరోజినీ నాయుడు, రోడ్డు ప్రమాదంలో ఒక కాలును పోగొట్టుకున్నా ఆత్మవిశ్వాసంతో శాస్ర్తియ నృత్యంలో రాణించిన పాఠ్యాంశాలలో స్థానం పొందిన సుధాచంద్రన్, ఇంకా ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ అధికారులుగానే కాక డాక్టర్లు, లాయర్లు, రాజకీయవేత్తలుగా, సినీ, నాటక రంగాలు, క్రీడలు, బాక్సింగ్, కరాటేలో సైతం పురుషాధిక్య ప్రపంచాన్ని చీల్చుకుని ఉవ్వెత్తున ఎగసిపడిన కడలితరంగంలా మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. భారత స్వాతంత్య్ర సమరంలో సైతం మహిళలు ప్రధాన భూమికను నిర్వహించారు. స్ర్తిల జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాలు, స్ర్తివాద సాహిత్యం, స్ర్తి హక్కుల పోరాటం, స్ర్తిల సమస్యలు ఇలా ఒకటేమిటి అనేక రకాల పుస్తకాలు ప్రచురితమైనాయి. మహిళా హక్కుల కోసం అంకితభావంతో కృషి చేస్తూ స్ర్తివాణిని వినిపిస్తున్న రచయిత్రులు ఓల్గా, వసంత కన్నభిరాన్, కల్పన కన్నభిరాన్ కలసి ఈ దశాబ్దంలో ప్రసిద్ధికెక్కిన 118 మంది మహోన్నుతులైన స్ర్తిల జీవిత విశేషాలు తెలియజేస్తూ ‘మహిళావరణం’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. గుంటూరు జిల్లా తెనాలికి ఒక స్ర్తి వల్ల ఆంధ్రాపారీస్ అనే పేరు వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒకప్పుడు నాటకాలలో పురుషులే స్ర్తి పాత్రలు ధరించేవారు. చిలకమర్తివారు రచించిన ఒక నాటకంలో స్ర్తి పాత్రను స్ర్తియే ధరిస్తే బాగుంటుందని వాకబు చేయగా తెనాలికి చెందిన కాంచనమాల నటించడానికి అంగీకరించారు. అప్పటి వరకు స్ర్తి పాత్రను స్ర్తిలే ధరించే సంప్రదాయం పారిస్‌లో ఉండేది. ఆ సంప్రదాయం కాంచనమాల వల్ల తొలిసారిగా తెనాలిలో ప్రారంభం కావడంతో ఈ ఊరు ఆంధ్రాపారీస్ అనే పేరు వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. నాటి నుండి తెనాలిని ఆంధ్రాపారిస్ అని పిలుస్తారు.
సమానత్వం కోసం
మహిళల ఆవేదన..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం స్ర్తి, పురుషులు సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం సమాన హక్కులు, సమాన వేతనం అని ఆ దేశ సూత్రాలలో పొందుపరిచారు. అయినా నేడు ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. ‘అసోచామ్’ అనే సంస్థ అహ్మదాబాద్, చండీగఢ్, జైపూర్, పూణె, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, లక్నో ఇత్యాది పది నగరాలలోని మహిళా ఉద్యోగుల సాధక బాధలను సర్వేచేసి తెలుసుకుంది. మహిళలు ఉద్యోగాలు మానేయడానికి అనేక కారణాలు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి సమస్యలు తక్కువగానే ఉన్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే మహిళలు ఉద్యోగాలు మానేయడానికి పలు కారణాలు తెలిపారు. పురుషులతో సమానమైన వేతనం లేకపోవడం, అనుకూలంగా లేని పనివేళలు, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు, లింగ వివక్షత, ఉద్యోగ భద్రత లేకపోవడం ఇత్యాది అనేక కారణాల వల్ల 26 శాతం మంది మహిళలు నిరాశ, నిస్పృహలతో ఉద్యోగాలు మానేస్తున్నారు. మన దేశంలో పలు సంస్థల్లో పెట్టుబడీదారీ మహిళలు పది శాతం ఉండగా, కార్పొరేట్ స్థాయిలో సీనియర్ మేనేజర్లుగా 30 శాతం మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోని 135 దేశాలలో ఉద్యోగం చేస్తున్న స్ర్తిల స్థితిగతులను పరిశీలిస్తే మన భారతదేశం 113వ స్థానంలో ఉంది. దీన్నిబట్టి మహిళలు ఎంత వెనుకబడి ఉన్నారో తెలుస్తుంది. అన్ని రంగాలతో పాటు చట్టసభల్లో సైతం స్ర్తిలకు 33 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించారు. ఇది అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ చట్టాలను సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. కారణం ఈ చట్టాలు చేసే వాళ్లలో అధికులు పురుషులే కదా? అనే విమర్శ లేకపోలేదు. జనాభా లెక్కల ప్రకారం నేడు మహిళల శాతం తగ్గింది. కొన్ని కులాలలో అయితే కోరుకున్న లక్షణాలున్న పెళ్లి కుమార్తెలు దొరక్క అనేక మంది బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. మరికొందరు కులాంతర వివాహాలు కూడా చేసుకుంటున్నారు. మహిళలు అధికంగా ఉన్న కులాలలో వరకట్నాల పేరుతో రాచి రంపాన పెడుతున్నారు.
