S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంక్రాంతికి వస్తావు కదూ!

ఏడాదిపాటు ఎదురుచూపు
గాలిలో ఎగిరి నీటిలో తేలి
నేలపై నడచి ఏ మార్గాన
నీవు వస్తావోనని
ఉన్న రెండు కళ్లనూ
నింగికి అతికించి నిరీక్షించాను
శిథిలమైన దేహంలో
జీవం వున్నది నయనాలలోనే!

ఈ పల్లె తల్లి తనువులో
ఒక్కొక్క అవయవమూ
విరిగిపోయింది

నీకు అక్షరాలు నేర్పిన
‘బడి’ మూతబడి
నిన్ను ఊరేగించిన
ఎడ్లబండి మూలబడి
నిను దీవించిన
గుడిలోని దీపం కొండెక్కి
నీ దాహం దీర్చిన
చేదబావి పూడిపోయి
నీకు బువ్వ పెట్టిన అరక విరిగి
దుక్కి దున్నిన ఎద్దులు ఊరు దాటి
నీకు పదాలు వినిపించిన
అరుగులు మాయమై
నీవు ఆడిన ఆటలన్నీ అటకెక్కి
ఉనికిని కోల్పోయాయి కన్నా!
నీకు తెలిసిన
హరికథలు వీధి నాటకాలు
కోలాటాలు చెక్క భజనలు
ఏవీ నేడు కానరావు
ఒక్కొక్క అంగం రాలినా
నీ అడుగుల సవ్వడికి
నీ పాద స్పర్శకు
ఎంతగా ఎదురుచూశానని!

కలల పండుగ కదలొచ్చినట్లు
నీవొస్తే నా మేను పులకించి
ఎంత పొంగిపోయానని!

బోగిలోని భోగమంతా నాదే
సంక్రాంతిలోని సంబరమంతా నాదే
కనుమలోని కమనీయం నాదే
మూడు రోజులు నేను మురిశాను
మీరు ఆనందంలో అలసిపోయారు
ముక్కనుమ ముగిసి
నన్ను విడిచి వెళుతున్నారు

నాలో ఎన్ని రాలిపోయినా
కల్లలో మాత్రం నీ కోసం ప్రాణం
నిలుపుకొని బతుకుతుంటాను
మళ్లీ సంక్రాంతికి వస్తావు కదూ!

-సురేంద్ర రొడ్డ 9491523570