చలామణి
Published Sunday, 26 January 2020జాన్ ఆర్ట్‌బెర్గ్ రాసిన ‘ఆల్ ది ప్లేసెస్ యూ గో.. హౌ విల్ యూ నో’ అన్న పుస్తకం చివర్లో ఓ చిన్న కథ చెబుతాడు. ఆ కథ నాకు చాలా నచ్చింది. ఆ కథ పేరు ‘టూ పెన్నీస్’ అంటే రెండు నాణేలు. ఆ కథ ఇలా మొదలవుతుంది.
మింట్ నుంచి రెండు కొత్త నాణేలు బయటకు వచ్చాయి. అవి చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయి.
రెండూ ఒకేలా వున్నాయి. వాటి విలువ కూడా ఒక్కటే. అందులో కూడా రెండూ ఒకే మాదిరిగా వున్నాయి.
ఆ రెండు నాణేల్లో ఒక నాణెం జారి నేల మీద పడిపోయింది. ఎంత వెదికినా అది దొరకలేదు.
రెండో నాణెం చలామణిలోకి వెళ్లిపోయింది. ఎంతోమంది చేతుల్లోకి మారింది.
ఎన్నో ప్రదేశాలు తిరిగింది.
దేవుని హుండీలోకి పోయింది. బ్యాంక్‌కి చేరింది. మళ్లీ చలామణిలోకి వచ్చింది.
పేదవాడి ఆకలిని కూడా ఆ నాణెం తీర్చింది. అలా చాలా సంవత్సరాలుగా ఆ నాణెం తిరుగుతూనే వుంది.
నేల మీద పడిపోయిన నాణెం చాలా సంవత్సరాల తరువాత దొరికింది. అది నల్లగా మారిపోయింది. దాని మీద వున్న రాతలు చెరిగిపోయాయి.
రెండు మాటల్లో చెప్పాలంటే ఆ నాణెం కళావిహీనంగా మారిపోయింది. తుప్పు పట్టినట్టుగా మారిపోయింది.
చలామణిలో వున్న నాణెం మాత్రం స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉంది.
సంవత్సరాల తరబడి పని చేస్తూ ఆ నాణెం చురుకుగా ఉండిపోయింది.
ఇదీ కథ.
కథ సారాంశం అర్థమైందని అనుకుంటాను. చలామణిలో వున్నవాళ్లే చురుగ్గా ఆకర్షణీయంగా వుంటారు.