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టని మహాత్మాగాంధీ అన్నారు. అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. ప్రేమిస్తావా? లేదా? అని కొందరు, శారీరక వాంఛ తీర్చమని మరికొందరు, నువ్వు ధరించిన అర్థనగ్న దుస్తుల వల్ల నాలో తాపం పెరిగిందని ఇంకొకడు, యాసిడ్ దాడులు, గొంతు కోసే వాళ్లు, సర్దుకుపోయి జీవించండి అని సలహాలిచ్చేవారు, మానభంగాలు, హత్యాచారాలు ఇలా ఇప్పటికీ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. చివరకు మహిళల్ని చంపేసి శవాలపై కూడా అత్యాచారం చేసి, మానవత్వానికి తీరని కలంకం తెచ్చిన ఉదంతాలు వింటుంటే మానవజాతి ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థమవుతుంది. అయేషా మీరాను ఘోరంగా చంపేసినా ఇప్పటివరకు నిందితులెవరో కనిపెట్టలేకపోయారు. హైదరాబాద్ దిశను హత్యాచారం చేసిన నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతం కావడం ఎక్కువమంది హర్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని చేసి 21 రోజులలోపే దోషికి శిక్షపడేలా చేస్తామని ప్రకటించిన పిదప కూడా అనేక హత్యాచారాలు జరిగాయి. అయినా ఎవరికీ, ఎక్కడా, ఎటువంటి కఠిన శిక్షలు అమలుగాక పోయే సరికి దోషులు కాలర్లు ఎగరేసి తిరుగుతున్నారు. అనేక దేశాలలో హత్యాచారాలు చేసే వారికి కొద్ది రోజుల్లోనే వేగవంతంగా దర్యాప్తు జరిపి ఉరి శిక్షలు విధిస్తున్నారు. దీంతో నిందితులకు ప్రాణభయం ఉండటం వల్ల అక్కడ ఇటువంటి నేరాలు తగ్గాయి. మనది ప్రజాస్వామ్య దేశం కావడంతో ఉరిశిక్ష పడినప్పటికీ రాష్టప్రతి క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నారు. వెనుకటికి ఒకడు అమ్మా నాన్నను హత్యచేశాడట. ఉరిశిక్షకు ముందు నీ చివరి కోరిక ఏమిటని అడిగితే అమ్మానాన్న లేని వాడిని, నన్ను విడిచిపెట్టండి అన్నాడట. ఇదే రీతిలో నేడు కొందరు మైనర్ బాలురు మానభంగాలు, హత్యలు చేసి అయ్యా! మేము మైనర్లము. విడిచిపెట్టండని కోర్టులను ఆశ్రయిస్తూ న్యాయవ్యవస్థకే తలనొప్పిగా తయారయ్యారు. మైనర్లనే సంగతి హత్యలు, మానభంగాలు చేసినప్పుడు తెలియదా అనేది బాధితుల ప్రశ్న. ఏది ఏమైనా ఇటువంటి నేరస్థుల ఆటలు కట్టించాలంటే న్యాయవాదులు వీళ్ల కేసులను వాదించకూడదు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగా న్యాయం జరిగేలా చూసి, హైకోర్టుకు వెళ్లడానికి అవకాశం లేకుండా ఉరిశిక్షలు విధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్లలకు సైతం చాలా జాగ్రత్తలు నేర్పించాలి.
యువతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
యువతలు కూడా ప్రమాదాలకు గురికాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం చాలా మంచిదే. సాంకేతిక పరిజ్ఞానమనేది కత్తిలాంటిది. దాంతో కూరగాయలు తరగచ్చు. పీకలు కోసుకోవచ్చు. ఇటువంటి పరిజ్ఞానాన్ని మంచి కోసం వినియోగించుకోవాలి. ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టి ముక్కూ, మొహం తెలియని గాలి గన్నారావులు నువ్వు కత్తి, తోపు, తురుము అని పొగుడుతుంటే మురిసిపోయి వాళ్ల మాయలో పడకూడదు. వాళ్ల మాయలో పడి, అటువంటి వారితో చనువుగా మెలగడం వల్ల మోసపూరిత బుద్ధి గల ఆ ప్రబుద్ధులు అశ్లీల వీడియోలు తీసి కుటుంబ సభ్యులను బెదిరించిన కథలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సామాజిక మాధ్యమాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే నిన్ననే నాకు పెళ్లయింది. నా భార్య ఎలా ఉంది అని ఆమె ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నారు. రంభ, సూపర్, అమేజింగ్ అంటూ తలా ఓ కామెంట్. పెళ్లాం నచ్చవలసింది చేసుకున్నవాడికి కానీ ఇదేమైనా పబ్లిక్ ప్రాపర్టీనా ప్రతీ ఒక్కడికీ నచ్చడానికి అనే విషయాన్ని గ్రహించాలి. ఈ మధ్య కాలంలో టిక్‌టాక్ అనే మరో జాడ్యం బయలుదేరింది. అందులో కొద్దిసేపు ఏ పాటకైనా నృత్యాన్ని అభినయిస్తే ఒకేసారి ప్రపంచవ్యాపితంగా పేరొస్తుందనే అపోహలో కొంతమంది బ్రతుకుతున్నారు. దీంతో మహిళలు చిన్నా, పెద్ద, యువతి, గృహిణి అనే తారతమ్యాలు లేకుండా మేకప్‌లు వేసుకుని కెమేరా ఫిల్టర్ల ద్వారా అందాన్ని ద్విగుణీకృతం చేసుకుని కనిపిస్తూ శరీర ఒంపుసొంపులు చూపిస్తూ, అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. ఆ నృత్యానికి లైకులు వస్తే తామేదో సెలబ్రిటీలమని మరో లోకంలో జీవిస్తున్నారు. ఇటువంటి వీడియోలకు కొందరు పనిలేని వారు చెడు కామెంట్లు చేస్తుంటారు. నీ రేటెంత, రాత్రికి వస్తావా? ఇటువంటి కామెంట్లు చేయడం వల్ల మా ఆయన నన్ను వదిలేశాడు. మేము గొడవ పడ్డాము అని తిరిగి మరో వీడియో పోస్టు చేస్తుంటారు. మనమే మన కొంపను కొల్లేరు చేసుకుంటున్నామనే విషయాన్ని గ్రహించాలి. పరాయి వాడు మనల్ని చెడు వ్యాఖ్యానాలు చేసే అవకాశం మనమే ఇచ్చి తరువాత మాకు స్వాతంత్య్రం లేదా? అని బాధపడితే ఎలా? తాత్కాలిక ఒంపులు, హోయలు, అందాన్ని చూసి పొగుడుతుంటే అది గొప్ప అని భ్రమలో బతకకూడదు. దేశానికి పనికి వచ్చే పని చేసి పదిమందికి మార్గదర్శకమైతే అది గొప్ప. రాత్రిపూట జరిగే పార్టీలకు ఎవరో ఒకరిని తోడుగా తీసుకుని వెళ్లాలి. అటువంటి పార్టీలలో శీతల పానీయాలలో మత్తుమందులు కలిపి, తాగించి హత్యాచారాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కొద్ది పరిచయంతోనే లాంగ్ డ్రైవ్ అని, పిక్నిక్ అని రెండు మూడు జంటలు వెళుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పాఠశాల, కళాశాల పిక్నిక్‌లకు ఉపాధ్యాయులు, అధ్యాపకుల పర్యవేక్షణలో