నా తిక్క నాది!
Published Sunday, 19 January 20202018 చివరలో యుఎస్ వెళ్లాను. విమానంలో వెళ్లేవారిని, తిరిగి వచ్చేవారిని తమతో రెండు సూట్‌కేసులు తీసుకుపోనిస్తారు. రెండూ కలిసి 100 పౌండ్లు బరువు ఉండవచ్చు. కిలోల్లో అది 46కు లెక్క తేలుతుంది. వెళ్లేటప్పుడు బోలెడన్ని తిండి పదార్థాలు తీసుకువెళ్లినట్లు ఉన్నాము. తిరిగి వచ్చేటపుడు నా 46 కిలోల్లో 16 కిలోలు లేదా అంతకు కొంచెం ఎక్కువే పుస్తకాలు ఉన్నాయి. మా అబ్బాయి ఆ విషయంగా నన్ను హెచ్చరిస్తూనే వున్నాడు. కంప్యూటర్‌లో, ట్యాబ్‌లో ఈ-పుస్తకాలు అంటే ఎలక్ట్రానిక్ పుస్తకాలు అంతగా చదువుతాను నేను. అయినా అచ్చు పుస్తకాలమీద ఎందుకు అంత ప్రేమ అన్నది వాని ప్రశ్న. జవాబు ఇవ్వాళ్టివరకు నాకు తెలియదు. నిజానికి అక్కడ ఉండగా హరారి అనే పెద్దమనిషి రాసిన పుస్తకం ఈ-బుక్‌గా కొన్నాం. కానీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అచ్చు పుస్తకం కూడా కొన్నాను. ఇంతకు విషయం అది కాదు. నా కొడుకు ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో చిన్న లైబ్రరీ ఒకటి ఉంది. నేను నడచి అక్కడికి కొన్నిసార్లు వెళ్ళాను. కొంతమంది రచయితలు, వాళ్ళ పుస్తకాలతో నాకు అక్కడ పరిచయం కలిగింది. ఆ రచయితలమీద ఆసక్తి పెంచుకుని వాళ్ల పుస్తకాలకోసం వెతికాను. నేను చాలా కాలంగా మనగురించి మనం అన్న శీర్షిక కింద మనిషి గురించి చాలా చదువుతున్నాను, రాస్తున్నాను. ఆ విషయంగా అప్పటివరకు నాకు దొరకని కొన్ని పుస్తకాలు అక్కడ కనిపించాయి. బిహేవ్ అన్న ఒక పుస్తకంలో నాకు నిజంగా ఆశ్చర్యకరమైన ఆలోచనలు కనిపించాయి.
మావాడు ఉంటున్న నగరం పేరు ఫీనిక్స్. అక్కడ వాడిన పుస్తకాలు అమ్మే అంగడి ఒకటి ఉంటుందని తెలుసుకుని అక్కడికి వెళ్లాము. చాలా పుస్తకాలు కొన్నాను. దగ్గరలోనే మరొక పుస్తకాల అంగడి కనిపించింది. అది నిజానికి పాత పుస్తకాల అంగడి కాదు. కానీ అక్కడ రాక్‌లలో కొన్ని పుస్తకాలమీద చిన్నఎర్రని బొట్టుబిళ్ళ అతికించి ఉంది. ఆ పుస్తకాలు తక్కువ ధరకు ఇస్తారని నాకు తెలియదు. నేను ఎంచుకున్న మూడింటిలో రెండు పుస్తకాలు ఆ రకం కిందికి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అవి కూడా మానవుని తీరు గురించి పుస్తకాలే కావడం అంతకన్నా ఆశ్చర్యం కలిగించింది.
అక్కడ ఉండగా అమన్ అనే ఒక మిత్రుడితో పరిచయం కలిగింది. అతను యువకుడు. మంచి పఠనాసక్తిగలవాడు. మాటల సందర్భంలో నా అభిరుచులు అతనికి అర్థం అయినట్టు ఉన్నాయి. రిచర్డ్ డాకిన్స్ రాసిన ద గాడ్ డెల్యూజన్ పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. అప్పటికే నాకు ఆ రచయిత గురించి బాగా తెలుసు. సెల్ఫిష్ జీన్ అనే పేరుతో అతను మానవ పరిణామక్రమం గురించి ఎంతో వివరంగా రాశాడు. అయితే అది కొంచెం అవసరం కంటే ఎక్కువ వివరంగా ఉందని నాకు అనిపించింది. నాస్తికత గురించి అతను చెబుతున్నతీరు మరింత నచ్చింది. అచ్చులో నేమి, ఈబుక్‌గానేమి ఇంచుమించు అతని పుస్తకాలు మొత్తం సంపాదించాను. చదవడ మొదలుపెట్టాను. కానీ ఎందుకో మద్యలో ఆ పని వచ్చింది. కొంతమంది రచయితలకు తాము ఎంచుకున్న అంశం మరీ మరీ తలకు ఎక్కుతుంది. ఇక వారి వివరణ అంతా ఆసక్తిగల పాఠకులకు అతిగా తోస్తుంది. పరిణామం, ప్రపంచం తీరు మొదలైన విషయాలను గురించి చాలా కాలంగా చదువుతున్న నాకే డాకిన్స్ పుస్తకాలు కొంచెం అతిగా తోచాయి. కనుక ఆ చదవడానికి తాత్కాలింగా విరామం పెట్టాను అంతేకానీ ఆపేశాను అని చెప్పలేను.
