S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాళేశ్వర మహాక్షేత్రం

పురాణ, చారిత్రక కాలాల నుండి వేల ఏళ్లుగా కాళేశ్వర క్షేత్రం ఎన్నో విశిష్టతలతో విరాజిల్లుతూ వస్తోంది. సదాశివునకు నిత్య నివాసంగా... భూలోక కైలాసంగా నిత్యం భక్తుల హరహర మహాదేవ శంభో శంకరస్తోత్రాలతో... ఓం నమశివాయ...ఓంకార నాదాల.... జేగంటల రావాలతో ఆలయం మారుమోగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 58 కిమీ మహదేవపురం మండల కేంద్రానికి 16 కి.మీ మహారాష్ట్ర సిరొంచ తాలూకాకు 4 కి.మీ దూరంలో గోదావరికి ఆవలి ఒడ్డున తెలంగాణాకు, మహా రాష్టక్రు, సరిహద్దుగా కాళేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఆలయం, నాలుగు దిక్కులా నాలుగు నంది విగ్రహాలతో, నాలుగు ధ్వజస్తంభాలతో, నాలుగు గోపురాలతో ప్రత్యేకత సంతరించుకొని నిత్యం సముజ్వలంగా శైవారాధనతో, ఆథ్యాత్మిక పరిమళాలతో భక్తకోటికి కైవల్యప్రాప్తికి ద్వారాలు తెరిచింది.
స్థలపురాణం: ఈ క్షేత్రానికి గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది. కాళుడు (యముడు) ఇక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమశివున్ని ప్రసన్నం గావించుకొని తన పేరున కాళేశ్వర క్షేత్రాన్ని వెలయింప జేసుకున్నట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ విషయాన్ని స్కాందపురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పినట్లుగా ఉంది. అలాగే గౌతమీ పురాణంతో కూడా ఈ క్షేత్రం విశిష్టత చాటబడి ఉంది.
పరివార ఆలయాలు: కాళేశ్వర, ముక్తీశ్వర స్వాముల వార్ల ఆలయానికి సరస్వతీ దేవాలయం, సూర్య దేవాలయం, ఆది ముక్తీశ్వరాలయాలతో కూడిన పరివార ఆలయ సముదాయం ఉంది. దేశంలో సూర్యదేవాలయాలలో ఒకటి కాళేశ్వరం, మరొకటి కోణార్క్, ఇంకొకటి అరసవల్లిలో ఉన్నాయి. సరస్వతి అమ్మవారికి దేశంలో మూడు ఆలయాలున్నాయి. ఒకటి కాళేశ్వరంలో మహా సరస్వతి, రెండోది బాసరలో జ్ఞాన సరస్వతి, మూడోది కాశ్మీరులో బాలసరస్వతి ఆలయం ఉంది. కాగా శ్రీ శంకర భగవత్పాదులు ఆదిశంకారాచార్యులు, తదుపరి శారదాపీఠాధిపతులు తమ శిష్య గణాలతో ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారతదేశంలోని కాళేశ్వరంకు వచ్చి శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వాముల వార్లకు దక్షిణాన మహా సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా జనశ్రుతి ఉంది. ఇప్పటికీ ఇదే పరంపర కొనసాగుతోంది.
