S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విదేశీ పెరుగు - రానున్న ముప్పు

మంఛుకొండల్లో పాలు తోడుకోవు. కాబట్టి అక్కడ పెరుగు దొరికే అవకాశమే లేదు. దాంతో కైలాస వాసి శివుడికి పెరుగు తినే అలవాటు లేకుండా పోయి ఆయన నీలకంఠుడయ్యాడు. పాలసముద్రం మీద పవళించే విష్ణుమూర్తికి పెరుగు దుర్లభం. చెంచాడు పెరుగు కలిస్తే చాలు పాలసముద్రం పెరుగు సముద్రం అయిపోగలదు. కాబట్టి పెరుగు తినే అలవాటు ఆయనకి లేకుండా పోయి, ఆయన నల్లనివాడయ్యాడు. ఇంక, స్వర్గంలో ‘సుర’ తప్ప ‘చల్ల’ దొరక్కపోవటంతో ఇంద్రుడు బలహీనుడయ్యాడు. పెరుగు పుచ్చుకునే అలవాటే ఉంటే, చంద్రుడికి క్షయవ్యాధి, వినాయకుడికి స్థూలకాయం, కుబేరుడికి కుష్ఠురోగం. అగ్నికి కాల్చే గుణం వచ్చేవే కాదు... అని, ‘యోగరత్నాకరం’ వైద్య గ్రంథంలో ప్రోబయటిక్స్ ప్రాధాన్యత గురించి ఓ చమత్కారం కనిపిస్తుంది. సామాన్యుడికి అర్థం కావాల్సిన విషయాల్ని శాస్త్రంలో ఇలా చమత్కార భరితంగా చెప్పటం మన శాస్తవ్రేత్తల ప్రతిభ.
పెరుగన్నం తినేవాడికి ఏ జబ్బులూ రావనీ, వ్యాధులు త్వరగా తగ్గుతాయి. తిరిగి రాకుండా ఉంటాయి. విష దోషాలు, దుర్భలత్వం, చర్మ రోగాలు, క్షయ, స్థూలకాయం, అమిత వేడి తగ్గిపోతాయి. శరీరానికి మంచి రంగు కలుగుతుంది.... అని దీని భావం. దేవతల కోసం అమృతాన్నీ, మానవుల కోసం పెరుగునీ భగవంతుడు సృష్టించాడని ఈ కథనానికి ముక్తాయింపు!
తరతరాలుగా పెరుగుతో పెరిగిన జాతి మనది. పాడిపంటలతో వర్ధిల్లిన మన సంస్కృతిలో పెరుగు ఒక భాగం. పాల కన్నా పెరుగు, పెరుగు కన్నా దాన్ని బాగా చిలికిన మజ్జిగ ఉత్తమోత్తమంగా పనిచేస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఇంటికొచ్చిన అతిథికి ఇప్పుడంటే కాఫీ/టీలిస్తున్నాం గానీ, పూర్వం మజ్జిగ ఇచ్చే వాళ్లు. చలివేంద్రాలంటే చల్లకుండలు పెట్టి, బాటసారుల దాహార్తి తీర్చేవారు. అందుకనే, మజ్జిగని దాహం అని కూడా పిలుస్తారు.
భోజనంలో ముగింపు పెరుగన్నమే! జనగణమన పాడితే కార్యక్రమం అయిపోయిందన్నట్టే పెరుగన్నంలోకి వస్తే భోజనం ముగింపునకు వచ్చినట్టు లెక్క. ఇంతగా పెరుగుకీ, పెరుగుతో తయారయ్యే పదార్థాలకూ ప్రాధాన్యతనిచ్చిన మన భోజన సంస్కృతి గురించి ఏ అధ్యయనమూ చేయకుండా ప్రపంచానికి పెరుగు ప్రాధాన్యతని తామే తెలియజేసినట్టూ ప్రోబయటిక్స్ గురించి రాస్తున్న విదేశీ వ్యాసకర్తలు రాస్తుంటే విచిత్రం అనిపిస్తుంది.
