S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సింగపూర్ గురించి..

మా అమ్మాయి కొంతకాలంగా సింగపూర్‌లో పని చేస్తూ ఉండేది. పై చదువు, పని పేరున తాను ఇప్పుడు యూరోప్‌కు మారుతుంది. కనుకనే సింగపూర్ చూడటానికి మమ్మల్ని రమ్మని పిలిచింది. మా అబ్బాయి కూడా అక్కడికి వచ్చాడు. నలుగురం కలిసి నాలుగు రోజుల పాటు మా ఊర్లో తిరిగాం.
అది ఒక దేశం. కానీ కేవలం ఒక ఊరు మాత్రమే ఉన్న దేశం. కానీ దాన్ని వాళ్లు చాలా బాగా నిర్వహించ గలుగుతున్నారు అని నాకు అర్థం అయింది. నగరంలో పరిశుభ్రత కొట్టొచ్చినట్టు కనిపించింది. అందరిలోనూ చట్టం గురించిన విధేయత కూడా అంత బలంగానూ కనిపించింది. ఆధునికత చూడాలంటే ఆ నగరంలోనే చూడాలి. అమెరికాలో కూడా లేని పద్ధతులు అక్కడ నాకు కనిపించాయి.
చాంగీ అనే విమానాశ్రయంలో మా అబ్బాయి ఉదయాన మాకన్నా ఒక అరగంట ముందు దిగినట్టు ఉన్నాడు. అమ్మాయి, అబ్బాయి అక్కడే మా కోసం వేచి ఉన్నారు. నేను, మా ఆవిడ కూడా అక్కడ దిగాము. మామూలుగా ఎవరైనా ఓ టాక్సీ పట్టుకుని ఇంటికి చేరుకుంటారు. మా పిల్లలు అక్కడ చూడవలసిన ప్రదేశం ఒకటి ఉంది. చూచి అప్పుడే ఇంటికి వెళ్దాం అన్నారు. వాళ్లు చెప్పిన ప్రదేశం పేరు జ్యువెల్. అంటే ఆభరణం. అది నిజంగానే విమానాశ్రయానికి ఆభరణం. మొత్తం నగరానికి ఆభరణం. అది విమానాశ్రయం లోపలే ఉంది అంటే ఆశ్చర్యం. ఈ వ్యాసం రాయడానికి నేను ఆలోచనలోనే ఉండగా నాకు మన స్థానిక పత్రిక ఒక దాంట్లో ప్రపంచంలోనే మంచి విమానాశ్రయాలు అన్న వ్యాసం కింద ఆ బొమ్మ కనిపించింది. విమానాశ్రయంలోనే ఒక పెద్ద ప్రాంతంలో చుట్టూ బోలెడన్ని పెద్దపెద్ద చెట్లు అంచెలంచెలుగా ఆకాశాన్నంటే ఎత్తు వరకు ఏర్పాటు చేశారు. అవి గుండ్రంగా వలయాలుగా ఏర్పడి ఉన్నాయి. అంతకంటే ఆహ్లాదకరమైన వాతావరణం మరొకటి ఉండదు అనిపిస్తుంది. చెట్లకన్నా ఆశ్చర్యంగా మధ్యలో అంత ఎత్తు నుండి కిందకు నీళ్లు గుండ్రంగా అన్ని వైపుల నుంచి దూకుతూ ఆలోచనకు అందని విధమైన ఒక జలపాతం కూడా అక్కడ ఉంది. అంతా కలిసి అది అన్ని రకాల ఆకర్షణ కనిపించే నిర్మాణం. దాన్ని చూచిన తరువాత గాని మేము ఇంటికి చేరాలి అన్న ఆలోచన పెట్టుకోలేదు.