పిరమిడ్ ఆకారంలో ఆలయం: కాళేశ్వరాలయం శిఖరం పిరమిడ్ ఆకారంలో నిర్మించబడి ఉంది. (ఇది ప్రస్తుతానికి లేదు). ఈ ఆలయానికి ఉత్తరాన మరొక చిన్న గుడి ఉండేది. అందులో అన్నపూర్ణ ప్రతిమ ఉండేది. ఇప్పటికీ ఆలయంలో గణపతి మత్స్యావతారం, చతుర్ముఖలింగం, సూర్య, విష్ణు, నంది మొదలైన విగ్రహాలున్నాయి. కాగా తెలంగాణాలో ప్రసిద్ధ క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచిన ఈ దేవాలయం కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థాన కవీంద్రుడు విద్యానాథుడు త్రిలింగ దేశానికి మహా సరిహద్దుగా కీర్తించాడు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి: ఉత్తర భారతదేశంలో మహోన్నతకాశీ పవిత్ర పుణ్య శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీ విశే్వశ్వర, విశాలాక్షిలను సందర్శించుకున్న వారికి కైలాసప్రాప్తి లభిస్తుందన్న విశ్వాసం హైందవులకు ఉంది. అందుకే కాశీ వెళ్లడానికి ప్రతీ శైవభక్తులు ఉబలాటపడతారు. అయితే పూర్వకాలం కాశీకి కాళినడకతో వెళ్లేవారు. ఈ క్రమంలో కాశీకి వెళ్లిన వాడు కాటికి పోయినట్లేనని అనే నానుడి ఉంది. అయితే కాశీకి సరిసమానమైన క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలో కాళేశ్వర క్షేత్రాన్ని పూర్వం ఋషులు కనుగొన్నారు. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి మూడు పవిత్ర నదుల సంగమం ఉంది. దీన్ని త్రివేణి సంగమం అంటారు. అదేవిధంగా కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహిని)... ముక్కంటి నుంచి జాలువారినది) కలిసి త్రివేణిసంగమం కావడంతో కాశీ క్షేత్రానికి, ప్రయాగ క్షేత్రానికి సరిసమానతను, పుణ్యం పవిత్రతలను చేకూర్చి దక్షిణ భారత కాశీ క్షేత్రంగా ఖ్యాతిని తెచ్చి దక్షిణ దేశ శైవభక్తులకు కాళేశ్వరాన్ని మరో కాశీగా చేరువజేశారు. కాశీ కన్నా వరిముళ్లు కన్నా ఎక్కువ మహిమాన్విత మైనదిగా కాళేశ్వర క్షేత్రానికి భక్తుల మనోభావాలున్నాయి.
త్రిలింగ శైవ క్షేత్రాలలో ఒకటి: రెండు తెలుగు రాష్ట్రాలలోని కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ద్రాక్షారామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర శైవ క్షేత్రాలతో కూడిన మూడు ప్రపంచ ప్రసిద్ధ శైవ క్షేత్రాలుండగా వాటిలో ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రంగా కాళేశ్వర క్షేత్రం అనాధి నుంచి ఖ్యాతిని పొందింది. పూర్వం ఆ మూడు క్షేత్రాల మధ్య ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు గల ఉమ్మడి (ఆంధ్రప్రదేశ్) ప్రాంతాన్ని ‘‘త్రిలింగ దేశం’’ అని పిలిచారు.
ద్వారాల విశిష్టత: కాళేశ్వర గర్భాలయానికి నాలుగువైపులా ద్వారాలున్నాయి. ఈ విశేషం దేశంలో మూడు ఆలయాలకే ఉంది. అవి కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వరాలయం, కాశీ విశే్వశ్వర స్వామి ఆలయం, నేపాల్‌లోని పశుపత ఆలయం.
యమకోణం: భక్తులకు యమదోషం తొలగించడానికి పూర్వం మునులు ఆలయంలోకి వెళ్లే ద్వార మార్గంలో యమకోణాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోకి ఒక దిక్సూచి ఆధారంతో వెళతారు. దీంతో తాము యమదోషాలను నివారించుకున్నట్లుగా భక్తులు నమ్ముతారు.
శని, సర్పదోష పూజలు: ఆలయంలో శనివారం శనిపూజలు, మంగళ, గురు వారాలు కాలసర్ప దోష నివారణ పూజలు జరుగుతాయి. ఈ పూజలతో అన్నీ శుభాలే కలుగుతాయని భక్తులకు అత్యంత విశ్వాసం.
ఒకే పానవట్టంపై రెండు లింగాలు: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలో ఒకే పానవట్టంపై ముక్తీశ్వర (శివుడు), కాళేశ్వరు (యముడు)లకు రెండు జంట లింగాలున్నాయి. ముక్తీశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలున్నాయి. ఈ నాసికా రంధ్రాల్లో అభిషేకానికి ఎన్ని పాలు, లేదా ఎన్ని నీళ్లు పోసినా లోనికి పోతాయి. బయటకు రావు. అభిషేకం చేసినవి త్రివేణి సంగమంలో కలుస్తాయని ‘‘కాళేశ్వర ఖండం’’ అనే గ్రంథం వివరిస్తోంది. ఇలా ఉండగా మొదటగా కాళుడికి (యముడికి), తర్వాత ముక్తీశ్వరునికి (శివునికి) పూజలు జరుగుతాయి. పార్వతీదేవి శుభానందాదేవి అవతారంలో ఆలయంలో దర్శనమిస్తుంది. గౌతమీ అభీష్టం, ముక్తీశ్వరుని ఆదేశాల మేరకు సచ్చిదానంద రూపిణియగు కాశీ అన్నపూర్ణాదేవి (పార్వతీ దేవి) శుభానందదేవిగా వెలిసింది. శివుని వాయుభాగంలో ఉండి బంగారు ఛాయ గలిగి సర్వాభరణములను ధరించి తాంబూలం నములుతూ దివ్య భాషణలు చేస్తూ ఈశ్వరున్నీ, భక్తులనూ ఆనందపరవశులను చేస్తూ శుభానందాదేవి కొలువై ఉంది. ఈ క్రమంలో ఆరాధనలతో, అభిషేకాలతో మహదానందులై శివుడు, యముడు జంటగా భక్తులకు కోరిన వరాలిస్తారని పూజారులు చెబుతారు.
