S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పిలిచిన వెంటనే రావు!

కొన్ని వాక్యాలనలా వెంటేసుకు
తిరగాలనిపిస్తుంది ఒంటరినిపించినప్పుడల్లా!
పిలిచిన వెంటనే రావు కొన్ని పిడి వాక్యాలు
ఏ నెత్తుటి గాయాలో నిలువెల్లా పూసుకొని
చిక్కగా చిక్కులు పడి
ఏదో నిజాన్ని తడిగా రాయాలని చూస్తాయి
తెగిన పద బంధాలను ముడివేసి
కాలం మరిచిన వేదనా గేయమొకటి
కూర్చాలని కొట్టుకులాడుతుంటాయి
కలాన్ని కుదురుగా ఉండనీయక
సత్యాగ్రహ సిరాని చిమ్మమని ఆదేశిస్తుంటాయి
గతం మన్నులో సమాధైన
ప్రాణాక్షరాలను తవ్వుకొని
ఎదలకు హత్తుకోమంటాయి!
నేల బారున నలిగి ఒరిగిన
కొన్ని కాంతి దేహాలనెత్తుకొని
వాటి మరణ వాంగ్మూలాన్ని
లోకానికి వినిపించమంటాయి!
ఆ వాక్యాలను పిలవాలంటే
పొడారిన నా గుండెను
పదేపదే తడుపుకోవాలి
నా ఆత్మను నగ్న హస్తాలతో
తడుముకోవాలి
నన్నో సమూహంగా మార్చేందుకు
ఆ వాక్యాలు చేసే నీతి యుద్ధాన్ని
నేను ఎదుర్కొన్నప్పుడల్లా
నా శిబిరంలో
వెలుగు సైనికుల ప్రసవం
కాంతి గీతాల సునాదం
కొన్ని వాక్యాలు పిలిచిన వెంటనే రావు
ప్రసవ వేదన పడాల్సిందే!
*

- డి.నాగజ్యోతి శేఖర్.. 9492164193