మా కుటుంబానికి కొన్ని వింత ఆలోచనా ధోరణులు ఉన్నాయి అని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానమూ లేదు. కొత్త చోట్ల అందరికీ కొన్ని ఆకర్షణలు కనిపిస్తాయి. మాకు మాత్రం మరేవో కనిపిస్తాయి అనిపించింది. అందుకే మొట్టమొదటి రోజునే మేము ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక పార్కుకు వెళ్లాము. మరొక అంతర్జాతీయ పత్రికల్లో ప్రపంచంలోనే ఉత్తమ నగరాలను గురించి రాస్తూ అందులో సింగపూర్‌ను కూడా చేర్చారు. ఆ వ్యాసంతోపాటు వాళ్లు వేసిన చిత్రం ఈ పార్కుకు సంబంధించినది. అది చూసిన తర్వాత మా ఎంపిక చాలా బాగుందని నాకు కూడా నమ్మకం కలిగింది. పార్క్ చాలా విస్తారంగా ఉంది. అందులో రెండు పెద్దపెద్ద నిర్మాణాలలో లోపలి ప్రత్యేక రకమైన మొక్కలను పెంచుతున్నారు. ఇక పార్కు నిండా అరుదైన రకాల చెట్లు చాలా చాలా ఉన్నాయి. సింగపూర్ నగరంలో నది కూడా ఉంది. నీళ్లకు కరువు లేదు. పక్కనే సముద్రం ఉంది. సముద్రం నీటిని ఉప్పు లేకుండా చేసే పెద్ద ఏర్పాటు కూడా ఆ నగరంలో ఉంది. వాటిని పక్కన పెడితే పార్కులో ఆకాశాన్ని అంటే రకం మనిషి కట్టిన కొన్ని చెట్లు ఉన్నాయి. అయితే అవి లోహంతో కట్టినవి. ఎంతో అందంగా ఉన్నాయి. ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. ఈ మధ్యన సింగపూర్ అనగానే మరొక నిర్మాణాన్ని మనం చార్మినార్‌ను ప్రదర్శించినట్లు చూపిస్తున్నారు. అందులో పక్కపక్కన మూడు ఎత్తయిన భవనాలు ఉంటాయి. ఈ నగరంలో మామూలు ఇళ్ళే ఇరవై అంతస్తులకన్నా ఎక్కువ ఉన్నాయి. ఇక ఆ భవనంలో ఎన్ని అంతస్తులు ఉన్నాయి నేను లెక్క పెట్టలేదు. మూడు భవనాల మీద కలిపి పడవ ఆకారంలో ఒక నిర్మాణం ఉంటుంది. అది నగరంలో చాలా దూరం వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఎన్నో ఉన్నాయి. ఆ పక్కనే చుట్టూ అంత ఎతె్తైన భవనాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద ధగధగ లాడుతున్న పేర్లను చూస్తే, బ్యాంకులు వ్యాపార సంస్థలకు ఆ ప్రదేశం కేంద్రమని అర్థమై పోతుంది. ఆశ్చర్యంగా అక్కడ ఒక ఆడిటోరియం కూడా ఉంది. అందులో ఆ రోజున కథాకళి నృత్య ప్రదర్శన జరుగుతున్నది. కానీ మేము అక్కడికి వెళ్లకుండా మధ్యలోనే ఒక జలాశయంలో జరగబోయే లైట్ షో కోసం వేచి ఉన్నాము.
అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఈ మధ్యన నేను ఒక వెల గల గడియారాన్ని కొత్తగా బెల్టు వేయించి పెట్టుకోవడం మొదలుపెట్టాను. అక్కడ కూర్చున్నప్పుడు ఆ బెల్ట్ ఊడిపోయింది. నేను కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే గడియారం కూడా పడిపోయి ఉండేది. కింద నేల చెక్కలను ఒకచోట చేర్చి తయారుచేసినది. ఫోన్‌లో ఉండే టార్చ్ వేసి వెతికితే ఊడిపోయిన సన్నని పుల్ల కూడా నాకు దొరికింది. ఆ గడియారాన్ని నేను వాడకుండా చాలా రోజులు ఉంచవలసి వచ్చింది. అందుకు కారణం బెల్ట్ లేకపోవడం. అది పోకుండా ఎంతో సంతోషం అయింది. ఈ లోపల అక్కడ లైట్ షో మొదలైంది. నిజానికి షో అంత అద్భుతమైనది కాకపోవచ్చు. కానీ పదిహేను నిమిషాలపాటు సాగిన సంగీతానికి అనుగుణంగా నీళ్లు రంగు రంగులలో మధ్యలో నాట్యాలు ఆడుతుంటే మనసుకు ఎంతో విరామ భావం కలిగింది. చాలాకాలం నుంచి సింగపూర్ అనగానే సింహం తలకాయ శిల్పం ఒకటి చూపిస్తారు. దాని నోట్లో నుంచి నీళ్లు బయటకు చిమ్ముతూ ఉంటాయి. లైట్ షో జరిగిన జలాశయం అవతలి వైపున ఆ శిల్పం కనిపిస్తున్నది. కానీ ఎందుకో మేము అక్కడి దాకా నడవలేదు. ధనవంతులకు కూడా అందుబాటులో ఉండని స్థాయి అంగళ్లను చూస్తూ మేము మరి ఎక్కడికి వెళ్లి చైనా రకం తిండి తిన్నాము.
సింగపూర్ పర్యాటక ఆకర్షణ కేంద్రం. అక్కడి వారికి కూడా తిండి మీద ప్రేమ ఎక్కువ అని అర్థం అయింది. అక్కడ తిండి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. వెలగల రెస్టారెంట్లు చాలా దేశాలకు సంబంధించినవి ఉండటం మామూలే. అయితే కొన్నిచోట్ల చుట్టూ రకరకాల తిండి అంగళ్లు ఉంటే మధ్యలో బోలెడన్ని బల్లలు, కుర్చీలు వేసి ఉంటాయి. నచ్చిన స్టాల్లో నచ్చిన తిండి తెచ్చుకుని ఇష్టం వచ్చిన చోట కూర్చొని తినవచ్చు. ఇది చాలా సౌకర్యంగా కనిపించింది. ఉన్న నాలుగు రోజుల్లో రెండుసార్లు మాలా అనే ఒక తిండి తిన్నాము. రకరకాల కూరగాయలను ఉడికించి, అందులో కొన్ని సాస్‌లను చేర్చి తయారుచేసిన వంటకం అది. ఒక చిన్న గినె్నలో అన్నం కూడా ఇచ్చారు. అన్నం సంగతి పక్కనపెడితే మాలా మాత్రం నాకు ఎంతో నచ్చింది. మన దగ్గర ఇటువంటి వంటకాలు ఎందుకు ఉండవు అన్న ప్రశ్న మెదడులో మళ్లీ మళ్లీ తిరిగింది. సింగపూర్‌లో తిండి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా మరోసారి రాయాలి.