అష్ట తీర్థాలు: పూర్వం ఇక్కడ మునులు బ్రహ్మతీర్థం, చిత్సుఖ తీర్థం, వ్యాస తీర్థం, నరసింహతీర్థం, హనుమత్‌తీర్థం, జ్ఞానతీర్థం, పక్షి (వాయస) తీర్థం, సంగమ తీర్థం, అను ఎనిమిది తీర్థాలతో ఎంతో పునీతంగాను, పవిత్రంగాను క్షేత్రాన్ని భాసింపజేశారు.
ప్రకృతి విభూతి రాళ్లు: కాళేశ్వరాలయానికి పడమర వైపు సుమారు 1 కి.మీ. దూరంలో ఉన్న యమగుండం మీద ఆది ముక్తీశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టూ ప్రకృతి సిద్ధమైన విభూతి రాళ్లు లభిస్తాయి. అందుకే ప్రకృతిసిద్ధ విభూతి రాళ్ల క్షేత్రంగా పేరుంది. ఈ విభూతిని దిద్దుకుంటే శివునికి ప్రీతిపాత్రులవుతారన్న ప్రబలమైన నమ్మకం భక్తుల్లో ఉంది. అందుకే ఈ విభూతిరాళ్లను ఎంతో భక్తితో పలువురు ఇక్కడకు వచ్చి సేకరించుకొని భద్రపరుచుకొని తద్వారా దేహానికి పూసుకుంటూ శివారాధన చేస్తుంటారు.
పిండ ప్రదానాల క్షేత్రం: ఇక్కడి గోదావరి త్రివేణి సంగమంలో పితృదేవత పిండ ప్రదానాలు చేస్తే వారికి కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి లభిస్తుందన్నది హైందవులకు ప్రబలమైన నమ్మకం. అందుకే ఇక్కడ పితృతర్పణాలు చేయిస్తారు. ఇందుకే కాళేశ్వర క్షేత్ర పిండ తర్పణాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
గౌతమిగా మారిన గోదావరి: సమీపంలోని మంత్రపురి (మంథిని) గౌతమ మహాముని తపో భూమిగా వర్ధిల్లింది. దీంతో గౌతమ మహాముని పాదాలను అభిషేకించి గోదావరి నదీమ తల్లి గౌతమిగా మరో పేరు దాల్చి ప్రపంచ ప్రఖ్యాతి పొందినది.
కాకతీయుల కాలంలో మహోజ్వల వైభవం: కాకతీయ చక్రవర్తుల కాలంలో కాళేశ్వర క్షేత్రం మహావైభవోపేతంగా మహోజ్వలంగా ప్రకాశించింది. రుద్రదేవుడి కాలం క్రీ.శ. 1158 నుంచి రెండో ప్రతాపరుద్రుడి క్రీ.శ. 1323 వరకు సుమారు 165 ఏళ్లకు పైగా ఈ క్షేత్రం వర్ణింప లేనంత అంగరంగ వైభవంగా మహోన్నతంగా కొనసాగినట్లు కాకతీయుల చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ అభివృద్ధికి రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అపార శైవభక్తితో కోట్లాది రూపాయల విలువైన మణుగుల కొద్దీ బంగారాన్ని సమర్పించుకున్నట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాకతీయులు ఇక్కడ ఎన్నో ఆలయాలు నిర్మించి గ్రామాన్ని ఆలయాలమయం చేసి శివునిపై తమకు గల ఆపార భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అయితే మహ్మదీయ రాజులు ఓర్వలేక వాటిని ధ్వంసం చేసినట్లు చరిత్రకారులు చెబుతారు.