పెరుగులో ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయని మన పూర్వులకు తెలుసు కాబట్టి దాన్ని ‘పెరుగు’ అన్నారు. ప్రోబయటిక్స్ పేరుతో అమ్మే విదేశీ పెరుగుల కన్నా మన పెరుగులో కమ్మదనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, తోడుపెట్టే ప్రక్రియ మీద మనదే పేటెంటు కాబట్టి! ఒక్కో ఇల్లాలు తోడు పెడితే పెరుగు రాయిలా తోడుకుని, కమ్మగా తియ్యగా ఉంటుంది. తోడు పెట్టడం అనేది ఒక కళ అనీ, అందులో నైపుణ్యం ఉన్న వారి చేతి పెరుగులో కమ్మదనం ఉంటుందనీ దీని భావం.
ఇప్పుడు ఆధునిక శాస్తవ్రేత్తల దృష్టి పేగుల్లో పెరిగే సూక్ష్మజీవుల మీద ఎక్కువగా ఉంది. జీర్ణశక్తి బలంగా ఉంటేనే శరీర వ్యాధినిరోధకశక్తి బలంగా ఉంటుందనే విషయానికి ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. అమీబియాసిస్ వ్యాధికి పెరుగే ఔషధం అని ఆయుర్వేద శాస్తవ్రేత్తలు ఏనాడో చెప్పారు. చెప్పటమే కాదు, పెరుగు వలన శరీరానికి కలిగే ఉపయోగాలన్నీ గుర్తించి, భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తప్పనిసరిగా ఉండేలా భోజన విధిని రూపొందించారు. తక్కిన రాష్ట్రాల వారి సంగతి ఎలా ఉన్నా తెలుగువారు ఈ నియమాన్ని విధిగా పాటిస్తున్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే కల్తీలు, విషపదార్థాలతో కూడిన ఆహారం ఎక్కువగా తింటున్నది మనమే! నిష్టూరంగా అనిపించినా ఇది నిజం. అయినా మనల్ని కాపాడుతోంది ఈ పెరుగన్నమే!
పెరుగు గురించిన ప్రచారం ఇటీవలికాలంలో బాగా ఊపందుకోవడంతో, వ్యాపారులు రంగప్రవేశం తప్పకుండా చేస్తారు. వారి ఉత్పత్తులకు అనుగుణంగా అనేక ప్రచారాలు శాస్తవ్రేత్తల పేరుతో పుట్టుకొస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మొదలుకానుంది. వాణిజ్యపరంగా పెరుగు, పెరుగు పదార్థాల ఉత్పాదకత మీద బహుళజాతి సంస్థల దృష్టి పడింది. ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందుతున్నాయి. కూల్ డ్రింకుల్లో విషాలు నింపి ఎలా మన చేత బలవంతంగా తాగించారో అలా పెరుగు, మజ్జిగల్ని కూడా విషాలతో నింపి మనతో తాగించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. అవతలవాళ్లు తలుపు తట్టకుండానే తెరిచే విధానం ఆ మన ప్రభుత్వాలు అవలంబిస్తుంటాయి కాబట్టి, విదేశీ వ్యామోహం మనలో జాస్తి కాబట్టి మొదటగా ఈ అంతర్జాతీయ వ్యాపారుల కళ్లు మన మీదే పడతాయి. 2017లో అమెరికాలో ప్రోబయటిక్స్ వ్యాపారం 40 బిలియన్ డాలర్లని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. మిన్ను విరిగి మీద పడ్డట్టు దాని ప్రభావం అతి త్వరలో మన పెరుగు, మజ్జిగల మీద అధికంగా పడనుందన్న మాట. మన పెరుగు, పాశ్చాత్యుల యోగర్టు, ఇతర ప్రోబయటిక్స్ రంగు-రుచి-వాసన- గుణగణాలలో చాలా వ్యత్యాసం ఉంటుంది. రుచీ, గుణమూ, నాణ్యతలు మన పెరుగులోనే ఎక్కువ. మనం దాన్ని నిలబెట్టుకోగలగాలి. వాణిజ్య ధోరణుల్ని నిరసించి తిరస్కరించగలగాలి.