నగరానికి పక్కనే ఒక దీవి ఉంది. అందులో మరింత అందమైన పార్కు ఉంది. అక్కడికి రైల్లో వెళ్లవలసి వస్తుంది. ఇదే సింగపూర్‌లోని ప్రత్యేకత. అక్కడ కొంత దూరం నడిచి తిరిగాం. పండుగ లైట్లు చూడడానికి వెళ్లిన ఒక చోటి నుంచి బస్సులో ఇంటికి తిరిగి వచ్చాము. రైల్లో కూడా ఎక్కాము. చాలామంది అక్కడ నడిచి తిరగడం కనిపించింది. మేము ఉన్న ఇంటికి దగ్గరలోనే అలా నడుస్తూ ఒక అద్భుతాన్ని కనుగొనగలిగాను. ఏదో కొనాలని బయలుదేరి వెళ్లాము. మధ్యలో మా అమ్మాయి ఒక పక్కకు తీసుకుపోయింది. అక్కడ వీధులకు వీధులు పాత ఇండ్లు ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. మేము ఉంటున్న ప్రాంతంలోనే 50 అంతస్తులు ఉన్న ఒక భవనం మీదకు మా అమ్మాయి మమ్మల్ని ప్రయత్నంగా తీసుకుపోయింది. మొదటి ఆశ్చర్యం అంత ఎత్తుకు వెళ్లిన తరువాత ఆ భవనం మీద ఇష్టం వచ్చినప్పుడు వాకింగ్ చేయడానికి సౌకర్యం ఉంది. ఆపైన కావలసినన్ని ఆకర్షణీయమైన చెట్లు మొక్కలు ఉన్నాయి. అక్కడి నుండి చుట్టుపక్కల నగరం చూడడానికి అవకాశం ఉంది. అట్లా చూస్తున్నప్పుడు ఎర్రని పైకప్పులు గల రెండు అంతస్థులు మాత్రమే కల ఈ పాత ఇళ్లు కనిపించాయి. నగరంలో రెండు మూడు చోట్ల అట్లాంటి ఇండ్లు ఉండటం ఆశ్చర్యమే కాక అద్భుతంగా కూడా కనిపించింది. అభివృద్ధి పేరున ఉన్నవి పోగొట్టుకోవడం మనకు బాగా అలవాటు అయింది. అక్కడి వారు మాత్రం ఆ పద్ధతి కాదన్నారు అని అర్థం అయింది.
సింగపూర్‌లో చైనా టౌన్ అన్న ప్రాంతాన్ని గురించి, అక్కడ గల బుద్ధుని దంత నిక్షేపం గురించి చెప్పకుండా ముగిస్తే అన్యాయం అవుతుంది. చైనా టౌన్‌కి వెళ్లగానే ముందు గుడి వద్దకు వెళ్లాము. అది 5 అంతస్తులుగా ఉన్నది. నాలుగవ అంతస్తులో ఒక బంగారు పెట్టెలో బుద్ధుని దంతం ఉంది. ఆ పెట్టె ఉన్నచోట సుమారు 500 కిలోల బంగారంతో తయారుచేసిన ఒక మండపం లాంటి నిర్మాణం ఉన్నది. ఆ హాలులోకి తప్ప మిగతా మొత్తం గుడిలో చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉండటం గమనించాను. మిగతా అన్ని చోట్ల బుద్ధుని గురించిన విగ్రహాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఉన్నాయి. కింది అంతస్తులోనే చాలా పెద్ద విగ్రహాలు రెండు ఉన్నాయి. అది ఒక పెద్ద హాల్. సంగీత బృందాల కార్యక్రమాలకు అందులో పాశ్చాత్య పద్ధతిలో ఏర్పాట్లు చేసి ఉన్నాయి. చుట్టుపక్కల గోడల నిండా బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. మనిషి ఆకారంలో ఉన్న ఆ విగ్రహాల పక్కన గూళ్లలో వందలు వేల విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్నవి. పై అంతస్తులో ఒకచోట ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి ఉంది. స్థానిక ఆచార్యుల విగ్రహాలు అక్కడి ప్రత్యేకత. వాళ్లంతా కూర్చుని మనల్ని చూస్తున్నారు అన్నంత సహజంగా ఆ విగ్రహాలు ఉన్నాయి.
ఇంకా చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. మరో అవకాశం కోసం చూస్తాను. సింగపూర్‌కు మళ్లీ వెళ్లే అవకాశం కోసం కూడా చూస్తాను.

-కె.బి.గోపాలం