కాళేశ్వరం మునులతో ఓరుగల్లు నిర్మాణానికి శంకుస్థాపన: లోహాన్ని బంగారంగా మార్చే మహామహిమాన్విత ఓరుగల్లు (స్వయం ప్రకాశిత వరుసవేది శివలింగం) వెలియగా కాకతీయ ప్రభువు రెండో ప్రోలరాజు క్రీ.శ. 1116-1157 మధ్య కాలంలో కాళేశ్వరంలోని ప్రసిద్ధ మునులు శ్రీరామారణ్య పాదుల వారిని, మహేంద్ర శ్రీపాదుల వారిని రప్పించారు. వారితో ఒరగల్లు లభించిన చోట ఓరుగల్లు నగర నిర్మాణానికి ప్రోలరాజు శంకుస్థాపన చేయించాడు. తదనంతరం ఆ నగరం సువిశాల, సుస్థిర కాకతీయ మహా సామ్రాజ్యానికి (రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత భూభాగాలకు) గొప్ప రాజధాని అయింది. ఈ విషయం క్రీ.శ. 1264 నాటికి చింతలూరు తామ్రశాసనం వల్ల, అలాగే ప్రతాప చరిత్ర వల్ల తెలుస్తోంది.
గంగాధరుని నిర్మాణం: కాళేశ్వరాలయం అతి ప్రాచీనమైనదని వివిధ పురాణాలు ఒక వైపు చెబుతుండగా, ఈ ఆలయ నిర్మాణాన్ని క్రీ.శ. 1171లో రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు) ప్రధానమంత్రి గంగాధరుడు శివునిపై తనకు గల అపార భక్తికి ప్రతీకగా కాళేశ్వరాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
రామేశ్వర దీక్షితులు రెండో ప్రోలరాజు శైవమత గురువు అయిన రామేశ్వర దీక్షితులు ఇక్కడ స్థిరపడి ఉపాలమఠం అనే గొప్ప శైవమఠాన్ని స్థాపించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
గణపతి దేవుని రాజగురువు నిర్మాణాలు: కాళేశ్వర, ముక్తీశ్వర స్వాములను కాకతీయులు ఎంతగానో ఆరాధించి ఆలయాన్ని సమున్నతంగా అభివృద్ధిపరిచారు. భక్త కోటికి నిత్య శివసందర్శన క్షేత్రంగా, వైభవోపేతం చేశారు. ఈ క్రమంలో రుద్రమ దేవి తన తండ్రి గణపతిదేవుడి ఆజ్ఞతో వారి రాజగురువు అయిన విశే్వశ్వర శంబు (శివాచార్యులు) దేశికల వారికి ధనసహాయం చేయగా ఆయన కాళేశ్వరంలో ఒక శివాలయాన్ని, ఉపలమఠాన్ని (గోళకీమఠం) నిర్మించాడు. కాళేశ్వరంలోని ఒక శాసనం, అలాగే క్రీ.శ. 1261 నాటి మల్కాపురం శాసనంతో ఆ విషయం తెలుస్తోంది. కాగా శివాలయం, ఉపల మఠాలను విశే్వశ్వర శంబు ధేవకులవారు తన ఆథ్యాత్మిక కుమారుడు ధర్మశివుడుతో నిర్వహింపజేశాడు.
ప్రతాపరుద్రుడి వితరణ: ప్రతాపరుద్రుడు పలు రాజ్యాలను జయించి కాళేశ్వరం లో త్రివేణి సంగమ స్నానం చేశాడు. కాళేశ్వర, ముక్తీశ్వరులను సందర్శించాడు. పేద బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడంతో పాటు వారింట కన్యలకు వివాహాలు జరిపించాడు. ఈ క్రమంలో ప్రతాపరుద్ర చక్రవర్తి తన 12 తులాభారాలతో కాళేశ్వరాలయానికి అపారమైన బంగారాన్ని సమర్పించుకున్నారట. ఇదే కాకుండా ఇంకా కోట్లాది రూపాయల విలువైన ఎన్నో మణుగుల బంగారాన్ని ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం నాడు ఆలయానికి సమర్పించే వాడట. ఈవిధంగా అపార బంగారంతో కాళేశ్వర, ముక్తీశ్వరస్వాముల ఆలయం వైభవోపేతంగా సిరిసంపదలతో సముజ్వలంగా తులతూగిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
దేవరాయల వారి దానం: క్రీ.శ. 1379లో రెండో హరిహర రాయల కుమారుడు దేవరాయల వారు దిగ్విజయ యాత్ర చేసి కాళేశ్వరం వచ్చి తన విజయాలకు గుర్తుగా ఇక్కడ గొప్ప ఉత్సవం జరిపి తులా పురుష దానం చేశాడని తెలుస్తోంది.
