S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమ్మక్క సారలమ్మలకు సబ్బినాటితో అనుబంధం

దేశమాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ జానపదులు ఆరాధ్య దైవాలుగా కొలవడం సదాచారంగా మారింది. దాదాపు 900 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన వన దేవతల జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే సాగుతుంది. అయితే గిరిజనులే కాక, గిరిజనేతరులు సైతం గద్దెలెక్కిన దేవతలను కొలవడం వంశపారంపర్య ఆచరణగా కొనసాగుతున్నది. కాకతీయులు మొదట సబ్బినాడు (కరీంనగర్)లోనే రాజ్యముచేసి, చాళుక్యుల దయచే అనుమకొండను సంపాదించారనే భావనకు, పొలవాసలో ఏకశిలాదేవి కాకతీయుల కులదైవం మందిరం ఆనాడు ఉండడం ఊతమిస్తున్నది. కాకతీయులలో మూడవ రాజైన రెండవ బేతరాజు, మహా మండలేశ్వర మేడరాజుకు సామంతుడని శాసనాధారులున్నాయి. జగిత్యాల జిల్లాలో ఆర్వెల్లి (ఆరువేల గ్రామం)లో నేటికీ ఎతె్తైన ఆర్వెల్లి నాయకమ్మ విగ్రహం కలిగి, ఏటా జాతర జరుగుతున్నది. బేతరాజు సబ్బి సహస్రం (ఆరువేల నాడు)ను పాలించాడని చరిత్రకారుల భావన. బేతరాజు తర్వాత రెండవ ప్రోలరాజు రాజై, జగిత్యాల సమీప పొలవాస రాజ్యాన్ని ఏలే మేడరాజును గెల్చి, సామంతునిగా నిలిపాడని, అలాగే మంత్రకూటపు (మంథెన) రాజైన గుండెరాజును గుండారం వద్ద ఓడించి, అవమాన పరిచాడని, గుండెరాజు, మేడరాజు అన్నదమ్ములని పరిశోధనలు జరిగాయి. ప్రోలుని తర్వాత రాజైన కాకతీయ రుద్రుడు నగునూరుపై దండెత్తి దొమ్మరాజును ఓడించాక, పొలవాసపై దండెత్తగా, మేడరాజు పారిపోగా, హుస్నాబాద్ సమీప ఆకునూరుకు చేరుకుని, మూల సైనిక బలంతో మైళగి దేవుని కళ్యాణి వరకు తరిమిన క్రమంలో రుద్రరాజు స్వతంత్రుడైన సందర్భంలో యావదాంద్రదేశం రుద్రుని పాలన కిందకు 1162లో వచ్చినట్లు చరిత్రకారులు తెలుగు ప్రజలందరిని ఒక్కటిగా చేసిన సంవత్సరంగా గుర్తించారు. మేడరాజు తమ్ముడగు ఏడెరాజు వేయించిన శాసనం రామగుండం వద్ద లభించుటచే ఏడెరాజు ఆప్రాంత సామంతుడుగా ఉండినట్లు అభిప్రాయాలున్నాయి. గణపతి దేవుని కాలాన కరీంనగర్ జిల్లా మొత్తం సామంత పల్లవుల పాలనలో ఉండెనని తెలుస్తున్నది. గణపతి దేవుని తర్వాత రుద్రమ సింహాసనమెక్కింది. కాకతీయులలో చివరివాడు ప్రతాపరుద్రుడు. స్థానిక కథనాల ప్రకారం పొలవాసను పాలించిన మేడరాజు ఏకైక పుత్రిక సమ్మక్కను తన మేనల్లుడైన మేడారం పాలకుడగు పగిడిద్దరాజుతో వివాహం జరిపించాడు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తగా, మేడరాజు పోరిపోయి, పగిడిద్దరాజుకు ఆశ్రయుడైనట్లు, పడిగిద్దరాజుపై ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు మాఘ పౌర్ణమినాడు మేడారంపై దండెత్తినట్లు, మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్దంలో వీరస్వర్గం పొందినట్లు, సమ్మక్కసైతం కాకతీయలతో వీరోచితంగా పోరుసల్పి, గిరిజన యుద్ధ తంత్రాన్ని ప్రదర్శించినట్లు ప్రచారంలో ఉంది. అందుకే అవిభక్త కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వనదేవతల గద్దెలున్నాయి. దేవాదాయ శాఖలో రిజిస్ట్రేషన్ అయినవి కరీంనగర్ జిల్లాలో 41 కాగా, వరంగల్ జిల్లాలో 12ఉన్నాయి. ఆదిలాబాద్‌లో వేళ్ళపై లెక్కించేవి కాగా, ఇతర జిల్లాలలో బహుస్వల్పం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494