వెళ్లాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే కొందరు పబ్బులకని, సుదూర ప్రాంతాలలో గడపడానికి వీకెండ్ డేస్‌కు వెళుతుంటారు. బంధుమిత్రుల తోడు లేకుండా ఇలా వెళ్లడం శ్రేయస్కరం కాదు. అందరినీ, అన్ని వేళలా ఇటువంటివి మంచి ఫలితాలనివ్వవు. కంపెనీ వాళ్లు అందులో పనిచేసే వారందరికీ పార్టీలు ఇస్తుంటారు. ఆ పార్టీలకు తల్లిదండ్రులు, రక్తసంబంధీకుల్ని కూడా అనుమతిస్తుంటారు. ఇటువంటి మంచి పార్టీలకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఉల్లాసంగా గడపవచ్చు. ఒంటరిగా ఆటో ఎక్కినప్పుడు దాని నెంబర్ ఇంటికి ఫోన్ చేసి చెప్పి ఏ వైపుకు ప్రయాణం చేస్తున్నామో తెలియజేయాలి. చెడు భావాలున్న ఆటో డ్రైవర్ సైతం ఇది వింటే మన వివరాలు తెలిసిపోయాయని భావించి హాని చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంత నాగరికత పెరిగినా ఇప్పటికీ తెలంగాణాలోని నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కొన్ని జిల్లాలలో అక్కడక్కడా జోగిని వ్యవస్థ కనిపించడం శోచనీయం. అందమైన అమ్మాయికి దేవుడికి అంకితమిచ్చామని ప్రకటిస్తారు. ఇక ఆ గ్రామానికి చెందిన పురుష పుంగవులంతా ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించవచ్చు. ఇలా ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనమవుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చట్టాలను తెచ్చి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పేదరికంతో బాధపడే యువతుల బలహీనతలను అడ్డం పెట్టుకుని యథేచ్చగా ఇటువంటి దారుణాలను కొనసాగిస్తున్నారు.
మహిళలకు కరువవుతున్న రక్షణ
పొట్ట చేతపట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవటానికి నేడు అనేకమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. కీచకుల్లాంటి కొందరు ఉద్యోగుల వల్ల అనేక చోట్ల మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళలు అటు భర్తకో, ఇటు కుటుంబ సభ్యులకో, స్నేహితులకో చెప్పుకోలేక సిగ్గుతో తమలో తామే కుమిలిపోతున్నారు. సినీ పరిశ్రమల్లో సైతం కమిట్‌మెంట్ పేరుతో ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్న సంగతి అనేకమంది బహిరంగంగానే చెప్పారు. మానవుడు చంద్రమండలంపైకి అడుగుపెట్టిన ఈ యాంత్రికయుగంలో కూడా కట్నం కోసం వేధించేవాళ్లు, బాల్య వివాహాలు జరిపించేవారు మనకు తారసపడుతూనే ఉన్నారు. సినీ రంగంలో గడ్డకట్టే చలిలో చలనచిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు మన హీరోలు శరీరమంతా సూటు, కోటుతో కప్పుకుంటారు. హీరోయిన్లు మాత్రం చలికి వణుకుతూ అంగాంగ ప్రదర్శనలు చేస్తూ పైన ఒక రిబ్బన్, కిందొక రిబ్బన్‌తో నటించాలి. అదేమిటని ప్రశ్నిస్తే పాత్ర డిమాండ్ చేసిందని కథలు చెబుతుంటారు. అనేక సందర్భాలలో కుటుంబ స్ర్తిలతో కలసి చూడలేనంత అశ్లీల దృశ్యాలతో చిత్రాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే ఎవరు చూడమన్నారు? మీరు