S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంత అదృష్టం

కవచాల్ని కూడా కుదించుకుని
కేంద్రకాలనే మిగుల్చుకున్న
సమూహంలోంచి
ఏదో ఒక గొంతు
మనల్ని ఆర్తిగా పిలిస్తే!
హృదయాల నడుమ
సేతువొకటి నిర్మించి
మనవైపు కొన్ని అడుగులు వేస్తే
ఎంత అదృష్టం!

మనం ఎదుగుతుంటే
సలసల కాగిపోతూ
మనం పడిపోతే
పకపక నవ్వుకునే
సమాజంలోంచి
ఏదో ఒక చేయి
మన అడుగుల్ని సరిచేస్తే!
ఆత్మీయత అనే పురికాసుతో
మనసులను ముడేస్తే
ఎంత అదృష్టం!

ఎంత స్వేదజలం పోసినా
ఒక్క విత్తూ మొలకెత్తని
ఎంత సూర్యరశ్మి అందించినా
ఒక్క పువ్వూ పూయని
పాషాణ పూదోటలో
మనం నాటని
ఓ స్నేహపు మొక్క
ప్రేమగా పలకరిస్తే!
మనం నీళ్లు పోయని
ఓ పూల తీగ
నవ్వు మొగ్గలేస్తే
ఎంత అదృష్టం!

మనకు తెలియకుండా
ఎప్పుడో ఒకప్పుడు
మన పెదాల ఆకాశంలోంచి
జారిపడ్డ ఓ చిర్నవ్వు చినుకు
వేల నవ్వుల హరివిల్లులా
గుమ్మం ముందు విరబూస్తే!
మనకు తెలియకుండానే
ఎక్కడో ఓ చోట
మన కలం కన్న ఓ అక్షరబీజం
వేవేల కొమ్మల మహావృక్షమై
కృతజ్ఞతతో కరచాలనం చేస్తే
ఎంత అదృష్టం!
*

-సాంబమూర్తి లండ 9642732008