మార్కెట్టుని ముంచెత్తుతున్న ప్రోబయటిక్స్ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసిన ఆచార్య పియెట్రో ఘెజ్జీ అనే శాస్తవ్రేత్త the fact that there is such a large amount of commercially-oriented information is problematic for consumers who are searching for honest answers'' అని వ్యాఖ్యానించాడు. ప్రోబయటిక్స్ ఆరోగ్యానికి మంచివి అని తెలిసిన వినియోగదారుడు ఆ పేరుతో ఏది కనిపించినా వెనకాముందూ చూడకుండా కొనేస్తాడు. వెనకా ముందూ చూడవలసింది ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే! వినియోగదారులుగా మీరూ నేనూ ఆ ద్రవ్యంలో కలిసిన దోషాలను ఎలా గుర్తించగలం? గుర్తించేలా కలిపితే కల్తీ ఉత్పాదకుడు మేధావి ఎలా అవుతాడు?
ఈ మధ్య ప్రోబయటిక్స్‌కి సంబంధం లేని రోగాల మీద కూడా తమ ఉత్పత్తులు పనిచేస్తున్నాయంటూ సైంటిఫిక్ నివేదికల పేరుతో వాణిజ్య ప్రకటనలు వెబ్ జర్నల్స్‌ని ముంచెత్తడంతో ప్రజలు గందరగోళ పడుతున్నారని కూడా పియెట్రో ఘెజ్జీగారు వ్యాఖ్యానించారు. మానసిక వ్యాధులు, గుండె జబ్బులూ ఇలాంటి వాటికి పెరుగుకి సంబంధం లేదు. పెరుగు శరీర సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగుల్లో ఉపయోగపడే బాక్టీరియాని చేర్చటం ద్వారా పేగుల్ని దృఢతరం చేస్తుంది. వేడిని నియంత్రిస్తుంది. విషదోషాలను హరిస్తుంది. బలాన్నిస్తుంది. చర్మాన్ని పోషిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపరచటం ద్వారా స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఇవీ పెరుగు సాధారణ ప్రయోజనాలు. కీళ్లవాతం నుండి కేన్సర్ దాకా పెరుగే ఔషధం అనీ, మా కంపెనీ ప్రోబయటిక్స్ వాడితే ఈ జబ్బులేవీ రావనీ, వస్తే ఆటోమెటిగ్గా తగ్గిపోతాయనీ ప్రకటనలు మితిమీరుతోన్నాయనేది పియెట్రో ఘెజ్జీ గారి ఆవేదన.
మన దేశ వాకిలి ఎదురుగా ప్రోబయటిక్స్ మూటలు దించుకుని వాణిజ్యవేత్తలు లోపలికి రావటానికి సిద్ధంగా కూర్చున్నారు. ముందుగానే మనం పడాల్సిన జాగ్రత్త ఏమంటే ప్రతీదీ బజార్లో కొనాలనే యావ వదిలేసి, ఇంట్లో కమ్మగా తోడుపెట్టుకున్న పెరుగు మాత్రమే తింటానని ఒట్టుపెట్టుకోవాలి. శీతలపానీయాలకు ఎలా బలైపోయామో ప్రోబయటిక్ పానీయాలకూ అలా బలి కాకుండా మనల్ని మనం కాపాడుకోగలగాలి. మన ఆరోగ్యం, మన సంపద, మన దేశ సంపద మూడూ ముఖ్యమే! అని మనలో విదేశీ వ్యామోహం లేకపోతేనే పొదుపవుతాయి.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com