ఆదరిస్తున్నారు కాబట్టే అటువంటి చిత్రాలు తీస్తున్నాము. ప్రజలు తిరస్కరిస్తే అటువంటి చిత్రాలు నిర్మించరు కదా? అని ఎదురుప్రశ్న వేసి మసిబూసి మారేడుకాయ చేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. స్ర్తి, పురుషులిద్దరూ సమానమే అనేది మాటల వరకే పరిమితమవుతుంది. ఆచరణలో శూన్యమే అని చెప్పవచ్చు. ఏ మహిళ కూడా పురుషుడు ధరించిన ఎటువంటి దుస్తులపై కూడా తన అభిప్రాయం చెప్పదు. కానీ స్ర్తిలు మాత్రం ఇటువంటి దుస్తులే ధరించాలి. లేకుంటే అత్యాచారాలు జరగడానికి స్ర్తిలే కారణభూతులవుతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. మనిషి సాంకేతికంగా శరవేగంతో అత్యాధునికత వైపుకు దూసుకువెళుతున్న ఈ నేపథ్యంలో సైతం ఆదిమ సమాజాన్ని తలపించే అనాగరిక సంఘటనలు స్ర్తిల పట్ల జరగడం శోచనీయం. ఇంకాస్త ముందుకెళితే భారతదేశంలో లైసెన్స్ ఇచ్చి మరీ వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. స్ర్తిల పేదరికాన్ని సొమ్ము చేసుకుంటూ వారిని పాపకూపాల్లోకి నెట్టేస్తున్నారు. ముంబై కమాటిపురాలోని రెడ్‌లైట్ ఏరియా, న్యూఢిల్లీ, గుజరాత్, కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపాన అతిపెద్ద రెడ్‌లైట్ ఏరియా శివదాస్‌పూర్ ఇత్యాది అనేక ప్రాంతాలలో లైసెన్స్‌లు ఇచ్చి మరీ బహిరంగ వ్యభిచారాన్ని చేయిస్తూ మహిళల్ని అంగడి బొమ్మలుగా మార్చేస్తున్నారు. పెద్దపెద్ద స్టార్ హోటళ్లలో కాల్‌గాళ్స్ పేరుతో అందమైన అమ్మాయిల్ని అంగడిబొమ్మలుగా చేసి వాళ్ల శరీరాలతో వ్యాపారాలు చేస్తున్నారు. భారతదేశంలో ఏ ఊళ్లో ముక్కుపచ్చలారని కనె్నపిల్లలు మాయమైనా ఈ వ్యభిచార గృహాలలోకి తరలించబడతారన్నా అతిశయోక్తి కాదు. మహిళాభ్యుదయం అనేది ఊకదంపుడు ఉపన్యాసాలకో, సాహిత్యానికో పరిమితమైనంత మాత్రాన అందరి బ్రతుకులూ బాగుపడవు. సామాన్య స్ర్తిలు ఇవన్నీ మాకెందుకులే అని ఏడుపుగొట్టు సీరియల్స్ చూసుకుంటూ అత్తమీద కోడలు, కోడలుపై అత్త కుట్రలు చేసుకుంటూ ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెతను ఋజువు చేస్తూ గిరి గీసుకుని జీవిస్తున్నారు. ఇటువంటివి పోవాలంటే క్షేత్రస్థాయిలో మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. వారిలో ఇంకా చైతన్యం కలిగించవలసిన ఆవశ్యకత ఉంది. ఇందులో భాగంగా అటు స్ర్తిలతో పాటు పురుషుల్లో సైతం మానసికంగా మార్పు తీసుకురావలసిన అవసరం ఉంది. స్ర్తి, పురుషులు ఇద్దరూ సమానమే. అవసరమైన సందర్భాలలో స్ర్తి, పురుషులు హెచ్చుతగ్గులకు పోకుండా ఒకరికొకరు సహాయ, సహకారాలు అందించుకుని సమాజాన్ని ముందుకు నడపవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పత్రికలు, మీడియాలకే స్ర్తి అభ్యుదయాన్ని పరిమితం చేయకుండా, మార్గదర్శక సూత్రాలలో కాలానుగుణంగా మార్పులు తెచ్చి అంకితభావంతో ప్రభుత్వాలు ప్రకటించిన వాగ్దానాలు, చేసిన చట్టాలు అమలయ్యేలా చేస్తే మహిళల బ్రతుకుల్లో వెలుగులు నింపవచ్చు. *

- షేక్ అబ్దుల్ హకీం జాని 9949429827