ఆలయ ధ్వంసం: అపారబంగారం అపహరణ: ఢిల్లీ మహ్మదీయ సుల్తానులు ఓరుగల్లుపై ఎన్నోమార్లు దాడులూ, విధ్వంసాలూ, లూఠీలు, ఎన్నో అమానుషాలు జరిపిన క్రమంలో కాళేశ్వరం కూడా ఎన్నోమార్లు వారి పైశాచిక దాడులూ, విధ్వంసాలూ, దోపిడీలూ, దురాగతాలకు గురైంది. ఈ నేపథ్యంలో క్రీ.శ. 1310లో ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆదేశంతో అతడి సైన్యాధిపతి మాలిక్ కాపర్, క్రీ.శ.1323లో ఢిల్లీ సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్ ఆదేశంతో అతని కుమారుడు, సైన్యాధిపతి ఉలఘ్‌ఖాన్‌లు ఆలయంలో ఉన్న అపార బంగారాన్ని, ధనాన్ని కొల్లగొట్టి లూఠీ చేసి, ఎంతో గొప్ప శిల్పకళా సౌందర్యంతో భాసిస్తున్న వేల ఏళ్ల చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కాళేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆలయం సకల ఐశ్వర్యాన్ని, ఆదరణను, వైభవ, ప్రాభవాలను సర్వం కోల్పోయి దీనావస్థ శోకితమై కళ తప్పి 650 ఏళ్లకు పైగా చీకటిలో మగ్గింది.
1972-73లో గుర్తింపు: 1976లో అభివృద్ధికి బాటలు: ఈ నేపథ్యంలో దేశానికీ, హైద్రాబాద్ (నిజాం) రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాళేశ్వర క్షేత్రాన్ని మన ప్రభుత్వాలు పునరుద్ధరించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో 1972-73లో ఈ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించింది. 1976లో అప్పటి దేవాదాయశాఖామంత్రి చొక్కారావు ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. 10 రోడ్లు నిర్మించారు. కరెంట్ సౌకర్యం కలిగించారు. బస్సులు వేయించారు. సి.ఎం. నిధి నుంచి రూ.50 లక్షలు తెచ్చారు. అలాగే తిరుమల, వేమలవాడ దేవస్థానాల ఆర్థిక సాయాన్ని తెచ్చి భక్తులకు వసతిగృహాలు కట్టారు. ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రం సిద్ధించాక రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్‌రావు కాళేశ్వరాన్ని వేములవాడ తరహాలో అభివృద్ధిపరచటానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో గృహసముదాయం, అతిథిగృహాలు, ఇతర నిర్మాణాలు జరుగనున్నాయి.
అంతర్‌రాష్ట్ర వారధి: కేంద్ర ప్రభ్వుం కాళేశ్వరం సమీపంలోని కనె్నపల్లి వద్ద గోదావరిపై అంతర్ రాష్ట్ర హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించగా అటు మహారాష్ట్ర ప్రజలు, ఇటు తెలంగాణ, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజల రాకపోకలతో కాళేశ్వరంకు మహర్దశ పట్టి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
జాతీయ రహదారి: ఇదే మ్రకంలో మహారాష్ట్ర సిరొంచ తాలూకా కేంద్రం నుంచి అంతర్‌రాష్ట్ర బ్రిడ్జి మీదుగా కాళేశ్వరం, మహాదేవపురం, కాటారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం మీదుగా తిరుపతి సమీపంలోని రేణిగుంట (చెన్నై, వరకు 643 కి.మీ., 363 నెం. జాతీయ రహదారి నిర్మాణాన్ని 250 కోట్ల రూపాయలతో 353 పనులతో కేంద్ర ప్రభుత్వం చురుకుగా నిర్మించింది. ఇలా ఉండగా ఇక్కడి నుంచి ప్రవహించే గోదావరి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది.

- గౌడ్