ఇక 2019 సంవత్సరంలో చదివిన పుస్తకాల గురించి ఒకసారి దృష్టి సారిస్తే యు వాల్ నోవా హరారి పుస్తకాలు రెండు, ముందుకళ్ళ ముందు కనబడుతున్నాయి. వీటిలో మొదటి పుస్తకం పేరు శాపియెన్స్. అంటే ఈ పుస్తకం మానవుల గురించి అని అర్థం చేసుకోవాలి. పరిణామం గురించి, మానవ సమాజ అభివృద్ధి గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. కానీ ఈమధ్యన ఈ అంశాలను కొత్త దృష్టితో చూడడం మొదలుపెట్టారు. చాలాకాలం క్రితమే జారేడ్ డయమండ్ అనే పరిశోధకుడు పరిణామం గురించి మంచి పుస్తకాలు రాశాడ. అవి నేను చాలాకాలం క్రితమే చదివాను. మానవుల ప్రస్తుత పరిస్థితికి, ఆర్థికంగా, రాజకీయంగా మరెన్నో రకాలుగా వివిధ దేశాలమధ్య గల తేడాలకు కారణాలను అతను చక్కగా వివరించాడు. యుద్ధాలు, వ్యాధులు పరిశ్రమల కారణంగా ప్రపంచం తీరు ఇవ్వాళ్టి స్థితికి వచ్చింది అని అతను వివరిస్తాడు హరారి మాత్రం మరింత ముందుకు వెళ్లి విషయాన్ని మరొక దృష్టితో విశే్లషించాడు. అన్నట్టు అతని మొదటి పుస్తకం భారతీయ భాషలోకి అనువదింపబడింది. ఈమధ్నే అది తెలుగులోకి కూడా వచ్చింది. క్షమిస్తాను అంటే ఒక మాట చెప్తాను. సైన్స్ గురించి అంతగా అవగాహన లేనివారు ఇటువంటి పుస్తకాలను అనువదిస్తే అసలైన విషయాన్ని అందుకోలేకపోతారు అని నా అనుమానం. కానీ ఈ పుస్తకంలోని వివరణ మరి సైన్స్‌గా ఉండదు గనుక అనువాదం బాగానే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. హరారి ఈ పుస్తకంలో మానవజాతి ప్రస్తుత పరిస్థితి వచ్చిన కారణాలను సహేతుకంగా వివరిస్తాడు. అందుకని చాలా అంశాలు ఆసక్తికరంగా తోచాయి. తెలుగు అనువాదం కనీసం తెచ్చుకుని చదవమని అభ్యర్థిస్తున్నాను. మన గురించి మనం తెలియకుండానే బతుకుతున్నాము. వెలుతురు ఉందని కూడా చీకటిలో బతకడం అలాంటిది ఈ పరిస్థితి. సరిగ్గా ఈ విషయాన్ని సూచించే పుస్తకం మరొకటి ఈ సంవత్సరం నా దృష్టిలోకి వచ్చింది. కనీసం కొంత తెలుసుకోండి అనే అర్థం వచ్చే పేరు ఆ పుస్తకానికి ఉంది. మన గురించి మనం అనే పేరుతో నా వ్యాసాల సంకలనం కూడా ఒకటి ఈ సంవత్సరం బయటపడింది. మనుషులం కనుక మన గురించి మనం తెలుసుకోవాలి అన్నది నాలాంటి చాలామంది చెబుతున్న ఒక విషయం. గైహారిసన్ అనే రచయిత కూడా అదే మాట చెబుతున్నాడు. అందరూ మొత్తం సైన్స్ తెలుసుకోకుండా ఫర్వాలేదు. మనుషులం కనుక మన మనుగడ, పరిసరాలు, ప్రపంచం, విశ్వం అంతా సైనే్స. కనుక కొన్ని వౌలిక విషయాలైనా తెలుసుకోకుండా బతకడం అన్యాయం అని అతని అభిప్రాయం. సైన్స్‌లోని కొన్ని అంశాలను అతను చాలా సులభంగా వివరించాడు. ఇటువంటి పుస్తకాలు చూడగానే తెలుగులోకి తీసుకురావాలి అని నాకు తోస్తుంది. కానీ వచ్చిన నాలుగైదు పుస్తకాలు అమ్ముడుపోవడం లేదు. ప్రభుత్వం నుంచి మొదలు మామూలు మనిషిదాకా మన దేశంలో ఎవరికీ జ్ఞానం గురించి, చదువు గురించి, భవిష్యత్తు గురించి పట్టలేదు. అయినా నేను చేయవలసింది చేస్తూనే ఉంటానరు. ముందు నా మట్టుకు నేను బాగా చదువుకుంటాను. ఆ విషయాలను సూటిగా, మాటుగా మీలాంటి వారిముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.
