రైతు రాజు
Published Sunday, 1 March 2020
బహుశా
ఇతను ఠారెత్తిస్తున్న
ఎండలనూ లెక్కచేయడు
ఈదురుగాలుల
జడివానకు
ఉరుములూ మెరుపులకూ
బెదరడు
ఇతని అరచేతులనూ
నడిచే పాదాలను
తరచిచూస్తే అంతటా
కాయలుకాసి
పగిలిన నేలపగుళ్లే
శరీరమంతా
చెమట చింది
నేలగంధము
పులుముకొన్న
మట్టి మనిషితడు
విశాలమైన ప్రపంచమైనా
ఇతనికి తెలిసిందల్లా
పొద్దుతిరుగుడు పూవై
తన అడుగులు
తాను నమ్ముకున్న
గొడ్డు గోదా చేనూచెల్క
పాడీ పంటవైపుగానే
ఇతను
ఆరుగాలం నాగలిపట్టి
దుక్కి దున్నీ
తన నడుము వంచి
నేలతల్లిని సాగుచేయగ
వరినారు మడుగుగా
విస్తరించిన
ఇతని ప్రతిబింబము
హరివిల్లు రంగులతో కూడి
ఆకాశమంత వ్యాపించి
జగమంత కుటుంబానికి
కణశక్తిబాండాగారమై
ఆకలి తీరుస్తాడు
నిరంతర శ్రామికుడుగా
వర్తమానముగా శ్రమిస్తూ
బంగారు భవిష్యత్తుకు
బాటలు వేస్తాడు
రైతురాజు కదా మరీ!!