ఆరిజన్ స్టోరీ అని మరొక పుస్తకం వచ్చింది. మానవజాతి పుట్టిన తీరు గురించి అందులో మాలాంటివారికి తెలిసిన విషయాలే అయినా మంచి పద్దతిలో చెప్పారు. వారికి అది మరింత సహాయకరంగా ఉంటుంది. లోకాభిరామం వ్యాసాలలో నేను బలవంతంగానైనా సరే సైన్స్ విషయాలను దూరుస్తాను అన్న సంగతి చాలామంది మిత్రులు గమనించారు. ఎవరికి తెలిసిన సంగతి వారు చెబుతారు. నేను తెలియడంతో ఆగకుండా అర్థమైంది అనిపించక సంగతులు అందరితో పంచుకోవాలి అనుకుంటాను. హరారి కూడా అలాగే అనుకున్నాడు. అతను పరిశోధకుడు. విశ్వవిద్యాలయాల అండ గలవాడు. కనుక ప్రపంచమంతా తిరిగి ఎంతోమందితో చర్చలు చేయగలిగాడు. వచ్చిన ఆలోచనలను పుస్తకంగా వేసి ప్రపంచమంతటా అందించగలిగాడు. మొదటి పుస్తకంలో అతను ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాడు. కానీ అతను రానున్న కాలం గురించి కూడా చాలా ఆలోచించాడు. కనుకనే మరొక పుస్తకం రాశాడు. అది మరింత ఆలోచన కలిగించేదిగా ఉంది. మనిషి దేవుడు లాగా నిర్ణయాలు చేయడం మొదలుపెడతాడు అన్నది అతని ప్రతిపాదన. నా దృష్టిలో ఇప్పటికే మనిషి దేవుడయ్యాడు ఇక మున్ముందు మరింత పెద్ద స్థాయిలో అవుతాడు. అపుడు నిజంగా దేవుడు కనిపిస్తాడు. ఈ ప్రపంచం గురించి మనకు వివరిస్తాడు. అప్పటికైనా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అన్న అభిప్రాయం అందరికీ కలిగితే బాగుంటుంది. నేను అంటున్న ఈ అప్పటికీ ఇప్పటికే వచ్చేసింది. మనం భవిష్యత్తులో బతుకుతున్నాం అని నేను అంటే అతిశయోక్తిగాను, అర్థంలేని మాటగాను వినిపించవచ్చు. మాలాంటివారికి ఒకప్పటి భవిష్యత్తు ఇపుడు ప్రస్తుతం. కానీ మేము అనుకోని అంశాలను కూడా ఈ ప్రస్తుతంలో చూడగలుగుతున్నాము. కనుకనే సంగతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. చాలామంది ఈ విషయం పట్టించుకోకుండా బతుకుతున్నారు. కనుక నేను ఇటువంటి విషయాలు అపుడపుడు మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఆసక్తిగలవారు చదువుతారు. అది లేనివారు నన్ను క్షమించి వదిలేస్తారు.
మొత్తానికి మన గురించి మనం అన్న ఆలోచన బలంగా ముందుకు సాగుతున్నది. అప్ రైట్ థింకర్స్ అని మరొక పుస్తకం కొన్నాను. మనిషి గురించి అందులో చేసిన విశే్లషణలు మరిన్ని ఆలోచనలకు దారితీస్తున్నాయి. అయితే మరెక్కడో ప్రస్తావించినట్టు ఈ రచయితలకు పడమటి ప్రపంచం తప్ప మన ప్రాంతం కనిపించలేదు. ఇక్కడి తత్వధోరణిని కూడా జతచేసి మానవుని గతం గురించి చెప్పాలన్న ఆలోచన బలంగా చాలా కాలంగా కొనసాగుతున్నది.
మనిషి గురించి తెలుసుకోవడానికి మరిన్ని పుస్తకాలు కొన్నాను. కొన్ని కొనకుండానే సంపాదించాను. వాటన్నిటినీ చదుతున్నాను. మునుముందు ఇదంతా ఒక రచనకు దారి తీస్తే బాగుంటుంది.